close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొబ్బరి పెంకుకి... కొత్త సొగసు..!

దేవుడిని కొలిచేందుకో కొబ్బరి కోసమో ఏటా వందల కోట్ల కొబ్బరికాయల్ని కొట్టేస్తాం. కొబ్బరి మాత్రం తీసుకుని చిప్పల్ని పారేస్తాం. కానీ ఈమధ్య ఆ ఖాళీ చిప్పలే గృహాలంకరణ వస్తువులై నట్టింట్లో కొలువుదీరుతున్నాయి. ఫ్యాషన్‌ యాక్సెసరీలై పలకరిస్తున్నాయి. వంటింటి సామగ్రిగానూ ఉపయోగపడుతున్నాయి. అవునండీ... వంటచెరకుకి తప్ప మరెందుకూ పనికిరావనుకునే ఆ చిప్పలకీ  చాలా సీనుంది మరి..!

భూలోక కల్పవృక్షంగా భావించే కొబ్బరిచెట్టు నుంచి వచ్చే ఆకులూ, పువ్వూ, వేళ్లూ; కొబ్బరికాయలూ, నీళ్లూ, పెంకులూ... ఇలా ప్రతి భాగాన్నీ రోజువారీ అవసరాలకే కాదు, ఆయుర్వేద, సిద్ధ వైద్యంలోనూ వాడుతుంటారు. దీనికితోడు ఆమధ్య గుండెజబ్బుల నివారణకు కొబ్బరి నూనెని మించింది లేదంటూ వెల్లువెత్తిన పరిశోధనలు ప్రాచ్య దేశాలతోబాటు కొబ్బరికాయ రూపమే తెలీని పాశ్చాత్యుల్నీ నారికేళ వృక్షాల చుట్టూ ప్రదక్షిణలు చేయించాయి. అంతెందుకు, కీటో డైట్‌ల పుణ్యమా అని కొబ్బరి నూనె ధరలు అమాంతం పెరిగిపోవడమే కాదు, కోనసీమ వాసుల్ని సైతం కొబ్బరినూనెని కొనుక్కునేలా చేశాయి. కొబ్బరి ఉత్పత్తుల వాడకం ఇలా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంటే, ఆ కాయల పెంకులన్నీ ఎక్కడ వేయాలి... ఏం చేయాలి... అన్నది అందరికీ సవాల్‌గా మారింది. అందుకు అందమైన ప్రత్యామ్నాయమే ఈ కొబ్బరి పెంకుల కళ అని చెప్పొచ్చు.

కోజికోడ్‌ నుంచి..!
అలాగని ఈ కళ నిన్నమొన్నటిది కాదు. చైనాలో టంగ్‌ కాలం నుంచీ కొబ్బరి చిప్పలతో గిన్నెలూ స్పూన్లూ కప్పులూ చేయడంతోపాటు ఉలితో కళాత్మకంగా చెక్కేవారట. మెల్లగా ఆగ్నేయాసియా దేశాలకీ మధ్య తూర్పు దేశాలకీ ఇది వ్యాపించింది. మన దగ్గర మాత్రం కొబ్బరిచెట్లు విరివిగా ఉన్న కేరళలోని కోజికోడ్‌, కాలికట్‌, త్రివేండ్రంలోని కళాకారులే మొదటగా వీటిని తయారుచేశారు. అక్కడి వీధుల్లో అమ్మకానికి ఉంచిన కొబ్బరిచిప్పల బొమ్మలూ దీపాలూ వస్తువులూ కళ్లను కట్టిపడేస్తుంటాయి. అవి చూసి ముచ్చటపడ్డ కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాటితో ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో ఈ కళ దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పైగా వాటిని చెక్కేందుకు పరికరాలు కూడా రావడంతో కొబ్బరిచిప్పలతో గృహాలంకరణ వస్తువుల్ని తయారుచేయడం బాగా పెరిగింది. అయితే అప్పట్లో నేరుగా చిప్పల్నే బొమ్మలుగా మలిచేవారు. ఇప్పుడు వాటిని వజ్రాలను సానబెట్టినట్లుగా చేసి నున్నగా మెరిసేలా చేస్తున్నారు. చెక్క కళాఖండాల మాదిరిగానే ఉలితోనూ చెక్కుతున్నారు. ముఖ్యంగా సునిశితమైన పనితనంతో చెక్కిన కొబ్బరి చిప్పల దీపాలూ షాండ్లియర్లూ చూపరుల కళ్లను కట్టిపడేయడం ఖాయం. ఇవనే కాదు, బొమ్మలూ, వాల్‌క్లాక్‌లూ వేజ్‌లూ ఫొటోఫ్రేమ్‌లూ పెన్‌స్టాండ్‌లూ... వంటి ఎన్నో వస్తువులు ఇంటి అందాన్ని పెంచడంతోబాటు గృహోపకరణాలుగానూ ఉపయోగపడుతున్నాయి.

