close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హరిత మతాబులు వచ్చేశాయోచ్‌!

‘దీపావళి అంటే దీపాల పండగ... మధ్యలో ఈ కాలుష్యం పెంచే మతాబులెందుకు!’ - ఈ వాదన మనదగ్గర ఎప్పటి నుంచో ఉంది.‘దీపావళి నుంచి మతాబుల్ని మైనస్‌ చేస్తే, దానికీ కార్తీక పున్నమికీ తేడా ఏమిటీ?!’ - పై వాదనకి ఇది కౌంటర్‌! దేశంలోని ఈ రెండు తరహాల వాళ్లనీ సంతృప్తి పరిచే సరికొత్త పర్యావరణహిత మతాబులు వచ్చేశాయిప్పుడు. ఈసారి దీపావళికి మనమంతా ఈ ‘గ్రీన్‌ క్రాకర్స్‌’నే వాడబోతున్నాం. ఇంతకీ ఇవేమిటో... వీటికీ పాతవాటికీ తేడా ఏమిటో చూద్దామా!

ఇప్పుడు ప్రపంచమంతా పర్యావరణహిత మంత్రమే జపిస్తోంది. భోజనం చేసే పళ్లాల నుంచి టీ తాగే కప్పులదాకా ప్రకృతికి హాని చేయని వస్తువులు వాడాలన్నదే ప్రకృతి ప్రేమికుల ఆకాంక్ష. ప్రభుత్వాలూ ఇదే విషయాన్ని చెబుతున్నా... ప్రజలు కొత్త వస్తువులకీ, పద్ధతులకీ మారడం మాత్రం కొంత నత్తనడకనే సాగుతోంది. కానీ, ఇంతకాలం మనమంతా ప్రకృతికి పెనుముప్పుగా భావిస్తూ వచ్చిన మతాబులు మాత్రం ఎవరూ ఊహించనంత వేగంగా పర్యావరణహితంగా మారి పోతున్నాయి! ఈ దీపావళికి గ్రీన్‌ క్రాకర్స్‌గా కొత్త అవతారంతో మనముందుకొస్తున్నాయి. సుప్రీంకోర్టూ, శాస్త్ర పరిశోధనా వ్యవస్థా, మతాబుల పరిశ్రమా... మూడూ కలిసి ఈ ఏడాది సాధించిన ఓ అద్భుతం ఇది.

ఆందోళనతో మొదలై...
చెవుల్ని చిల్లులుపెట్టే శబ్దాలూ, ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేసే పొగాలేని దీపావళి ఉండాలనే వాదన ఎప్పటి నుంచో ఉన్నా... ఈ దశాబ్దంలో అది ఉద్యమరూపాన్ని దాల్చింది. ముఖ్యంగా దీపావళి తర్వాతి రోజు కొన్ని నగరాల్లో గాలిలోని ‘పీఎం 2.5’ రేణువుల సంఖ్య భారీగా పెరుగుతోందని గ్రహించారు. వెంట్రుకవాసికన్నా సన్నటి సూక్ష్మ రేణువులివి. సాధారణంగా వీటి సంఖ్య 250 మైక్రో గ్రాములకంటే ఎక్కువుంటే ప్రజలుఅనారోగ్యానికి గురవుతారని చెబుతారు. అలాంటిది, దీపావళి తర్వాత అది 800 మైక్రో గ్రాములు ఉంటున్నట్టు తేలింది! చిన్నారులనీ, ఊపిరితిత్తుల సమస్యలున్న వాళ్లనీ ఇది ప్రమాదంలోకి నెడుతుంది. అందుకే, దిల్లీకి చెందిన రెండేళ్లు కూడా నిండని ముగ్గురు పిల్లల తరఫున వారి తండ్రులు సుప్రీంకోర్టులో మతాబుల పరిశ్రమని మూసివేయాలంటూ 2015లో కేసువేశారు. దానిపైన విచారణ జరిపిన కోర్టు 2017లో టపాసుల తయారీపైన ‘తాత్కాలిక’ నిషేధాన్ని విధించింది. ఇది నాణేనికి ఓ వైపు. మరోవైపు, నిషేధంతో ఈ పరిశ్రమని నమ్ముకున్న దాదాపు పాతికలక్షలమంది పొట్టకొట్టొద్దంటూ ఆందోళన మొదలైంది. దాంతో అటు పరిశ్రమా దెబ్బతినకుండా, ఇటు పర్యావరణానికి పెద్దగా హాని లేకుండా కొత్తతరం మతాబుల్ని తయారు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అలా, కొత్తతరహా టపాకాయల్ని సృష్టించడానికి శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్‌ఐఆర్‌) శాస్త్రవేత్తలు నడుంబిగించారు.

