close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇలాంటివారు.. కోటికి ఒకరు...!

ఇలాంటివారు.. కోటికి ఒకరు...!

పొద్దున్నే లేచి పని ముగించుకుని ఆమె ఆఫీసుకెళ్తుంది. ఆమెతో పాటూ ఆయనా టిఫిన్‌ బాక్సు పట్టుకుని తయారైపోతారు. ఆమెకొకటే ఆఫీసు. ఆయనకు చాలా.. ఎక్కే గడపా, దిగే గడపా..! వెళ్లిన ప్రతిచోటా తాను చేస్తున్న పనిగురించి చెప్పడం, సాయం అడగడం. కొందరు చేస్తారు, కొందరు మళ్లీ చూద్దామంటారు, మరికొందరు ‘సేవా... ఈరోజుల్లో ఇదో ఫేషనైపోయింద’ని ముఖం మీదే అనేస్తారు. ఎవరెలా స్పందించినా ఆయన చిన్నబుచ్చుకోరు. మరో కార్యాలయం లేదా మరో ఇంటికి... వెళ్తారు. ప్రేమగా పలకరిస్తారు. ఉత్సాహంగా మళ్లీ మొదటినుంచి చెప్పుకొస్తారు...

దిహేనేళ్లుగా ఆయనకిది అలవాటైపోయింది. ఆర్టీసీ బస్సూ లేదంటే ఎవరో ఇచ్చిన ద్విచక్రవాహనం. ఆటోలకు ఖర్చుపెట్టరు. రాత్రి దాకా తిరుగుతారు. ఇంటికి రాగానే ఎవరెవరిని కలిసిందీ, ఎంత డబ్బు సమకూరిందీ లెక్క రాస్తారు. అందరిలా ఉద్యోగం చేసుకుని భార్యాబిడ్డలతో సంసారం చూసుకోక నడివయసులో ఎందుకొచ్చిన తిప్పలివి అంటే...ఆయన నవ్వేస్తారు. ఆ నవ్వు వెనక ఎందరి విషాద గాథలో విన్న ఆవేదన విన్పిస్తుంది. ఎందరో అనాథలకు ఆత్మబంధువైన తృప్తి కన్పిస్తుంది. అవును మరి, ఒకరా ఇద్దరా... ఏకంగా 250 మంది పిల్లల్ని పెంచి విద్యాబుద్ధులు నేర్పడమంటే మాటలా? దానికి తోడు పాతిక మంది సిబ్బందికి జీతాలూ ఇవ్వాలి. ఆయనెవరంటే... క్రిష్‌ ‘గమ్యం’ సినిమా గుర్తుందా? అందులో గిరిబాబు పాత్రే నిజజీవితంలో పోపూరి పూర్ణచంద్రరావు.

గత పదిహేనేళ్లలో ఆయన దాదాపు 80 వేల మందిని కలిశారు. పదికోట్ల రూపాయలకు పైగానే విరాళాలు సేకరించారు. తానున్నా లేకున్నా సంస్థ ఎలాంటి అవరోధాలూ లేకుండా కొనసాగాలన్న ఉద్దేశంతో సొంత భవనంతో సహా కోటి రూపాయల కార్పస్‌ ఫండ్‌ ఏర్పరిచారు. కానీ ఆయనకు మాత్రం... సొంత ఇల్లు లేదు. రూపాయి జీతం తీసుకోరు. రెండు గదుల అద్దె ఇంట్లో ఉంటూ తన పిల్లల్ని దాతల సహాయంతో చదివిస్తున్నారు. ఈ నిస్వార్థ, నిరాడంబర వ్యక్తి ఎంతో మొహమాటపడుతూ ఈనాడు ఆదివారానికి తానెంచుకున్న జీవనమార్గాన్ని వివరించారు.

విద్యార్థి సంఘ నేతగా...
పోపూరి పూర్ణచంద్రరావుది ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని బొల్లాపల్లి అనే చిన్న గ్రామం. నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన బిడ్డను వ్యవసాయ కూలీగా పనిచేస్తూ చదివించుకుంది తల్లి. తల్లి కష్టాన్ని చూస్తూ పెరగడం, విద్యార్థి సంఘాల్లో తిరగడంతో జీవితం పట్ల చిన్నవయసులోనే ఆయనకో అవగాహన ఏర్పడింది. ఎదిగే వయసులో కళాశాలలో జరిగిన ఓ సంఘటన ఆయనకు దిశానిర్దేశం చేసింది. ఆయన డిగ్రీ చదువుతుండగా కరవు జిల్లాల కళాశాలల్లో విద్యార్థులు కట్టిన ఫీజులు వెనక్కిచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విషయం పత్రికల్లో చూశారాయన. వాళ్ల కాలేజీ యాజమాన్యం డబ్బు తిరిగివ్వలేదు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడిగా ఉన్న పూర్ణచంద్రరావు కొందరు విద్యార్థుల్ని వెంటపెట్టుకెళ్లి జిల్లా కలెక్టరుని కలిశారు. పరిస్థితి వివరించి జీవో కాపీ తీసుకున్నారు. దాన్ని యాజమాన్యానికి చూపించి ప్రశ్నించారు. యాజమాన్యం దిగివచ్చి డబ్బు తిరిగిచ్చింది. వందలాది విద్యార్థులకు తోడ్పడిన ఆ సంఘటన ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సాయం చేయడంలోని సంతృప్తిని అనుభవంలోకి తెచ్చింది.

