close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రంగుల్ని చూస్తే...

మార్కెట్టులో నడుస్తుంటే సాదాసీదాగా ఉండే దుకాణాలు త్వరగా ఆకర్షించవు. కానీ వాటిముందు తోరణాల్లా రంగు రంగుల వస్తువులు వేలాడదీసి ఉంటే మన దృష్టిని ముందుగా ఆకట్టుకుంటాయి. రంగుల్లోని మహత్తు అదే. ఈ ఆకర్షణ అనేది దాదాపు అందరిలో ఒకేలా ఉంటుంది, రంగులు ఒకేరకమైన భావోద్వేగాల్ని కలిగిస్తాయి, దీనికి ప్రాంతీయ, జాతీయ భేదం లేదు అంటున్నారు జోహాన్స్‌ గూటెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. ఇందుకోసం వీళ్లు ఆరు ఖండాల్లోని 30 దేశాలకు చెందిన సుమారు ఐదువేల మందిని ఎంపికచేసి మరీ పరిశీలించారట. పన్నెండు రంగుల్ని చూపించి వాళ్లకెలా అనిపిస్తుందో ఆన్‌లైన్‌లో ప్రశ్నించారట. ఉదాహరణకు ఎరుపు రంగుని చూసినప్పుడు ఏమనిపిస్తుందీ అంటే ఆకర్షణీయంగా ఉంటుందనీ అలాగే పసుపు రంగు ఆనందంగా అనిపిస్తుందనీ చెప్పారట. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రంగులమీద సంప్రదాయాలూ ప్రతిఫలిస్తుంటాయి. అలాంటివాటిని వదిలేస్తే వర్ణాలు అందరిలోనూ ఒకే రకమైన భావోద్వేగాల్ని కలిగిస్తాయనేది నిజం అంటున్నారు సదరు పరిశోధకులు.


పిల్లలు ఒంటరిగా ఉంటున్నారా?

ఒంటరితనం మానసికంగానే కాదు, శారీరక ఆరోగ్యానికీ మంచిది కాదన్నది తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఇది అందరికీ తప్పనిసరిగా మారింది. దాంతో ప్రపంచం మొత్తం డిజిటల్‌ మీడియా ద్వారానే కలిసి ఉంటోంది. అయితే దీనివల్ల పిల్లల మెదడు భాగంలోని కొన్ని కణాలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు మౌంట్‌ సినాయ్‌ హాస్పిటల్‌కు చెందిన పరిశీలకులు. మనిషి సామాజిక ప్రవర్తన అనేది మెదడులోని ప్రిఫ్రాంటల్‌ కార్టెక్స్‌లోని కణాలమీద ఆధారపడి ఉంటుందని గుర్తించారు. ఇందుకోసం పిల్లఎలుకల్ని తీసుకుని రెండువారాలపాటు మిగిలినవాటితో కలవనీయకుండా ఉంచారట. ఆ తరవాత వాటిని గమనించగా- మెదడులోని ప్రిఫ్రాంటల్‌ కార్టెక్స్‌ భాగంలోని న్యూరాన్ల నుంచి మిగిలినవాటికి సంకేతాలు సరిగ్గా అందడం లేదని తెలిసింది. ఆపై కొంతకాలానికి అవి స్తబ్దుగా మారడం గమనించారు. అయితే వాటిని అలాగే వదిలేయకుండా ఆప్టోజెనిటిక్స్‌, కీమోజెనిటిక్స్‌ పద్ధతుల్ని ఉపయోగించి ఆ భాగంలోని కణాలను ప్రేరేపించడంతో అవి మళ్లీ చురుకుగా మారినట్లు గుర్తించారు. కాబట్టి ఐసొలేషన్‌ వల్ల పిల్లల్లో సామాజిక ప్రవర్తనకు సంబంధించిన లోపాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశీలన ఆధారంగా రకరకాల మానసిక వ్యాధుల కారణంగా సామాజిక ప్రవర్తన సరిగ్గా లేనివాళ్లలో కూడా ఆ కణాల్ని లైట్‌థెరపీ వంటి చికిత్సల ద్వారా ప్రేరేపించడం ద్వారా ఆ లక్షణాన్ని తగ్గించవచ్చు అంటున్నారు.


బ్యాటరీ మాస్కులొస్తున్నాయ్‌!

రోనా కాలంలో ఫేస్‌ మాస్క్‌ అత్యవసర యాక్సెసరీగా మారిపోయింది. అయితే కళ్లజోడు పెట్టుకుని మాస్క్‌ పెట్టుకుంటే మనం వదిలే ఊపిరి కళ్లద్దాలమీదకు వెళ్లి మసకగా అయిపోతుంటుంది. అలాగే ముక్కుని మాస్కులో బంధించడం వల్ల ఆక్సిజన్‌ కూడా సరిపడా అందక అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే ఎల్‌జీ కంపెనీ ప్యూరికేర్‌ వేరబుల్‌ పేరుతో సరికొత్త ఫిల్టర్‌ మాస్క్‌ను డిజైన్‌ చేసింది. ఇందులో అమర్చిన రెండు ఫ్యాన్లు తీసుకున్న- వదిలిన గాలిని శుభ్రం చేయడంతోబాటు, ఆ ఊపిరి అద్దాలమీదకు వెళ్లకుండా చేస్తుంది. యూవీకాంతితో పనిచేసే దీని బ్యాటరీ, మాస్కుని ఎప్పటికప్పుడు డిజ్‌ఇన్ఫెక్ట్‌ చేస్తుంటుంది. అలానే మాస్కుతోబాటు వచ్చే బాక్సు ద్వారా బ్యాటరీల్ని ఛార్జ్‌ చేసుకోవచ్చట. త్వరలోనే మార్కెట్టులోకి రానున్న ఈ మాస్క్‌ ధర ఎంత ఉంటుందనేది ఇంకా కంపెనీ నిర్ణయించలేదు మరి.


కలత నిద్రతో బీపీ!

నిద్ర ఆరోగ్యంమీద ఎంతో ప్రభావం కనబరుస్తుందని తెలిసిందే. అయితే కలత నిద్ర వల్ల బీపీ పెరగడమే కాదు, పొట్టలోని మేలు చేసే బ్యాక్టీరియా కూడా దెబ్బతింటుందనేది తాజా కబురు. ఈ విషయమై చికాగో ఇలినాయిస్‌ యూనివర్సిటీ నిపుణులు చేసిన ఓ పరిశీలనలో ఈ విషయం స్పష్టమైందట. దాదాపు ఓ నెలరోజులపాటు నిద్రకు భంగం కలిగించడం వల్ల ఎలుకల్లో బీపీ పెరగడంతోబాటు వాటి పొట్టలోని బ్యాక్టీరియాలో మార్పులు చోటుచేసుకున్నాయట. ఈ రకమైన మార్పులు ఇన్‌ఫ్లమేషన్‌కీ తద్వారా మరిన్ని గుండె వ్యాధులకీ దారితీస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా రాత్రివేళల్లో సరిగ్గా నిద్రపట్టనివాళ్లలోనూ నైట్‌ షిఫ్టుల కారణంగా కచ్చితమైన నిద్రావేళలు ఉండని వాళ్లలోనూ ఈ రకమైన సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా- నిద్ర సరిగ్గా పోకున్నా ఆహారంలో మార్పులు చేయడం ద్వారా పొట్టలోని మైక్రోబయోమ్‌ మారకుండా చేయగలిగే చికిత్సకోసం ప్రయత్నిస్తున్నారు సంబంధిత నిపుణులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు