
కారం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటుంటారు కొందరు. కానీ పచ్చిమిర్చి హృద్రోగాలను 26 శాతం తగ్గిస్తుందని పేర్కొంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు. మిర్చి ఎక్కువగా తినేవాళ్లలో హృద్రోగాలూ క్యాన్సర్ల కారణంగా మరణించడం తక్కువ అని ఇప్పటికే ఎన్నో పరిశీలనలు తెలియజేస్తున్నాయి. అయితే వాటన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేసి ఈ విషయాన్ని మరోసారి నొక్కి చెబుతోంది హృద్రోగ నిపుణుల బృందం. మిర్చిలోని క్యాప్సైసిన్ మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది మంటనీ క్యాన్సర్ కణాల పెరుగుదలనీ అడ్డుకుంటుంది. అందుకే ఈ బృందం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మిర్చి తినేవాళ్లనీ తిననివాళ్లనీ పోల్చి చూసిందట. అందులో మిర్చి తినేవాళ్లలో హృద్రోగ మరణాలు 26 శాతం, క్యాన్సర్ మరణాలు 23 శాతం తక్కువగా ఉన్నాయట. అంతేకాదు, మిర్చి తినని వాళ్లకన్నా కారం బాగా తినేవాళ్లే ఎక్కువకాలం జీవిస్తున్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా ఆహారంలో మిర్చిని భాగం చేసుకోమని నొక్కిచెబుతోంది అంతర్జాతీయ శాస్త్రబృందం.
కొవిడ్‌తో మనసుకి తంటా!
కొవిడ్ వచ్చి తగ్గినవాళ్లలో నీరసం, ఊపిరి సరిగ్గా అందకపోవడం... వంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అయితే కొత్తగా వీళ్లలో మానసిక సమస్యలు కూడా వస్తున్నట్లు చెబుతున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు. అమెరికాలో కొవిడ్ వచ్చి తగ్గిన ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో ఆసుపత్రికి వస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. వాళ్లలో ఆందోళన, డిప్రెషన్, మతిమరుపు, నిద్రలేమి... వంటివి ఎక్కువగా ఉన్నాయట. కొవిడ్-19 వచ్చి తగ్గిన 62 వేల మందిని 90 రోజులపాటు పరిశీలించినప్పుడు- వాళ్లలో 18 శాతం మంది ఏదో ఒక మానసిక వ్యాధితో సతమతమవుతున్నట్లు గుర్తించారట. అదే సమయంలో- ఇతరత్రా వ్యాధులు వచ్చినవాళ్లతో పోలిస్తే ఈ సమస్యలు కొవిడ్ కేసుల్లోనే ఎక్కువగా ఉన్నాయట. దీన్నిబట్టి కరోనా వైరస్ నాడీవ్యవస్థమీద ప్రభావం కనబరుస్తుందనీ, మున్ముందు మానసిక వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉందనీ హెచ్చరిస్తున్నారు.
తెలివైన డి-విటమిన్!
విటమిన్-డి లోపిస్తే వచ్చే సమస్యలు మనకు తెలిసిందే. అయితే గర్భిణీల్లో ఇది లోపిస్తే దాని ప్రభావం పుట్టే పిల్లల తెలివితేటలమీదా ఉంటుంది అంటున్నారు సియాటెల్ చిల్డ్రన్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు. ఈ విషయం గురించి వీళ్లు అమెరికాలో నివసించే నల్లజాతి గర్భిణులను ఎంపికచేసి వాళ్లలో ఎప్పటికప్పుడు డి-విటమిన్ శాతాన్ని పరిశీలిస్తూ వచ్చారట. ఎందుకంటే- సాధారణంగానే నల్లజాతి స్త్రీలలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల అది యూవీ కిరణాలను అడ్డుకోవడంతో శరీరంలో డి-విటమిన్ తయారీ తక్కువగా ఉంటుంది. అందుకే తెల్లజాతి స్త్రీలతో పోలిస్తే నల్లజాతి గర్భిణీల్లో 46 శాతం మందిలో డి-విటమిన్ లోపం కనిపిస్తుందట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గత పదిహేను సంవత్సరాలుగా కొంతమంది నల్లజాతి మహిళలకు పుట్టిన పిల్లల వివరాలను సేకరించి వాళ్ల ఐక్యూ శాతాన్ని పరిశీలించారట. తెలివితేటలకి జన్యువులతోపాటు ఇతరత్రా కారణాలు ఉన్నప్పటికీ డి-విటమిన్ సమృద్ధిగా ఉన్న తల్లులకు పుట్టిన పిల్లలతో పోలిస్తే ఆ లోపంతో బాధపడే తల్లులకు పుట్టిన పిల్లల్లో తెలివి తేటలు తక్కువగా ఉన్నట్లు స్పష్టమైందట. కాబట్టి గర్భిణీలు తప్పనిసరిగా డి-విటమిన్ లోపం తలెత్తకుండా చూసుకోవాలనీ, ఒకవేళ అది తక్కువగా ఉంటే సప్లిమెంట్లను తీసుకోవడం మేలనీ అంటున్నారు సదరు వైద్యులు.
మతిమరపుకి మందు!
కొంతమంది ఎప్పుడూ నిరాశానిస్పృహలతో కనిపిస్తుంటారు. దేనిమీదా నమ్మకం ఉండదు. చిన్న సమస్యనూ భూతద్దంలోంచి చూసి భయపడు తుంటారు. కొందరు మాత్రం ఎన్ని సమస్యలున్నా ఆశావాద దృక్పథంతో ముందుకు వెళతారు. ఈ రకమైన ఆలోచనా దృక్పథం మలివయసులో వాళ్ల జ్ఞాపకశక్తిమీదా ప్రభావాన్ని కనబరుస్తుందట. పాజిటివ్‌గా స్పందించేవాళ్లలో మతిమరపు వచ్చే అవకాశం చాలా తక్కువ. వాళ్ల వృద్ధాప్యం కూడా హాయిగానే సాగిపోతుంది అంటున్నారు నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నిపుణులు. ఇందుకోసం వెయ్యిమందిని మధ్యవయసు నుంచి మలి వయసు వరకూ- అంటే, దాదాపు 25 ఏళ్లపాటు గమనించగా- వాళ్లలో వయసుతోపాటు అంతో ఇంతో జ్ఞాపకశక్తి తగ్గిందట. కానీ నిరాశావాదులతో పోలిస్తే పాజిటివ్‌గా ఆలోచించేవాళ్లలో మతిమరపు శాతం తక్కువగా ఉందట. అంతేకాదు, పాజిటివ్‌గా ఆలోచించే వాళ్లు శారీరకంగానూ ఆరోగ్యంగా ఉన్నారట. పైగా వీళ్లకి సామాజిక సంబంధాలూ ఎక్కువే అంటున్నారు.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్