
ఆన్లైన్ చదువులూ పరీక్షలతో స్కూలు పిల్లలూ పెద్దలూ అందరూ రాయడం పోయి, కీబోర్డుకే అలవాటుపడుతున్నారు. అయితే, చేత్తో రాసేటప్పుడూ కీబోర్డుమీద టైప్ చేసేటప్పుడూ మెదడు ఒకేలా స్పందిస్తుందా అన్న విషయాన్ని ఎలక్ట్రోఎనసెఫలోగ్రాఫ్ ద్వారా పరిశీలించారట నార్వేయన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. దాని ఆధారంగా నేర్చుకునే వయసులో చేత్తో రాయడం వల్లే ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. దీనికోసం స్కూలు పిల్లలూ యూనివర్సిటీ విద్యార్థుల్ని ఎంపిక చేసి, బొమ్మలు వేసేటప్పుడూ రాసేటప్పుడూ టైప్ చేసేటప్పుడూ వాళ్ల మెదడు తరంగాల్ని నిశితంగా పరిశీలించారట. అందులో పెన్నుతో రాసేటప్పుడూ బొమ్మలు వేసేటప్పుడూ మెదడులోని రెండు భాగాలు కలిసి పనిచేయడాన్ని గమనించారు. జ్ఞాపకశక్తికీ కొత్త సమాచారాన్ని గ్రహించేందుకూ ఆ రెండూ కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమట. టైప్ చేసేటప్పుడు ఈ రెండింటిమధ్యా సమన్వయం పెద్దగా లేదట. దీన్నిబట్టి రాయడం పిల్లలకు అవసరం అంటున్నారు. ఎందుకంటే- అక్షరాల్ని రాసేటప్పుడు చేతి కదలికలవల్ల నాడులన్నీ చురుగ్గా మారతాయి. ఫలితంగా మెదడు విషయాన్ని ఎక్కువగా గ్రహిస్తుందట. అందుకే మనం చెప్పదలచుకున్నది టైప్ చేయొచ్చుకానీ విషయాన్ని నేర్చుకునేటప్పుడు మాత్రం నోట్స్ రాసుకుంటేనే మంచిది, గ్రాహకశక్తి పెరుగుతుంది అంటున్నారు పరిశీలకులు.
ఆందోళన ఎందుకొస్తుందంటే...
కొంతమంది తరచూ ఆందోళనకి లోనవుతుంటారు. అది వాళ్ల స్వభావం అని సరిపెట్టుకుంటాం. కానీ దానికి కారణం థైరాయిడ్ గ్రంథిలోని లోపమే అంటున్నారు మానసిక నిపుణులు. 2017 నాటికి మనదేశంలోనే నాలుగున్నర కోట్ల మంది యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారట. అయితే ఒత్తిడి, ఆందోళన అనగానే అందరూ నాడీవ్యవస్థలోని లోపాలుగా భావిస్తారుగానీ హార్మోన్ల అసమతౌల్యత అని గుర్తించరు. కానీ థైరాయిడ్ కారణంగానూ ఆ సమస్య రావచ్చు అంటున్నారు క్వియ్ ఆసుపత్రి నిపుణులు. సాధారణంగా థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్, ట్రిడో థైరోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా గుండె, కండరాలు, జీర్ణవ్యవస్థ, మెదడు భాగాలను నియంత్రిస్తుంటుంది. అయితే కొన్నిసార్లు స్వీయరోగనిరోధక వ్యవస్థ ఎదురు తిరగడంతో యాంటీబాడీలు విడుదలై థైరాయిడ్ గ్రంథికి హాని కలిగిస్తాయి. ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా గుర్తించేందుకు ఆందోళనతో బాధపడేవాళ్ల థైరాయిడ్ గ్రంథిని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా పరిశీలించినప్పుడు- అందులో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా కనిపించిందట. దాంతో ఆఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు పదిహేను రోజులపాటు మందులు ఇవ్వగా వాళ్లలో ఆందోళన తగ్గిందట. దీన్నిబట్టి యాంగ్జయిటీ అనగానే మెదడు, నరాలకు సంబంధించిన పరీక్షలే కాదు, థైరాయిడ్ గ్రంథినీ పరీక్షించాలని చెబుతున్నారు సంబంధిత నిపుణులు.