డిగ్రీ అవగానే ఉద్యోగం కోసం ఆయన హైదరాబాదు చేరారు. ప్రైవేటు కంపెనీల్లో చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. ఒకసారి పనిచేస్తున్న చోట కంటికి దెబ్బ తగిలి ఓ కన్ను చూపు పోయింది. కానీ యాజమాన్యం ఏమాత్రం స్పందించలేదు. ఏడేళ్లు తిరిగేసరికి గానుగెద్దు జీవితం మీద విరక్తిపుట్టింది. అప్పటికే రైల్వే స్టేషన్లలో అనాథలుగా తిరిగే పిల్లలకోసం ఏమన్నా చేయాలన్న ఆలోచన ఉండేది. పలువురితో ఆ అంశం గురించి చర్చించేవారు. ఆయన ఏం చేసినా తాము అండగా ఉంటామంటూ కొంతమంది హామీ ఇచ్చారు. కొన్నాళ్లు పిల్లల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థకీ సేవలందించారు. ‘అక్కడ సిబ్బంది ఎక్కువ జీతాలు తీసుకునేవారు. విమానాల్లో తిరిగేవారు. అదంతా చూస్తుంటే నాకెందుకో తప్పు చేస్తున్నారనిపించేది. ఆ డబ్బుతో ఇంకొందర్ని చదివించొచ్చు కదా. దాతలు మంచి మనసుతో ఇస్తారు. ఆ డబ్బు నయాపైసలతో సహా సద్వినియోగమైనప్పుడే వారికి తృప్తి. ఆ ఆలోచనతోనే సంస్థను ప్రారంభించా’ అంటూ ‘నైస్‌’ ప్రారంభ రోజుల్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

‘నైస్‌’ అంటే...
‘నీడీ ఇల్లిటరేట్‌ చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌’ - పొడి అక్షరాల్లో నైస్‌ అయింది. అనాథ పిల్లలకు వసతి, భోజన, విద్యాసౌకర్యాలు కల్పిస్తుందీ సంస్థ. 2002లో పదిమంది పిల్లలతో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఇప్పుడు 250 మంది పిల్లలున్నారు. వారిలో అరవై మంది ఆడపిల్లలు. సీబీఎస్‌ఈ విధానంలో నడుస్తున్న ఈ పాఠశాల గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని మైనంపాడు గ్రామంలో ఉంది. రిషీవ్యాలీతో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా ఉన్న పలు పాఠశాలలను సందర్శించిన పూర్ణచంద్రరావు అన్ని చోట్లా అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి వాటిలో మంచివి అనుకున్న పద్ధతులను ఎంచుకుని తమ పాఠశాలలో ఆచరిస్తున్నారు. పాఠశాల, వసతి గృహం నిర్వహణకు అంకితభావంతో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. వారంతా పాఠశాల ప్రారంభించినప్పటినుంచీ ఇక్కడే పనిచేస్తున్నారు. ఏ అవసరానికీ ఎక్కడా రూపాయి అప్పు చేసే పరిస్థితి రాకుండా ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి ఓ వాహనాన్ని కూడా సంస్థ వద్ద ఉంచారు. పాఠశాల, వసతి గృహాల నిర్వహణకు నెలకు తొమ్మిది లక్షల రూపాయలవరకూ ఖర్చవుతుంది. ఆ డబ్బు సేకరించడం పూర్ణచంద్రరావు బాధ్యత. అందుకే ఆయన నిరంతర అన్వేషిలా భుజానికి ఓ సంచీ తగిలించుకుని దాతల కోసం వెదుకుతూ ఉంటారు. ఓ స్నేహితుడి పెళ్లిలో దర్శకుడు క్రిష్‌తో ఆయనకు పరిచయమైంది. అప్పటినుంచీ క్రిష్‌ క్రమం తప్పకుండా సంస్థకు సాయం అందిస్తున్నారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ప్రాంతంలో ఓ చిన్న రెండు గదుల పోర్షనే పదిహేనేళ్లుగా పూర్ణచంద్రరావు నివాసం. తల్లి, భార్య, ఇద్దరు బిడ్డలతో ఆయన నివసించే అద్దె ఇంట్లో కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండవు. ఆయన పని చేసుకునే బల్ల, పుస్తకాలే ఓ గదిలో సగాన్ని ఆక్రమిస్తాయి. ‘మా ఇంటికి బంధువులెవరూ రారు. వస్తే పడుకోడానికి కూడా చోటుండదని’ అంటారాయన నవ్వుతూ. నిరుపేద కుటుంబానికి చెందిన జయలక్ష్మిని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న పూర్ణచంద్రరావుకు ఇద్దరు అబ్బాయిలు. జయలక్ష్మి ఉద్యోగంలో చేరడంతో తాను ఉద్యోగం మానేసి పూర్తి సమయం స్వచ్ఛంద సేవకే కేటాయించాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయానికి తల్లీ భార్యా పిల్లలూ మద్దతివ్వడం విశేషం. ఆయన మంచితనం చూసి దాతలే పిల్లల చదువుకు కూడా సాయం చేస్తున్నారు. పదో తరగతివరకూ ఒక స్కూలు ఉచితంగా చదువు చెప్పింది. ఆ తర్వాత తక్కువ ఫీజుంటుందని పెద్దబ్బాయిని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలలో ప్లస్‌టూ చదివించారు. రామకృష్ణా మఠం వారి కళాశాలలో ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. చిన్నబ్బాయి ఇంటర్‌ పూర్తి చేసి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.

