close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మురళీ ‘విజయ’బాట...

మురళీ ‘విజయ’బాట...

‘ఆరంభం బావుంటే సగం పని పూర్తయినట్లే’... టీమ్‌ ఇండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ మురళీ విజయ్‌ అదే చేస్తున్నాడు. నిలకడైన బ్యాటింగ్‌తో గట్టి పునాది వేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. పేరులో విజయం ఉన్న ఈ టెస్టుస్పెషలిస్టు తన జీవనయానంలో ఎన్నో అపజయాల్నీ, అవమానాల్నీ చూశాడు. అయినా తన వికెట్‌ను కాపాడుకుంటూ ఇన్నింగ్స్‌ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు..!
ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో తప్పిన మురళీ విజయ్‌ పెట్టేబేడా సర్దుకొని ఇంటినుంచి బయటకెళ్తూ... ‘నా గురించి ఆందోళనొద్దు. నేను చనిపోను. మీకు చెడ్డపేరూ తీసుకురాను. కొన్నాళ్లు నా మానాన నేను బతుకుతాను...’ తల్లిదండ్రులతో చెప్పిన మాటలివి. బాగా చదువుకోవడంలేదని తండ్రి కోప్పడటంతో మురళి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలా బయటకు వచ్చి చెన్నైలోనే ఓ చిన్న హోటల్‌ గదిలో ఆర్నెల్లు అద్దెకున్నాడు. ఆ గదిలో అతడితోపాటు ఓ డ్రైవర్‌, మరో వ్యక్తీ ఉండేవారు. విజయ్‌ తండ్రి వ్యాపారి. వ్యాపారంలో లాభనష్టాల ప్రభావం ఏనాడూ కుటుంబం మీద పడనీయలేదాయన. తల్లి కూడా పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచింది. కానీ, వాళ్లు చదువుకి ప్రాధాన్యమిచ్చేవారు. నూటికి ఒక్క మార్కు తగ్గినా ఘోరం జరిగినట్టు మాట్లాడేవారు. విజయ్‌ సోదరి ఇంటర్మీడియెట్‌లో 98 శాతం మార్కులు సంపాదించుకుంది. ‘అప్పుడు చదువుపైన నాకు ఆసక్తి లేదు. నా ఉద్దేశంలో జ్ఞానమంటే బయట నలుగురితో మాట్లాడటం, నాలుగు చోట్లకు వెళ్లి ఏదైనా పనిచేస్తూ నేర్చుకోవడమేనన్నట్టు ఉండేది’ అని చెబుతాడు విజయ్‌. దాని గురించి చాలా రోజులుగా అతడిలో అంతర్మదనం జరిగింది. చివరగా ఆరోజు ఓ నిర్ణయానికి వచ్చాడు. ‘నేనెప్పుడూ సొంత నిర్ణయాలు తీసుకునేవాణ్ని. అలాంటపుడు నా కాళ్లమీద నేను బతకగలనా అన్న సందేహం వచ్చింది. ఓ ఆర్నెల్లు బయట ఉండి పరీక్షించుకుందామనుకున్నాను’ అని 17 ఏళ్ల వయసులో తాను తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటాడు విజయ్‌. హోటల్లో ఉంటూ ఒక స్నూకర్‌ పార్లర్‌లో పనికి కుదిరాడు. అక్కడ పనిచేస్తూనే ఖాళీ సమయంలో క్రికెట్‌ ఆడేవాడు. కానీ డబ్బుకి ఇబ్బందయ్యేది. రోజూ రాత్రి పడుకునేటపుడు ఆలోచిస్తూ మర్నాడు ఇంటికి వెళ్లిపోదామనుకునేవాడు. కానీ తెల్లవారి లేచాక జీవితమనే పరీక్షలో నెగ్గాలని ఆ ఆలోచనను విరమించుకునేవాడు. మరీ కష్టమైన రోజున ఒకపూట స్నేహితుల ఇంటికి వెళ్లేవాడంతే. ఆ సమయంలో ఒక గొలుసుకట్టు వ్యాపారంలో చేరాడు. ఆ వ్యాపారంలోకి కొత్తవారిని చేర్చితే అతడికి కొంత మొత్తం వచ్చేది. విజయ్‌కు పరిచయాలు ఎక్కువ. దాంతో ఆ పని సులభంగా చేసుకోగలిగాడు. అలా వచ్చిన డబ్బుతో ఆ ఆర్నెల్లూ గడిపాడు. ఆ సమయంలో కొన్నిసార్లు ఇంట్లో వాళ్లకి కనిపించి తిరిగి వచ్చేసేవాడు. ‘ఆరోజు నాన్న నన్ను ఆపకుండా మంచి పనిచేశారు. అందువల్లనే చిన్న వయసులోనే స్వేచ్ఛనీ, బాధ్యతనీ తెలుసుకోగలిగాను. క్రికెట్టే నా భవిష్యత్తని నేనే నిర్ణయించుకున్నాను. దానికోసం ఎంతో కష్టపడ్డాను’ అని చెబుతాడు విజయ్‌.
గుర్తింపు వచ్చిందిలా...
ఆర్నెల్ల తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిన విజయ్‌, ఆపైన ఇంటర్మీడియెట్‌ పాసై మైలాపూర్‌లోని వివేకానంద డిగ్రీ కాలేజీలో చేరాడు. క్రికెట్లో ఆ కాలేజీ జట్టుకి మంచి పేరు. ‘ఒకప్పుడు సంపన్నులమైన మేము వ్యాపారంలో నష్టాలవల్ల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులుపడ్డాం. అయితే నాన్న డబ్బుకంటే మానవ సంబంధాలకు ప్రాధాన్యమిచ్చేవారు. నేనూ అదే దారిలో వెళ్లేవాణ్ని’ అని చెప్పే విజయ్‌ తన జీవితంలో స్నేహితులు ముఖ్యపాత్ర పోషించారనీ, శ్రీనాథ్‌, హరీష్‌, వినీత్‌... ఇంకా చాలామంది స్నేహితులు ఉన్నారనీ, వాళ్లని ఎప్పటికీ మర్చిపోననీ చెబుతాడు. స్నేహితుల తల్లిదండ్రులూ విజయ్‌ని వారి కొడుకులానే చూసేవారు. చదువుల్లో అంతంత మాత్రమేనని తెలిసినా అతడితో స్నేహానికి అడ్డుచెప్పేవారు కాదు. పైగా వారందరూ విజయ్‌ని క్రికెట్‌ ఆడమని ప్రోత్సహించేవారు. ‘వారలా చెబుతుంటే నేను క్రికెట్‌ కోసమే పుట్టాననిపించేది. నాలో ఓ అంతర్జాతీయ క్రికెటర్‌ ఉన్నాడని నాకంటే ఎక్కువగా వారే నమ్మేవారు. 14 ఏళ్లపుడు 1999లో చెన్నైలో జరిగిన ఇండియా-పాకిస్థాన్‌ టెస్టు మ్యాచ్‌ను చెపాక్‌ మైదానానికి వెళ్లి చూశాడు విజయ్‌. ఆరోజు గెలుపు వాకిట్లో నిలబడ్డ మన జట్టు 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. విజయం కోసం చివరవరకూ సచిన్‌ ఎంతలా పోరాడిందీ దగ్గర్నుంచి గమనించాడు. భారత జట్టుకు ఆడాలన్న కోరిక అతడికి అప్పుడే కలిగింది. కానీ, విజయ్‌ లెదర్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టింది 17 ఏళ్లకి. డిగ్రీలో చేరాక క్రికెట్‌ బాగా ఆడేవాడు. ఒక దశలో రాష్ట్ర అండర్‌-19 జట్టుకి ఎంపిక అవుతాననుకున్నాడు. కానీ కాలేదు. దాంతో కాలేజీ జట్టు ఆటగాడిగానే కొనసాగుతూ పోటీ ఏ స్థాయిదన్న పట్టింపు లేకుండా క్రికెట్‌ మ్యాచ్‌ అనగానే అందరికంటే మైదానంలో ముందుండేవాడు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించేవాడు. అలాంటి మ్యాచ్‌లలో విజయ్‌ ఆటని చూసిన తమిళనాడు రంజీ ఆటగాడు భరత్‌ అరుణ్‌ (భారత జట్టు మాజీ బౌలింగ్‌ కోచ్‌) చెన్నై క్లబ్‌ క్రికెట్‌ జట్లలో ఒకటైన ‘కెమ్‌ప్లాస్ట్‌’కి ఆడే అవకాశం కల్పించాడు. కానీ అక్కడ నాలుగైదు మ్యాచ్‌లు వేచిచూశాక గానీ విజయ్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. అవకాశం వచ్చినపుడు మాత్రం సద్వినియోగం చేసుకునేవాడు. బాగా ఆడినా కొన్నిసార్లు లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు పంపేవారు. లేదంటే విశ్రాంతి ఇచ్చేవారు. కానీ విజయ్‌ ప్రతిభను అలాంటి అడ్డంకులు ఎన్నాళ్లొ ఆపలేకపోయాయి.
జుట్టువల్ల తీసుకోలే...
21 ఏళ్లపుడు లీగ్‌లలో అద్భుతంగా ఆడుతున్న తనను తమిళనాడు రాష్ట్ర రంజీ జట్టుకి ఎంపిక చేస్తారనుకున్నాడు విజయ్‌. కానీ మళ్లీ నిరాశే ఎదురైంది. కారణం ఏమై ఉంటుందని కనుక్కుంటే... అతడి పొడవైన జుట్టేనని తెలిసింది. ‘నా ప్రదర్శనకంటే వారికి హెయిర్‌స్టైల్‌ ముఖ్యమా’ అనుకున్న విజయ్‌ ఆరోజు సాయంత్రమే హెయిర్‌స్టైల్‌ మార్చుకున్నాడు. ‘ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో ఆటతోపాటు ఆహార్యం కూడా ముఖ్యమని ఆలస్యంగా అర్థమైంది. జనాల్ని మార్చడం నా వల్లకాదు. అందుకే నా పద్ధతుల్నే మార్చుకున్నాను. జుట్టు ఎప్పుడైనా పెంచుకోవచ్చు. ముందు జట్టులోకి రావాలనుకున్నా’ అంటాడు విజయ్‌. సెంచరీ చేయడంకంటే 30-40 పరుగులుచేసి మ్యాచ్‌ను గెలిపించడమే గొప్పగా ఫీలయ్యేవాడు. కానీ సెలక్టర్లకి భారీ స్కోర్లు కావాలని గుర్తించి వాటిపైనా దృష్టిపెట్టాడు. తర్వాత రెండేళ్లకు తమిళనాడు రంజీ జట్టుకి ఎంపికయ్యాడు. ఆపైన ఏడాదికి, 2008లో గాయపడిన గౌతమ్‌ గంభీర్‌ స్థానంలో భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. ‘‘మొదటిసారి టీమ్‌ ఇండియాకి ఆడినపుడు జట్టు సభ్యులందరూ శుభాకాంక్షలు చెప్పారు. సచిన్‌ అయితే... ‘నీ ప్రయాణంలో ఇది మరో అడుగు మాత్రమే. దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆటను ఆస్వాదించు’ అని చెప్పాడు. ఆరోజు అదే ఫాలో అయ్యాను’’ అని చెబుతాడు విజయ్‌. మొదటి టెస్టు ఆస్ట్రేలియాపైన నాగ్‌పూర్‌లో ఆడాడు. ఆ టెస్టులో రెండు ఇన్నింగ్సులలో 33, 41 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఆ మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కూడా భారత్‌ గెల్చుకుంది. కానీ తర్వాత గంభీర్‌ జట్టులోకి రావడంతో మళ్లీ ఏడాదివరకూ విజయ్‌కు అవకాశం రాలేదు. మరోసారి గంభీర్‌కే గాయమవడంతో శ్రీలంకతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అప్పట్నుంచీ నిలకడగా రాణిస్తూ రెండేళ్లు జట్టులో కొనసాగాడు.


