close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనాకీ బ్లడ్‌గ్రూప్‌కీ సంబంధం ఉందా?

రోనా ఒక్కొక్కరిమీద ఒక్కోలాంటి ప్రభావాన్ని కనబరుస్తుందనేది ఇప్పటికే అర్థమైపోయింది. అయితే దీనికి బ్లడ్‌ గ్రూప్‌ టైప్‌ కూడా కొంతవరకూ కారణమేనని అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ హెమటాలజీ పేర్కొంటోంది.  మిగిలిన అన్ని గ్రూపులతో పోలిస్తే ‘ఓ’ గ్రూపు ఉన్న వాళ్లకి కరోనా సోకే అవకాశం చాలా తక్కువట. డెన్మార్క్‌లో కొవిడ్‌ పరీక్ష చేసి పాజిటివ్‌ వచ్చిన ఐదు లక్షల మందిని పరిశీలించగా అందులో అందరికన్నా ‘ఓ’ గ్రూపు వాళ్లే తక్కువగా ఉన్నారట. ఎ, బి, ఎబి గ్రూపులమధ్య పెద్ద వ్యత్యాసం కనిపించలేదట. అయితే, కొవిడ్‌ సోకిన తరవాత ఎక్కువ ఇబ్బంది పడ్డవాళ్లలో బి గ్రూపుతో పోలిస్తే ఎబి, ఎ గ్రూపు వాళ్లే ఎక్కువగా ఉన్నారట. వాంకోవర్‌లో ఆసుపత్రి పాలైన వాళ్లలో వెంటిలేషన్‌ అవసరమైన వాళ్లలో ఎక్కువమంది ఎ, ఎబి గ్రూపులున్నవాళ్లే ఉన్నారట. వీళ్లలో ఎక్కువమందికి మూత్రపిండాలూ, ఊపిరితిత్తులూ దెబ్బతిన్నట్లు గుర్తించారట. దీని ఆధారంగా ఎ, ఎబి గ్రూపులతో పోలిస్తే ఓ, బి గ్రూపులు ఉన్నవాళ్లకి కొవిడ్‌ వల్ల పెద్ద ప్రమాదం లేదని భావిస్తున్నారు.


చిగుళ్ల వ్యాధితో ఆల్జీమర్స్‌!

చిగుళ్ల వ్యాధే కదా అని నిర్లక్ష్యం చేయకండి. దానివల్ల మధుమేహం, హృద్రోగం, ఆల్జీమర్స్‌ రావచ్చు అంటున్నారు టొరంటో విశ్వవిద్యాలయ నిపుణులు. వీళ్లు తాజాగా చేసిన పరిశోధనలో పెరియోడాంటిటిస్‌ రోగనిరోధకవ్యవస్థని దెబ్బతీసి మొత్తం శరీరంలోని అన్ని భాగాల్లోనూ ఇన్‌ఫ్లమేషన్‌కి కారణమవుతుందని తేలిందట. ఇందుకోసం వీళ్లు చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్న ఎలుకల్ని ఎంపికచేసి, రోగనిరోధకవ్యవస్థలో కీలకమైన న్యూట్రోఫిల్స్‌ పనితీరుమీద ఓ కన్నేసి ఉంచారట. ఎందుకంటే- ఈ వ్యాధి సోకినప్పుడు- దాన్ని ఎదుర్కొనే క్రమంలో న్యూట్రోఫిల్స్‌ సంఖ్య పెరుగుతుంది. కేవలం నోటిలోనే కాకుండా శరీరంలోని అన్ని భాగాల్లోనూ వాటి సంఖ్య పెరిగిందట. అలా ఒక్కసారిగా వాటి సంఖ్య పెరగడంవల్ల అవి ఇన్‌ఫ్లమేషన్‌కి కారణమవుతున్నట్లు గుర్తించారు. ఈ విషయమై మరింత స్పష్టత కోసం చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్న వాళ్లని ఎంపికచేసి, కొన్ని రోజులపాటు వాళ్లని బ్రష్‌ చేయకుండా ఉంచినప్పుడు, న్యూట్రోఫిల్స్‌ సంఖ్య బాగా పెరిగిందట. వాళ్లు మళ్లీ బ్రష్‌ చేసుకోగానే వాటి సంఖ్య తగ్గిందట. దీన్నిబట్టి న్యూట్రోఫిల్స్‌తో ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నట్లు తేలింది. అంతేకాదు, దంతవ్యాధులున్నవాళ్లలో న్యూట్రోఫిల్స్‌ పెరగడం వల్ల కొవిడ్‌ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు.