సొంత స్థలం అమ్మి...
పూర్ణచంద్రరావు సొంతూళ్లొ వారికి చిన్న ఇల్లుండేది. అది అమ్మగా వచ్చిన డబ్బుతో స్కూలు కోసం స్థలం కొన్నారు. సంస్థ పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయించారు. విరాళాలతో మరింత స్థలం కొని సొంతభవనమూ నిర్మించారు. ‘హైదరాబాద్‌లో అయితే కార్పొరేట్‌ ఆఫీసులుంటాయి. సాఫ్ట్‌వేర్‌, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారని నేనిక్కడే ఉండి విరాళాలకోసం తిరుగుతూంటాను. దాతల నుంచి తీసుకున్న ప్రతి రూపాయికీ రసీదు ఇస్తాను. వార్షిక నివేదికలో రాస్తాను. ఏటా ఆడిటింగ్‌ చేయిస్తాను. దాతల డబ్బుతో సమకూర్చిన ఆస్తులన్నీ సంస్థ పేరునే ఉన్నాయి తప్ప నా పేరున ఏదీ లేదు. కార్యాలయ నిర్వహణ ఖర్చు లేకుండా నా ఇంటినుంచే పనిచేస్తాను. స్వచ్ఛంద సంస్థ అనగానే వచ్చే అపవాదులేవీ లేకుండా పారదర్శకంగా సంస్థను నిర్వహించడం నా ఆశయం...’ అని చెబుతారు పూర్ణచంద్రరావు.

ఎవరికి ప్రాధాన్యం?
వివిధ కారణాల వల్ల తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన అనాథ పిల్లలను గ్రామ, మండల స్థాయి అధికారుల సిఫార్సుతో ఈ సంస్థలో చేర్చుకుంటున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయి దుర్భర పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. తమ దృష్టికి వచ్చిన పిల్లల గురించి ఎవరైనా ఆయనకు సమాచారం ఇవ్వచ్చు. పదేళ్లకు అటూ ఇటూగా ఉంటే చేర్పించుకుంటారు. అంతకన్నా చిన్నపిల్లలైతే సంరక్షణభారం మరింత పెరుగుతుందనీ అందుకే తమ పనులు తాము చేసుకోవడం వచ్చిన పిల్లల్ని చేర్చుకుంటామనీ చెబుతారు పూర్ణచంద్రరావు. ముందుగా అందరినీ మల్టిగ్రేడ్‌, మల్టిలెవెల్‌ తరహా తరగతిలో కూర్చోబెట్టి ఓ ఏడాది పాటు ఆంగ్లం, లెక్కలు, సైన్సు నేర్పిస్తారు. పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని బట్టి పై తరగతులకు పంపుతారు. పదో తరగతి తర్వాత మొదట కొందరిని ఐటీఐ చేయించి ఉద్యోగాల్లో పెట్టారు. అయితే సృజనకు అవకాశం లేని ఆ ఉద్యోగాల్లో పిల్లలు ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోవడం ఆయనకు నచ్చలేదు. అందుకని పీజీ వరకూ చదివించాలని నిర్ణయించుకున్నారు. స్కూల్లో చదువుతున్నవారు కాకుండా ప్రస్తుతం ఎంటెక్‌, ఎంసీఏ, ఎంఎస్‌సీ, డెయిరీ సైన్స్‌, ఎంబీఏ, బీఎస్‌సీ చదువుతున్న వాళ్లు 20 మంది దాకా ఉన్నారు. మరో 16 మంది ఇంటర్‌లో ఉన్నారు. చదువు పూర్తై ఉద్యోగంలో స్థిరపడేవరకూ వారి బాధ్యత సంస్థదే. ఏటా మే 6న ఆలుమ్ని దినోత్సవం నిర్వహిస్తారు. ఆరోజు అందరూ కలుసుకుని సరదాగా గడుపుతారు.

చదువొక్కటే కాదు
తమదంటూ ఒక కుటుంబం, తమవారంటూ బంధుగణం... ఏమీ లేని పిల్లలు వీరు. వీరికి కేవలం చదువొక్కటే చెప్పిస్తే సరిపోదు. వ్యక్తిత్వ వికాసం, మానవ సంబంధాలు, విలువల గురించీ నేర్పించాలి. ‘అందుకు తగ్గట్టుగానే మా పాఠశాలలో బోధన ఉంటుంది. ఇక్కడ మేం అనుసరించే ప్రమాణాలు ఏ కార్పొరేట్‌ విద్యాసంస్థలోనూ మీకు కన్పించవు. ఇస్రో శాస్త్రవేత్తల దగ్గర్నుంచీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించి ప్రసంగాలు ఇప్పిస్తాం. మెగసెసె అవార్డు గ్రహీత సందీప్‌ పాండే తరచూ పాఠశాల సందర్శిస్తుంటారు. మాకు తొలి నుంచీ ఆయన పెద్ద అండగా ఉన్నారు’ అని చెప్పారు పూర్ణచంద్రరావు. పాండే నిర్వహిస్తున్న ‘ఆశ’ స్వచ్ఛంద సంస్థతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలకు కూడా ఆయన సేవలందిస్తున్నారు. నిస్వార్థంగా సేవలందించే స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేయాలనుకునే వారికి తాను మార్గదర్శనం చేస్తాననీ పూర్ణచంద్రరావు చెబుతారు. ఆయన నిస్వార్థ, నిరాడంబర జీవనం చూసిన చాలామంది ఆర్థికంగా అండగా నిలుస్తామంటూ ముందుకు వచ్చారు. కానీ ఏ సాయమైనా సంస్థకే తప్ప తనకు అక్కరలేదని సున్నితంగా తిరస్కరిస్తారాయన. కొన్ని వ్యాపార సంస్థలు సామాజిక బాధ్యత కింద లక్షల్లో విరాళాలు ఇస్తాయి. కొందరు వంద, యాభై కూడా ఇస్తారు. దాతలందరూ ఆయనకు సమానమే. ఎంత మొత్తం ఇచ్చారన్నది ఆయన పట్టించుకోరు. ‘ఎవరిదైనా కష్టార్జితమే. అది వృథా కాకూడదనే కోరుకుంటారు. అందుకే ప్రతి రూపాయికీ లెక్క చెప్పడం నా బాధ్యత’ అంటారాయన. సమాజం పట్లా సాటి మనుషుల పట్లా ఇంతటి బాధ్యతా నిబద్ధతా ఉన్న సేవామూర్తులు కోటికి ఒకరున్నా చాలు కదూ...!

మరికొన్ని...

పూర్ణచంద్రరావు శ్రీమతి జయలక్ష్మి ఉద్యోగమే వారి కుటుంబానికి జీవనాధారం.
*స్కూలు ప్రారంభించడానికి ముందు ఆయన దేశంలో పేరొందిన 800 పాఠశాలల్ని సందర్శించారు. అక్కడి బోధన, నిర్వహణ విధానాలను పరిశీలించారు. 
*వీరి స్కూల్లో కులమత ప్రస్తావన ఉండదు. 
*దాతలెవరైనా పది రూపాయలిచ్చినా సరే... అది సంస్థ ఖాతాలోకి వెళ్తుంది. 
*వార్షిక నివేదికలో నమోదవుతుంది. ఆ నివేదిక ప్రతిని మళ్లీ ఆయనే పట్టుకెళ్లి స్వయంగా దాతలకు అందజేస్తారు.
*ప్రభుత్వం నుంచీ రాజకీయ నాయకుల నుంచీ ఒక్క రూపాయి కూడ తీసుకోలేదు. 
*పాఠశాల ఉనన పల్లెలో పేదలకోసం ఓ చిన్న ఆస్పత్రిని నిర్మించాలన్నది పూర్ణచంద్రరావు కల.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.