close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సెట్లోంచి పొమ్మనగానే కన్నీళ్లొచ్చేశాయి!

సెట్లోంచి పొమ్మనగానే కన్నీళ్లొచ్చేశాయి!

ఈ తరం కమెడియన్లలో తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నది ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సప్తగిరి. ‘ప్రేమకథా చిత్రమ్‌’తో మొదలుపెట్టి ‘దృశ్యం’, ‘లవర్స్‌’, ‘పవర్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘మజ్ను’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో తనదైన టైమింగ్‌తో, హావభావాలతో ప్రేక్షకులకు దగ్గరైన గిరి, మొదట సినిమాల్లో నటించడానికి అస్సలు ఇష్టపడలేదంటే నమ్మలేరు. అతడు ఏడేళ్ల పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన విషయం కూడా ఎక్కువ మందికి తెలీదు. ‘సప్తగిరి’ అన్న పేరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’లో హీరోగా మారే వరకూ తన జీవితంలో అలా ఎవరూ వూహించని కోణాలు చాలా ఉన్నాయంటున్నాడు...

వెంకట ప్రభు ప్రసాద్‌... మా అమ్మా నాన్నా నాకు పెట్టిన పేరు ఇదే. తిరుమల కొండల్లో వెంకటేశ్వరస్వామి సాక్షిగా అనుకోకుండా ఆ పేరు సప్తగిరిగా మారింది. ఇంటర్‌ పరీక్షలయ్యాక ఓ రోజు దేవుడి దర్శనం కోసం తిరుపతికి వెళ్లా. బయటికొచ్చి ఆలయ గోపురంవైపే చూస్తూ నిల్చున్నా. అంతలో మఠాధిపతిలా ఉన్న ఓ పెద్దాయన వెనక నుంచి వచ్చి, ‘నాయనా సప్తగిరీ, కాస్త పక్కకి తప్పుకో’ అన్నారు. ఆయన కళ్లలో ఎదో సానుకూల శక్తీ, ఆయన పిలుపులో ఓ మంచి అనుభూతీ కనిపించాయి. ఏడు కొండల మధ్య ఆయన పిలిచిన పేరే జీవితాంతం ఉండిపోవాలని అక్కడే నిర్ణయించుకున్నా. అలా ఆ క్షణం నా పేరుని సప్తగిరిగా మార్చుకున్నా. నేను పుట్టి పెరిగిందంతా చిత్తూరు జిల్లాలో ఐరాల అనే ప్రాంతంలో. నాన్న అటవీ శాఖలో చిరుద్యోగి. ఆయనపైన ఉన్న గౌరవంతోనో, భయం వల్లో తెలీదు కానీ ఇంటర్‌ వరకూ బాగానే చదివా. ఆపైన ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాలేదు. నాకూ పై చదువులు చదవాలనిపించలేదు. దాంతో భవిష్యత్తులో ఏం చేయాలన్న ఆలోచన ఆ దశలో మొదలైంది.

ఇంటరవగానే హైదరాబాద్‌కి...
ఇంటర్‌ చదివే రోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసేవాణ్ణి. సినిమా పూర్తయ్యాక మిగతా వాళ్లంతా బావుందో, బాలేదో అని మాట్లాడుకొని వదిలేసేవారు. నేను మాత్రం ఆ పరిధి దాటి ఏ సన్నివేశాలు బావున్నాయో, ఫలానా చోట ఎలా ఉంటే బావుండేదో అని విశ్లేషించడం మొదలుపెట్టా. ‘భారతీయుడు’, ‘సింధూరం’ లాంటి సినిమాలు చూశాక ఆ రంగంపైన ఇష్టం పెరిగింది. ప్రయత్నిస్తే నేనూ మంచి కథలు రాయగలననీ, సినిమాలు తీయగలననీ అనిపించింది. పరిశ్రమకు వెళ్తే హారతిచ్చి మరీ అవకాశం ఇస్తారనుకునేంత అమాయకత్వంతో ఉండేవాణ్ణి. దాంతో ఎంసెట్‌లో ర్యాంకు రాలేదని తెలిసిన వెంటనే హైదరాబాద్‌ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అక్కడికి వెళ్లి మల్టీమీడియా కోర్సు నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఇంట్లో చెప్పి, కొంత డబ్బు తీసుకొని బయల్దేరా. హైదరాబాద్‌లో సతీష్‌ అని మా అన్నయ్య ఒకరు తప్ప మరెవరూ తెలీదు. అయినా సరే ఎలాగోలా అవకాశాలు తెచ్చుకోవచ్చన్న మొండి ధైర్యంతో వచ్చా. ఆ దశలో ఆలోచనలన్నీ దర్శకుణ్ణి కావాలని తప్ప, నటనపైన వెంట్రుక వాసంత ఆశ కూడా లేదు.

