close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీ కొట్టు నుంచి సీఎం కుర్చీ దాకా!

టీ కొట్టు నుంచి సీఎం కుర్చీ దాకా!

తమిళనాడులో రాజకీయాలంటే చాలా ఏళ్లుగా జయలలిత, కరుణానిధి తప్ప బయటివాళ్లకు మూడో పేరు తెలీదు. అలాంటి పరిస్థితిలో అనూహ్యంగా మూడోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు పన్నీర్‌ సెల్వం. జయకు నమ్మిన బంటుగా, అన్నాడీఎంకేలో కీలక సభ్యుడిగా, ఇప్పుడు దక్షిణాదిలో రాజకీయంగా శక్తిమంతమైన రాష్ట్రానికి సీఎంగా ఎదిగిన పన్నీర్‌ సెల్వం ప్రయాణం ప్రధాని మోదీలానే ఓ చిన్న టీకొట్టు నుంచి మొదలవ్వడం విశేషం.

మిళనాడులోని తేనీ జిల్లా పెరియకుళం ప్రాంతానికి వెళ్లి రోజీ టీ కొట్టు ఎక్కడని అడిగితే ఎవరైనా చెబుతారు. చుట్టుపక్కల టీ ఐదు రూపాయలకు అమ్మితే, అక్కడ మాత్రం పది రూపాయలు. అయినాసరే ఎన్నో ఏళ్లుగా రుచిలో, ధరలో రాజీ లేకుండా నడుస్తున్న ఆ కొట్టు జనాలతో కిటకిటలాడుతూనే ఉంటుంది. పాతవాళ్లు అలవాటు కొద్దీ అక్కడ టీ తాగితే, కొత్త వాళ్లు ఆసక్తితో అందులో అడుగుపెడతారు. ఆ దుకాణం సాక్షాత్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకి చెందింది కావడమే కొత్తవాళ్లని అంతగా ఆకర్షించే అంశం. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అత్యున్నత పీఠంపైన కూర్చున్న సెల్వం, ఒకప్పుడు అదే టీ కొట్లో గ్లాసులు కడిగాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ వచ్చినవాళ్లకి వచ్చినట్లు వేడివేడి టీ అందించాడు. అలా టీ కొట్టు సెల్వంగా స్థానికులకు దగ్గరైన అతడు, ఒక్కో మెట్టూ ఎక్కుతూ, పార్టీ అధినేత్రి నమ్మకాన్ని చూరగొని ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీ దాకా చేరాడు.

తండ్రి అడుగుజాడల్లో...
ఎనిమిదిమంది సంతానంలో అందరికంటే పెద్దవాడు పన్నీర్‌ సెల్వం. మొదట అతడికి ‘పెచిముత్తు’ అన్న పేరు పెట్టారు. అతడి పెదనాన్న పేరు కూడా అదే. చిన్న పిల్లాడిని అరే ఒరే అంటూ పెద్దవాళ్ల పేరుతో పిలిస్తే అవమానమని కుటుంబ సభ్యులంతా అలా పిలవడం మానేశారు. ఎవరూ పిలవని పేరు ఎందుకు ఉండాలనిపించి, కొన్నాళ్లకి తండ్రి అతడి పేరుని పన్నీర్‌ సెల్వంగా మార్చాడు. ఆ కుటుంబం నుంచి తొలిసారి బడిలో చేరిన పిల్లాడు అతడే. ఓ పక్క స్కూలుకెళ్తూనే తండ్రి ఒట్టకర దేవర్‌కు వ్యవసాయ పనుల్లోనూ సాయం చేసేవాడు. ఎనిమిది మంది సంతానాన్ని సాకడానికి వచ్చే ఆదాయం సరిపోక దేవర్‌ వూళ్లొని చిరు వ్యాపారులకూ, లారీ డ్రైవర్లకూ తక్కువ వడ్డీకి డబ్బులివ్వడం మొదలుపెట్టాడు. పెరియకుళం హైవేకి ఆనుకొని ఉండటంతో నిత్యం లారీల రాకపోకలతో కోలాహలంగా ఉండేది. సరకు తీసుకెళ్తున్నామనీ, తిరిగొచ్చేప్పుడు డబ్బులిచ్చేస్తామనీ చెబితే ముక్కూమొహం తెలీని డ్రైవర్లకు కూడా దేవర్‌ అప్పిచ్చేవాడు. మోసపోతావని స్థానికులు హెచ్చరించినా తన వ్యాపారానికి నమ్మకమే పునాదని చెప్పేవాడు. అప్పు తీసుకున్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో చనిపోతే కుటుంబ సభ్యులు తిరిగి డబ్బిచ్చినా తీసుకునేవాడు కాదు. అతడి అలవాట్లూ, పద్ధతుల ప్రభావం పన్నీర్‌ మీదా పడుతూ వచ్చింది. తండ్రి అవసరాలకు అప్పిస్తే, అతడు సమస్యల్లో ఉన్న స్నేహితులకు చేబదులిచ్చేవాడు. అలా వూళ్లొ తండ్రికీ, స్నేహితుల దగ్గర పన్నీర్‌కీ మనసున్న వాళ్లుగా ముద్ర పడింది.

అప్పులన్నీ మాఫీ
బీఏ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామనుకున్న పన్నీర్‌, కుటుంబ సమస్యల వల్ల డిగ్రీని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆ తరవాత తండ్రి బాటలోనే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ పైన ఓ చిన్న డెయిరీఫామ్‌ ప్రారంభించాడు. పాల వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించి బయటి వాళ్లకు పాలమ్మే బదులు తానే ఓ టీ క్యాంటీన్‌ పెడితే బావుంటుందన్న నిర్ణయానికొచ్చాడు. అలా విజయన్‌ అనే స్నేహితుడితో కలిసి వూరి మధ్యలో ఇద్దరి పేర్లూ కలిసేలా ‘పీవీ’ క్యాంటీన్‌ను ప్రారంభించాడు. క్రమంగా టీ పెట్టడంలో పన్నీర్‌కి తిరుగులేదన్న పేరొచ్చింది. అందుకే మిగతా దుకాణాల కంటే మొదట్నుంచీ కాస్త ఎక్కువ ధరకే దాన్ని అమ్మేవాడు. అలా కాలం గడుస్తుండగా ఓ రోజు తండ్రి చనిపోవడంతో అతడికి బాకీ ఉన్నవాళ్లంతా పన్నీర్‌కి డబ్బులు తిరిగివ్వడానికి వచ్చారు. కానీ తన తండ్రి మరణంతోనే అప్పులూ మాఫీ అయిపోయాయనీ, వాటిని చెల్లించాల్సిన పని లేదనీ చెప్పి వాళ్లను వెనక్కి పంపించాడు. అలా స్థానికులతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

జయకు వ్యతిరేకంగా!
టీ క్యాంటీనే జీవితం అనుకుంటూ సాగుతున్న పన్నీర్‌ నటుడు ఎంజీఆర్‌ని విపరీతంగా ఆరాధించేవాడు. ఎంజీఆర్‌ రాజకీయాల్లోకి రావడంతో అభిమాన నటుడికి మద్దతుగా పన్నీర్‌ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు. చనిపోయేలోపు పుట్టి పెరిగిన పెరియకుళం మున్సిపాలిటీకి ఛైర్మన్‌గా పనిచేయాలని ఆయనకు కోరికగా ఉండేది. కానీ స్థాయికి మించిన ఆలోచన చేస్తున్నాడని తప్పుపడతారన్న భయంతో, ఆ ఆశను తనలోనే దాచుకుని పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు పూర్తిసమయాన్ని పార్టీకే అంకితం చేయాలన్న ఉద్దేశంతో టీ కొట్టు బాధ్యతల్ని తమ్ముడికి అప్పగించాడు. ఓసారి తమ్ముడి కూతురు నీటిలో పడి చనిపోవడంతో, ఆమె జ్ఞాపకంగా ‘పీవీ క్యాంటీన్‌’ పేరుని ‘రోజీ క్యాంటీన్‌’గా మార్చాడు. అప్పటికే స్థానికంగా పన్నీర్‌కి మంచి వాడన్న పేరుండటంతో, రాజకీయాల్లోకి అడుగుపెట్టాక అతడికి మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. రాజకీయాల్లో అంతా ఆయన్ని ‘ఓపీఎస్‌’ అని సంక్షిప్త పేరుతోనే పిలిచేవారు. ఆ దశలో ఎంజీఆర్‌ చనిపోవడంతో అక్కడ చాలామందిలానే పన్నీర్‌కూ ఏం చేయాలో దిక్కు తోచలేదు. పార్టీ రెండుగా చీలడంతో ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అప్పటికి జయలలిత పార్టీలో పసికూనే. దాంతో ఎంజీఆర్‌ రాజకీయ వారసత్వం ఆయన భార్య జానకికే దక్కుతుందని నమ్మి ఆమె పక్షాన చేరి పనిచేయడం మొదలుపెట్టాడు.

నెరవేరిన కల
ఎంజీఆర్‌ చనిపోయాక జరిగిన ఎన్నికల్లో అతడి భార్య జానకి బృందం తరఫున నిర్మల అనే మరో నటి జయలలితకు ప్రత్యర్థిగా నిలబడింది. ఆ సమయంలో నిర్మల పెరియకుళం ప్రాంతంలో ప్రచారానికి వచ్చినప్పుడు పన్నీర్‌ ఇంట్లోనే బస చేసింది. నిర్మల, జయలలితల ప్రచార రథాలు ఎదురుపడ్డప్పుడు పన్నీర్‌, నిర్మల తరఫునే ప్రచారంలో పాల్గొన్నారు. కానీ కొన్నాళ్లకు సమీకరణాలు మారాయి. జయలలితే ఎంజీఆర్‌కు రాజకీయ వారసురాలు అవుతుందన్న విషయాన్ని పన్నీర్‌ గ్రహించారు. ఎంజీఆర్‌పైన అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చిన పన్నీర్‌, ఆయన వారసత్వం తీసుకునే వాళ్ల పక్కన నిలబడటమే న్యాయమనుకున్నారు. జానకి పక్షం నుంచి బయటికొచ్చి జయలలితకు మద్దతివ్వడం మొదలుపెట్టారు. ఎంజీఆర్‌పైన పన్నీర్‌కి ఉన్న అభిమానం, పెరియకుళంలో ఆయనకున్న పేరు గురించి తెలుసుకున్న జయ సంతోషంగా తన బృందంలోకి ఆహ్వానించారు. అలా స్థానిక నాయకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన పన్నీర్‌ జయ ప్రోత్సాహంతో పెరియకుళం పురపాలక సంఘంలో సభ్యుడిగా, ఆపైన ఏకంగా దానికి ఛైర్మన్‌గా ఎదిగి తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. అప్పటికి రాజకీయాల్లో పన్నీర్‌కి అంతకుమించిన ఆశలేమీ లేవు. సీఎం కుర్చీనైతే అతడు కల్లో కూడా వూహించలేదు.

ఆశించకుండానే ఎమ్మెల్యే!
జయ పక్షాన చేరిన పదేళ్ల దాకా పన్నీర్‌ అందరిలానే పార్టీలో సాధారణ సభ్యుడిగా కొనసాగారు. కానీ ఆమెకు దగ్గరయ్యే అవకాశం 1999లో లోక్‌సభ ఎన్నికల సమయంలో వచ్చింది. జయలలిత ప్రాణస్నేహితురాలు శశికళ మేనల్లుడు దినకరన్‌ ఆ ఏడాది పెరియకుళం నుంచి లోక్‌సభకు పోటీ చేశాడు. ప్రత్యర్థి పార్టీ డీఎంకే కూడా బలమైన వ్యక్తినే నిలబెట్టడంతో జయ ఆ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దినకరన్‌ను ఎలాగైనా గెలిపించే బాధ్యతను పన్నీర్‌పైనే వేశారు. తానెంతగానో అభిమానించే వ్యక్తి అలా పిలిచి అడిగేసరికి పన్నీర్‌కూ పట్టుదల పెరిగింది. తనకున్న స్థానిక బలాన్నీ, పేరునీ, అనుభవాన్నీ ఉపయోగిస్తూ దినకరన్‌ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో అతడు సునాయాసంగా విజయం సాధించాడు. ఆ విజయంతో దినకరన్‌ కంటే ఎక్కువ లాభపడింది పన్నీర్‌ సెల్వమే. అప్పట్నుంచీ పార్టీ వ్యవహారాల్లో అతడికి ప్రాధాన్యం పెరిగింది. ఫలితంగా 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దొరికింది. కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఐదేళ్లు పనిచేశాక అక్కడితో ఆగిపోతే చాలనుకున్న పన్నీర్‌ అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. అతడి హయాంలో పెరియాకులం కార్పొరేషన్‌ పరిధిలో జరిగిన అభివృద్ధినే ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. అలా తొలిసారి ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అనూహ్యంగా సీఎం!
పురపాలక సంఘం ఛైర్మన్‌గా పన్నీర్‌కి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జయ ఆయన్ని రెవెన్యూ శాఖ మంత్రిగా నియమించారు. ఆ క్రమంలో పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న జయలలిత ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చోడానికి అనర్హురాలని సుప్రీం కోర్టు తేల్చింది. దాంతో మరో ఆలోచన లేకుండా పన్నీర్‌కే ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అలా ఎమ్మెల్యేగా మారిన తొలి ఏడాదిలోనే ముఖ్యమంత్రి పదవినీ చేపట్టారు. మళ్లీ జయకు మార్గం సుగమమయ్యే వరకూ ఆర్నెల్లపాటు ఆ పదవిలో కొనసాగిన పన్నీర్‌, సీఎం కుర్చీని ఖాళీగా వదిలేసి పక్కనే మరో కుర్చీలో కూర్చొని పరిపాలన సాగించారు. ఆ చర్యతో జయ మనసులో శాశ్వతంగా ముద్రవేశారు. ఆ ఆర్నెల్లూ అధికారులను నడిపించడంలో, పార్టీని సమన్వయపరచడంలో అతడు చూపిన నేర్పు జయను ఆకర్షించింది. అందరినీ కలుపుకొని పనిచేయగల నాయకత్వ సామర్థ్యం ఆయనకు ఉందని అర్థమైంది. దాంతో పన్నీర్‌కి రెవెన్యూ శాఖతో పాటు ప్రజా పనులు, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖల మంత్రిగానూ పదోన్నతి దక్కింది. క్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్న కాలంలో ఆర్థిక, హోం, రెవెన్యూ, ఎక్సైజ్‌ లాంటి కీలక శాఖల బాధ్యతలు చూసుకున్నారు. కొన్ని రోజులపాటు ప్రతిపక్ష నేతగా, అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగానూ మారారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు అసెంబ్లీలో జయలలిత తరవాత పార్టీ డిప్యూటీ లీడర్‌గా రెండో స్థానంలో కొనసాగారు.

జేబులో ‘అమ్మ’ ఫొటో
రెండేళ్ల క్రితం జయలలిత అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పుతో మళ్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టారు పన్నీర్‌. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన కళ్లు చెమ్మగిల్లడం రాష్ట్రమంతా చూసింది. అప్పట్నుంచీ ఆయనకి ‘కన్నీర్‌ సెల్వం’ అన్న పేరూ వచ్చింది. పన్నీర్‌ సెల్వం జేబులో, కారులో, టేబుల్‌పైనా జయలలిత ఫొటోలు తప్పనిసరిగా ఉంటాయి. అది అతి అభిమానమంటూ చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ‘మున్సిపాలిటీ ఛైర్మన్‌ అయితే చాలనుకున్న నేను ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం ఆమే. మనకు జీవితం ఇచ్చిన వాళ్లని ఎంత గౌరవించినా తక్కువే. అందుకే ఇతరుల మాటల్ని నేను పట్టించుకోను’ అంటారు పన్నీర్‌. మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో సౌమ్యుడిగా ప్రజల దగ్గరా, సమర్థుడిగా పార్టీ నేతల దగ్గరా పేరు తెచ్చుకున్నారు. ‘చాలా తక్కువగా, అందరితోనూ ఒకేలా మాట్లాడతారు. సీనియర్‌ మంత్రి అన్న దర్పం ఆయన మాటల్లో, వ్యవహార శైలిలో ఏమాత్రం కనిపించదు’ అన్నది ప్రతిపక్ష నేతలకు సైతం పన్నీర్‌పైన ఉన్న అభిప్రాయం. ఈ ఏడాది మొదట్లో జయలలిత పదవిలో ఉండగానే ‘ఓపీఎస్‌ ఫర్‌ సీఎం’ అనే హ్యాష్‌టాగ్‌ ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడ్డానికి ఆయన అభిమానులే దాన్ని మొదలుపెట్టారని కొందరంటే, జయకీ, పన్నీర్‌కీ మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రతిపక్షాలే ఆ పనిచేశాయన్నది ఇంకొందరి మాట. ఏదేమైనా ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని కొందరు కొరుకుంటున్నట్లూ, జయకు ఆయన దూరమైతే తమకు పోటీ ఉండదని ఇంకొందరు భావించినట్లూ ఆ అలజడితో తేలిపోయింది. మొత్తంగా రాష్ట్రంలో ఆయనెంత కీలకమో అందరికీ అర్థమైంది.

రెండు నెలల క్రితం జయ ఆస్పత్రిలో చేరగానే ఆమె శాఖల బాధ్యతలూ పన్నీర్‌ చేతికే వెళ్లాయి. ఆమె చనిపోయిన కొన్ని నిమిషాల వ్యవధిలో పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆయన్ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అలా ఒక దశలో జయ ప్రత్యర్థి బృందంలో ఒకరిగా మొదలైన పన్నీర్‌ ప్రయాణం ఆమెకు అత్యంత నమ్మకస్థుడిగా, చివరికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారే వరకూ సాగింది. ఒకరిని నమ్మితే చివరి వరకూ వాళ్లతోనే ఉండటం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, అప్పగించిన బాధ్యతల్ని పక్కాగా నిర్వహించడం, అనవసరమైన విమర్శలూ, వివాదాలకూ దూరంగా బతకడం... ఓ సాధారణ టీ కొట్టు నిర్వాహకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చింది ఈ లక్షణాలే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.