close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తమ్ముణ్ణి రప్పించడానికే ఆస్పత్రి మొదలుపెట్టా!

తమ్ముణ్ణి రప్పించడానికే ఆస్పత్రి మొదలుపెట్టా!

ఏటా లక్షల మందికి వైద్యం చేస్తూ, దేశంలో ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలకు పునాది వేస్తూ, రెండువేలకు పైగా పడకలతో దక్షిణాదిలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటిగా నిలిచింది ‘యశోదా హాస్పిటల్స్‌’. ఎక్కడో మారుమూల పల్లెటూళ్లొ పుట్టి, ఓ చిన్న జిరాక్స్‌ దుకాణంతో జీవితాన్ని మొదలుపెట్టి తమ్ముళ్లతో కలిసి అంత పెద్ద వైద్యశాలకు పునాది వేశారు గోరుకంటి రవీందర్‌ రావు. ‘మేం అనుభవిస్తున్న జీవితం, అందిస్తున్న వైద్యసేవలూ, స్థాపించిన పరిశ్రమలూ... అన్నీ మా అమ్మ చలవే’ అంటూ ఆవిడ చూపిన దారిలో వేసిన అడుగుల్నీ, దాటిన మలుపుల్నీ, అందుకున్న విజయాల్నీ ఆయనిలా గుర్తు చేసుకుంటున్నారు.

తెలుగు నేలపైనే తొలిసారిగా వేరే రాష్ట్రం నుంచి గుండెని తీసుకొచ్చి ఇక్కడి రోగికి అమర్చాం. ‘ర్యాపిడ్‌ఆర్క్‌’ పరిజ్ఞానంతో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందించాం. రెండున్నర దశాబ్దాలు పైబడ్డ ‘యశోదా హాస్పిటల్స్‌’ ప్రయాణంలో ఇలాంటి ఎన్నో మైలురాళ్లను అందుకున్నాం. వరంగల్‌ జిల్లాలో మేడిపల్లి అనే చిన్న పల్లెటూళ్లొ పుట్టిన మేము, ఇప్పుడీ స్థాయికి రావడానికి కారణం వంద శాతం మా అమ్మ చూపిన మార్గమే. ఆవిడిచ్చిన ప్రోత్సాహంతోనే రెవెన్యూ గుమాస్తా పిల్లలమైన మా నలుగురు అన్నదమ్ముల్లో ఇద్దరం వైద్యులుగా, ఇంకొకరు సీఏగా, నేను ఇంజినీరుగా ఎదిగాం. చదువుకుంటే చాలు, పిల్లలు ప్రయోజకులవుతారన్నది మా అమ్మ యశోదాదేవి నమ్మకం. అందుకే చిన్నప్పట్నుంచీ మమ్మల్ని నాలుగింటికే నిద్రలేపి, ఏడింటిదాకా చదివించి స్కూలుకి పంపేది. సాయంత్రం ఆరున్నర నుంచి మళ్లీ చదువే. నా ఐదో తరగతి తరవాత నాన్నకు బదిలీ కావడంతో వరంగల్‌కి మకాం మార్చాం. ఆ తరవాతా నాన్నకు బదిలీలవుతూ వస్తున్నా, చదువులు పాడవుతాయని అమ్మ కాజీపేటలోనే ఇల్లు అద్దెకు తీసుకొని మమ్మల్ని చదివించింది.

క్యాంటీన్‌కీ డబ్బుల్లేక...
హైస్కూల్లో ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి అనే లెక్కల మాస్టారు చదువుతో పాటు జీవిత పాఠాలూ బోధించేవారు. ఆయనిచ్చిన ధైర్యంతోనే ఇంటర్‌లో ఉండగానే మేం ఇంజినీర్లు అవడం ఖాయమన్న నమ్మకం కలిగింది. ఇంటర్‌ కూడా అవకముందే ఓ రోజు స్నేహితుడితో కలిసి వరంగల్‌ ఆర్‌ఈసీలో ఫస్టియర్‌ తరగతి గదిని వెతుక్కుంటూ వెళ్లి, ఇంజినీరింగ్‌లో చేరాక ఏ బెంచీలో కూర్చోవాలని కూడా ముందే ఎంపిక చేసుకొని వచ్చాం. అదృష్టం కొద్దీ అందులోనే సీటొచ్చింది. అప్పటివరకూ డబ్బుల్లేక పుస్తకాలూ, బట్టలకు కూడా ఇబ్బంది పడేవాళ్లం. ఇంజినీరింగ్‌లో స్నేహితులు పదిసార్లు క్యాంటీన్‌కు తీసుకెళ్తే, కనీసం ఒక్కసారైనా నేను డబ్బులుపెట్టాలి. కానీ దానికి కూడా కష్టమై, వాళ్లెప్పుడు పిలిచినా మెల్లగా ఏదో ఒక కారణం చెప్పి జారుకునేవాణ్ణి.

ఇరాన్‌లో అవకాశమొచ్చినా...
ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక మోటార్‌ సైకిల్‌ ఉండేది. దాని మరమ్మతుల కోసం తరచూ ఓ తెలిసిన మెకానిక్‌ దగ్గరికి వెళ్లేవాళ్లం. అతడు చదువుకోకపోయినా, చాలా జల్సాగా, సంతోషంగా బతికేవాడు. మరోపక్క ఎగ్జిక్యుటివ్‌ ఇంజినీర్‌గా పనిచేసే మా బంధువొకాయన మాత్రం ఎప్పుడూ డబ్బులకు ఇబ్బంది పడేవాడు. అందుకే భవిష్యత్తులో నేనూ వ్యాపారం చేయాలన్న ఆలోచనకూ అప్పుడే పునాది పడింది. ఇంజినీరింగ్‌ పూర్తవగానే ప్రభుత్వం కొత్తగా పెట్టిన ‘రిగ్స్‌’ డిపార్ట్‌మెంట్లో ఉద్యోగం వచ్చింది. నేను ఉద్యోగం చేస్తున్న సమయంలోనే మా తమ్ముడు సురేందర్‌ రావు ఎంబీబీఎస్‌ పూర్తిచేసి ఇరాన్‌ వెళ్లాడు. అక్కడ మంచి ఉద్యోగ అవకాశముందని తెలిసి నా సర్టిఫికెట్ల కాపీలను పంపించమనడంతో, ఆ పనికోసం తొలిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టా. అప్పుడు నగరం మొత్తమ్మీద ఐదారు జిరాక్స్‌ షాపులుండేవి. నేను కోఠీలో ఓ దుకాణాన్ని వెతుక్కుంటూ, దాన్ని తెరవకముందే అక్కడికెళ్లి కూర్చున్నా. తీరా షాపు తెరిచాక, ఆ యజమాని ఆ రోజు జిరాక్స్‌ తీయడం కుదరదని చెప్పాడు. అర్జెంటని ఎంత బతిమాలినా వినకుండా మరుసటిరోజు సాయంత్రానికి జిరాక్స్‌ తీసిచ్చాడు. అప్పటికే నా సర్టిఫికెట్లను తీసుకెళ్లాల్సిన తమ్ముడి స్నేహితుడు ఇరాన్‌ బయల్దేరిపోయాడు. దాంతో ఆ అవకాశం చేజారిపోయింది.