లక్ష్యానికి దగ్గరగా...
మొదట్నుంచీ నాకు ఇంగ్లిష్‌ బాగా మాట్లాడాలన్న కోరిక ఉండేది. అందుకే హైదరాబాద్‌ రాగానే ఎస్‌.ఆర్‌.నగర్‌లో మా అన్నయ్య గదిలో ఉంటూ దగ్గర్లోని ఓ కోచింగ్‌ సెంటర్లో చేరా. తెలుగు మీడియం నేపథ్యం, ప్రాథమిక విషయాలు కూడా తెలీకపోవడం వల్లో ఏమో కానీ రెండు నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో ఇంగ్లిష్‌ రాలేదు. సమయం మొత్తం దానికే కేటాయిస్తే కష్టమనిపించి సినిమాల్లోకి వెళ్లే మార్గాన్ని వెతుక్కోవాలని ఆ కోర్సు నుంచి బయటికొచ్చేశా. మా అన్నయ్యకి విషయం చెబితే, ‘ముందు హైదరాబాద్‌ ఎంత పెద్దదో, మన గదికి రావాలంటే ఎన్ని దార్లు ఉన్నాయో తెలుసుకో. ఎవరిపైనా ఆధారపడకుండా బతకడం నేర్చుకో. ఆ తరవాత సినిమాల గురించి మాట్లాడదాం’ అన్నాడు. ఆ క్రమంలో ఎవరో ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పరిచయమవుతారన్న ఆశతో స్టూడియోల చుట్టూ తిరిగేవాణ్ణి. ఓ రోజు మా పక్కింటి కుర్రాడు చెప్పే దాకా, మా గదికి ఎదురుగా రమేష్‌ వర్మ అనే పబ్లిసిటీ డిజైనర్‌ ఆఫీసుందనీ, ఆయన దగ్గరకి సినిమావాళ్లు వచ్చి వెళ్తారన్న విషయం నాకు తెలీలేదు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి నా గురించి చెప్పా. ‘రోజూ ఆఫీసుకి వస్తుంటే నీకే ఇక్కడి విషయాలపైన అవగాహన వస్తుంది. నాకు వీలైతే ఏదైనా సహాయం చేస్తా’ అని మాటిచ్చారాయన. అలా తొలిసారి నా లక్ష్యానికి కాస్త దగ్గరగా వచ్చాననిపించింది.

అసిస్టెంటుగా అవకాశం
రమేష్‌ వర్మ దగ్గరే ‘ఉయ్యాలా జంపాలా’, ‘మజ్ను’ సినిమాలు తీసిన దర్శకుడు విరించి వర్మ ఉండేవాడు. ఇద్దరం కలిసే అవకాశాల కోసం తిరిగేవాళ్లం. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. చివరికి తరుణ్‌తో ‘ఒక వూరిలో’ సినిమా తీయడానికి రమేష్‌ వర్మ సిద్ధమయ్యారు. నేనూ, విరించి ఆయనకు అసిస్టెంట్లుగా చేరాం. రమేష్‌ వర్మ నన్ను చెన్నైకి పంపించి, అక్కడ ఆ సినిమా కోసం అనుకున్న ఓ తమిళ సంగీత దర్శకుడి దగ్గర కూర్చొని పాటలు చేయించమన్నారు. రెండు నెలలు అలా గడిచిపోయాక ఎందుకో ‘ఒక వూరిలో’ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. దాంతో నాలో అసహనం పెరిగింది. అప్పటికే డబ్బులకు చాలా ఇబ్బందయ్యేది. ఇంటద్దె కూడా కట్టలేని పరిస్థితి. ఒంటి పూట భోజనం అలవాటైంది. నేను మహా అయితే హైదరాబాద్‌కి వచ్చిన రెండు మూడు నెలల్లో సెటిలైపోవచ్చు అనుకున్నా. కానీ అప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయాయి. దాంతో ఉండబట్టలేక రమేష్‌ వర్మగారి దగ్గరికి వెళ్లి ఆ సినిమా ఆలస్యమవుతుంది కాబట్టి వేరే ఎవరి దగ్గరైనా నన్ను చేర్పించమని అడిగా. నా పరిస్థితిని అర్థం చేసుకొని దర్శకుడు శేఖర్‌ సూరిని పరిచయం చేశారు. శేఖర్‌గారి దగ్గరికి తిరగ్గా తిరగ్గా చివరికి తెల్లారి షూటింగ్‌ మొదలవుతుందనగా నన్ను కూడా దర్శకత్వ శాఖలో అసిస్టెంట్లలో ఒకరిగా చేరమన్నారు. అదే ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’.