దేశాన్నిబట్టి ప్రణాళిక
2011లో వెస్టిండీస్‌ పర్యటనలో రాణించకపోవడంతో విజయ్‌ను జట్టు నుంచి తప్పించారు. ‘ఆ సమయంలో సాంకేతికంగా ఎలాంటి సమస్యలూ లేవు. మనసు, శరీరం మధ్య సమన్వయం లోపించింది. దాన్ని నా వ్యక్తిగత కోచ్‌ జయకుమార్‌, భారతజట్టు మాజీ వికెట్‌ కీపర్‌ భరత్‌రెడ్డిల సహకారంతో సరిదిద్దుకున్నాను. వారిద్దరూ నా ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. దాంతోపాటు అప్పట్లో ఒక సెషన్లో పూర్తిగా డిఫెన్స్‌ ఆడుతూ, మరో సెషన్లో దూకుడుగా ఆడేవాణ్ని. దేశవాళీ మ్యాచ్‌లలోనూ అలాగే ఆడేవాణ్ని. ఆ పద్ధతిని మార్చుకొని ప్రతి సెషన్‌నీ బ్యాలెన్స్‌డ్‌గా ఆడటం అలవాటు చేసుకున్నాను. ఆ మార్పులు చేసి దేశవాళీ మ్యాచ్‌లలో రాణించడంతో తిరిగి ఆర్నెల్లలో జాతీయజట్టులోకి రాగలిగాను’ అని చెబుతాడు విజయ్‌. 2013 ఫిబ్రవరిలో టెస్టు జట్టులోకి వచ్చాక ఇప్పటివరకూ ఫిట్‌నెస్‌ కారణంగా తప్ప ఫామ్‌ పరంగా జట్టుకి దూరం కాలేదు. టెస్టుల్లో ఓపెనర్‌గా వెళ్లి త్వరగా ఔటై వస్తే, రోజంతా పెవిలియన్లో వూరకే కూర్చోవాలనీ, అది తనకంత నచ్చదనీ, అందుకే నిరంతర సాధన చేస్తూ లోపాల్ని సరిదిద్దుకుంటాననీ చెబుతాడు. విజయ్‌ ఎక్కువగా బ్యాక్‌ఫుట్‌పైన ఆడతాడు. గంటకు 145కి.మీ. వేగంతో బంతులు వచ్చినపుడు సులభంగా కదలాలని బరువు తగ్గించుకున్నాడు. మ్యాచ్‌లు ఆడే దేశాన్నిబట్టి స్టాన్స్‌ను మార్చుకుంటాడు. ఆస్ట్రేలియాలో బౌన్స్‌ ఎక్కువ కాబట్టి కాస్త నిటారుగా నిలబడతాననీ, ఇండియాలో బౌన్స్‌ తక్కువ కాబట్టి కాస్త వంగి ఉంటాననీ చెబుతాడు. ఇంగ్లాండ్‌ పర్యటనకు సిద్ధమైనపుడు గాల్లో తేమ ఉంటుందని ఉదయాన్నే ప్రాక్టీసు చేసేవాడు.
కఠోర శ్రమతో టెస్టు జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న విజయ్‌కు వన్డేలూ, టీ20ల్లో మాత్రం స్థానం దొరకడంలేదు. 2015 జులైలో జింబాబ్వేతో చివరగా, టీ20, వన్డేల్లో ఆడాడు. త్వరలోనే మళ్లీ వన్డేల్లోనూ, టీ20ల్లోనూ కనిపిస్తానంటున్నాడు. ‘ఇష్టమైన ఆటలో దేశం కోసం ఆడుతున్నాను. వన్డేలూ, టీ20లంటూ అతిగా ఆశపడటమూ తప్పే. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం వరకే నా పని. టెస్టులూ, వన్డేలూ, టీ20లూ వేటి ప్రత్యేకత వాటికి ఉంది. కానీ నా వరకూ టెస్టుల తర్వాతే మిగతా వాటికి స్థానం’ అని చెబుతాడు విజయ్‌.


ఇంకొంత
ప్పటివరకూ 48 టెస్టులూ, 17 వన్డేలూ, తొమ్మిది టీ20లూ ఆడాడు. టెస్టుల్లో తొమ్మిది సెంచరీలూ, 14 అర్ధ సెంచరీలూ చేశాడు.
* విజయ్‌, నికితాలకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి నిరావ్‌, అమ్మాయి ఇవా. ఇంటి దగ్గరుంటే పిల్లలచేత పాటలు పాడిస్తూ, పాప డైపర్లని మార్చుతూ సమయం గడుపుతాడు.
* పిల్లల పేర్లను కుడిచేతిపైన టాటూ వేయించుకున్నాడు. ‘లవ్‌ మమ్‌’ అని ఎడమ భుజంపైన రాసుకున్నాడు.
* ఖాళీ సమయంలో స్నూకర్‌ ఆడతాడు, సర్ఫింగ్‌ చేస్తాడు. కొత్త ప్రదేశాలకు వెళ్లి కొత్త సంస్కృతుల్ని గమనిస్తాడు. ‘క్రికెటర్‌ కాకుంటే మోడల్‌ని అయ్యేవాణ్నేమో’ అంటాడు.
* లాంగ్‌ డ్రైవ్స్‌ అంటే ఇష్టం. మెల్‌బోర్న్‌ గ్రేట్‌ ఓషన్‌ డ్రైవ్‌ వెంబడి కారులో షికారు చేయడం ఎంతో ఇష్టమని చెబుతాడు.
* ఐపీఎల్‌లో ప్రస్తుతం కింగ్స్‌ లెవెన్‌ జట్టుకి ఆడుతున్నాడు. గతేడాది కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేశాడు.
* ఒత్తిడికి గురికాకుండా ఆడే మార్క్‌ వా బ్యాటింగ్‌ తీరు నచ్చేదట.
* జట్టుతో హోటల్‌ రూమ్‌లో ఉన్నపుడు తోటి ఆటగాళ్లతో వీడియో గేమ్స్‌ ఆడతాడు.
* రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లకు పెద్ద ఫ్యాన్‌. ఇద్దరిలోనూ కమల్‌ అంటే కొద్దిగా ఎక్కువ అభిమానం.

పెళ్లి వివాదం
ది 2012... కెరీర్‌ సవ్యంగా నడుస్తున్న సమయంలో విజయ్‌ జీవితంలో ఓ వివాదం చోటుచేసుకుంది. అది... క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ మాజీ భార్య నికితాతో ప్రేమలో పడటం. వాస్తవాలు తెలియకపోయినా ఆ సమయంలో అందరూ విజయ్‌ని విలన్‌లా చూశారు. కానీ నికితా, విజయ్‌ పెళ్లిచేసుకొని ఆ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ‘ప్రముఖులమే కానీ, మేమూ మనుషులమే. వ్యక్తిగత విషయాల్ని అందరితో పంచుకోవాల్సిన అవసరంలేదు. ఆ విషయం గురించి మా అమ్మనాన్నలకి చెప్పాను. అందరి జీవితాల్లోనూ సమస్యలు ఉంటాయి. నా ఆట జీవితంలో ఒక భాగం మాత్రమే. నాది కూడా అందరిలాంటి జీవితమే’నంటాడు విజయ్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.