close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నా ప్రయాణం ‘విషాదం’తో మొదలైంది!

నా ప్రయాణం ‘విషాదం’తో మొదలైంది!

‘నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా’, ‘అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా’, ‘మామా ఓ చందమామా నీకు సినిమా చూపిస్త మామా’, ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో’... ఈ పాటల పల్లవుల్ని చదువుతుంటే వెంటనే వాటి రాగం నోట్లో ఆడేస్తోంది కదూ..! అంతలా సంగీత ప్రియులకు దగ్గరైన ఇలాంటి ఎన్నో గీతాల్ని స్వరపరిచాడు శేఖర్‌ చంద్ర. ‘నచ్చావులే’, ‘నువ్విలా’, ‘మనసారా’, ‘సినిమా చూపిస్త మామ’, ‘కార్తికేయ’, తాజాగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’... అన్నీ అచ్చమైన మ్యూజికల్‌ హిట్లే. ఏడో తరగతికి కూడా రాకముందే ఏడు స్వరాలతో ఏడడుగులేసి, అదే తన జీవితమనుకున్నాడు శేఖర్‌..!


చిన్నపిల్లలకు ఉండే ఓ సహజ లక్షణం... కొత్తగా ఏది కనిపించినా కావాలని గొడవ చేయడం. ఏం చేసైనా అనుకున్నది దక్కించుకోవాలనే తపన వాళ్లలో కనిపిస్తుంది. చిన్నప్పుడోసారి తెలిసిన వాళ్లింటికి వెళ్లినప్పుడు నాకూ అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ ఇంట్లో ఎవరో ఓ చిన్న పియానో వాయించడం చూశా. దాన్ని నొక్కుతుంటే వచ్చే శబ్దాలని వింటుంటే చాలా ఆశ్చర్యమేసింది. ఎలాగైనా దాన్ని అమ్మానాన్నలతో కొనిపించుకోవాలనీ, నేనూ వాళ్లలా వాయించాలనీ నిర్ణయించుకున్నా. కానీ వెంటనే అడిగితే ఇంట్లో కొనలేదు. కొన్ని రోజులకు నాకు విపరీతంగా జ్వరమొస్తే ఆస్పత్రిలో చేర్పించారు. ఇంట్లో వాళ్లను ఏదైనా అడగడానికి అదే సరైన సమయం. అందుకే ఇంజెక్షన్‌ చేయించుకోకుండా, మందులు వేసుకోకుండా మారాం చేశా. క్యాషియో కొనిస్తేనే చెప్పిన్నట్లు వింటానన్నా. దాంతో తప్పనిసరై నాకో చిన్న క్యాషియో తెచ్చిచ్చారు. అప్పట్నుంచీ అదే నా ప్రపంచంలా మారిపోయింది. పిల్లలంతా ఆడుతూపాడుతూ కాలక్షేపం చేస్తుంటే నేను మాత్రం దానిమీద ఏదో ఒకటి వాయించేవాణ్ణి. నాకు నచ్చిన పాటల ట్యూన్‌లను సొంతంగా దానిమీద పలికించడానికి ప్రయత్నించేవాణ్ణి. అలా తొమ్మిదేళ్ల వయసులో ఆ చిన్న సంగీత వాద్యమే నాకు సర్వస్వమైంది.
రోజా పాట విన్నాక...