ఆ మాత్ర మతిమరపుకీ మందే!
డయాబెటిస్ రోగులకి వాళ్ల రక్తంలోని చక్కెర స్థాయుల్ని బట్టి మందులు ఇస్తుంటారు. అందులోభాగంగానే కొన్ని దేశాల్లో మెట్‌ఫార్మిన్‌ను ఎక్కువగా ఇస్తారట. అయితే అది ఆ రోగుల్లో ఎలా పనిచేస్తుందనే దానిమీద గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారట ఆస్ట్రేలియా పరిశోధకులు. జంతువుల్లో కూడా ఆ మందు ఫలితాల్ని గమనించారట. చిత్రంగా దానివల్ల మనుషుల్లోనూ జంతువుల్లోనూ ఆయుఃప్రమాణం పెరగడంతోపాటు క్యాన్సర్లు రావడం తక్కువగా ఉందని తేలిందట. పైగా మతిమరపూ తగ్గినట్లు గుర్తించారు. అదెలా అంటే- సాధారణంగా డయాబెటిస్ బాధితుల్లో వయసొచ్చేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. కానీ మెట్ఫార్మిన్ వాడని వాళ్లతో పోలిస్తే, అది వేసుకునే వాళ్లలో జ్ఞాపకశక్తి తగ్గుదల తక్కువగా ఉందట. కాబట్టి దీన్ని యాంటీ ఏజింగ్ ట్యాబ్లెట్‌గానూ వాడొచ్చా అన్న విషయాన్ని ఆలోచిస్తున్నారు.
కొవిడ్ కొందరిలో ఎందుకు తీవ్రం?!
కోవిడ్-19 కొందరిని ఆసుపత్రి పాలు చేస్తోంది, మరికొందరి ప్రాణాల్నీ బలి తీసుకుంటోంది. ఇంకొందరిలో అసలు లక్షణాలే కనిపించడం లేదు. దీనికి వాళ్ల వయసూ ఇతర ఆరోగ్య సమస్యలూ కారణం కావచ్చని భావిస్తూ వచ్చారు. కానీ తీవ్రసమస్యలున్న కొందరు వృద్ధులూ త్వరగా కోలుకుంటున్నారు. దాంతో ఆసుపత్రిలో చేరిన రోగుల్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి- వాళ్ల జన్యువులే ప్రధాన కారణం అని తేల్చారు ఒకినవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ నిపుణులు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న అందరిలోనూ క్రోమోజోమ్-3 మీద ఓ ప్రత్యేక జన్యు వైవిధ్యం కనిపించిందట. చిత్రంగా అది 50 వేల సంవత్సరాల క్రితం దక్షిణ ఐరోపా నుంచి వచ్చిన నియాండెర్తల్ జన్యువుల్ని పోలి ఉందట. అంటే- నియాండెర్తల్కీ ఆధునిక మనిషికీ మధ్య జరిగిన సంపర్కం వల్లే ఈ జన్యువులు సంక్రమించినట్లు భావిస్తున్నారు. పైగా ఈ జన్యు వైవిధ్యం దక్షిణాసియాలో యాభై శాతం ఉంటే, తూర్పు ఆసియాలో అసలే లేదట. అయితే ఆ జన్యువులు ఉన్నవాళ్లలోనే కరోనా ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉందనేది ఇంకా తెలియలేదు. కానీ కొందరిలో దాని ప్రభావం ఎక్కువగా ఉండటానికి కారణం జన్యువులే అన్నది పరిశోధకుల ఉవాచ.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్