close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇప్పుడైతే ప్రేమకు టైం లేదు!

ఇప్పుడైతే ప్రేమకు టైం లేదు!

నాన్న థంకచన్‌ ఇమ్మాన్యుయేల్‌. మలయాళ సినిమాల్ని నిర్మిస్తుంటారు. 2011లో ‘స్వప్న సంచారి’ సినిమా తీశారు. ఆ సినిమా దర్శకుడు కమల్‌ నన్ను చూసి, దాన్లో చేయమని అడిగారు. అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతున్నాను. అందులో బాలనటిగా కనిపించాను. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో చేయమని అడిగారు. మా కుటుంబం ఉండేది అమెరికాలోని టెక్సాస్‌లో. అక్కణ్నుంచి తరచూ వస్తే చదువుకి ఆటంకం అవుతుందని వాటిలో చేయలేదు. చిన్నప్పట్నుంచీ ఏదైనా కళలకు సంబంధించిన విభాగంలో ఉండాలనుకునేదాన్ని. ఇంట్లో సినిమాల గురించి ఎక్కువగా చర్చించేవారు. దాంతో వీలైతే తెరపైన, కాకుంటే తెర వెనక, లేదంటే మోడల్‌గానో కెరీర్‌ మొదలుపెట్టాలనుకునేదాన్ని. స్కూల్‌ చదువు పూర్తయ్యాక పైచదువులు చదువుతూ కొన్ని ఫొటోలూ, వీడియోలతో ప్రొఫైల్‌ తయారుచేసుకున్నాను. నా ఫొటోల్ని చూసిన మలయాళ దర్శకుడు అబ్రిడ్‌ షైన్‌ నన్ను సంప్రదించారు. వీడియో ప్రొఫైల్‌ కూడా చూశాక తన సినిమాకి హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ చేశారు. 2015లో వచ్చిన ‘యాక్షన్‌ హీరో బిజు’ హీరోయిన్‌గా నా మొదటి సినిమా. మలయాళంలో ‘ప్రేమమ్‌’ చూశాక హీరో నవీన్‌ పాలే అభిమానిగా మారిపోయాను. ‘బిజు...’లో అతడే హీరో. మొదటి సినిమాలోనే నవీన్‌ సరసన నటించడంలాంటి అవకాశాన్ని వూహించలేదు. ఆ సినిమా పెద్ద హిట్‌.

టాలీవుడ్‌లోకి ఇలా...
అమెరికాలో స్నేహితులతో కలిసి భారతీయ సినిమాలు చూస్తుంటాను. మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్‌లతోపాటు మరికొంత మంది టాలీవుడ్‌ హీరోల గురించి ఇక్కడికి రాకముందునుంచే తెలుసు. నటిగా మారాక తెలుగు సినిమాలూ చేయాలనుకున్నాను కానీ, ఇంత త్వరగా తెలుగులో నటిస్తాననుకోలేదు. ‘బిజు’ పాటలు యూట్యూబ్‌లోనూ హిట్‌ అయ్యాయి. దాంతో ‘మజ్ను’, ‘ఆక్సిజన్‌’ సినిమాలకు దాదాపు ఒకేసారి పిలుపు వచ్చింది. తర్వాత కొద్ది గ్యాప్‌లో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో అవకాశం వచ్చింది. మొదటి సినిమా విడుదల కాకముందే మూడు సినిమాల్లో ఆఫర్లు... ఎంతమంది కొత్తవాళ్లకి ఇలాంటి అవకాశం వస్తుంది చెప్పండి! నిజం చెప్పాలంటే మొదట హైదరాబాద్‌ రావడానికి భయపడ్డాను. మలయాళీ నటి ఒకరు ఈ విషయంలో నన్ను భయపెట్టారు కూడా. కానీ ఇక్కడి వాతావరణానికి తొందరగానే అలవాటుపడ్డాను. ఇప్పుడు హైదరాబాద్‌ కూడా సొంతూరులానే అనిపిస్తోంది. ఇక్కడ నాకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటారు అందరూ. నిజంగా ఈ విషయంలో అదృష్టవంతురాలినే. ఎందుకంటే నటనలో నేనెలాంటి శిక్షణా తీసుకోలేదు. సినిమా సినిమాకీ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను. కెరీర్‌ ప్రారంభంలోనే భాష తెలియని టాలీవుడ్‌లోకి భయంభయంగా అడుగుపెట్టాను. కానీ దర్శకులూ, తోటి నటులూ సెట్స్‌లో నన్ను ప్రోత్సహిస్తుంటే తొందరగానే నేర్చుకోగలుగుతున్నాను. మజ్నూలో నా కళ్లతోనే సగం భావాల్ని పలికించేలా చేశారు దర్శకుడు విరించి. నా కళ్లు చాలా పెద్దవి. ఎవరికైనా పెద్ద కళ్లు ప్లస్సూ, మైనస్సూ కూడా. ఎందుకంటే కాస్త ఎక్కువ చేసినా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. భావాల్ని సరిగ్గా పలికించకపోతే ప్రేక్షకులు వేరేలా అర్థం చేసుకునే ప్రమాదమూ ఉంది. నేను బయట కూడా ‘మజ్ను’లో కిరణ్మయి టైపు. కొత్తవారితో తొందరగా కలవలేను. ఒకసారి కలిశాక వాళ్లను విడవలేను. ‘మజ్ను’ నిర్మాత గీత, దర్శకుడు విరించి, హీరో నాని... మొదటి రోజునుంచీ నాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. సినిమా షూటింగ్‌ సమయంలో అన్నీ అనుకున్నట్టు జరగవు. ఆ సమయంలో విరించి ఎప్పుడూ కోప్పడటంగానీ, నిరుత్సాహపడటంగానీ చూడలేదు. ఓ దర్శకుడు అలాంటి మంచి లక్షణాలతో ఉండటం గొప్ప విషయం. డైలాగులు నేర్చుకోవడంలో నాకు కష్టమనిపించినపుడు నానీ సాయపడేవాడు. ఎలాంటి డౌట్‌ అడిగినా సరైన సమాధానం అతడి నుంచి వచ్చేది. ఆడుతూ పాడుతూ మజ్ను షూటింగ్‌ పూర్తి చేసుకున్నాం. ఆ సినిమా షూటింగ్‌ పూర్తయినపుడు బాధగా అనిపించింది. ‘మజ్ను’తో నా కెరీర్‌ వేగం పుంజుకుంది. అందులోని కిరణ్మయి పాత్రతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయిపోయారు. మజ్ను విజయంతో పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇతర భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకూ నేను తెలుగులో చేసిన ముగ్గురు (నాని, గోపీచంద్‌, రాజ్‌తరుణ్‌) హీరోలూ మూడు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగినవారు. అయినా ముగ్గురూ సెట్స్‌లో ఎంతో ఓపిగ్గా సహకరించేవారు. నేను సినిమాలకీ, టాలీవుడ్‌కీ కొత్త అన్నది కూడా అందుకు ఓ కారణం కావొచ్చు. హీరోలనే కాదు మొత్తంగా తెలుగువాళ్లది సహకరించే మంచి మనసని అర్థమవుతోంది. ఇక్కడ చాలా మంది స్నేహితులయ్యారు. నాకు ఇంటిపైన బెంగ కలగకుండా కూడా చేశారు. కిట్టు... రొమాన్స్‌, కామెడీ, సస్పెన్స్‌, డ్రామా.... అన్నీ కలగలిసిన సినిమా. రాజ్‌తరుణ్‌కూ, నాకూ పెట్‌ డాగ్స్‌ అంటే ఇష్టం. సినిమా కూడా వాటి చుట్టూ తిరుగుతుంది. తరుణ్‌ దగ్గర 20వరకూ పెట్‌ డాగ్స్‌ ఉన్నాయి. కిట్టూ సినిమాలో వాటిలోని పదింటితో మేం షూట్‌ చేశాం.

కోలీవుడ్‌లో చేస్తున్నా...
తమిళ దర్శకుల్లో మణిరత్నం, గౌతమ్‌ మేనన్‌ సినిమాలంటే బాగా ఇష్టం. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా ‘ధృవ నక్షత్రం’లో నేనూ పనిచేయాల్సింది. కానీ ఈ సంవత్సరం మరో రెండు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో డేట్స్‌ కుదరలేదు. గౌతమ్‌తో త్వరలోనే మరో సినిమాకి పనిచేయాలనుంది. ప్రస్తుతానికి తమిళంలో విశాల్‌తో ‘తుప్పరివాలన్‌’ అనే సినిమా చేస్తున్నాను. కోలీవుడ్‌లో ఇదే నా మొదటి సినిమా. ఆ సినిమా దర్శకుడు మిస్కిన్‌ నన్ను చెన్నై పిలిపించి చీర కట్టులో కొన్ని ఫొటోలు తీసి చూశారు. తర్వాత ‘నువ్వే మా హీరోయిన్‌’ అనేశారు. చాలా సింపుల్‌గా జరిగిపోయిందా ఎంపిక. నేను అమెరికాలో పెరిగినా చాలా తరచుగా కేరళ వస్తుంటా ఇక్కడికి వచ్చినపుడు సంప్రదాయ దుస్తులు ధరిస్తా. అమెరికాలోనూ ప్రత్యేక వేడుకలపుడు, చీరలూ, సల్వార్‌లూ వేసుకుంటాను. కాబట్టి చీరల పరంగా నాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవలేదు.

సినిమాలు మార్చేశాయి...
ప్రస్తుతం సైకాలజీ మేజర్‌లో ఫస్టియర్‌ పూర్తయింది. ఆ కోర్సు సెకండ్‌ ఇయర్‌ చాలా కష్టం. దాంతో కాలేజీకి వెళ్లకుండా విరామం తీసుకున్నాను. ఇప్పుడు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ముందు సినిమాలు చేసి తర్వాత చదువు కొనసాగిస్తా. సైకాలజీ చదవడంవల్ల నిదానం అలవాటైంది. ఓపిక కూడా పెరిగింది. సినిమా రంగంలో ఉన్నవారికి ఇవి చాలా అవసరం. ఇప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్లని కాస్త మెరుగ్గా అర్థం చేసుకుంటున్నాను. అందువల్ల అందరితో సఖ్యంగా ఉండగలుగుతున్నా. సినిమాల్లోకి వచ్చాక వ్యక్తిగతంగానూ నాలో చాలా మార్పు వచ్చింది. నేను నా కంఫర్ట్‌జోన్‌ దాటి బయటకు రావడానికి సినిమా అనుభవం బాగా పనిచేసింది. కొత్త విషయాల్ని నేర్చుకోవడం, కొత్త వ్యక్తులతో పనిచేయడం... ఇలాంటివన్నీ నాలో మార్పుతెచ్చాయి. నేను సున్నిత మనస్కురాలిని. నిజ జీవితంలో ఎవరైనా నన్ను విమర్శిస్తే వెంటనే కోపం వస్తుంది. సినిమా రంగంలో అందరినీ నటనతో సంతృప్తిపరచడం కష్టమే. ఒకే సినిమా కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. ఇక్కడికి వచ్చాక విమర్శల్ని స్వీకరించడం నేర్చుకున్నాను. అసలు సినిమా వాళ్ల జీవితమే బిజీగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవడం, రోజంతా పనిచేయడం, ఎప్పుడు తిరిగి వస్తామో తెలీదు. అయినా, ఈ రంగం నేను ఎంచుకున్నదే కాబట్టి నాకు ఇవేవీ కష్టంగా కనిపించడంలేదు. ఇప్పుడు సినిమాల గురించి చర్చించడమన్నా ఇష్టమే. సినిమా చిత్రీకరణలో సాంకేతిక అంశాలూ, నిర్మాణం, దర్శకత్వం అన్నింటి గురించీ అవగాహన ఉంది. అదే నాకు నటనలో కలిసొస్తోంది.

భవిష్యత్తులో...
నటి నయనతార అంటే బాగా ఇష్టం. ఆమె సినిమాల్ని తప్పకుండా చూస్తుంటాను. సినిమాల విషయంలో నేనూ నయన్‌ బాటలో నడవాలనుకుంటున్నా. ఆమె తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను కొనసాగించిన తీరు బాగుంది. నేనూ అలాగే చేయాలనుకుంటున్నా. నాకు డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏమీ లేదు. ఇప్పుడిప్పుడే సినిమాలు మొదలుపెట్టాను. కొన్నాళ్లపాటు వచ్చిన సినిమాలు చేస్తాను. అయినా నటీమణులు పాత్రల్ని మరీ జాగ్రత్తగా ఎంచుకొని చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. మనకు వచ్చిన వాటినే బాగా చేయాలి. సినిమా జర్నీలో ఇప్పటివరకూ అయితే ఎలాంటి కష్టాలూ ఎదురవలేదు. కానీ ఏ యాక్టర్‌కైనా మంచి స్క్రిప్టులు ఎంచుకోవడం దీర్ఘకాలంలో సవాలే.

ప్రేమ-పెళ్లి
కచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. అంతమాత్రాన ప్రేమించినవాడు అన్నివిధాలా మంచివాడవుతాడని చెప్పలేను. కానీ ఆ వ్యక్తి బలాలూ, బలహీనతల గురించి మనకు ముందే ఒక అవగాహన ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో అబ్బాయి వ్యక్తిత్వంకన్నా మిగతావాటికి అంటే కుటుంబం, ఆస్తిఅంతస్తు లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. నేనైతే ఇప్పుడిప్పుడే కెరీర్‌ నిర్మించుకుంటున్నాను. ప్రస్తుతానికి నాకు ప్రేమ గురించి ఆలోచనలేదు. ప్రేమలో పడ్డాక అవతలవాళ్లకి తగినంత సమయం కేటాయించగలగాలి. అతడితో ప్రతి అంశంలో నిజాయతీగా ఉంటాను. తనూ అలానే ఉండాలనుకుంటాను. తగినంత సమయం ఇవ్వగలిగినపుడే నేను ప్రేమలో పడతాను.


ఇంకొంత...

పెద్ద కళ్లు మైనస్‌ అని చెప్పానుకదా, ఎందుకంటే... నేను అబద్ధం చెప్పినపుడు కనుగుడ్లు పక్కలకు వెళ్లిపోతాయి. అమ్మ వెంటనే పసిగట్టేస్తుంది.
* ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లలో ఉన్నాను. ఎక్కువగా చూసే వెబ్‌సైట్‌ పింట్‌రెస్ట్‌. అక్కడ రకరకాల ఫ్యాషన్లను పరిశీలిస్తాను. ఎప్పుడూ కొత్తగా కనిపించడంలో ఆ వెబ్‌సైట్‌ నాకు సాయపడుతుంది.
* వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజుకు నాలుగైదు విడతల్లో తీసుకుంటా.
* టోరీ కెల్లీ నా అభిమాన గాయని.
* ఖాళీ దొరికితే సినిమాలు చూస్తాను. అవే నాకు నటనలో శిక్షణ తరగతులు. అందుకే వాటిలో నటుల హావభావాల్ని క్షుణ్నంగా పరిశీలిస్తాను.
* కొత్త ప్రదేశాలకు వెళ్తే షాపింగ్‌ చేస్తుంటాను.
* ఏ తరహా డ్రెస్‌ వేసుకున్నా మనం నవ్వుతూ, హుందాగా ఉండాలి. అప్పుడు సహజంగానే అందంగా కనిపిస్తాం.
* అమెరికాలో నాకు నలుగురైదుగురు స్నేహితులు ఉన్నారు. మరీ ఎక్కువ మంది స్నేహితులున్నా కొత్త సమస్యలు రావొచ్చు. అందుకే కొద్ది మందికే పరిమితమవుతా.
* సినిమా షూటింగ్‌లతో ఇంటికి దూరంగా ఉన్నపుడు అమెరికాలో ఉండే అమ్మానాన్నలకు రోజూ ఫోన్‌ చేస్తాను. గంటా, రెండు గంటలు మాట్లాడతాను.
* పుస్తకాలు బాగా చదువుతాను. కానీ సినిమాల్లోకి వచ్చాక స్క్రిప్టులు చదివేసరికే సమయం సరిపోతోంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.