గాయకులూ, సంగీత దర్శకులంటే ఆ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వస్తారనుకుంటారు. కానీ ఇంట్లో, బంధువుల్లో సంగీత కళాకారులెవరూ లేరు. మా నాన్న హరి అనుమోలు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌. ‘మయూరి’, ‘నువ్వేకావాలి’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘గమ్యం’ లాంటి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు కెమెరామన్‌గా చేశారు. రాజమౌళి, త్రివిక్రమ్‌, క్రిష్‌, విక్రమ్‌, వంశీ, క్రాంతి మాధవ్‌ లాంటి చాలామంది దర్శకుల తొలి సినిమాలకు ఆయనే పనిచేయడం విశేషం. అలాంటి వ్యక్తి ఇంట్లో ఉంటే నేనూ అదే దారిలో వెళ్తాననీ, ఆయన ప్రోత్సాహం కూడా ఉంటుంది కాబట్టి తిరుగుండదనీ చాలామంది అభిప్రాయం. కానీ నాకు మాత్రం తెలీకుండా పాటలపైన ఇష్టం పెరిగిపోయింది. సినిమాలకు సంబంధించిన విషయాలను నాన్న ఇంట్లో ఎక్కువగా ప్రస్తావించేవారు కాదు. ఏ కాస్త ఖాళీ దొరికినా రేడియోతోనే ఆయనకు కాలక్షేపం. బహుశా దానివల్లే నాకు సంగీతంపైన ప్రేమ మొదలైందేమో అనిపిస్తుంది. ఇక ఓసారి ‘రోజా’ సినిమాకి వెళ్లినప్పుడైతే, ‘నా చెలి రోజావే’ పాట వింటూ ఒకలాంటి మైకంలోకి జారిపోయా. చాలా రోజుల వరకూ ఆ పాటా, సంగీతం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
కీరవాణిగారి సలహా
సంగీతంపైన ఇష్టం పెరుగుతూ రావడంతో క్రమంగా పియానో, గిటార్‌ నేర్చుకోవడం మొదలుపెట్టా. పాట పాడుతూ గిటార్‌ వాయిస్తుంటే చాలా మజాగా ఉంటుందన్న ఆలోచన తప్ప వేరే లక్ష్యమేదీ ఉండేది కాదు. స్కూల్లో స్టేజీషోలకు బ్యాక్‌గ్రౌండ్‌ వాయించేవాణ్ణి. ఇంట్లో కూడా అప్పుడప్పుడూ సరదాగా పాడుతూ మ్యూజిక్‌ చేసేవాడిని. అమ్మావాళ్లకు అది నచ్చినా ఎక్కడ దాన్ని సీరియస్‌గా తీసుకొని చదువుని అశ్రద్ధ చేస్తానేమోనని ఆ విషయం చెప్పేవాళ్లు కాదు. పదో తరగతి, ఇంటర్‌కి వచ్చేసరికి ఇంట్లో వాళ్ల ఒత్తిడితో కాస్త చదువుపైన దృష్టిపెట్టా. అలాంటప్పుడే ఓసారి ‘సఖి’ సినిమా పాటలు విన్నాక సంగీత పిచ్చి మళ్లీ మొదటికొచ్చింది. ఆ రంగంలోనే భవిష్యత్తుని వెతుక్కోవాలని అప్పుడే ఫిక్సయిపోయా. ఏమంటారోనని భయపడుతూనే నాన్నకు నా నిర్ణయం చెప్పా. సినిమాటోగ్రఫీ అయితే ఫర్వాలేదు కానీ సంగీతం అనగానే అందరూ కాస్త సందిగ్ధంలో పడ్డారు. నా కోరిక ఎందుకు కాదనాలని ఓ రోజు నాన్న కీరవాణిగారి దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. అదే నా జీవితానికి పెద్ద మలుపు. కీరవాణిగారు ఒకట్రెండు పాటలు చెప్పి వాటిని కీబోర్డ్‌, గిటార్‌ల మీద వాయించమన్నారు. నేను వాయించే విధానం నచ్చి మంచి మ్యూజిక్‌ సెన్స్‌ ఉందనీ, హైదరాబాద్‌లో కాకుండా చెన్నైకి పంపించి ఇంకా బాగా సంగీతం నేర్పితే మంచి భవిష్యత్తు ఉంటుందనీ నాన్నకు సూచించారు. ఆయన మాటలతో నేనేదో పనికొచ్చే పని చేస్తున్నానన్న భరోసా నాన్నకూ కలిగింది. అలా చెన్నైకి వెళ్లి ట్రినిటీ మ్యూజిక్‌ కాలేజీలో చేరి సీరియస్‌గా సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టా.
వాయిస్తూ... నేర్పిస్తూ
చెన్నైలో ఓ పక్క సంగీతం, కర్ణాటిక్‌ వోకల్‌ నేర్చుకుంటూనే కీరవాణిగారి పాటలు రికార్డింగ్‌ జరిగే స్టూడియోకీ తరచూ వెళ్లొస్తూ ఉండేవాణ్ణి. అలా ఓసారి వెళ్లినప్పుడు ‘ఒకటో నెంబర్‌ కుర్రాడు’ సినిమా రికార్డింగ్‌ జరుగుతోంది. అందులో ‘ఒరేయ్‌ నువ్వు నాకు నచ్చావురా’ అనే పాటకి కోరస్‌ నాతో పాడించారు. తరవాత కూడా ఇంకొన్ని పాటలకు కోరస్‌ పాడాను. ఆ సమయంలోనే అర్జున్‌ అనే వ్యక్తి పరిచయమయ్యారు. ఆయన సీరియల్స్‌కు సంగీతం అందించేవారు. అలా కీబోర్డ్‌ ప్రోగ్రామర్‌గా ఆయనతో కలిసి సీరియళ్లూ, జింగిల్స్‌ చేసేవాణ్ణి. కొన్నాళ్లు కోటిగారి దగ్గర కూడా కీబోర్డ్‌ వాయించా. నేను పియానోలో ఫోర్త్‌ గ్రేడ్‌ కోర్సు చేసేప్పుడు కొంతమంది పిల్లలకి మొదటి గ్రేడ్‌ పాఠాలు నేర్పేవాణ్ణి. వాళ్లు ఎక్కువగా ఏదో ఒక హిందీ పాట చెప్పి, దానికి వాయించడం నేర్పమనేవారు. వాళ్లకోసం నేను ముందే దాన్ని సాధన చేసేవాణ్ణి. అలా నాకూ పాటలకు వాయించడం ప్రాక్టీసయ్యేది. కీరవాణిగారి వల్ల స్టూడియో వాతావరణం, సినిమా సంగీతం చేసే విధానం పైన అవగాహన పెరుగుతూ వచ్చింది. అలా చెన్నైలో రోజులు గడవసాగాయి. ఇంట్లో వాళ్లకేమో నేనొక్కడినే అక్కడ ఏం చేస్తున్నానో అన్న బెంగ. ఆ సమయంలోనే దర్శకుడు ఉప్పలపాటి నారాయణగారి పరిచయం నా కెరీర్‌ని ముందుకు తీసుకెళ్లింది.
సినిమా ఆగింది!
ఓసారి ఏదో రికార్డింగ్‌ నుంచి బయటికొచ్చేప్పుడు నారాయణగారు స్టూడియోలో ఎదురుపడ్డారు. కీబోర్డ్‌ ప్లేయర్‌గా రాణిస్తున్నందుకు అభినందిస్తూనే సొంతంగా ఏవైనా ట్యూన్లు చేస్తున్నానేమోనని కనుక్కున్నారు. అప్పటివరకైతే అలాంటి ప్రయత్నాలు చేయలేదనీ, కానీ పాటలు కూడా చేయగలననీ చెప్పా. దాంతో ఆయనకు తెలిసిన వాళ్ల సినిమాకు కొత్త సంగీత దర్శకుల కోసం చూస్తున్నారని చెప్పి ఓసారి ప్రయత్నించమన్నారు. సరేనని కొన్ని ట్యూన్లు చేసి సీడీ వాళ్లక్కిచ్చా. అందరికీ అవి బాగా నచ్చి ప్రాజెక్టు ఓకే అయింది కానీ ఏవో కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఒక వారం తరవాత మళ్లీ నారాయణగారే నన్ను ఆఫీసుకి పిలిపించారు. తానే ఓ సినిమా తీయబోతున్నట్లు చెప్పి, మొదట ఓ ట్యూన్‌ చేయమనీ, అది నచ్చితేనే ముందుకెళ్దామనీ అన్నారు. అప్పుడు నా వయసు 21. ఆ సమయంలో ఎవరికైనా మంచి యూత్‌ఫుల్‌ మ్యూజిక్‌ చేయాలని ఉంటుంది. కానీ నాకు ఆయన చెప్పింది ఓ భారమైన సందర్భం. అలా మొదటి పాటే ఓ విషాద గీతం చేయాల్సి వచ్చింది. పాట ఆయనకు బాగా నచ్చడంతో ఆ సినిమాకు నన్నే పనిచేయమన్నారు. నిర్మాతలు కూడా పాటలు విని వెంటనే అంగీకరించారు. నాకు పరిచయం లేని వ్యక్తులు నా సంగీతాన్ని ఇష్టపడటం, ఎక్కడలేని ఉత్సాహాన్నిచ్చింది. ఈ రంగంలో నేను రాణించగలనన్న నమ్మకం కుదిరింది. అలా ‘జ్ఞాపకం’ పేరుతో నా తొలిసినిమా విడుదలైంది. అంతగా ఆడకపోయినా, పాటలకు మంచి గుర్తింపొచ్చింది. ఆ సినిమా వల్ల నాకు కలిగిన మరో ప్రయోజనం... దర్శకుడు రవిబాబుతో పరిచయం.
‘నచ్చావులే’... నచ్చేసింది
‘జ్ఞాపకం’ సినిమాలో అన్నీ భిన్నమైన సందర్భాల్లో వచ్చే పాటలున్నాయి. దర్శకుడు రవిబాబుగారికి అవి బాగా నచ్చి ఆయనే ఓ రోజు ఫోన్‌ చేసి పిలిచారు. మొదట నన్ను చూడగానే, ‘చిన్నవాడిలా ఉన్నావు, థ్రిల్లర్‌ సినిమాకు పనిచేయగలవా’ అన్నారు. నా మ్యూజిక్‌ నచ్చితేనే తీసుకోండని చెప్పా. అలా నాతో మాట్లాడాక ‘అనసూయ’ సినిమాకు అవకాశం ఇచ్చారు. అది థ్రిల్లర్‌ కాబట్టి నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యముంటుంది. నాక్కూడా అదో భిన్నమైన అనుభవంలా నిలిచిపోతుందని అనిపించింది. అనుకున్నట్లే సినిమా పెద్ద హిట్టయింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం గురించి పరిశ్రమలో చాలామంది చర్చించుకున్నారు. ఆ తరవాతి సినిమా ‘నచ్చావులే’ నాకో డ్రీమ్‌ ప్రాజెక్టులా మిగిలింది. మా నాన్నగారు ఉషాకిరణ్‌ మూవీస్‌లో కొన్ని సినిమాలకు పనిచేశారు. కానీ ఆయన ప్రమేయం లేకుండా అలాంటి సంస్థ నుంచి అవకాశం రావడం గొప్పగా అనిపించింది. నేను రోజూ ఇంటి నుంచి ఫిల్మ్‌ సిటీకి వచ్చి వెళ్తుంటే నాన్నను ఏదో తెలీని భయం వెంటాడేది. అక్కడికెళ్లి చెడ్డ పేరు తీసుకురాకపోతే చాలనుకున్నారు. కానీ ‘నచ్చావులే’ మ్యూజికల్‌గా చాలామంచి హిట్టయింది. అందులో అన్ని పాటలూ ఆ ఏడాది టాప్‌ సాంగ్స్‌ జాబితాలో చేరాయి. గాయని గీతామాధురికి తొలి నంది అవార్డు ఆ సినిమాతోనే వచ్చింది. మా ఇంట్లో వాళ్లు కూడా ఆ విజయంతో వూపిరి పీల్చుకున్నారు.
వరసగా విజయాలు
‘నచ్చావులే’ తరవాత ఉషాకిరణ్‌ బ్యానర్‌లో ‘నువ్విలా’, ‘బెట్టింగ్‌ బంగార్రాజు’ సినిమాలకు పనిచేశా. ‘నువ్విలా’ కూడా సంగీతపరంగా మంచి విజయాన్ని అందుకుంది. ‘అమరావతి’, ‘అవును’, ‘మాయ’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’, ‘అమ్మాయి క్లాస్‌ అబ్బాయి మాస్‌’... ఇలా వరసగా సినిమాలకు పనిచేస్తూ వెళ్లా. మధ్యలో ‘మనసారా’ సినిమా ఆడియో మంచి బ్రేక్‌ ఇచ్చింది. తరవాత ‘కార్తికేయ’ సినిమా కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచింది. అది థ్రిల్లర్‌ సినిమా అయినా మ్యూజికల్‌గానూ విజయం సాధించింది. ఆపైన ‘సినిమా చూపిస్త మామ’ కమర్షియల్‌ విజయాన్ని ఖాతాలో వేసింది. వచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళ్లా తప్ప అవి చిన్నవా పెద్దవా అని ఆలోచించలేదు. మన పాటలు హిట్టయితే మంచి అవకాశాలు వాటంతటవే వస్తాయనుకున్నా. కానీ పరిశ్రమలో ఎంత నైపుణ్యం ఉన్నా పరిచయాలు పెంచుకోవడం, మానవ సంబంధాలు కొనసాగించడం కూడా ముఖ్యమనీ నా అనుభవాల వల్ల తెలిసింది. అందుకే ఇప్పుడు నా పంథాని కొంత మార్చుకొని నలుగురితో బాగా కలుస్తున్నా. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మరో మంచి హిట్‌గా నా కెరీర్లో నిలిచిపోతుంది. మరో సినిమా ‘నేనూ నా బాయ్‌ఫ్రెండ్స్‌’ త్వరలో విడుదలవుతుంది. ఇంకొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి.
‘మంచి సంగీతం అందిస్తే సరిపోదు. వీలైనంత మంది తెలుగు వాళ్లకు అవకాశమివ్వాలి’... ‘నచ్చావులే’ సినిమా మొదలైనప్పుడు రామోజీరావుగారు నాకిచ్చిన సలహా ఇది. సాధారణంగా నిర్మాతలు ఎవరితో పాడించినా ఫర్వాలేదు కానీ తమ పాటలు బావుంటే చాలనుకుంటారు. కానీ దానికి భిన్నంగా ఆయన చెప్పిన మాట ఆశ్చర్యపరిచింది. అప్పట్నుంచీ ఇప్పటిదాకా దాదాపుగా తెలుగు వాళ్లకే ఎక్కువగా అవకాశమిస్తున్నా. అందుకే నా పాటల్లో పదాలూ స్పష్టంగా వినిపిస్తాయంటారు చాలామంది. ఎప్పటికీ అలాంటి అవకాశాలను అందరికీ ఇచ్చేంత మంచి స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక.


ఇంకొంత...
నా భార్య మాధురి అమెరికాలో ఎమ్మెస్‌ చేసి ఎల్వీప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌లో క్లినికల్‌ రీసెర్చ్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసింది. మా అమ్మాయి నయనిక పుట్టాక తనని చూసుకోవడానికి ప్రస్తుతం ఉద్యోగానికి దూరంగా ఉంది. నా పాటలకు సంబంధించి నిజాయతీగా తొలి ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చేది నా భా
* నేను ఎక్కువగా మెలొడీ గీతాలను చేస్తుంటా. కానీ కార్లో వెళ్లేప్పుడు థమన్‌ చేసే హుషారైన గీతాల్ని వినాలనిపిస్తుందని అతనికోసారి చెప్పా. మరోపక్క థమన్‌కి నాలా మెలొడీ పాటల్ని చేయడమే ఇష్టమనేసరికి చాలా ఆశ్చర్యమేసింది.
* ఇప్పటిదాకా దాదాపు పాతిక సినిమాలు చేశా. మంచి ప్రాజెక్టులా కాదా అని చూశా తప్ప మైలు రాళ్ల గురించి ఆలోచించలేదు. కానీ ఇకపై వాటికీ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నా.
* చిన్నప్పుడు పియానో, గిటార్‌ వాయించేప్పుడే ఏదో ఒక పాట పాడటం అలవాటై, క్రమంగా గాత్రంలోనూ పట్టు దొరికింది. ‘సినిమా Œూపిస్త మామ’, ‘మేం వయసుకు వచ్చాం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాల్లో పాటలు పాడా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.