‘బొమ్మరిల్లు’తో నటుడిగా...
ఆకలితో ఉన్నవాడికి పని దొరికితే ఎలా ఉంటుందో ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’తో చూపించా. ప్రతి విభాగం గురించి తెలుసుకుంటూ, అందరితో పరిచయాలు పెంచుకుంటూ, చెప్పిన పని చేస్తూ ముందుకెళ్లా. ఆ సినిమా రెండో షెడ్యూల్‌ మొదలయ్యేసరికి తక్కిన అసిస్టెంట్లంతా మానేయడంతో ముగ్గురం మిగిలాం. దాంతో పనిభారంతో పాటూ సినిమా పరిజ్ఞానం కూడా పెరుగుతూ వచ్చింది. అనుకున్న దానికంటే ఆ సినిమా పెద్ద విజయాన్నే అందుకొని నా కెరీర్‌కి మంచి పునాది వేసింది. ఆ తరవాత తెలిసిన వాళ్ల సాయంతో దిల్‌ రాజుగారి బ్యానర్‌లో ‘బొమ్మరిల్లు’ సినిమాకి అసిస్టెంట్‌గా చేరా. ఆనంద్‌ రంగా, శ్రీకాంత్‌ అడ్డాల, చైతన్య దంతులూరి లాంటి దర్శకులంతా ఆ సినిమాకి నాకు సీనియర్లు. వాళ్ల పనితీరుని గమనిస్తూ, నటులకు సన్నివేశాల్ని వివరిస్తూ ఓ కమర్షియల్‌ సినిమా తీయడంలోని మెలకువల్ని నేర్చుకుంటూ పనిచేశా. దిల్‌ రాజుగారి సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఓ సన్నివేశంలో నటిస్తే బావుంటుందన్నది చిన్న సెంటిమెంట్‌. దాంతో దర్శకుడు భాస్కర్‌ నాతో ఓ సన్నివేశం చేయించారు. అలా అనుకోకుండా ‘బొమ్మరిల్లు’తో నటుడిగానూ తెరపైన కనిపించా. తరవాత మళ్లీ భాస్కర్‌ దగ్గరే ‘పరుగు’ సినిమాకి అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేరా.

దారి మారిపోయింది...
‘బొమ్మరిల్లు’ సమయంలో భాస్కర్‌గారు నా మాటతీరూ, బాడీ లాంగ్వేజ్‌, హావ భావాల్ని బాగా గమనించేవారట. దాంతో నన్ను దృష్టిలో పెట్టుకొని ‘పరుగు’ సినిమా కోసం ఓ పాత్రని రాశారు. ఆ విషయమే నాకు చెప్పి అందులో నటించమన్నారు. కానీ సినిమాలో నటిస్తూ, దర్శకత్వ శాఖలో పనిచేయడం కష్టమనీ, కాబట్టి ఆ పని వద్దనీ అన్నారు. ‘బొమ్మరిల్లు’లో సెంటిమెంట్‌ అన్నారు కాబట్టే నటించాననీ, నాకు నటుడిగా అవకాశమే వద్దనీ, అసోసియేట్‌ డైరెక్టర్‌గానే పనిచేస్తాననీ చెప్పా. దాంతో భాస్కర్‌గారు కాస్త నొచ్చుకొని, రెండు విభాగాల్లోనూ అవకాశం లేదని చెప్పి వెళ్లిపోమన్నారు. ఆ మాట వింటూనే కంట్లో నీళ్లు తిరిగాయి. దాంతో నేను కష్టమైనా దేనికీ ఇబ్బంది కలగకుండా రెండు విభాగాల్లోనూ పనిచేస్తానని చెప్పా. అలా ఆశించకుండానే ‘పరుగు’తో పూర్తిస్థాయి నటుడిగా మారా. ఆపైన నా స్నేహితుడు ఆనంద్‌ రంగా తీసిన ‘ఓయ్‌’లోనూ నటించా. క్రమంగా నటుడిగానే ఎక్కువ అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఓ పక్క ‘కందిరీగ’, ‘దరువు’, ‘నిప్పు’, ‘మంత్ర’ ‘గబ్బర్‌ సింగ్‌’ లాంటి సినిమాల్లో కనిపించినా, అప్పటికి పూర్తిగా నటనవైపు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలోనే ఉన్నా. ఆ సమయంలో మారుతి తీసిన ‘ఈ రోజుల్లో’ విడుదలై మంచి హిట్టయింది. ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’ సినిమాకు నేనూ మారుతి కలిసి చాలా రోజులు పనిచేశాం. ‘ప్రేమకథా చిత్రమ్‌’ మొదలయ్యాక ఆయనోసారి ఫోన్‌ చేసి ఆ సినిమాలో నటించమని అడిగారు. నిజానికి ఆ పాత్రని ముందు వేరే వాళ్లతో చేయించినా అది మారుతికి నచ్చలేదని తెలిసింది. దాంతో బాగా చేయాలని కష్టపడ్డా. చివరికి అది నా కెరీర్‌లో పెద్ద విజయంగా నిలిచింది. ఆ తరవాత వరసబెట్టి వచ్చిన అవకాశాలతో నటుడిగానే స్థిరపడక తప్పలేదు.

పారితోషికం లేకుండా...
‘ప్రేమకథా చిత్రమ్‌’ తరవాత ‘దృశ్యం’, ‘మనం’, ‘పవర్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘మజ్ను’... ఇలా పెద్ద హీరోల సినిమాల్లో చేసిన పాత్రలన్నీ కొన్ని రోజుల్లోనే చాలా పేరు తెచ్చిపెట్టాయి. ఒక రోజు నేను చేసిన సినిమాలన్నింటినీ గుర్తుచేసుకుంటే, వాటిన్నింటికీ భిన్నంగా ఏదైనా చేయాలన్న ఆలోచన మొదలైంది. సీరియస్‌ పాత్రల్నీ, డ్యాన్సుల్ని కూడా నేను బాగా చేయగలనన్నది నా నమ్మకం. సరైన అవకాశం వస్తే హీరోగానూ నిరూపించుకోగలను అనిపించేది. ఓసారి విమానంలో వచ్చేప్పుడు చూసిన ఓ తమిళ సినిమా నాకు బాగా నచ్చింది. దాన్ని మన వాతావరణానికి తగ్గట్లు మార్చుకొని నటించాలని నిర్ణయించుకున్నా. మరోవైపు సినిమాల్లో బిజీ అవడం వల్ల సమయానికి తిండీ నిద్ర లేక గ్యాస్ట్రిక్‌ సమస్య మొదలైంది. దాంతో ఓరోజు డా.రవి కిరణ్‌ అనే హోమియో వైద్యుడి దగ్గరకి వెళ్లా. చికిత్స తీసుకునే క్రమంలో మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఓ రోజు మాటల్లో మాటగా నేను చూసిన తమిళ సినిమాతో పాటు స్నేహితులతో కలిసి దాన్ని తీయబోతున్న విషయాన్నీ చెప్పా. తరవాత ఓ రోజు ఆయన ఫోన్‌ చేసి కథ తనకీ బాగా నచ్చిందనీ, ఆ సినిమాని నిర్మిస్తాననీ అన్నారు. నాపైన నమ్మకంతో సినిమా విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ, నా మార్కెట్‌ స్థాయి గురించి ఆలోచించకుండా పెద్ద సినిమాకు తగ్గట్లుగా ఖర్చుపెట్టారు. అందుకే ఆ సినిమాకు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా ఆ డబ్బుని కూడా సినిమా కోసం పెట్టమని చెప్పా. ఆ ఖర్చంతా తెరమీద వంద శాతం కనిపిస్తుంది. నా పేరు మారడం, నటనవైపు రావడం, హీరో స్థాయికి ఎదగడం... ఇలా నా జీవితంలో ముఖ్యమైన విషయాలన్నీ అనుకోకుండా జరిగాయి. అందుకే జరగబోయే వాటి గురించి ఆలోచించకుండా మంచి అవకాశాలు వచ్చినప్పుడు హీరోగా చేస్తూ, ఎప్పటికీ కమెడియన్‌గా కొనసాగుతూ ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటా. ఇక దర్శకత్వమంటారా... చెప్పా కదా నా జీవితంలో ముఖ్యమైనవన్నీ అనుకోకుండానే జరిగాయని..!

ఇప్పట్లో పెళ్లి చేసుకోను!

నేను పూర్తి శాకాహారిని. రోజూ క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేస్తా. ఈ మధ్యే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, ఆధ్యాత్మిక అంశాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా.

* ప్రస్తుతం కెరీర్‌ పరంగా చాలా లక్ష్యాలు పెట్టుకున్నా. వేరే బాధ్యతల వైపు వెళ్తే దేనికీ సమయం కేటాయించలేనేమో అని నా భయం. అందుకే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.

* పరిశ్రమలో నాకు నటులకంటే అసిస్టెంట్‌ డైరెక్టర్లూ, దర్శకులే ఎక్కువ మంది స్నేహితులు. ఖాళీ దొరికితే ఆ బృందంతోనే తిరుగుతుంటా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.