close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిరంజీవి చెప్పాక మారాను...

చిరంజీవి చెప్పాక మారాను...

‘డాన్‌ శీను’, ‘బాడీగార్డ్‌’, ‘బలుపు’లతో... హ్యాట్రిక్‌ హిట్‌లు కొట్టిన డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని. తర్వాత ‘పండగ చేస్కో’తో హీరో రామ్‌కు మంచి హిట్‌ ఇచ్చాడు. తాజాగా ‘విన్నర్‌’తోనూ ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ‘డాన్‌ శీను’కి ముందు ఆ తర్వాత తన ప్రయాణం గురించి ఇలా చెబుతున్నాడు గోపి...

దో తరగతిలో 420 మార్కులు తెచ్చుకున్న నేను ఇంటర్మీడియెట్‌లోనూ ఫస్ట్‌క్లాస్‌లో పాసవుతాననుకున్నారు మావాళ్లంతా. వాళ్ల అంచనాల్ని తలకిందులు చేస్తూ ఒక్క సంస్కృతంలో తప్ప మరే సబ్జెక్టులోనూ పాసవ్వలేదు. సెకండ్‌ ఇయర్‌లోనూ అదే సీన్‌ రిపీటయింది. టెన్త్‌లో నాకు లెక్కల్లో 90 మార్కులు వచ్చాయి. దాంతో ఎంపీసీ గ్రూపులో చేర్పించారు. అసలు విషయమేంటంటే... స్కూల్లో లెక్కల మాస్టారు బాగా చెప్పేవారు. ఆయన దగ్గర మంచిగా ఉండాలని లెక్కలు ఎక్కువ ప్రాక్టీసు చేసి ఆ మార్కులు సంపాదించానంతే. కానీ ఇంటర్మీడియెట్‌ లెక్కలు కష్టంగా ఉండేవి. ఇంటర్‌ నెల్లూరులో మా పిన్ని వాళ్లింట్లో ఉండి చదువుకున్నాను. మా బాబాయి అన్నమనేని శ్రీరామ్‌ అక్కడ ఈనాడు విలేకరిగా పనిచేసేవారు. నేను చదివిన వి.ఆర్‌.కాలేజీ దగ్గర్లో కృష్ణ, కావేరి, కల్యాణి మల్టీప్లెక్స్‌... సహా చాలా థియేటర్లు ఉండేవి. క్లాస్‌ పుస్తకాలకంటే ఆ వాల్‌పోస్టర్లే ఆకర్షించేవి. ఏడాదిలో 250 రోజులు థియేటర్లలోనే ఉండేవాణ్ని. చూసిన సినిమాలే మళ్లీ చూసేవాణ్ని. శంకర్‌ ‘జెంటిల్మన్‌’ని 50-60 సార్లు చూశాను. మావూరు ఒంగోలుకి 20కి.మీ. దూరంలోని బొద్దులూరివారి పాలెం. సినిమాలతో నా అనుబంధం మొదలైంది అక్కడే. పక్క వూరు ‘ఉలిచి’లో శారదా నికేతన్‌ కాన్వెంట్‌లో చదివాను. మా అమ్మమ్మవాళ్లదీ మావూరే. వాళ్లింట్లోనే పెరిగాను. మా తాతయ్య సర్పంచ్‌. అక్కడికి పక్క వూరు నుంచి ఒక వ్యక్తి కలర్‌ టీవీ, వీసీపీ తెచ్చి సినిమాలు వేసేవారు. బయటవాళ్లకి టికెట్‌ రూపాయి. మాకు ఉచితం. లారీ డ్రైవర్‌, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, రౌడీ అల్లుడు, ముఠామేస్త్రి, శివ... లాంటి సినిమాల్ని మా వూళ్లొనే చూశాను. సినిమాలూ, క్రికెట్‌ కోసం స్కూలు ఎగ్గొట్టేవాళ్లం. దెబ్బలు తినేవాళ్లం.

కెమెరా పట్టానిలా...
మా బాబాయికి నెల్లూరు నుంచి వరంగల్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయింది. నన్ను మాత్రం నెల్లూరులో ఉండి ఇంటర్‌ పూర్తిచేసి రమ్మన్నారు. ఖాళీగా ఉంచకూడదని ఓ మెడికల్‌ షాపులో చేర్పించారు. అక్కడ ఆరు వందలు జీతంగా ఇచ్చేవారు. వాటిని సినిమాలు చూడ్డానికే ఖర్చుచేసేవాణ్ని. ఆ తర్వాత ఏడాది కూడా ఇంటర్‌ పూర్తిచేయలేకపోయాను. దాంతో నన్ను వరంగల్‌ తీసుకువెళ్లారు. నా చేతికి కెమెరా ఇస్తే బెటరనుకొని ఒక ఫొటో స్టూడియోలో చేర్పించారు. అక్కడ ఫొటోలతోపాటు, పెళ్లిళ్లకు వీడియోలు ఎక్కువగా తీసేవాణ్ని. తర్వాత ఈటీవీ న్యూస్‌కి ఫ్రీలాన్సర్‌గా పనిచేశాను. మందుపాతర పేలుళ్లు, ఎన్‌కౌంటర్లూ, పెద్ద ప్రమాదాలూ, సినిమా వార్తల్నీ కవర్‌ చేశాను. టీవీలో ‘కెమెరామేన్‌ గోపిచంద్‌’ అని నా పేరు వస్తే చూసి మురిసిపోయేవాణ్ని. తర్వాత ఈటీవీలో ఫుల్‌టైమ్‌ కెమెరామేన్‌గా చేరుదామని ప్రయత్నిస్తే ‘చాలా సన్నగా ఉన్నావు. బరువైన బీటా కెమెరాల్ని మోయలేవు. కాస్త లావయ్యిరా చూద్దాం’ అన్నారక్కడ మేనేజర్‌. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లాలనిపించింది. మాదాల రంగారావు నాకు పెదనాన్న. వాళ్లబ్బాయి మాదాల రవి ఏఏ ఆర్ట్స్‌ మహీంద్రగారి అల్లుడు. రవన్న నాగురించి ఆయనకి చెప్పారు. అప్పటికి ఆ బ్యానర్‌లో శ్రీహరి గారి ‘పోలీసు’ సినిమా ప్రీప్రొడక్షన్‌ దశలో ఉంది. అసిస్టెంట్‌ కెమెరామేన్‌గా చేరమన్నారు. ఆ సినిమా కథా చర్చల్లో పాల్గొని నాకు తోచిన సలహాలు ఇస్తుండేవాణ్ని. నా ఆలోచనలు బావున్నాయని మహీంద్రాగారు నన్ను డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌కి మార్చారు. అలా ఆ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయ్యాను.

శ్రీహరి ప్రోత్సాహం
ఆ సమయంలో శ్రీహరి గారు ‘ఏ వూరు తమ్మి మీది’ అని అడిగితే... విషయం చెప్పాను. ‘బంధుత్వం ఇంతవరకే తీసుకొస్తుంది. ఇక్కణ్నుంచి నువ్వే ముందుకు వెళ్లాలి’ అని చెప్పారు. నేను కూడా ‘ఇదే నా ఆఖరి ఛాన్స్‌ ఎలాగైనా నిరూపించుకోవాల’నుకునేవాణ్ని. ఆ తర్వాత శ్రీహరిగారు సెట్స్‌లోనూ బాగా ప్రోత్సహించేవారు. ఆయనతో దేవా, గణపతి, సాంబయ్య, శివాజీ... ఇలా తొమ్మిది సినిమాలకి పనిచేశాను. ఆ దశలో అసిస్టెంట్‌ నుంచి అసోసియేట్‌ అయ్యాను. డైరెక్టర్‌ ఎవరైనాసరే నన్ను అసోసియేట్‌గా పెట్టేవారాయన. ఏఏ ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఇ.వి.వి.గారు ‘అమ్మో ఒకటో తారీఖు’ తీశారు. అప్పుడు ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది. షాట్‌ కట్‌చేసే విధానం, కామెడీ ట్రాక్‌ నడిపించడం ఆయన్నుంచే తెలుసుకున్నాను. ఆ సమయంలో శ్రీను వైట్లగారి ‘ఆనందం’ రిలీజైంది. ఆ మేకింగ్‌ తీరు నచ్చి ఆయన దగ్గర అసోసియేట్‌గా చేరాను. శ్రీనుగారి దగ్గర ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌లో ‘ఆనందమానందమాయే’, తర్వాత ‘వెంకీ’, ‘అందరివాడు’ సినిమాలకు పనిచేశాను. పనిచేయడమంటే అలా ఇలా కాదు. ఏది చెప్పినా చేసేవాణ్ని. ఎంతటి బాధ్యతైనా తీసుకునేవాణ్ని. ‘అందరివాడు’ ఆఖరి పాట తీస్తున్నపుడు చిరంజీవి గారు నన్ను పిలిచి ‘ఈ సినిమాలో నీకోసం 20-30 టేక్‌లు వన్‌మోర్‌లు చేశాను గోపీ. సెట్‌లో నీ ముఖాన్ని గమనించేవాణ్ని. నచ్చనపుడు ఇలా కాదే అన్నట్టు కనిపించేది. డైరెక్టర్‌ కావాల్సినవాడివి, ఏదైనా నచ్చకపోతే ఆ విషయం డైరెక్టర్‌కైనా ఆర్టిస్ట్‌కైనా చెప్పు. నీలో నువ్వు దాచుకోకు’ అని చెప్పారు. అప్పట్నుంచీ నాకు ఏదైనా అసంతృప్తి ఉంటే వెంటనే తెలియజేసేవాణ్ని. శ్రీనువైట్లతో నాకు మంచి సాన్నిహిత్యం ఉండేది. కానీ ‘ఢీ’ మధ్యలో మాకు చిన్న మిస్‌కమ్యునికేషన్‌ వచ్చి బయటకు వచ్చేశాను. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో చిరంజీవిగారి ఆఫీసు నుంచి ఫోన్‌ వస్తే వెళ్లాను. ‘మురుగదాస్‌తో స్టాలిన్‌ సినిమా తీస్తున్నాం. ఈ సినిమాకి చిరంజీవిగారు, అరవింద్‌గారూ నిన్ను అసోసియేట్‌గా పెట్టమన్నార’ని నిర్మాత ఠాగోర్‌ మధు చెప్పారు. మంచి అవకాశం కాబట్టి సరేనన్నాను. సినిమాపైన మురుగదాస్‌కు ఉన్నంత ప్యాషన్‌ని మరెవరిలోనూ చూడలేదు. అనుకున్నట్టు షాట్‌ రాకపోతే కొన్నిసార్లు కంటతడి పెట్టేవారు. స్టాలిన్‌ తర్వాత మురుగదాస్‌తో హిందీ గజినీకి కొంత సమయం పనిచేశాను. ఆయన స్క్రిప్టుని సిద్ధం చేసుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ మా మధ్య అనుబంధం ఉంది. స్టాలిన్‌ సమయంలో ఛోటాగారు నన్ను బాగా ఉత్సాహపరిచేవారు. గోపీచంద్‌ ‘లక్ష్యం’ సినిమాకి అసోసియేట్‌ అవకాశమిప్పించారు. తర్వాత మెహర్‌ రమేష్‌తో ‘కంత్రీ’కి పనిచేశాను. ఆ సమయంలో దిల్‌రాజు గారు నన్ను ‘జోష్‌’కి అసోసియేట్‌గా చేయమని చేతిలో అడ్వాన్స్‌ పెట్టబోతే... ‘లేదండి డైరెక్టర్‌ అవ్వాలనుకుంటున్నాను’ అని చెప్పా. ‘నీకు డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇస్తాను. కానీ మా బ్యానర్‌లో ఒక సినిమాకి అసోసియేట్‌గా పనిచెయ్యి’ అన్నారు. దాంతో జోష్‌కి చేస్తానని ఆయనకి మాటిచ్చాను.

తన కథ అన్నారు...
అంతలో మెహర్‌ రమేష్‌ ఫోన్‌చేసి ‘బిల్లా రీమేక్‌ చేస్తున్నాను. నువ్వు పూర్తి సమయం కేటాయించాల్సిన పనిలేదు. సెట్‌లో ఉంటే చాలు. మిగతా సమయం నీ స్క్రిప్టు రాసుకో’ అన్నారు. బిల్లా కోసం మలేసియా వెళ్లాను. ప్రభాస్‌కు ఓ కథ వినిపించాలని దిల్‌రాజు అక్కడికి వచ్చారు. నేను దొరికిపోయాను. స్క్రిప్టు రాసుకునే స్వేచ్ఛనిస్తే వచ్చానన్నాను. తర్వాత బృందావనం, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌లకూ అసోసియేట్‌గా పనిచేయమన్నారు కానీ అప్పటికే ‘డాన్‌ శీను’ స్క్రిప్టు సిద్ధంగా ఉండటంతో ఆ సినిమాలకి పనిచేయలేకపోయాను. బిల్లా సమయంలో ప్రభాస్‌కి ‘డాన్‌ శీను’ లైన్‌ చెప్పాను. ఆయన చేద్దామన్నారు కానీ వేరే సినిమా మొదలవడంతో టైమ్‌ దొరకలేదు. ఆ సమయంలో అశ్వినీదత్‌ గారికి మెహర్‌ రమేష్‌ నా దగ్గరున్న కథ గురించి చెప్పి, రవితేజకైతే బాగుంటుందనీ చెప్పారు. దత్తుగారు కథ విని ఇంకా భారీతనం కనిపించాలన్నారు. కొన్నాళ్లు దానిపైన పనిచేశాను. ఆ సమయంలో రవితేజ గారికి కథ వినిపించాలని ప్రయత్నించినా కుదరలేదు. తర్వాత హీరో గోపీచంద్‌ ఫోన్‌ చేశారు. మాకు బంధుత్వమూ ఉంది. బాగోగులు అడిగాక ‘నీ దగ్గర కథ ఉందని విన్నాను నాకు చెబుతావా’ అన్నారు. వెళ్లి వినిపించాను. నచ్చింది చేస్తానన్నారు. దిల్‌రాజు గారికి విషయం చెప్పాను. ఆయన అప్పటికి ‘బృందావనం’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ నిర్మాణ పనుల్లో తీరికలేకుండా ఉన్నారు. అయినా కథ విన్నారు. ‘ఇది రవితేజకి సరిపోయే కథ కదా’ అన్నారు. నేను గోపీచంద్‌ బాడీలాంగ్వేజ్‌కి సరిపడ్డట్టు మార్చుతానని చెప్పాను. దిల్‌రాజు వేరొక బ్యానర్‌మీద ఆ సినిమా తీద్దామన్నారు. గోపీచంద్‌కి అది నచ్చలేదు. ఆ సమయంలో ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ వెంకట్‌గారు ముందుకొచ్చారు. ఆ మధ్యలో రవితేజకు నేను ఎదురైతే ‘నాకోసం కథ రాశావని అందరూ చెబుతున్నారు. నాకు మాత్రం వినిపించవా... అసలు లైన్‌ ఏంటి’ అని అడిగితే. ‘ఓ కుర్రాడు డాన్‌ అవ్వాలనుకుంటాడు’ అని చెప్పాను. ‘మరైతే, అది నా కథ కదా’ అన్నారు. ఎందుకంటే అమితాబ్‌ బచ్చన్‌కి రవి పెద్ద ఫ్యాన్‌. అప్పటికే గోపీచంద్‌ని అనుకున్నాం కదాని రవితేజతో ఎక్కువ చర్చించలేదు. కానీ ఆ సమయంలోనే పూరీగారితో గోపీ ‘గోలీమార్‌’ మొదలుపెడుతున్నట్టు ఆ సినిమా నిర్మాతలు ప్రకటించారు. దాంతో రవితేజాని హీరోగా పెట్టి తీద్దామన్నారు వెంకట్‌. అసలు కథ రాసింది ఆయన కోసమేనని చెప్పాను. వెంటనే రవికి పూర్తి కథ చెప్పడం, అది నచ్చడం, ప్రాజెక్టు పట్టాలకెక్కడం జరిగిపోయింది. ‘వెంకీ’ నుంచి కోనా వెంకట్‌గారితో మంచి ర్యాపో ఉంది నాకు. గోపీమోహన్‌, శ్రీనువైట్ల, కోనా, నేను బృందంగా చాలా సినిమాలకు కథాపరమైన పనులు చేశాం. కోనాగారు డాన్‌ శీనుకి మాటలు రాశారు. 2010లో వచ్చిన డాన్‌ శీను మంచి హిట్‌ అయింది. తర్వాత ‘బాడీగార్డ్‌’ రీమేక్‌కి వెంకటేష్‌గారు పిలిచారు. ‘బలుపు’ కథ బేసిక్‌ లైన్‌ దర్శకుడు బాబీది. దాన్ని రవితేజకి చెబితే చేద్దామన్నారు. దాన్ని ఇంకా డెవలప్‌ చేశాను. ‘బలుపు’ హిట్‌. ఆ సినిమా తర్వాత దిల్‌రాజు పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ పంపారు. కానీ ఏవో కారణాలవల్ల సినిమా చేయలేకపోయాం. తర్వాత ‘పండగచేస్కో’, తాజాగా ‘విన్నర్‌’ చేశాను. దిల్‌రాజు గారితో మొదట్నుంచీ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. నా తర్వాత సినిమా మాత్రం ఆయనతోనే ఉంటుంది.

ఇప్పటివరకూ కమర్షియల్‌ సినిమాలే చేస్తూ వచ్చాను. నాకు ప్రేమకథలంటే ఇష్టం. కానీ కమర్షియల్‌ సినిమాలైతేనే కెరీర్‌ బాగుంటుందని మిత్రులు చెప్పేవారు. నా తర్వాత సినిమాలో వినోదంతోపాటు సందేశం ఉండేలా తీయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆ కథకి మెరుగులు దిద్దుతున్నాను.

పెద్దమ్మగుళ్లొ చూశా...

నాన్న వేంకటేశ్వర్లు, అమ్మ ఇందిరాదేవి. అన్నయ్య శ్రీనివాస్‌ ఒంగోలులో ఉంటాడు.
* చాలామంది నన్ను రవితేజ తమ్ముడనుకుంటారు. చదువుకునే రోజుల్లో నాలానే ఉండేవాణ్నని ఆయనకూడా చెబుతారు.
* మార్చి 13న నా పుట్టినరోజు. స్టాలిన్‌ సమయంలో చిరంజీవిగారు నాకు పుట్టినరోజు కానుకగా వాచీ ఇచ్చారు. చాలాకొద్దిమందికి ఆయనలా వాచీలిచ్చారు.
* ‘బలుపు’ సమయంలోనే నాకు పెళ్లి అయింది. మా ఆవిడ శ్రీసత్య. బీబీఎమ్‌ చదివింది. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుళ్లొ చూశాను. వివరాలు కనుక్కుంటే ఏలూరని తెలిసింది. తెలిసిన వాళ్లద్వారా సంబంధం మాట్లాడించాం. ముందు సినిమా వాళ్లకి ఇవ్వమన్నారు. మెల్లగా ఒప్పించాం. 2013 ప్రేమికుల రోజునే మా పెళ్లి జరిగింది. మాకో బాబు సాత్విక్‌.
* ఖాళీ దొరికితే క్రికెట్‌ ఆడతాను. వూళ్లొ మాది లుంగీ బ్యాచ్‌. ప్రతి వేసవికీ వూరు వెళ్తాను. అప్పుడు తాటి కాయలు తిని గుండ్లకమ్మ వాగులో ఈతకొట్టడం తప్పనిసరి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.