close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాఫీకో మాత్ర... సూప్‌కో క్యూబ్‌!

ఇంటికెవరొచ్చినా టీ లేదా కాఫీ పెట్టిస్తాం. పని చేసుకుంటున్నప్పుడు ఏ మాత్రం తలనొప్పిగా అనిపించినా... కప్పు కాఫీ తాగాలనిపించడం మామూలే. అవన్నీ ఏ మాత్రం శ్రమలేకుండా చిటికేసినంత సులువుగా అయిపోవాలంటే ఈ మాత్రలు వాడితే సరి. మాత్రలు వాడటం ఏంటీ.. వాటితో టీ, కాఫీలు తయారవడం ఏంటనే ఆశ్చర్యం వద్దు. పాలూ, కాఫీ, టీ, సూప్‌ లాంటివి ఇప్పుడు మాత్రలూ, క్యూబ్‌ల రూపంలో వచ్చేస్తున్నాయి మరి.

ఆఫీసులో ఉన్నప్పుడూ... ఏ ఊరికైనా వెళ్తున్నప్పుడూ వేడివేడి కాఫీ తాగాలనిపించడం మామూలే. కానీ మనకు నచ్చిన రుచిలో దొరక్కపోవచ్చు. ఇలాంటి ఇబ్బందిని ముందే గుర్తించి కొన్నిసార్లు ఫ్లాస్కుల్లో కాఫీలు పోసుకుని తీసుకెళ్తుంటాం కానీ ఆ వేడి ఎంత సేపు ఉంటుందనేదీ ఊహించలేం. అదేవిధంగా వాతావరణం ఏ మాత్రం చల్లగా ఉన్నా... కాస్త జలుబు చేసినా లేదా జ్వరంగా అనిపించినా మనసు వేడివేడి సూప్‌నే కోరుకుంటుంది. ఇంట్లో అది చేయాలంటే... మొక్కజొన్న పిండి మొదలు ఎన్నో వస్తువులు సిద్ధం చేసు కోవాలి. అంత కష్టపడినా కొన్నిసార్లు అనుకున్న రుచి రాకపోవచ్చు. బజార్లో దొరికే ప్యాకెట్లు తెచ్చుకుని సూప్‌ చేసుకోవచ్చు కానీ... దాన్ని ఇంట్లో ఉన్నప్పుడే వాడగలం కానీ... ఆఫీసులోనో మరోచోటో కాదు. అలాగని హోటల్‌కి వెళ్లాలంటే మాటలు కాదు. ఈ సమస్యలేవీ లేకుండా చేస్తాయి ఈ సూప్‌ క్యూబ్‌లూ, కాఫీ, టీ మాత్రలు. ఇవి మన దగ్గర ఉంటే... కావాలనుకున్నప్పుడు ఒక్క కాఫీ ఏమిటీ... సూప్‌, పాలూ, గ్రీన్‌టీ వంటివన్నీ చాలా తక్కువ సమయంలో చేసుకుని వేడివేడిగా తాగొచ్చు.

ఉదాహరణకు కాఫీనే తీసుకుంటే... కప్పు పాలల్లో కావాలనుకున్న రుచిని బట్టి రెండు లేదా మూడు బిళ్లలు వేసుకుని కలిపితే చాలు. చిక్కటి కాఫీ హాయిగా తాగేయొచ్చు. గ్రీన్‌టీ కూడా అంతే. ఇది బ్యాగుల రూపంలో దొరికినా... వాటికన్నా ఈ మాత్రలు మన పనిని ఇంకా సులభం చేస్తాయి. కప్పు వేణ్నీళ్లల్లో ఒక మాత్ర వేసుకుని కలిపితే చాలు. గ్రీన్‌టీ సిద్ధమైనట్లే. పదేపదే బ్యాగు ముంచి తీయడం... లేదా వడకట్టుకోవడం వంటి సమస్యలేవీ ఉండవు. ఒకవేళ ఇందులో తీపికోసం తేనె కలుపుకోవాలంటే... అనే సందేహం వద్దు. దానికోసం సీసాను మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా అది కూడా క్యాప్సూల్‌లా వచ్చేసింది. మనకు కావాలనుకున్న తీపిని బట్టి ఒకటిరెండు క్యాప్సూల్స్‌ని విడదీసి అందులో కలుపుకుంటే సరి. ఇవే కాదు... పాలు కూడా మాత్రల్లా దొరుకుతున్నాయి. ఎంత చిక్కగా కావాలనుకుంటే అన్ని మాత్రల్ని వేడినీటిలో వేసుకుని కలుపుకోవచ్చు. వీటిని మన దగ్గర పెట్టుకుంటే ఏ ఊరికైనా వెళ్లినా.. పిల్లలకు పాల ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు.

సూప్‌ నచ్చిన రుచిలో..
నలుగురు కలిసి సూప్‌ తాగాలనుకుంటే.. ఒకరు టొమాటో రుచి కోరుకోవచ్చు. మరొకరు స్వీట్‌కార్న్‌ లేదా మిక్స్‌డ్‌ వెజ్‌ అడగొచ్చు. అందరికీ నచ్చిన రుచిలో దాన్ని చేయాలంటే పెద్ద పని. ఆ పనిని తగ్గించేస్తాయి ఈ సూప్‌ క్యూబ్‌లు. నచ్చిన ఫ్లేవర్లలో దొరికే ఈ క్యూబ్‌లను నాలుగైదు రకాలు కొనిపెట్టుకుని... కావాలనుకున్నదాన్ని వేడినీటిలో వేస్తే... అది కరిగి సూప్‌ తయారవుతుంది. దాన్ని అలాగే తాగొచ్చు లేదా అదనంగా కాస్త సోయాసాస్‌ లేదా టొమాటోసాస్‌ లాంటివీ వేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే... వేడినీళ్లు సిద్ధంగా ఉంటే చాలు...టీ, పాలూ, సూప్‌ లాంటివన్నీ నచ్చినట్లుగా చేసుకుని వేడివేడిగా లాగించేయొచ్చు... ఏమంటారు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు