close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మా లక్ష్యం... 10 లక్షల ఉద్యోగాలు!

మా లక్ష్యం... 10 లక్షల ఉద్యోగాలు!

ఈ రోజుల్లోనే అమెరికా వీసాల కోసం కుర్రాళ్లు కష్టపడుతుంటే, పదేళ్ల క్రితమే అక్కడ దాదాపు రూ.3500 కోట్లు విలువ చేసే కంపెనీని సృష్టించారు అనంత్‌ రావు. గ్రామీణ భారతం ఉపాధి కోసం, సంస్థలు నైపుణ్యంగల అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్న దశలో ఆ రెంటినీ కలుపుతూ తన ‘స్కిల్‌ ప్రో’ సంస్థ ద్వారా 70వేల మందికిపైగా ఉచితంగా శిక్షణతో పాటు ఉద్యోగాలూ ఇప్పించారాయన. అందరిలానే చదువుకోవడానికి అమెరికా వెళ్లి అంత పెద్ద సంస్థని ఎలా స్థాపించారో, ఆ పైన మోటరోలా కంపెనీకి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎలా మారారో, ఇప్పుడు పేదలకు ఉపాధినిస్తూనే వెంచర్‌ క్యాపిటలిస్టుగా పెట్టుబడులతో కుర్రాళ్ల కలలను ఎలా నిజం చేస్తున్నారో... ఇలా చెబుతున్నారు.

జేపీ మొబైల్‌... ప్రపంచంలో తొలి వైర్‌లెస్‌ ఈ-మెయిళ్లను సృష్టించిన సంస్థ. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ లాంటి ప్రఖ్యాత సంస్థలు ఇప్పటికీ ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. పదేళ్ల క్రితం ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు 3,500 కోట్ల రూపాయలకు మోటరోలా సంస్థ చేజిక్కించుకున్న ఆ కంపెనీని మేమే మొదలుపెట్టాం. స్కిల్‌ ప్రో... కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ కొన్ని వేల మంది పేదలకు వృత్తి విద్యల్లో శిక్షణతో పాటు ఉద్యోగాలు ఇప్పిస్తున్న సంస్థ. దాని సాయంతో 70వేల మందికి పైగా ఉద్యోగాలు పొందారు. మరెంతో మంది స్వయం ఉపాధి బాట పట్టారు. దాన్ని నడిపిస్తుందీ మేమే. ‘ఫోకస్‌ వెంచర్స్‌’... కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ, కోట్ల రూపాయల పెట్టుబళ్లతో కుర్రాళ్ల కలలను నిజం చేస్తున్న కంపెనీ. దాన్ని స్థాపించిందీ నేనే. మొదట్లో పేరుతో పాటు డబ్బునీ సంపాదించే ప్రయత్నంలో చాలా ఏళ్లు గడిపేశాను. ఇప్పుడు ఆ అవకాశాన్ని మరొకరికి కల్పించేందుకు ఇన్వెస్టర్‌గా మారాను. మరోపక్క మారుమూల పల్లెల్లో చదువులేని వాళ్లకు కూడా బిగ్‌ బజార్‌, కాఫీ డే, పెప్సికో లాంటి సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించగలుగుతున్నాను. మధ్యలో మోటరోలా ఆసియా పసిఫిక్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గానూ పనిచేశాను. ఇన్ని భిన్న కోణాలున్న నా ప్రయాణం వరంగల్‌ జిల్లాలో కొత్తపల్లి అనే ఓ పల్లెటూళ్లొ మొదలైంది.

ఇంటికి దూరంగానే...
మా పెదనాన్న యతి రాజారావుగారు అనేక దఫాలు అసెంబ్లీకి ఎన్నికై 30 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా పనిచేశారు. మా నాన్న కూడా ఆయనకు చేదోడు వాదోడుగా పక్కనే ఉండేవారు. రాజకీయ కుటుంబం కావడంతో ఆ ప్రభావం ఎక్కడ నా పైన పడుతుందోనని ఇంటికి దూరంగా రెండో తరగతిలో మంచిర్యాలలో, నాలుగో తరగతిలో వూటీËలోని ఓ రెసిడెన్షియల్‌ స్కూల్లో చేర్పించారు. అక్కడ చదువు కంటే ఆటలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. ఓడిపోవడం, గెలవడం, జట్టుని ముందుకు నడిపించడం, నలుగురితో కలిసి పనిచేయడం లాంటి జీవన నైపుణ్యాలన్నీ ఆటల ద్వారానే అలవడ్డాయి. స్కూల్‌ తరఫున హాకీ, క్రికెట్‌ ఎక్కువగా ఆడేవాణ్ణి. ఓ దశలో క్రీడాకారుణ్ణి కావాలనే అనుకుంటూ పెరిగా. ఇంటర్‌ పూర్తయ్యాక వైజాగ్‌ గీతం కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో సీటొచ్చింది. అప్పుడు కూడా ఇంటికి దూరంగా హాస్టల్లోనే ఉన్నా. నా జీవితం కాస్త మలుపు తిరిగింది అక్కడే.

పెళ్లి కోసం ఏడాది!
ఇంజినీరింగ్‌ తొలి ఏడాదిలో ఉన్నప్పుడు ఓసారి రోడ్డు ప్రమాదంలో నా కాలు విరిగింది. దాదాపు ఏడాదిన్నర మంచమ్మీదే ఉన్నా. ఇంట్లోనే ఉంటూ కేవలం పరీక్షలకు హాజరయ్యేవాణ్ణి. ఖాళీగా ఉండటంతో రకరకాల ఆలోచనలు వేధించేవి. క్రమంగా కెరీర్‌పైన దృష్టిపెట్టడం మొదలుపెట్టా. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరంలో మళ్లీ కాలేజీకి వెళ్లా. బీటెక్‌ అయిపోగానే అమెరికాలోని లూసియానా స్టేట్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్‌ చేయడానికి బయల్దేరా. అప్పుడప్పుడే కంప్యూటర్లతో పాటు కృత్రిమ మేధస్సుకీ ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. దాంతో ఎమ్మెస్‌లో అదే విభాగంలో స్పెషలైజేషన్‌ చేశా. ఆ తరవాత ఆ రంగంలోనే పనిచేస్తున్న నార్టెల్‌ సంస్థలో ఉద్యోగంలో చేరా. వైర్‌లెస్‌ పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సుకి సంబంధించిన అంశాలపైన పట్టుతో పాటు ఆసక్తీ పెరిగింది. ఆ క్రమంలోనే సొంతంగా ఓ సంస్థను నెలకొల్పాలన్న ఆశా కలిగింది. అదే దశలో నార్టెల్‌లో ఇంటర్న్‌షిప్‌ కోసం వచ్చిన సరిత అనే తెలుగమ్మాయి పరిచయమైంది. ఆమె కూడా మా అపార్ట్‌మెంట్‌లోనే ఉండటంతో నెమ్మదిగా ఇద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారింది. మేం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. మరోపక్క అమెరికాలోనే ఉండే దయాకర్‌ అనే కజిన్‌ కలిసి కంపెనీ మొదలుపెట్టడానికి ముందుకొచ్చాడు. దాంతో నార్టెల్‌ లాంటి పెద్ద సంస్థలో ఉద్యోగాన్ని వదులుకొని రిస్కు చేసి ‘జేపీ మొబైల్‌’ అనే సంస్థను మొదలుపెట్టా. ఏడాది పాటు ఇంట్లో వాళ్లతో పోరాడి చివరికి అతికష్టమ్మీద సరితతో నా పెళ్లికి ఒప్పించా.

ప్రపంచంలో తొలిసారి...
అమెరికాలో వ్యాపారం చేయడం చాలా సులువు. దేనికైనా అనుమతులు త్వరగా లభిస్తాయి. చెప్పిన సమయానికి పని పూర్తవుతుంది. దాంతో ‘జేపీ మొబైల్‌’ ప్రయాణం సాఫీగానే మొదలైంది. వైర్‌లెస్‌ సేవల రంగంలో ఏదైనా కొత్తగా సృష్టించాలన్న లక్ష్యంతో మా సంస్థను మొదలుపెట్టాం. అప్పట్లో ‘పేజర్ల’ తరవాత ‘పామ్‌ పైలట్‌’ అనే పరికరాలుండేవి. అప్పటికీ ఫోన్లూ, ఇంటర్నెట్‌ కనెక్షన్లు కూడా పెద్దగా లేవు. దాంతో వైర్లూ, కంప్యూటర్లతో పనిలేకుండా ఒక పామ్‌ పైలట్‌ నుంచి మరొక దానికి వైర్‌లెస్‌ ఈమెయిల్‌ పంపించే పరిజ్ఞానాన్ని ప్రపంచంలో తొలిసారి మేమే అభివృద్ధి చేశాం. ఆ వార్త పత్రికల్లో ప్రముఖంగా రావడంతో పెద్ద కంపెనీల దృష్టంతా మామీద పడింది. బయటి నుంచి నిధులు సమకూర్చుకొని కంపెనీని భారత్‌కూ విస్తరించాం. ఆ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ కోసం అంతర్గత మెసేజింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఎవరైనా షేర్లు కొనాలన్నా, అమ్మాలన్నా మా వ్యవస్థ ద్వారానే జరిగేది. పదిహేడేళ్ల తరవాత ఇప్పటికీ అక్కడ మేం అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఉపయోగిస్తుండటం విశేషం. అలా కంపెనీ విస్తరిస్తోన్న దశలో 2001లో అమెరికాలోని ‘వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌’ పైన జరిగిన దాడులు మొత్తం ఐటీ రంగాన్నే కుదిపేశాయి. నూటికి తొంబై ఐదు కంపెనీలు మూతపడ్డాయి. పెద్ద సంస్థలన్నీ ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులకు వైర్‌లెస్‌ పరికరాలను ఇవ్వడానికీ వెనకడుగేశాయి. ఆ సంక్షోభ స్థితి మూడేళ్లు కొనసాగింది. దాంతో పరిస్థితి కుదుటపడే వరకూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ కోర్సులో చేరా.

మోటరోలా వైస్‌ప్రెసిడెంట్‌గా...
ఐటీ మార్కెట్‌ తిరిగి కోలుకునే దశలో నోకియా, శాంసంగ్‌ లాంటి సంస్థలకు వైర్‌లెస్‌ వ్యవస్థను అందించడం మొదలుపెట్టాం. మరోపక్క ‘బ్లాక్‌బెర్రీ’ సంస్థ మాకు ప్రధాన ప్రత్యర్థిగా మారింది. అప్పటికే ఐదారు స్టార్టప్‌లను కొనుగోలు చేశాం. ఆ పనుల కోసం సేకరించిన నిధుల్ని ఇన్వెస్టర్లకు తిరిగివ్వాల్సిన సమయం వచ్చింది. లాభాల ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించడానికి చాలా సమయం పడుతుంది. దాంతో ‘గుడ్‌ టెక్నాలజీ’ అనే మరో సంస్థలో విలీనమై ఐపీవోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మోటరోలా, మైక్రోసాఫ్ట్‌, నోకియా సంస్థలు మా కంపెనీని కొనుగోలు చేయడానికి పోటీ పడ్డాయి. చివరికి అందరి కంటే ఎక్కువగా దాదాపు 520 మిలియన్‌ డాలర్లు(రూ.3500 కోట్లు) చెల్లించి మోటరోలా సంస్థ మా కంపెనీని సొంతం చేసుకుంది. అలా ‘జేపీ మొబైల్‌’లో పదేళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసింది. ఆపైన సింగపూర్‌లో ఉంటూ ఆసియా పసిఫిక్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేయమంటూ మోటరోలా ఆహ్వానించింది. అప్పటికే నాకిద్దరు ఆడపిల్లలు. రోజుకు పద్దెనిమిది గంటలు పనిలో పడి చాలా కాలంపాటు కుటుంబానికి దూరమయ్యాననే ఆలోచనే అప్పుడప్పుడూ ఇబ్బంది పెడుతుండేది. దానికి తోడు వూహ తెలిసినప్పట్నుంచీ అమ్మానాన్నాలకూ, ముగ్గురు తమ్ముళ్లకూ దూరంగానే ఉంటూ వచ్చా. దాంతో హైదరాబాద్‌ కేంద్రంగానే పనిచేస్తానని మోటరోలా యాజమాన్యానికి చెప్పి కుటుంబంతో సహా తిరిగొచ్చేశా.

రిస్కుకి సిద్ధపడే...
పేరుకి హైదరాబాద్‌లో ఉంటున్నా సంస్థ పనిమీద తరచూ ముంబై, చైనా, మలేసియా, అమెరికాలకు తిరగాల్సొచ్చేది. వ్యాపార రంగంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయమైనా వేగంగా తీసుకొని త్వరగా అమలు చేసేవాళ్లం. మోటరోలాలో ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛకీ, ఉత్సాహానికీ దూరమవుతున్నా అనిపించింది. దాంతో రెండేళ్ల పాటు వైస్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగాక సంస్థకు రాజీనామా చేసి బయటికొచ్చా. అప్పటిదాకా వ్యాపారిగా సంపదతో పాటు బోలెడంత అనుభవాన్నీ సమకూర్చుకున్నా. దాన్ని నలుగురికీ పంచాల్సిన సమయం వచ్చిందనిపించింది. దాంతో ‘ఫోకస్‌ వెంచర్స్‌’ అనే సంస్థను మొదలుపెట్టి కొత్త స్టార్టప్‌లకు పెట్టుబడులతో పాటు నా అనుభవాన్నీ అందివ్వడం ప్రారంభించా. మొదట ‘గ్రీన్‌ కాన్సెప్ట్స్‌’ పేరుతో క్లీన్‌ ఎనర్జీ రంగంలో పనిచేస్తున్న సంస్థలో కొంత పెట్టుబడి పెట్టా. తరవాత ఓ ఇంటర్నెట్‌ కంపెనీకీ, ఆపైన ‘నెఫ్రో ప్లస్‌’ అనే డయాలసిస్‌ చైన్‌కీ పెట్టుబడులు అందించా. క్రమంగా ‘నెఫ్రో ప్లస్‌’ ఎనభైకి పైగా శాఖలతో అతిపెద్ద డయాలసిస్‌ చైన్‌గా ఎదిగింది. పది కంపెనీల్లో పెట్టుబడి పెడితే అందులో రెండే నిలదొక్కుకొని లాభాల బాట పడతాయని నా అంచనా. ఆ రిస్కుకి సిద్ధపడే ఇన్వెస్టర్‌గా మారా.