సాధించేశారు...
మామూలుగా మతాబులు మండటం కోసం బొగ్గుని ఇంధనంగా వాడతారు. ఆ మంటని కాస్త పెద్దదిగా చేయడానికి సల్ఫర్‌నీ శక్తిమంతంగా పేలడానికీ, వెలుగు జిలుగులకీ  బేరియం నైట్రేట్స్‌ వంటి రసాయనాలనీ వాడతారు. ఇవన్నీ ‘పీఎం 2.5’ని పెంచేవే. కాబట్టి, సీఎస్‌ఐఆర్‌ వీటి వాడకాన్ని 30 శాతం మేర తగ్గించేలా కొత్త తరహా మతాబుల్ని కనిపెట్టింది. ‘మరి ఇవి 70 శాతం రసాయనాలని వెదజల్లుతాయిగా కదా!’ అనుకుంటున్నారా... అందుకే ఈ కొత్త టపాకాయలు పేలిన వెంటనే నీటి ఆవిరినీ, గాలినీ వెదజల్లే విధంగా తయారుచేశారు. ఇవి రెండూ కాలుష్య కారక పొగని తొక్కిపెడతాయి. ఇక, శబ్దకాలుష్యం సంగతికొస్తే పాత టపాకాయల్లో 165 డెసిబుల్స్‌ దాకా శబ్దం వస్తే ఇందులో 125 డెసిబుల్సే వస్తుంది. సీఎస్‌ఐఆర్‌కి చెందిన నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(నీరి) వీటిని తయారుచేసింది. ఆ సంస్థే మతాబుల తయారీ పరిశ్రమకి వీటి తయారీ ఫార్ములాని అందించి... అనుమతులూ ఇస్తోంది! సుప్రీంకోర్టు ఇక అందరూ వీటినే తయారుచేయాలని ఆదేశాలు జారీచేసింది.

ఇది మరో ఎత్తు!
తమిళనాడులోని శివకాశి మనదేశంలో మతాబుల రాజధాని! ఏటా అక్కడ మూడువేల కోట్ల రూపాయల మేరకు టపాకాయల వ్యాపారం జరుగుతుంది. వెయ్యికిపైగా సంస్థల్లో ఐదు లక్షలమంది పనిచేస్తున్నారు. 2017లో సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో ఈ పరిశ్రమ కుదేలైంది. కంపెనీల యజమానులూ, కార్మికులూ మూడేళ్లపాటు ఆందోళనలెన్నో చేశారు. అంత చేసినవారే- సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక అత్యంత వేగంగా దాన్ని అమలు జరిపారు. ‘నీరి’ ఫార్ములాని చకచకా నేర్చుకుని కొన్ని నెలల్లోనే హరిత టపాకాయల్ని... అదీ భారీ సంఖ్యలో తయారుచేశారు. ఈ ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్‌లో సరఫరా కోసం తెనాలికీ, ఇటు తెలంగాణలో పంపిణీ కోసం హైదరాబాద్‌కీ వచ్చేశాయి. అలా... మనదేశం తొలిసారి తక్కువ కాలుష్యంతో కూడిన ‘హరిత దీపావళి’ని జరుపుకోబోతోంది!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు