close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందరిలాంటి సీఎం కాదు!

అందరిలాంటి సీఎం కాదు!

  రాజకీయం రంగు మారింది... తెల్లటోపీలూ ఖద్దరు చొక్కాలూ వెలాతెలా పోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు చోట్ల కమలదళం వికసించింది. కాషాయం కాంతులీనింది. పాలనా పగ్గాలు చేపట్టిన కమలనాథుల్లో వారం తిరగకుండానే ‘ఒకే ఒక్కడు’గా వెలిగిపోతున్నారు యోగి ఆదిత్యనాథ్‌.

త్తర్‌ ప్రదేశ్‌... నాలుగు తెలంగాణల పెట్టు. దేశ చట్టసభకు ఏకంగా ఎనభై మంది సభ్యుల్ని పంపుతున్న రాష్ట్రం. అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్నారు. యాంటీరోమియో స్క్వాడ్‌తో ఆకతాయిల వేధింపుల బాధ తప్పిందని అమ్మాయిలు ఆనందిస్తున్నారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై నిరుద్యోగ యువత ఆవేదన ఆయన దృష్టికి వచ్చింది. ఆ పరీక్ష ఫలితాలు నిలిపివేయాలన్న సీఎం నిర్ణయంతో నిరుద్యోగులు సంతోషించారు. అధికారుల అలసత్వానికి అవినీతి తోడవడంతో అనుమతులేవీ లేకుండా అడ్డదిడ్డంగా అవతరించిన కబేళాల కథ కంచికి చేరింది. సీఎం ఫోన్‌ అందుకున్న ఓ ఎమ్మెల్యే చీపురు పట్టాల్సి వచ్చింది. సీఎం ఎప్పుడు ఏ కార్యాలయానికి వస్తారోనన్న భయం అందరినీ నిజంగా ‘పనిచేసేలా’ చేస్తోంది... మొత్తం దేశానికి ఇప్పుడు యూపీ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అయింది... ఈ పరిణామాల వెనుక... ఒక వ్యక్తి జీవితాశయం ఉంది. నిర్దిష్టమైన లక్ష్యం... సాధన దిశగా క్రమశిక్షణతో సాగిన జీవితం ఉంది.

పల్లె... పాంచూర్‌
నేటి ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతం పౌరీ గార్వాల్‌ జిల్లాలో ఓ మారుమూల పల్లె పాంచూర్‌. అక్కడ ఫారెస్ట్‌ రేంజర్‌గా పనిచేసిన ఆనంద్‌సింగ్‌ బిష్త్‌, సావిత్రి దంపతుల ఇంట జన్మించారు అజయ్‌సింగ్‌. గణితంలో డిగ్రీ పట్టా పొందిన కుమారుడిలో మొదటినుంచీ నాయకత్వ లక్షణాలను చూశారు ఆ తండ్రి. ‘నువ్వు ఇంటి నాలుగు గోడల మధ్య జీవిస్తున్నావు. నీ బిడ్డల కోసమే పాటుపడుతున్నావు... నేనలా కాదు, సమాజంకోసం పాటుపడతాను చూడు...’ అంటూ కుమారుడు సవాలు విసిరితే ఆనందంగా స్వీకరించారు ఆ తండ్రి. డిగ్రీ చదివేటప్పుడే తోటివారికి ట్యూషన్లు చెప్పిన అజయ్‌ సింగ్‌కి అప్పటినుంచే సమాజంలో జరిగే సంఘటనలపై తన ఆలోచనలనూ అభిప్రాయాలనూ నిర్భయంగా ఇతరులతో పంచుకోవడం అలవడింది. రామమందిర నిర్మాణోద్యమంలో చురుగ్గా తిరుగుతూ పీజీలో చేరే ప్రయత్నాల్లో ఉన్న అజయ్‌సింగ్‌పై గోరఖ్‌నాథ్‌ మఠాధిపతి అవైద్యనాథ్‌ దృష్టిపడింది. ఆ యువకుడిలో ఆయన తన భవిష్యత్‌ వారసుడిని చూశారు. తండ్రి అనుమతితో అజయ్‌సింగ్‌ని మఠంలో చేర్చుకున్నారు. 22 ఏళ్ల అజయ్‌సింగ్‌ బిష్త్‌ - మహంత్‌ అవైద్యనాథ్‌ వారసుడు ఆదిత్యనాథ్‌గా కాషాయ జీవితం ప్రారంభించారు. గోరఖ్‌నాథ్‌ మఠాధిపతులు తొలి నుంచీ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. అవైద్యనాథ్‌ కూడా పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. దాంతో ఆదిత్యనాథ్‌ భావి జీవితానికి చక్కని బాట పడింది. ఓవైపు సాధుజీవనం, గో సేవ. మరోవైపు మహామహుల జీవిత చరిత్రల పఠనం, గురువు అవైద్యనాథ్‌ రాజకీయ, ధార్మిక బోధనలు. వాటిని ఔపోసన పడుతుండగానే స్థానికంగా కులాల మధ్య జరిగిన ఘర్షణలు ఆయనలోని నాయకుడికి పని కల్పించాయి. కొన్నాళ్లకే ఆదిత్యనాథ్‌కి అనుచరగణం తయారైంది. భాజపా తరఫున 26 ఏళ్ల వయసులో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. విజయం సాధించి 12వ లోక్‌సభలో పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. ఇక వెనుదిరిగి చూసే అవసరం రాలేదు. ఎంపీగా ఆదిత్యనాథ్‌ పార్లమెంటు సమావేశాల్లో, సభలో జరిగే చర్చల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుత లోక్‌సభలో గోవధ నిషేధం లాంటి మూడు ప్రైవేటు బిల్లులను ఆయన ప్రవేశపెట్టారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు దిల్లీలో, సమావేశాలు లేనప్పుడు గోరఖ్‌పూర్‌ మఠంలో ఉండేవారాయన.

మఠం నుంచి సామాజిక మాధ్యమాలకు...
మఠంలో రోజూ ఉదయం, సాయంత్రం ప్రజాదర్బారు నిర్వహించి నియోజక వర్గ ప్రజల సమస్యలను వినేవారు ఆదిత్యనాథ్‌. అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు ఫోన్లు చేసేవారు. లేఖలు రాసేవారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని వారికి ఆయనపై ఎనలేని అభిమానం. కులమత పట్టింపులు లేకుండా అందరూ నిస్సంకోచంగా తమ సమస్యలను ఆయనకు చెప్పుకొనేవారు. 2014 సాధారణ ఎన్నికల్లో తీవ్రంగా కృషిచేసి పార్టీకి అత్యధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాలు సంపాదించిపెట్టిన ఆదిత్యనాథ్‌ను కేంద్ర మంత్రిని చేస్తారని అందరూ భావించారు. మఠానికి సంబంధించిన కొందరు ప్రముఖులు ప్రధానిని కలిసి ఈ ప్రస్తావన తెచ్చారు కూడా. అయితే రాష్ట్రానికే సేవ చేయాలన్న ఆదిత్యనాథ్‌ అభిమతమే నాడు ఆయన్ని కేంద్ర మంత్రి పదవిని కాదనేలా చేసిందంటారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన ఆదిత్యనాథ్‌ ప్రజలను ఆకట్టుకోవడంలో ప్రధాని మోదీ తర్వాత స్థానాన్ని పొందారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకి అండదండగా నిలిచి యూపీని భాజపా పాలిత రాష్ట్రాల ఖాతాలో చేర్చడంలో సఫలీకృతులయ్యారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొత్తం రాష్ట్ర వాసుల విన్నపాలు వినడానికి ఆయన సిద్ధమయ్యారు. తన పేరున ఉన్న వెబ్‌సైట్‌, ట్విటర్‌, ఇతరత్రా సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని పిలుపిచ్చారు.

పార్టీలో ఉంటూనే తనదైన ప్రత్యేకతను కాపాడుకున్నారు ఆదిత్యనాథ్‌. 2002లో ‘హిందూ యువ వాహిని’ సంస్థను ప్రారంభించి హిందుత్వ ప్రచారానికి పూనుకున్నారు. లవ్‌ జిహాద్‌, ఘర్‌వాపసీ లాంటి కార్యక్రమాలు, తూటాల్లాంటి మాటలు... ఆయనకు ఫైర్‌బ్రాండ్‌, వివాదాస్పద నేత, హిందుత్వవాది అన్న ముద్ర వేశాయి. కానీ ప్రజాభిమానం ముందు అవేవీ పనిచేయలేదు. గోరఖ్‌పూర్‌ ఘర్షణల్లో జైలుకు సైతం వెళ్లి వచ్చారాయన. మూడేళ్ల క్రితం మహంత్‌ అవైద్యనాథ్‌ మృతితో గోరఖ్‌నాథ్‌ మఠాధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్‌లో ఇప్పుడు రాష్ట్రాన్నే సంస్కరించగల నాయకుడిని చూస్తున్నారు ఉత్తరప్రదేశ్‌ ప్రజలు.

వారికి గ్రీన్‌ సెయింట్‌...
నలభైనాలుగేళ్ల ఆదిత్యనాథ్‌కి గోరక్షకుడిగా, జంతుప్రేమికుడిగా పేరుంది. సువిశాలమైన గోరఖ్‌నాథ్‌ మఠం ఆధ్వర్యంలో పలు దేవాలయాలున్నాయి. అక్కడి గోసంరక్షణ కేంద్రంలో వందలాది ఆవులు ఉంటాయి. మఠంలో ఉంటే ఆదిత్యనాథ్‌ ఉదయం మూడు గంటలకే నిద్రలేస్తారు. యోగా, ధ్యానం అనంతరం గోశాలకు వెళ్లి ఆవులకు మేత వేస్తారు. ఆ తర్వాతే తాను అల్పాహారం తీసుకుంటారు. ఓ కుక్క, ఓ పిల్లి, జింక, కొన్ని కోతులు కూడా యోగి సంరక్షణలో ఉన్నాయి. రోజంతా రాజకీయ సమావేశాలతో బిజీగా గడిపే యోగి రాత్రి కాసేపు తన పెంపుడుకుక్క కల్లూతో ఆడుకుని సేదతీరుతారు. ఆ మధ్య ఓ పులి పిల్లకు సీసాతో పాలు పడుతున్న ఆదిత్యనాథ్‌ ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది. తప్పిపోయి తులసీపూర్‌ ఆశ్రమం పరిసరాల్లో తిరుగుతున్న పులి పిల్లను ఆశ్రమవాసులు చేరదీయగా అక్కడికి వెళ్లినప్పుడల్లా యోగి దానితో ఆడుకునేవారు. సీసాతో పాలు పట్టేవారు. కొన్నాళ్ల తర్వాత దాన్ని అటవీ శాఖకు అప్పజెప్పారు. గోరఖ్‌నాథ్‌ మఠం ఆధ్వర్యంలో పలు చోట్ల ఆశ్రమాలున్నాయి. వాటి చుట్టుపక్కల ప్రాంతాల గిరిజనులతో యోగికి సాన్నిహిత్యం ఎక్కువ. జంతువులను వేటాడవద్దని వారికి చెప్తారు. పండ్ల మొక్కలనూ ఔషధ మొక్కలనూ నాటడం ఆయనకిష్టమైన పని. అందుకే అభిమానులు ఆయనను ‘గ్రీన్‌ సెయింట్‌’ అంటారు.

బొప్పాయి... పెరుగు
ఆదిత్యనాథ్‌ పూర్తి సాత్వికాహారం తీసుకుంటారు. ఉడికించిన పప్పులు, బొప్పాయి, ఆపిల్‌, పెరుగు.. ఆయన ఉదయం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థాలు. మధ్యాహ్నమూ రాత్రీ కూడా రెండేసి చపాతీలూ కూరలే ఆయన భోజనం. రాత్రిళ్లు ఒకోసారి చపాతీలు కూడా మానేసి ఓ ఆపిల్‌తోనే సరిపెట్టుకుంటారు. అనుచరులందరికీ యోగి ఆహారపుటలవాట్లు తెలుసు. అందుకే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అనుచరుల ఇళ్లలో వారితో కలిసి ఆయన భోజనం చేస్తుంటారు. ఎన్నికల ప్రచారానికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కువగా నీరు, మజ్జిగ తాగుతూ ఒకటో, రెండో అరటి పళ్లు తిని పనిలో పడిపోయేవారట.