పెంకులా... బటన్సా..!
‘పాతే కొత్త’ అన్న చందాన ఈమధ్య లోహ పాత్రలకు బదులుగా మట్టి, రాయి, చెక్కతో చేసిన రకరకాల పర్యావరణ ప్రియమైన వస్తువుల వాడకం బాగా పెరిగింది. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ చిప్పలతో సైతం కప్పులూ గిన్నెలూ స్పూన్లూ గరిటెలూ జగ్గులూ మగ్గులూ తయారుచేస్తున్నారు. వీటిలో టీ, సూప్‌ ఏది పోసుకుని తాగినా... ఐస్‌క్రీమ్‌ టిఫిన్లూ సలాడ్లూ ఏది వేసుకుని తిన్నా... ఒకలాంటి సహజమైన ఫ్లేవర్‌ ఆయా వంటకాలకూ పట్టి మరింత రుచిగా ఉంటాయనీ, ఆరోగ్యానికీ మంచిదని చెబుతున్నారు. ఈ సామాగ్రి తయారీలో ఎలాంటి రంగులూ రసాయనాలూ వాడకుండా కేవలం ఇనుప, చెక్క పనిముట్లతోనే వాటికి సానబెట్టి సహజమైన మెరుపుని తీసుకురావడంతో ఇంటికి వచ్చిన అతిథులను కోకోనట్‌ షెల్‌ కప్పులూ గిన్నెలూ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఇక, కొబ్బరి పెంకులతో చేసిన బటన్స్‌ అయితే ఫ్యాషన్‌ గురూలకు తెగ నచ్చేస్తున్నాయట. పెంకులో సహజంగా ఏర్పడిన గీతలూ రంగులే ఆ బటన్స్‌కో ప్రత్యేక డిజైన్‌ తీసుకొస్తున్నాయి. దాంతో వీటిని దుస్తులకి వాడటమే కాకుండా ఆ బటన్స్‌ను జ్యూట్‌, ఫ్యాబ్రిక్‌, లెదర్‌... వంటి వాటితో చేసిన బ్యాగులకి అతికించడం ద్వారా కొత్త లుక్‌ తీసుకొస్తున్నారు. కొందరయితే అచ్చంగా కొబ్బరిపెంకులతోనే బ్యాగులూ క్లిప్పులూ వాచీలూ గాజులూ లాకెట్లూ చెవిలోలాకులూ వంటి యాక్సెసరీల్నీ నగల్నీ కూడా చేస్తున్నారు. మొదట్లో కేరళలో మాత్రమే ఈ కొబ్బరితో చేసిన వస్తువులూ బొమ్మల వాడకం ఎక్కువగా ఉండేది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ పుణ్యమా అని ఇప్పుడు రకరకాల వెబ్‌సైట్లలో వీటిని విక్రయించడంతో కొబ్బరి కళాఖండాలూ లేదా వస్తువులను ప్రత్యేక సందర్భాల్లో కానుకలుగా ఇచ్చిపుచ్చుకోవడమూ పెరిగింది. మార్కెట్లో దొరికేవి కొన్నయితే, కాస్త సృజన ఉన్నవాళ్లు ఎవరికి వాళ్లు ఇంట్లోనే స్వయంగా కొబ్బరి చిప్పల్ని కొంచెంగా సానబెట్టి, రంగులద్ది మొక్కల్నీ పెంచుతున్నారు. కాబట్టి ఖాళీ పెంకుల్ని పారేసేముందు ఒక్కసారి వాటివైపు చూడండి... మీదైన ఆలోచనతో దానికో కొత్త రూపాన్ని ఇవ్వండి..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.