వంద సంస్థల్లో ఉద్యోగాలు...
ఇన్వెస్టర్‌గా కొనసాగుతున్న దశలోనే ‘టాలెంట్‌ స్ప్రింట్‌’ అనే సంస్థకు సలహాదారుగానూ ఉన్నా. బీటెక్‌ విద్యార్థులకు ఉద్యోగాలకు కావల్సిన నైపుణ్యాల్ని అందించే సంస్థ అది. నేను గతంలో చేసిన వ్యాపారం, అప్పటిదాకా పెట్టుబడి పెట్టిన సంస్థలూ... అన్నీ అంతిమంగా సంపద సృష్టే లక్ష్యంగా సాగాయి. కానీ పేదల జీవితాల్ని మార్చే శక్తి నైపుణ్యాభివృద్ధి రంగానికే ఉందని అర్థమైంది. అందుకే ఆ రంగంలో పనిచేసే మంచి సంస్థను చూసి పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన మొదలైంది. ఆ క్రమంలో ‘స్కిల్‌ప్రో’ అనే సంస్థ గురించి తెలిసింది. అందులో ప్రతిభ ఉన్న ఉద్యోగులున్నా, ఆర్థిక పరిమితుల వల్ల ఎదగలేకపోతోంది. దాంతో మొదట అందులో కొంత డబ్బు పెట్టాలనుకున్నా. కానీ దాని వల్ల బయటి వ్యక్తిలా మిగిలిపోతా తప్ప, నా ఆలోచనలూ లక్ష్యాలకు తగ్గట్లుగా సంస్థను నడిపించలేనేమో అనిపించింది. జీవితంలో ఎవరూ తమకు తొలి ఉద్యోగాన్ని ఇచ్చిన వాళ్లను మరచిపోలేరు. అలా అందరూ నన్నూ, నా సంస్థనూ గుర్తుపెట్టుకుంటే చూడాలన్న కోరిక కలిగింది. దాంతో ఐదేళ్ల క్రితం ‘స్కిల్‌ప్రోను’ కొనుగోలు చేశా. దానికి ఛైర్మన్‌గా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ల జీవన ప్రమాణాల్ని పెంచడమే లక్ష్యంగా పనిచేయడం మొదలుపెట్టా. దాని కోసం మొదట్లో చాలా వూళ్లు తిరిగి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశా. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో పాటు క్రమంగా కాఫీ డే, అమెజాన్‌, షాపర్స్‌ స్టాప్‌ లాంటి దాదాపు వంద కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నా. వాళ్లకు ఎలాంటి నైపుణ్యం ఉన్న వ్యక్తులు కావాలో తెలుసుకొని దానికి తగ్గట్లే అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాం. దానికోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా లాంటి పదిహేడు రాష్ట్రాల్లో అరవై కేంద్రాలను నెలకొల్పాం. కేవలం పేదలను మాత్రమే ఎంపిక చేసుకొని వాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించి నలభై కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఉద్యోగం దొరికేలా ఏర్పాట్లు చేశాం. అలా ఇప్పటిదాకా మా కేంద్రాల నుంచి డెబ్భై వేల మంది నియామక పత్రాల్ని అందుకుని బయటకు వెళ్లారు. భవిష్యత్తులో ఆ సంఖ్యను పది లక్షలకు పెంచడమే లక్ష్యంగా కష్టపడుతున్నాం. ఆ ప్రయాణంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాతోనే భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాయి.

‘వ్యాపారవేత్త లక్ష్యం సంపదను సృష్టించడమే కాదు, మార్పు తీసుకురావడం కూడా’ అని స్టీవ్‌ జాబ్స్‌ చెప్పిన మాటను అక్షరాలా నమ్ముతా. అందుకే ఒడిశా, బిహార్‌ లాంటి రాష్ట్రాల్లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో కూడా రిస్కు తీసుకొని శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, కుర్రాళ్లను ఆ తరవాత అక్కడి నుంచి దూరంగా తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. దేశంలోని యువ వ్యాపారులకు నా వంతు సాయం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపారుల వేదిక ‘టై’ (ది ఇండస్‌ ఆంట్రప్రెన్యూర్స్‌)లో సభ్యుడిగా కొనసాగుతున్నా. ఇప్పటికే వేల మంది ‘స్కిల్‌ ప్రో’ ద్వారా తొలి ఉద్యోగాలు పొందారు. భవిష్యత్తులో ఆ సంఖ్య లక్షలకు చేరుతుంది. వాళ్లందరికీ నేను తెలీకపోవచ్చు కానీ కచ్చితంగా మా సంస్థను మాత్రం తలచుకుంటూనే ఉంటారు. ఈ జీవితానికి నాకది చాలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.