close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అల్లుడొచ్చిన వేళ..!

‘వివాహభోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహ్హొహ్హొ నాకే ముందు...’ అని మాయాబజారు ఘటోత్కచుడిలా విందారగిస్తోన్న ఈ పెద్దమనిషి ఫొటో ఈ మధ్య సోషల్‌మీడియాలో రకరకాల హాస్యోక్తులతో చక్కర్లు కొట్టింది. కానీ అసలు సంగతేంటంటే- ఈయనో అల్లుడుగారు. జమాయీ షష్ఠి సందర్భంగా అత్తగారింటికి వచ్చినప్పుడు- అత్తింటివాళ్లు ఆప్యాయంగా వండి వడ్డించిన విందుభోజనం అన్నమాట.

ఎంత అల్లుడైతే మాత్రం ఎక్కడైనా ఇలా వండిపెడతారా అని ఆశ్చర్యపోకండి. బెంగాలీయులకి ఇది సర్వసామాన్యం. ఇలా పెట్టకపోతే తప్పుగా ఫీలవుతారు. అత్తింటివాళ్లు పండక్కి పిలిచి నాకిచ్చే మర్యాద ఇదేనా అని అల్లుడుగారూ అనుకోవచ్చుగాక. అందుకే ఈ బకాసుర విందు. మనదగ్గర దసరా, దీపావళి, సంక్రాంతి... పండుగలకి కొత్త దంపతుల్ని అత్తామామలు సాదరంగా ఆహ్వానించి, అల్లుడికి విందు భోజనం వడ్డించి, వద్దంటున్నా మారు వడ్డనతో తేన్చేవరకూ తినిపించి సంతృప్తి చెందడం తెలిసిందే. అల్లుడుగారు ఇంట్లో ఉన్నన్నిరోజులూ ఆయనకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా రాచమర్యాదలు చేయడం సర్వత్రా మామూలే. ఈమధ్య ఈ మర్యాదలు కాస్త తగ్గి అందరూ సరదాగా వేడుక చేసుకుంటున్నారు. కానీ కొన్నేళ్ల కిత్రం వరకూ ఇంటికి అల్లుడుగారు వస్తున్నారంటే వంటింట్లో అత్తగారికి గుండెల్లో భయం మొదలయ్యేది. వండేవి నచ్చుతాయో లేదో అనుకుంటూనే ఒకటికి పది రకాలు వండి వడ్డించేవారు.అయితే బెంగాలీయులకి అల్లుడుబాబు అంటే అపారమైన గౌరవం. అందుకే పండగపండక్కీ అల్లుడు రావడం సంగతెలా ఉన్నా ఆ అల్లుడుగారి కోసం ఏకంగా ఓ పండగనే సృష్టించి జరుపుకునే ఘనత వాళ్లకే సొంతం. జ్యేష్ట మాసంలో ఆరో రోజున ‘జమాయీ షష్ఠి’ పేరుతో అల్లుడిని పిలిచి ఓ ప్రత్యేక వేడుకలా జరుపుకునే సంప్రదాయం అక్కడ వాడుకలో ఉంది.

కొత్తల్లుడికి అత్తగారి కుటుంబంతో చక్కని బంధం ఏర్పడటం కోసమే ఈ పండగ అని చెబుతారు. విందుభోజనం ఏర్పాటుతోపాటు అల్లుడు దీర్ఘాయుష్కుడై వర్థిల్లాలని కోరుకుంటూ పూజాకార్యక్రమాలూ నిర్వర్తిస్తారట. కొత్తల్లుడనే కాదు, పాతబడ్డ అల్లుడుగారినీ పిలిచి ఈ పండుగ జరుపుకోవడం వాళ్లకో సరదా. అల్లుడినీ కూతురినీ ఇంటికి ఆహ్వానించాక, ముందుగా అల్లుడికి అత్తగారు నుదుట పెరుగుతో తిలకం దిద్ది, చేతికి పసుపుతాడు కడుతుందట. ఆపై ఆరు పండ్లతో ఉన్న ప్లేటుని నుదుట తాకిస్తుందట. ఆపై అల్లుడిగారికి పంచభక్ష్యపరమాన్నాలతో భోజనాన్ని వడ్డిస్తారట. అలా వడ్డించేప్పుడు అత్తగారితోపాటు ఇంట్లోని ఆడవాళ్లంతా చుట్టూ చేరి విసనకర్రలతో విసురుతూ కొసరికొసరి వడ్డిస్తారట. అందులో నేతి అన్నం, ఖస్టా పరాటా, బైంగన్‌ భాజా, కలయ్‌ దాల్‌, చింగరీ మలై కర్రీ, చనార్‌ దాల్నా, సొర్సె పోటోల్‌, కట్‌లెట్‌, చనార్‌ ఖీర్‌, సందేశ్‌, రసమలై, రసగుల్లా... ఇలా ఎన్నో రకాల వంటకాల్నీ; పానీయాల్నీ; అరటి, మామిడి, నేరేడు, లిచి వంటి పండ్లనీ వడ్డిస్తారట. వీటితోపాటు హిల్సా చేపలకూర తప్పనిసరి. బిజీ జీవితంలో అత్తగార్లకూ  అన్నిరకాల వంటల్ని వండి వడ్డించే ఓపిక లేకపోవడంతో ప్రస్తుతం ఈ వేడుక కాస్తా గడపదాటి రెస్టరెంట్లూ స్టార్‌హోటళ్ల మెట్లెక్కింది. అవును మరి, వండలేనివాళ్లు అల్లుడుగారిని హోటల్‌కే పిలిచి విందు ఇస్తున్నారట. దాంతో అక్కడి హోటళ్ల వాళ్లు కూడా జమాయీ షష్ఠికోసం ప్రత్యేక మెనూని తయారు చేస్తున్నారు. పండుగ ఎవరిదైతేనేం... ఈ రకంగా విందుభోజనం పెడతానంటే బెంగాలీ అనేముందీ... తెలుగింటి అల్లుడు మాత్రం రానంటాడా చెప్పండి...!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.