సామాన్లమ్మి జిరాక్స్‌ షాపు!
ఇరాన్‌ వెళ్లే అవకాశం తప్పిపోయినా, జిరాక్స్‌ దుకాణానికి ఉన్న డిమాండ్‌ని చూశాక నాకూ ఓ షాపు తెరవాలనిపించింది. అక్కడి పనివాళ్లతో మాటలు కలిపాక, నెలకు రెండు వేలు మిగుల్తాయని అర్థమైంది. అప్పుడు నా జీతం రూ.375. అప్పటికి పెళ్లయి ఆర్నెల్లే అయింది. అమ్మావాళ్లు ఓసారి ఆలోచించుకోమని చెప్పినా, తెలీని నమ్మకంతో ఇంట్లో చిన్నచిన్న సామాన్లూ, కొద్దిగా బంగారం అమ్మి పదివేల రూపాయలు పోగేశా. ఉద్యోగానికి రాజీనామా చేసి కోఠీలో జిరాక్స్‌ దుకాణం మొదలుపెట్టా. ఆ తరవాత తెలిసిన విషయం ఏంటంటే... నేను ఎవర్నయితే చూసి షాప్‌ పెట్టానో, ఆ యజమాని పలుకుబడి ఉన్న మనిషి. ప్రభుత్వాధికారులతో ఉన్న పరిచయాల ఆధారంగా ఆర్డర్లు తెచ్చుకునేవాడు. నాకు అలాంటి పరిచయాలేవీ లేకపోవడంతో వ్యాపారం అనుకున్నట్లు సాగలేదు. దాంతో తెలిసిన కుర్రాడికి షాపు అప్పగించి మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టా. అదృష్టం కొద్దీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కొలువు దొరికింది. కానీ అక్కడ అస్సలు పనుండేది కాదు. నాకేమో పనిలేకపోతే తోచదు. ఈలోగా నెమ్మదిగా జిరాక్స్‌ వ్యాపారానికీ గిరాకీ పెరుగుతూ వచ్చింది. దాంతో పొద్దున్నంతా షాపులో పనిచేసుకుంటూ సాయంత్రం ఆఫీసుకెళ్లి సంతకం పెట్టి వచ్చేవాణ్ణి. పైఅధికారి పిలిచి అడిగితే, పనిస్తే ఎంతైనా చేస్తాననీ, ఖాళీగా ఉండటం నా వల్ల కాదనీ చెప్పా. నా జిరాక్స్‌ వ్యాపారం పుంజుకునే సమయానికి, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఓ రోడ్డు కాంట్రాక్టు పనుల్ని పరిశీలించమని నన్ను పురమాయించారు. అక్కడ నాణ్యత లేకుండా పనులు జరుగుతున్నాయని పైఅధికారికి చెప్పినా స్పందించకుండా నన్నూ చూసీ చూడనట్లు వదిలేయమన్నారు. నేనలా రాజీ పడలేననీ, కావాలంటే నన్ను వేరే విభాగానికి బదిలీ చేయమనీ అడిగా. అలా కార్పొరేషన్‌లో సర్వే విభాగానికి నన్ను పంపించారు.

ఏడాదిలో రూ.లక్షన్నర...
ఓరోజు ఎవరో కాంట్రాక్టర్‌ జిరాక్స్‌ తీయమని ఓ చిన్న పేపర్ల కట్టని తీసుకొచ్చాడు. నేను ఆ కాపీలు సరిగ్గా వచ్చాయో లేదోనని పరిశీలిస్తుంటే, నేను వాటిని చదువుతున్నానేమో అని అతడు పొరబడ్డాడు. దాంతో ‘అది చాలామంచి సర్వే కాంట్రాక్టు. కానీ నా దగ్గర దాన్ని పూర్తిచేయడానికి కావల్సిన డబ్బుల్లేవు. మీరొక ఇరవై వేలు సర్దితే, మీ వంతుగా ఏడాదయ్యే సరికి లక్ష రూపాయల లాభమొస్తుంది’ అన్నాడు. విశాఖపట్నం దగ్గర రక్తకుండ, చింతపల్లి ప్రాంతాల్లో చేయాల్సిన సర్వే కాంట్రాక్ట్‌ అది. ఆ పత్రాలు చదివాక అంతా సజావుగా ఉందని అనిపించడంతో డబ్బులు సర్దుబాటు చేసుకొని, ఉద్యోగానికి సెలవు పెట్టి వైజాగ్‌ బయల్దేరా. అనుకున్నట్లే ఏడాది తరవాత దాదాపు లక్షన్నర లాభం వచ్చింది. అదే నా వ్యాపారానికి మలుపు.

దేశవ్యాప్తంగా వ్యాపారం...
ఓసారి మా జిరాక్స్‌ మెషీన్‌లో ప్లేట్లు పాడైతే, మేం వేరే కంపెనీ టోనర్‌ వాడుతున్నందువల్ల వారంటీ పనిచేయదని జిరాక్స్‌ కంపెనీ వాళ్లు చెప్పారు. అసలు ప్లేట్లు పాడవడానికీ, టోనర్‌కూ సంబంధం ఉంటుందో లేదో తెలుసుకోవడానికి లైబ్రరీకి వెళ్లి చాలా పుస్తకాలు చదివా. ఆ క్రమంలోనే జిరాక్స్‌ మెషీన్‌, ప్లేట్లకు సంబంధించిన పరిజ్ఞానంపైన లోతైన అవగాహన కలిగింది. అప్పుడే ఆ ప్లేట్లేవో మేమే తయారు చేయొచ్చు కదా అనిపించింది. ఈలోగా ‘ఐబీపీ’ అనే ఓ ప్రభుత్వ రంగ సంస్థ, కొత్త మెషీన్లు ఉన్నవాళ్లకు కొత్త సాంకేతికతతో తయారైన జిరాక్స్‌ ప్లేట్లని అందించడానికి ముందుకొచ్చింది. వాళ్లపైన నమ్మకంతో కొత్త మెషీన్‌ కొన్నా. కానీ వాళ్లు రూపొందించిన టెక్నాలజీ పనిచేయలేదు. నా ఇంజినీరింగ్‌ నైపుణ్యం, ఆ యంత్రాల విషయంలో ఉన్న అనుభవంతో కొన్ని మరమ్మతులు చేసి వాళ్లిచ్చిన ప్లేట్లతోనే కొంత వరకూ అక్షరాల్ని ముద్రించగలిగా. ఆ విషయం తెలిసీ, కోర్టులో కేసు పెట్టకుండా వెనక్కి తగ్గితే నా ప్రయోగాలకు కావల్సిన సాంకేతిక సహాయమంతా చేయడానికి ఐబీపీ ఛైర్మన్‌ ముందుకొచ్చారు. ఆ సమయంలో జిరాక్స్‌ ప్లేట్ల స్థానంలో కొత్తగా జిరాక్స్‌ డ్రమ్స్‌ రావడం మొదలయ్యాయి. విదేశాల నుంచి వచ్చే డ్రమ్‌ ధర ఐదు వేలు ఉండేది. ‘యశోదా వాక్యూమ్‌ ఇండస్ట్రీస్‌’ని స్థాపించి, మా పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎనిమిది వందల రూపాయలకే ఆ డ్రమ్స్‌ని తయారు చేసి ఇవ్వడం మొదలుపెట్టాం. క్రమంగా దేశవ్యాప్తంగా డెబ్భై శాతం వాటా మా పరికరాలే ఆక్రమించాయి. మా జిరాక్స్‌ డ్రమ్స్‌ కోసం ఆర్నెల్లు వేచి చూడాల్సినంత డిమాండ్‌ పెరిగింది. అలా దాదాపు పన్నెండేళ్ల పాటు దేశవ్యాప్తంగా ఆ మార్కెట్‌ని శాసించాం.

28ఏళ్ల క్రితం నర్సింగ్‌హోమ్‌

జిరాక్స్‌ యంత్రాలపైన పనిచేసే సమయంలో ‘అల్ట్రా హై వాక్యూమ్‌ టెక్నాలజీ’ పైన నాకు పట్టు దొరికింది. దాని ఆధారంగానే జిర్కోనియం పౌడర్‌, మెగ్నీషియం గ్రాన్యూల్స్‌ని తయారు చేయడం ప్రారంభించాం. రాకెట్లలో వాడే జిర్కోనియం పౌడర్‌ని డిఫెన్స్‌ విభాగం మా నుంచి కొనుగోలు చేస్తుంది. అటామిక్‌ రియాక్టర్లలో ఉపయోగించే మెగ్నీషియం గ్రాన్యూల్స్‌ని ‘బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌’కు సరఫరా చేస్తున్నాం. ఇప్పటికీ దేశంలో వాటిని సరఫరా చేసే సంస్థ మాదొక్కటే. రెండు పరిశ్రమలూ బాగా నడుస్తుండటంతో సంపాదన పెరిగింది. దాంతో ఈసారి నా వంతు వచ్చిందనిపించి, ఇరాన్‌లో ఉన్న మా తమ్ముడు సురేందర్‌కి ఫోన్‌ చేసి భారత్‌కి రమ్మంటే, నర్సింగ్‌ హోమ్‌ కడితే వస్తానన్నాడు. అలా తమ్ముణ్ణి హైదరాబాద్‌కి రప్పించడానికి దాదాపు 28ఏళ్లక్రితం సోమాజిగూడలో ‘యశోదా నర్సింగ్‌హోమ్‌’ని మొదలుపెట్టాం.

రెండువేలకుపైగా పడకలు...
నర్సింగ్‌హోమ్‌ పెట్టిన తొలిరోజుల్నుంచీ బాగా నడిచేది. పాత బస్తీ ప్రాంతంలో సరైన ఆస్పత్రులు లేకపోవడంతో మలక్‌పేటలో ‘యశోదా హాస్పిటల్స్‌’ పేరుతో పెద్ద ఆస్పత్రిని నెలకొల్పాం. ఆ తరవాత సోమాజీగూడలోనే కొన్ని ఫ్లాట్స్‌ని కొనుగోలు చేసి, వాటిని పడగొట్టి ఆస్పత్రిని నిర్మించాం. సికింద్రాబాద్‌లోనూ సరైన వైద్యశాలల కొరత ఉందనిపించి మరో ఆస్పత్రి నెలకొల్పాం. అలా ఓ చిన్న నర్సింగ్‌ హోమ్‌తో మొదలైన ప్రయాణం రెండువేలకుపైగా పడకలున్న ఆస్పత్రుల సముదాయంగా ఎదిగింది. హైటెక్‌సిటీ ప్రాంతంలోనూ పన్నెండు వందల పడకల ఆస్పత్రిని నిర్మించే పనిలో ఉన్నాం.

వృత్తి రీత్యా ఛార్టెర్డ్‌ అకౌంటెంటైన చిన్న తమ్ముడు దేవెందర్‌ ఆస్పత్రుల ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటాడు. ఎండీ స్థానంలో ఉన్న జీఎస్‌ రావు వైద్య పరమైన విషయాలూ, ఛైర్మన్‌గా నేను ఇతర బాధ్యతల్నీ పంచుకున్నాం. ఉదయం నుంచీ రాత్రి వరకూ ముగ్గురిలో ఒకరు నిత్యం ఆస్పత్రిలో అందుబాటులో ఉండాలన్నది మేం పెట్టుకున్న నిబంధన. జాతీయస్థాయి వైద్య కళాశాలల్లో ఉన్నత కోర్సులు చేస్తున్న తెలుగు విద్యార్థులని ఎంపిక చేసుకొని వైద్యులుగా నియమించాలన్నది మేం పాటిస్తున్న సూత్రం. ‘కార్పొరేట్‌ హాస్పిటల్‌ సర్వీస్‌ ఫర్‌ కామన్‌మేన్‌’ అన్నది మేం నమ్ముకున్న సిద్ధాంతం. వైద్యంలో ఏ కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా అందిపుచ్చుకోవాలన్నది మా విధానం. ఈ లక్షణాలే వైద్య రంగంలో ‘యశోదా హాస్పిటల్స్‌’ని ఉన్నత స్థాయికి చేరిస్తే, చిన్నప్పట్నుంచీ అమ్మ నేర్పిన విలువల పాఠాలు సాధారణ గుమాస్తా పిల్లలైన మమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చాయి.

డొనేషన్లు కట్టనన్నా!
నా దగ్గర డబ్బున్నా మా పిల్లలని డొనేషన్లు కట్టి చదివించనని చెప్పేవాణ్ణి. మా అమ్మాయి తిట్టుకుంటూనే ఆర్టీసీ బస్సులో కాలేజీకి వెళ్లేది. మా పెద్దబ్బాయి ఎంసెట్‌లో 35వ ర్యాంకు తెచ్చుకొని ఉస్మానియాలో ఎంబీబీఎస్‌ చేశాడు. చిన్నబ్బాయి ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్‌ చదివాడు.

* మెదడూ, వెన్నెముక తప్ప శరీరంలో దాదాపు అన్ని భాగాలనూ ట్రాన్స్‌ప్లాంట్‌ చేశాం. అందరికంటే ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్‌ చికిత్సలను అందిస్తున్నాం. వీటి కంటే యుక్తవయసులో ఉన్న పేదపిల్లలను ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపిన సందర్భాల్లోనే నాకెక్కువ సంతృప్తి మిగుల్తుంది.

* మా రెండో తమ్ముడు నరేందర్‌ రావు అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. పరిశ్రమలైనా, ఆస్పత్రులైనా, వ్యాపారమైనా మా అమ్మ పేరుతో మొదలుపెట్టడమే మాకలవాటు. కోటి రూపాయలకు పైగా విలువైన ఆస్తుల్ని ఈమధ్యే స్వగ్రామ అభివృద్ధి కోసం రాసిచ్చాం.

* ప్రస్తుతం నా సమయంలో యాభై శాతాన్ని ‘యశోదా ఛారిటబుల్‌ ఫౌండేషన్‌’కే కేటాయిస్తున్నా. అనాథాశ్రమాల నుంచి బయటికొచ్చేసిన టీనేజీ పిల్లలకి కొత్త జీవితాల్ని ఇచ్చేందుకు ‘వైసీఎఫ్‌’ కృషిచేస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.