close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇప్పుడదే స్టూడియోలో సినిమాలు తీస్తున్నా!

ఇప్పుడదే స్టూడియోలో సినిమాలు తీస్తున్నా!

వరసగా నాలుగు పెద్ద విజయాల తరవాత ఆ జోరుని కొనసాగించాలని హీరో నానీ, వరసగా నాలుగు సినిమాల తరవాత ఈసారి కెరీర్లో మరో మెట్టు పైకెక్కాలని దర్శకుడు త్రినాథరావు... ఇద్దరూ కలిసి పనిచేసిన చిత్రం ‘నేను లోకల్‌’. ‘మేం వయసుకు వచ్చాం’ అంటూ చిన్న సినిమాతో పరిశ్రమలోకి వచ్చి, ‘సినిమా చూపిస్త మావ’తో విజయాన్ని ఖాతాలో వేసుకొని ఇప్పుడు మరో మాస్‌ మసాలాతో అలరిస్తున్న త్రినాథ్‌, కాసేపు సినిమా కబుర్లు పక్కనబెట్టి తన గురించి చెబుతున్నారు.

క్క ఛాన్స్‌... ఒకప్పుడు హైదరాబాద్‌లో దిల్‌ రాజుగారి ఆఫీసు ముందు తిరుగుతూ, మనసులో ఆ ఒక్క ఛాన్స్‌ దొరికితే బావుండూ అనుకుంటూ ఆయన్ని కలవడానికి ప్రయత్నించేవాణ్ణి. ఇప్పుడదే ఆఫీసులో కూర్చొని కథా చర్చలు జరుపుతున్నా. గతంలో అన్నపూర్ణ స్టూడియో గేటు బయట తిరుగుతూ ఎవరైనా లోపలికి పిలవకపోతారా, నా కథ వినకపోతారా అని ఆశగా ఎదురు చూసేవాణ్ణి. ఇప్పుడదే స్టూడియోలో సినిమాలు తీస్తున్నా. విశాఖపట్నం జిల్లాలో, ఈ రోజుకీ బస్సు సదుపాయం లేని పొట్నూరు అనే పల్లెటూళ్లొ పుట్టిన నేను, అవకాశాల కోసం రోడ్ల మీద పడిగాపులు పడే దశ నుంచి దర్శకుడి స్థాయికి రావడానికి రకరకాల సమస్యల్ని దాటొచ్చా. సినిమాలతో సంబంధం లేని కుటుంబం మాది. నాన్న వూళ్లొనే వ్యవసాయం చేసుకునేవారు. ఐదుగురు మావయ్యలూ ప్రభుత్వోద్యోగులుగా స్థిరపడ్డారు. పల్లెటూళ్లొనే పెరిగితే భవిష్యత్తు పాడవుతుందేమోనన్న బెంగతో మా అమ్మమ్మ అనకాపల్లిలో మావయ్యల దగ్గరే నన్ను చదివించడానికి తీసుకొచ్చింది. అలా రెండో తరగతి నుంచి అక్కడే పెరిగా.

ప్రిన్సిపల్‌ మాట విని...
నేను బాగుపడినా, పడకపోయినా నా వల్ల వాళ్లింట్లో ఎవరికీ ఏ ఇబ్బందీ రాకూడదనీ, మన పని మనం చేసుకుంటే కాస్త ఆలస్యమైనా జీవితంలో మంచి స్థాయికి వెళ్తామనీ నాన్న పదేపదే చెప్పేవారు. ఆ మాటల్ని మనసులో పెట్టుకొని పెద్దవాళ్లు ఓ మాటన్నా చూసీచూడనట్లు ఉండేవాణ్ణి. మావయ్యలు ఏదైనా సినిమా చూసొస్తే ఓ రెండు మూడ్రోజులు ఇంట్లో దాని గురించి చర్చించేవారు. ఫలానా సన్నివేశం తేలిపోయిందనో, కథ ఇంకాస్త బిగువుగా ఉంటే బావుండేదనో మాట్లాడుకునేవారు. ఆ ప్రభావంతో హైస్కూల్‌కి వచ్చేసరికి వాళ్ల చర్చల్లో నేనూ భాగమయ్యా. ఓసారి డిగ్రీ కాలేజీలో మేం వేసిన నాటకానికి మంచి పేరొచ్చింది. నాటకం పూర్తయ్యాక మేకప్‌ తీస్తుంటే, మా ప్రిన్సిపల్‌ నర్సింహారావుగారు నన్ను వెతుక్కుంటూ వచ్చి, ‘చాలా బాగా చేశావురా, సినిమాల్లో ప్రయత్నించొచ్చు కదా, ఇప్పుడున్నోళ్లు ఎవరూ పుట్టుకతో గొప్పవాళ్లు కాదు, ఆలోచించుకో...’ అని వెళ్లిపోయారు. అప్పటిదాకా సినిమాలు చూడ్డం తప్ప తెరవెనక ప్రపంచం గురించి అస్సలు తెలీదు. కానీ బయటివాళ్లే నా ప్రతిభని మెచ్చుకున్నప్పుడు, నేనెందుకు ప్రయత్నించకూడదూ అన్న ఆలోచన క్రమంగా మొదలైంది. దాంతో డిగ్రీ పూర్తయ్యాక సినిమా రంగంలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నా.

లైబ్రరీల్లో మూడేళ్లు...
హైదరాబాద్‌ వెళ్లి సినిమాల్లో పనిచేయాలని ఉందని మొదట మా చిన్న మావయ్యకి చెప్పా. అప్పట్లో హైదరాబాద్‌లో ఎల్వీప్రసాద్‌గారు ఏదో సినిమాకు ఆడిషన్లు నిర్వహిస్తే, అందులో పాల్గొనడానికి మా తాతయ్య అనకాపల్లి నుంచి వెళ్లొచ్చారట. బహుశా ఆయన్నుంచే నాక్కాస్త సినిమా పిచ్చి వచ్చిందేమో అని మావయ్య అనుకున్నారు. ‘అసలు సినిమా అంటే ఏంటి?’... అని మావయ్య నాకో ప్రశ్న వేసి, దానికి సమాధానం చెబితే అమ్మావాళ్లను ఒప్పించి నన్ను హైదరాబాద్‌ పంపిస్తానన్నారు. చూడ్డానికి చిన్న ప్రశ్నలా కనిపించినా, దాని లోతెంతో ఆలోచించడం మొదలుపెట్టాకే అర్థమైంది. ఒక్క మాటలో సినిమా గురించి చెప్పడం అసాధ్యమనిపించింది. సినిమాల గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రోజూ లైబ్రరీకి వెళ్లి వాటికి సంబంధించిన పుస్తకాల్ని చదవడం మొదలుపెట్టా. తరవాత హిందీ, ఇంగ్లిష్‌, తెలుగు సినిమాల క్యాసెట్లు తెచ్చుకొని చూస్తూ, ఒక్కో దర్శకుడు సినిమాని ఏ విధంగా తీస్తున్నాడో విశ్లేషిస్తూ వచ్చా. సినిమాల గురించి తెలుసుకునే కొద్దీ, నేనూ దర్శకుణ్ణి కాగలనన్న నమ్మకం పెరగసాగింది. దాంతో సొంతంగా కథలు రాసుకోవడం మొదలుపెట్టా. అలా మూడేళ్లు గడిచాక కొన్ని కథల్ని సిద్ధం చేసుకొని తెలీని ధైర్యంతో, బోలెడన్ని ఆశలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టా.

రోడ్ల మీద పడిగాపులు...
గతంలో అసిస్టెంట్‌, అసోసియేట్‌, కో-డైరెక్టర్‌... ఇలా అనేక దశల్ని దాటి దర్శకుడు కావాలంటే కనీసం పదేళ్లు పట్టేది. నాకేమో సినిమా రంగంలో ఎవరితో పరిచయం లేదు. ఎప్పటికి అవకాశం వస్తుందో తెలీదు. హైదరాబాద్‌ వచ్చిన మొదటి నెల్లో మావయ్య ఇంట్లో ఉన్నా. తరవాత వేరే గది అద్దెకు తీసుకున్నా. నేను రాసుకున్న కథల్ని పట్టుకొని, ఎవరైనా విని అవకాశమివ్వకపోరా అన్న ఆశతో ఆఫీసుల వెంట తిరగడం ప్రారంభించా. అలా మొదట రామ్‌గోపాల్‌ వర్మగారి ఆఫీసుకెళ్తే సెక్యూరిటీ లోపలికి రానివ్వలేదు. ఆ పైన ఎన్ని ఆఫీసులకెళ్లినా అదే పరిస్థితి. ఇంకొన్నాళ్లు పొద్దున్నే అన్నపూర్ణ స్టూడియోస్‌ ముందు వాలిపోయేవాణ్ణి. రోజూ నన్ను గమనిస్తూ వచ్చిన సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ ఒకాయన, నిర్మాతల్నీ, హీరోల్నీ కలవాల్సిన పద్ధతి అది కాదనీ, అలా ఎన్ని రోజులు తిరిగినా పనవ్వదనీ చెప్పి పంపించేశాడు. రెండు మూడు నెలలు గడిచాక నాకు పరిస్థితి అర్థమైపోయింది. వూరి నుంచి వచ్చేప్పుడు నాన్న దగ్గర ఐదొందలు తీసుకున్నా. అదే ఆయన నాకు చేసే చివరి సాయం కావాలని ఆరోజే నిర్ణయించుకున్నా. అందుకే నాకు లెక్కలపైన పట్టుండటంతో ఖర్చుల కోసం డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఓ కాలేజీలో మ్యాథ్స్‌ ట్యూటర్‌గా చేరా.

ఆ అమ్మాయి వల్లే...
కాలేజీలో పనిచేసేప్పుడు సినిమా ప్రయత్నాలకు సమయం ఉండేది కాదు. కొన్నాళ్లకు బండి నడుస్తుంది కదా అనిపించి, దాదాపు సినిమా ఆఫీసులకి వెళ్లడం మానేశా. అలా రోజులు గడుస్తున్నప్పుడు ఓసారి అనుకోకుండా మా మావయ్య కూతురు కలిసింది. మాటల్లో మాటగా నేనసలు హైదరాబాద్‌కి ఎందుకొచ్చానో, ఏం చేస్తున్నానో అని ఆరాతీసింది. సినిమాల కోసం వచ్చానని చెబితే నవ్వుతుందేమో అనిపించి చెప్పలేదు. నేనేదో దాస్తున్నాననే విషయాన్ని గ్రహించి, ‘నేను సత్యం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇప్పుడది సాధించా. అలా నీ లక్ష్యం ఏంటి? దానికోసం నువ్వు నిజాయతీగా కష్టపడుతున్నావో లేదో ఆలోచించుకో’ ఆనేసి వెళ్లిపోయింది. ఆడపిల్లా, అందులోనూ నాకంటే చిన్నదానికే జీవితంలో అంత స్పష్టత ఉన్నప్పుడు నేను లక్ష్యానికి దూరంగా బతకడం కరెక్టు కాదనిపించింది. ఆ రోజే ఉద్యోగానికి రాజీనామా చేశా. ఇతర వ్యాపకాలన్నీ వదిలేసి మళ్లీ సినిమాలమీద పడ్డా. అప్పట్నుంచీ డబ్బుల సమస్యలూ, ఇంట్లో వాళ్ల నుంచి రకరకాల ప్రశ్నలూ షరా మామూలయ్యాయి.

తొలి అవకాశం...
హైదరాబాద్‌లో మొదట్నుంచీ సాయి శ్రీరామ్‌ (ప్రస్తుతం కెమెరామన్‌)తో కలిసుండేవాణ్ణి. సాయి అప్పుడు కెమెరా అసిస్టెంట్‌గా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్లేవాడు. ఓరోజు నేనింటికొచ్చే సరికి తినడానికి ఏమీ లేదు. నా దగ్గరా డబ్బుల్లేవు. నేను ఏదో ఏర్పాటు చేసుంటానని సాయి ఆశతో గదికి వచ్చాడు. అతడి దగ్గర కూడా పైసా లేదు. అప్పటికే సరిగ్గా అన్నం తిని మూడ్రోజులైంది. ఏం చేయాలో తోచలేదు. అంత దుర్భరంగా బతికే బదులు వూరికెళ్లిపోతే బావుంటుందన్న ఆలోచనా మొదలైంది. అప్పట్లో పావలా, అర్ధరూపాయి బిళ్లల్ని నేనూ సాయీ గదిలో దేవుడి బొమ్మదగ్గర పెట్టేవాళ్లం. ఆ విషయం గుర్తొచ్చి మొత్తం నాణేల్ని లెక్కేస్తే పదమూడు రూపాయలయ్యాయి. దాంతో ప్లేట్‌ మీల్స్‌ తెచ్చుకొని కడుపు నింపుకున్నాం. చాలాసార్లు బస్సు టికెట్‌కి డబ్బుల్లేక, కేవలం సినిమా టికెట్‌కి సరిపడా చిల్లర సంపాదించి కిలోమీటర్ల కొద్దీ నడిచి సినిమా చూసొచ్చేవాళ్లం. అలా రోజుల్ని కష్టంగా గడుపుతూనే సినిమా ప్రయత్నాలు సాగించా. ఆ క్రమంలో పరిచయమైన సహదేవ్‌ అనే వ్యక్తి దర్శకుడు టి.ప్రభాకర్‌ దగ్గరకి నన్ను తీసుకెళ్లారు. ఆయన నాకో సందర్భం చెప్పి, దానికి మాటలు రాసి సన్నివేశాన్ని రూపొందించమనీ, నచ్చితే అవకాశమిస్తాననీ అన్నారు. దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదని కసిగా మాటలు రాశా. ప్రభాకర్‌గారికీ అవి నచ్చడంతో నన్ను దర్శకత్వ శాఖలో అసిస్టెంట్‌గా తీసుకున్నారు. ఆ సినిమాకి దర్శకుడు సంపత్‌ నంది, రచయితగా పనిచేశారు. నేను కూడా స్క్రిప్ట్‌ బాగా రాస్తాననిపించి, సంపత్‌తో కలిసి నన్నూ పనిచేయమన్నారు. అలా ‘మీనాక్షి’ అనే సినిమాతో దర్శకత్వ శాఖలో నా ప్రయాణం మొదలైంది.

అందరికీ నచ్చింది...
‘మీనాక్షి’ విడుదలయ్యాక కూడా చాలా రోజులపాటు సంపత్‌ నందితో కలిసి పనిచేశా. ఆ తరవాత ‘పిల్లజమీందార్‌’ దర్శకుడు అశోక్‌తో కలిసి మూడు సినిమాలకు పనిచేశా. ఒక సినిమా చేస్తున్నప్పుడే ఎవరో ఒకరికి నా పనితీరు నచ్చి మరో సినిమాకి అసిస్టెంట్‌గా పిలిచేవారు. ఆ ప్రయాణంలోనే కె.లక్ష్మణ్‌ పరిచయమయ్యారు. ఆయనకి సినిమా నిర్మించాలన్న ఆసక్తి ఉండేది. నేను వినిపించిన కథ నచ్చడంతో ఆయన దగ్గరున్న పరిమిత బడ్జెట్‌లో సినిమా తీయడానికి ముందుకొచ్చారు. ఆపైన మరో నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌గారికీ కథ నచ్చి ఆయనా చేతులు కలపడంతో నా తొలి సినిమా ‘మేం వయసుకు వచ్చాం’ మొదలైంది. ఆ ఏడాది విడుదలై విజయం సాధించిన మూడు చిన్న సినిమాల్లో మాదీ ఒకటి. ఆ ప్రభావంతో వరసగా లెక్కలేనన్ని చిన్న సినిమాలొచ్చాయి. మా సినిమాని త్రివిక్రమ్‌గారితో సహా పరిశ్రమలో చాలామంది దర్శక నిర్మాతలు చూసి అభినందించారు.

రామ్‌చరణ్‌ ఫోన్‌...
డైరెక్టర్‌గా నా కెరీర్‌ ప్రారంభమయ్యేనాటికి ఇంట్లో నా పెళ్లి సమస్య మొదలైంది. వూళ్లొ అందరూ నా గురించి ఆరాతీస్తుంటే ఏం చెప్పాలో అర్థంకాక అమ్మానాన్నా కుంగిపోయేవాళ్లు. అమ్మానాన్నల బాధ చూడలేక, ఎవరిని చూస్తే వాళ్లని చేసుకుంటానని మాటిచ్చా. చెప్పినట్లే వాళ్లు చూసినమ్మాయినే పెళ్లికి రెండ్రోజుల ముందెళ్లి చేసుకొని వచ్చా. ఆ వెంటనే నా తొలి సినిమా మొదలైంది. ఆపైన వరుణ్‌ సందేశ్‌తో ‘ప్రియతమా నీవచట కుశలమా’, ‘నువ్వలా నేనిలా’ సినిమాలు తీశా. నా తొలి నిర్మాత వేణుగోపాల్‌గారు మళ్లీ సినిమా చేద్దామనడంతో పక్కా కమర్షియల్‌ సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. ‘ఉయ్యాలా జంపాలా’ చూశాక రాజ్‌ తరుణ్‌ డైలాగులు బాగా విసుర్తున్నాడు కాబట్టి నా సినిమాకి పనికొస్తాడనిపించింది. అలా ‘సినిమా చూపిస్త మావ’ మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోలో ఆ సినిమా కాపీ చూసిన దిల్‌రాజుగారు నాతో చెప్పిన తొలి మాట, ‘నువ్వు ఎవరికీ కమిట్‌ అవ్వకు. మనం తరవాతి సినిమా కలిసి చేస్తున్నాం’ అని. ఆయనకి సినిమా అంతలా నచ్చేసింది. సినిమా కూడా మంచి హిట్టయింది. విడుదలైన వెంటనే రామ్‌ చరణüగారి నుంచి ఫోనొచ్చింది. ఆయన పిలిపించి సినిమా తీసిన విధానాన్ని అభినందిస్తూ మాట్లాడారు.

నా తొలిసినిమాకి నానీ వాయిస్‌ ఓవర్‌ చెప్పారు. ఆ సినిమాలో ‘వెళ్లిపోకే’ అనే పాట నానీ కారులో రోజూ వినేవాడట. ‘సినిమా చూపిస్త మావ’ తరవాత అతనితో సినిమా చేసే అవకాశం వచ్చింది. వరసగా నానీకి ఐదో విజయం అందించాలనీ, నేనూ దర్శకుడిగా ఓ మెట్టు పైకెక్కాలనీ జాగ్రత్తగా ‘నేను లోకల్‌’ తీశా. ఈ సినిమా సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌, తనకు వందశాతం నచ్చితే తప్ప పాటని షూటింగ్‌ కోసం కూడా పంపించేవాడు కాదు. ఎవరికో కాదు, ముందు మన పని మనకు నచ్చాలీ అనే మంచి విషయాన్ని ఆయన్నుంచి నేర్చుకున్నా. ఒకప్పుడు ఎప్పటికైనా లోపలికి దర్శకుడిగా అడుగుపెట్టాలని అనుకుంటూ, స్క్రిప్ట్‌ ఫైల్‌ పట్టుకొని దిల్‌రాజుగారి ఆఫీసు బయట నిల్చునేవాణ్ణి. ఇప్పుడా స్థానంలో రోజూ పదుల సంఖ్యలో కుర్రాళ్లని చూస్తున్నా. వాళ్లలో నన్ను నేను చూసుకుంటున్నా. అనుకున్నట్లే పరిశ్రమలోకి వచ్చా. సినిమాలు తీశా. విజయాలూ అందుకున్నా. నేను ముందుకెళ్తూనే నాలాంటి వాళ్లకీ అవకాశం కల్పించే దశకు వచ్చిన రోజునే నా సినీ జీవితం పరిపూర్ణమైనట్టు లెక్క.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.