
పసుపును సాగు చేసిన రైతులు ఏం చేస్తారు... పంట చేతికి రాగానే అమ్మేస్తారు. గుజరాత్‌కి చెందిన రైతు దేవేశ్ పటేల్ మాత్రం పసుపుతో వైవిధ్యమైన ఉత్పత్తులు తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షిస్తున్నాడు. ఏడాదికి రెండుకోట్ల లాభంతో దూసుకెళుతూ... ఐఐఎమ్ విద్యార్థులకు అతిథిగా పాఠాలు చెబుతున్నాడు.
పసుపు సాగు అనగానే మనకి వంటకాల్లో వేసే పసుపు పొడి ఒక్కటే గుర్తొస్తుంది. గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతం బొరియావికి చెందిన దేవేశ్ పటేల్ మాత్రం పసుపు పంట నుంచి పొడి, పచ్చి కొమ్ముల పచ్చడి, పాలలో వేసుకునే కాప్స్యూల్స్, టీ మసాలా, పెయింట్లు వంటివి తయారు చేస్తున్నాడు. దాంతోపాటు అల్లం వంటి మరికొన్ని పంటలు కూడా వేసి ప్రయోగాలు చేస్తున్నాడు.
రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన దేవేశ్కి చిన్నతనం నుంచీ వ్యవసాయమంటే ప్రాణం. పదోతరగతి అయ్యాక చదువు మానేసి సాగు చేద్దామనుకున్నాడు. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఉదయం సాయంత్రం పొలం పనులు చూసుకుంటూ కాలేజీకి వెళ్లేవాడు. అలా ఇంజినీరింగ్ పూర్తి చేసిన దేవేశ్కి ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేసుకుంటూనే అమెరికా, యూరప్ దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులూ, మార్కెటింగ్ వంటి వాటిపైన అధ్యయనం చేశాడు. కొన్నాళ్లకి సొంతూరులోనే వ్యవసాయం చేయాలని ఉద్యోగం మానేసి బొరియావికి తిరిగొచ్చాడు. అప్పట్నుంచీ సాగుపైన దృష్టి పెట్టిన దేవేశ్ కొంత పొలం కూడా కొని సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకి ఆనంద్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సాయంతో మేలైన పసుపు రకాన్ని వృద్ధి చేశాడు. ఆ పసుపు చక్కటి రంగూ, సువాననతో కూడి అధిక దిగుబడి ఇవ్వడంతో పేటెంట్ కూడా తీసుకున్నాడు. తరవాత పసుపుతోపాటు అల్లం, అశ్వగంధ, నిమ్మ, మిర్చి, బంగాళాదుంపలు, చిలగడ దుంపలు, కంద, గోధుమలు కూడా పండించడం మొదలు పెట్టాడు. తన ఉత్పత్తుల్ని ‘సత్వ’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చిన దేవేశ్ ఆ తరవాత మరికొన్నింటినీ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాడు.
అల్లం, పసుపు మాత్రలు
పాలల్లో పసుపు వేసుకుని తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయనీ, రోగనిరోధకశక్తి పెరుగుతుందనీ చెబుతారు. మరి అలా తాగాలంటే మనకు రుచించదు. అందుకే దేవేశ్ పసుపుకు అశ్వగంధ, తేనె, వేప వంటివి కలిపి రుచినీ, అదనపు పోషకాలనూ జోడించి కాప్స్యూల్స్ రూపంలో తెస్తున్నాడు. గ్లాసు పాలలో ఒక కాప్స్యూల్ వేసుకుంటే చక్కెర కలపాల్సిన పని కూడా ఉండదు. అలానే పచ్చి పసుపు కొమ్ములతో పచ్చడీ, దుస్తుల అద్దకాల్లో వాడే పెయింట్లూ, అల్లం, సుగంధ ద్రవ్యాలు కలగలిపి టీ మసాలాలూ తయారు చేస్తున్నాడు. వీటితోపాటు అల్లం పొడినీ కాప్స్యూల్స్నూ కూడా చేస్తున్నాడు. ఇవన్నీ వ్యవసాయ శాస్త్రవేత్తల సాయంతోనే చేస్తున్న దేవేశ్ ఫుడ్ స్టాండర్డ్స్ అథారిటీ అనుమతితో అమెరికా, యూరోప్ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, నెదర్లాండ్స్ వంటి చోట్లకు వాటిని పంపుతున్నాడు. ఏటా అక్కడకు ఆరువేల క్వింటాళ్ల పసుపునూ, అల్లాన్నీ ఎగుమతి చేస్తున్నాడు. ప్రస్తుతం తన సొంత బ్రాండ్ ద్వారా బంగాళాదుంప, చిలగడదుంప చిప్స్, ఇతర దుంపలతో పిండి పదార్థాలూ, గోధుమపిండి, కారం, వంటి దాదాపు 30రకాల ఉత్పత్తులను అమ్ముతున్నాడు. అందుకుగానూ పెట్టుబడి పోను ఏటా రెండుకోట్ల ఆదాయాన్ని కళ్లజూస్తున్న దేవేశ్ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎమ్ క్యాంపస్‌లలో వ్యవసాయం, మార్కెటింగ్‌కు సంబంధించిన పాఠాలు చెబుతున్నాడు.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్