ఆయనకు ఆరుగురు తోబుట్టువులున్నారు. రెండు దశాబ్దాలుగా సోదరుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా వారు మాత్రం ఆ హడావుడికి దూరంగా నిరాడంబర జీవితం గడుపుతున్నారు. గడ్డి కోయడానికి పొలం వెళ్లిన శశి తన సోదరుడు ముఖ్యమంత్రి అయిన వార్త ఫోనులో విన్నారు. పని వదిలేసి పరుగున ఇల్లు చేరారు. అందరికీ మిఠాయిలు పంచారు. టీవీ ముందు కూర్చుని వార్తలు వింటూ ఆనందించామనీ ఆరోజు వంట చేసుకోవడమే మరిచిపోయామనీ బంధువులు చెప్పారు. ఆదిత్యనాథ్‌ మఠానికి వెళ్లిపోయినా తరచూ సొంతూరు వెళ్లివచ్చేవారు. ఆ వూళ్లొ ఓ పాఠశాల కూడా ఆయన కట్టించారు. తల్లి సావిత్రి అంటే ఆయనకు చాలా ప్రేమ. తరచూ ఆమెకు ఫోన్‌ చేసి క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. ఆమె దిల్లీ వస్తే సాధ్యమైనంత ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవారు. తమ కుమారుడిది గొప్ప మనసే కానీ గొప్ప మనిషి కాదనీ అందరిలాంటి వాడేననీ అంటారు ఆ తల్లిదండ్రులు. రాజకీయంగా ఎదుగుతున్న యోగి తమ వూరివాడేనని గుర్తుచేసుకుని గర్విస్తుంటామనీ టీవీల్లో ఆయన ప్రసంగాలు విని ఆనందిస్తామనీ వూరి వాళ్లు తెలిపారు.

వ్యతిరేకత కాదు... అభిమానం
ఉద్వేగ భరిత ప్రసంగాలతో హిందుత్వవాదిగా పేరొందిన ఆదిత్యనాథ్‌కి పలువురు ముస్లిం అనుచరులూ ఉన్నారు. ఆయన హిందుత్వవాది అయితే కావచ్చునేమో కానీ ముస్లిం వ్యతిరేకి మాత్రం కాదని వారు పేర్కొంటారు. గోరఖ్‌నాథ్‌ మఠంలో మందిరాల నిర్మాణ పనుల పర్యవేక్షణా, భూములు, డబ్బుల లెక్కలూ అన్నీ చూసేది యాసిన్‌ అన్సారీ. గోరఖ్‌నాథ్‌ దేవాలయ తొలి ఇంజినీరు నిసార్‌ అహ్మద్‌. అక్కడున్న వందలాది ఆవుల సంరక్షణ బాధ్యత మాన్‌ మహమ్మద్‌ది. నిరుపేద కుటుంబానికి చెందిన మహమ్మద్‌ మఠంలోనే భోజనం చేస్తాడు. అక్కడే ఉంటాడు. వేళకు నమాజ్‌ చేసుకుంటాడు. గోశాలలో తన పనితీరు ఛోటే మహరాజ్‌కి(ఆదిత్యనాథ్‌) బాగా నచ్చుతుందనీ ఆయనకి ఇష్టమైన నందిని అనే ఆవుని తాను చాలా ప్రేమగా చూసుకుంటాననీ మహమ్మద్‌ చెప్తాడు. మఠంలోని దేవాలయాల వద్ద పలు దుకాణాలు నిర్వహిస్తున్నది కూడా ముస్లింలే. ఒకప్పుడు మఠానికి సంబంధించిన వంటగదిలో కూడా ముస్లిం వనితలు బాధ్యతలు నిర్వహించేవారు. మఠంలో తమ మధ్య హిందూ ముస్లిం అన్న భేదభావాలేమీ ఉండవనీ అక్కడ అందరూ సమానమేననీ వారు చెప్తారు. తమ కుటుంబాల్లో జరిగే వేడుకలకు యోగి హాజరవడం వారికి ఆనందం కలిగించే సంఘటన. దిల్లీలో యోగి నివసించే ఫ్లాట్‌లో కూడా ఒక ముస్లిం యువకుడే సహాయకుడిగా ఉంటున్నాడు. మఠంలో ఆదిత్యనాథ్‌ నివసించే గదిలో టీవీ ఉండదు. ఆయన అన్ని వార్తాపత్రికలనూ చదివేవారట. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలువురు ప్రముఖుల జీవిత చరిత్రల పుస్తకాలు గదిలోని అల్మారా నిండా ఉంటాయి. వాటన్నిటినీ శుభ్రంగా అమర్చడం కూడా తన బాధ్యతేననీ మఠంలోని అన్ని ప్రాంతాలకూ వెళ్తాననీ మతం తనకెప్పుడూ అవరోధం కాలేదనీ అంటాడు మహమ్మద్‌. తమ మహరాజ్‌ ‘మతానికి కాదు జనాభిమతానికి విలువిస్తార’ని మఠంలోని వారు గర్వంగా చెప్తారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.