దోమలకి మనిషి రక్తమే ఎందుకు?

దోమకాటు ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. అయితే దోమలూ ఈగల్లాంటి కీటకాలే కదా... కానీ అవి మనుషుల్ని ఎందుకు కుడతాయి అనిపించడం సహజం. అయితే మనుషుల్ని కుట్టి రక్తం పీల్చేది ఆడదోమలే. మనిషి రక్తమే వాటికి రుచిస్తుంది. ఎందుకంటే- సంతానోత్పత్తికోసం గుడ్లు పెట్టేందుకు వాటికి పోషకాహారం అవసరం. అది మనిషి రక్తంలో దొరుకుతుందనీ అందుకే అవి కుడుతున్నాయనీ ద రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు జికా, చికెన్‌గున్యా వైరల్‌ జ్వరాలకు కారణమైన ఈడెస్‌ ఏజిప్టి అనే ఆడదోమని కూలంకషంగా పరిశీలించారట. కొన్ని ఆడదోమలకు అచ్చం రక్తం రుచితో ఉండే ఆహారాన్నీ, తేనెనీ ఆహారంగా అందిస్తే అవి తేనెని వదిలేసి, రక్తం దగ్గరకే వెళ్లి పీల్చసాగాయట. దీన్నిబట్టి అవి ఆహారంలో తేడాని గుర్తించగలవనీ, అందుకే అన్ని రకాల పోషకాలతో కూడిన మనిషి రక్తం రెడీమేడ్‌గా దొరుకుతుంది కాబట్టి గుడ్ల ఉత్పత్తికోసమే అవి మనుషుల్ని కుడుతున్నాయనీ చెబుతున్నారు సదరు పరిశోధకులు.


సోయాతో డిమెన్షియా తగ్గుతుందా?

సోయా ఉత్పత్తులు ఎక్కువగా తినేవాళ్లలో డిమెన్షియా తక్కువగా ఉన్నట్లు పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. జపాన్‌లో తొంభై సంవత్సరాలు దాటిన వృద్ధుల్ని పరిశీలించినప్పుడు- వాళ్ల పొట్టలో వైవిధ్యభరితమైన బ్యాక్టీరియా ఉత్పత్తికి సోయా దోహదపడుతున్నట్లు గుర్తించారు. ఆ బ్యాక్టీరియా నేరుగా మెదడు మీద ప్రభావం చూపిస్తుందనీ ముఖ్యంగా మతిమరపుకి కారణమయ్యే వైట్‌ మ్యాటర్‌ లెజియన్స్‌ సంఖ్యను తగ్గిస్తుందనీ గుర్తించారు. ఎందుకంటే వీటి సంఖ్య ఎంత తక్కువగా ఉంటే జ్ఞాపకశక్తి అంత బాగుంటుంది. వీటి సంఖ్య పెరిగితే, మెదడు చురుకుదనానికి కారణమయ్యే ఈక్వల్‌ ఉత్పత్తి తగ్గిపోతుందట. దాంతో మతిమరపు, ఆల్జీమర్స్‌ వంటివి వచ్చే అవకాశం ఉంది. అదే వైట్‌మ్యాటర్‌ తక్కువగా ఉన్నవాళ్లలో మెదడులో ఈక్వల్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉందట. దీనికి సోయా వాడకమే కారణమని తేల్చారు. అదెలా అంటే- సోయా ఎక్కువగా తినడం వల్ల వాళ్ల పొట్టలో ఒక రకమైన బ్యాక్టీరియా చేరుతుంది. అది కాస్తా సోయాలోని ఐసోఫ్లేవొనిన్లని మెదడు పనితీరుకి కారణమయ్యే ఈక్వల్‌గా మారుస్తుంది. అందువల్లే ప్రపంచదేశాలతో పోలిస్తే జపనీయుల్లో మతిమరపు తక్కువ అంటున్నారు. పైగా సోయాలోని ఐసోఫ్లేవనిన్ల కారణంగా వాళ్లలో గుండెజబ్బులూ తక్కువేనట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు