close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెండ్రోజుల్లో రూ.6వేల కోట్లు!

రెండ్రోజుల్లో రూ.6వేల కోట్లు!

ఎంత పెద్ద ధనవంతుడైనా రోజుకి మహా అయితే కోటో, రెండు కోట్లో సంపాదిస్తాడు. కానీ రాధాకిషన్‌ దమాని రెండ్రోజుల్లో ఏకంగా ఆరువేల కోట్ల రూపాయలకుపైగా సంపదని తన ఖాతాలో వేసుకొని, ఒక్క దెబ్బతో దేశంలోని మొదటి ఇరవై మంది శ్రీమంతుల్లో ఒకరిగా మారిపోయారు. సామాన్యుడి సూపర్‌మార్కెట్‌గా ముద్రపడిన డి-మార్ట్‌ని స్థాపించింది ఆయనే. ఇటీవలే తొలిసారి షేర్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన డి-మార్ట్‌ సంస్థ విలువ రెండ్రోజుల్లో ఏకంగా రూ.40వేల కోట్లు దాటింది. దాంతో అది దేశంలోనే అతిపెద్ద రిటైల్‌ సంస్థగా అవతరించింది.

డిమార్ట్‌... దేశంలో చిన్న పట్టణాల నుంచీ మెట్రో నగరాల దాకా చాలా ప్రాంతాల్లో కనిపించే సూపర్‌ మార్కెట్‌. ఆ స్టోర్ల అధినేత దమానీ మాత్రం బయట ఓ చిన్న బిజినెస్‌ పార్టీలో కూడా కనిపించరు. ముప్ఫయి ఏళ్లుగా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్నా, కనీసం ఒక్క వ్యక్తిగత ఇంటర్వ్యూ కూడా మీడియాకి ఇవ్వకపోవడం ఆయన వ్యాపార దృక్పథానికి నిదర్శనం. వెనక ఎన్ని వేల కోట్లున్నా ఎప్పుడూ తెల్లని ప్యాంటూ చొక్కాతో కనిపించడం దమానీ నిరాడంబరత్వానికి ఉదాహరణ. ఒకప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో ఆయనో తిరుగులేని శక్తి. అంతకంతకూ పడిపోతున్న షేర్లు కూడా ఆయన కొంటే అమాంతం పైకి లేస్తాయని ఇన్వెస్టర్ల నమ్మకం. అందుకే దమానీని ‘భారతీయ బఫెట్‌’ అని పిలిచేవారు. ఆయన సూచనల ప్రకారం స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లంతా కోటీశ్వరులుగా ఎదిగారు. అలా చాలా ఏళ్ల పాటు మదుపరిగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన దమానీ, ఉన్నట్టుండీ పదిహేడేళ్ల క్రితం స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులకు దూరమై అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎన్నాళ్లగానో తన మనసులో మెదులుతున్న రిటైల్‌ వ్యాపారం మీద దృష్టిపెట్టడానికే ఆ నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే స్టాక్‌ మార్కెట్‌కు దూరమైన కొన్నాళ్లకు ‘డి-మార్ట్‌’ తొలి స్టోర్‌ని దమాని మొదలుపెట్టారు.

బేరింగుల వ్యాపారం...
స్టాక్‌మార్కెట్లో దూసుకెళ్తున్నా దాన్ని వదిలి దమాని వ్యాపారంలోకి రావడానికి కారణం ఆయన కుటుంబ నేపథ్యమే. దమానీ తండ్రి బాల్‌ బేరింగ్‌లను విక్రయించే వ్యాపారం చేసేవాడు. చదువైపోయాక దమానీ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకున్నారు. రోజూ ఆయనతో కలిసి దుకాణానికి వెళ్తూ వ్యాపార మెలకువలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. కేవలం బాల్‌ బేరింగులకు పరిమితం కాకుండా వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్న ఆలోచనలో ఉండేవారు. కానీ తండ్రి మరణం దమానీ ఆలోచనలకు కళ్లెం వేసింది. అప్పటిదాకా లాభాలతో సాగిన వ్యాపారం, పెద్దదిక్కు దూరమవడంతో క్రమంగా తిరోగమిస్తూ వచ్చింది. కొన్నాళ్లకు నష్టాలు తట్టుకోలేక ఏకంగా ఆ వ్యాపారాన్ని దమానీ మూసేశారు. ఆపైన ఏం చేయాలా అని మధన పడుతున్న దశలో, తనలానే స్టాక్‌ బ్రోకర్‌గా మారమని అన్నయ్య సలహా ఇచ్చాడు. దానికోసం కొన్నాళ్లు అన్నయ్య దగ్గరికే వెళ్లి అతడు పెట్టుబడులు పెడుతున్న తీరునీ, మార్కెట్‌ ఎత్తుపల్లాలనూ దమానీ క్షుణ్ణంగా గమనించేవారు. కొంత డబ్బు పెట్టడానికీ, అవసరమైతే ఆ డబ్బుని కోల్పోవడానికీ సిద్ధపడితే తప్ప స్టాక్‌మార్కెట్‌ గురించి పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యమని అర్థం చేసుకున్నారు. ఆ రోజుల్లో చాలామందికి స్ఫూర్తిగా నిలిచిన స్టాక్‌ బ్రోకర్‌ చంద్రకాంత్‌ సంపత్‌కి ఏకలవ్య శిష్యుడిగా మారారు. ఆయన వ్యూహాలకు అనుగుణంగానే నెమ్మదిగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.

మార్కెట్లో ‘షేర్‌’...
దేశంలోని టాప్‌-3 ఇన్వెస్టర్లలో ఒకరిగా దమానీకి పేరుంది. స్టాక్‌మార్కెట్‌ రారాజుగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకు పెట్టుబడుల పాఠాలు నేర్పింది కూడా దమానీనే. అలాంటి వ్యక్తి కెరీర్‌ గ్రాఫ్‌ కూడా మొదట పతనంతోనే మొదలైంది. ఇతర ఇన్వెస్టర్లను అనుసరిస్తూ వాళ్లు పెట్టుబడి పెట్టిన సంస్థల్లో డబ్బు పెట్టి చాలాసార్లు నష్టపోయాడు. చేతులు కాల్చుకున్నాక కానీ, ఆ ఎగుడుదిగుళ్ల మార్కెట్లో ఎవరినీ గుడ్డిగా అనుసరించకూడదని ఆయనకు అర్థం కాలేదు. అప్పట్నుంచీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూనే, తన మనస్సాక్షిని నమ్మి షేర్లు కొనుగోలు చేస్తూ వచ్చారు. మార్కెట్లో దూసుకెళ్తున్న షేర్లపైనే చాలామంది దృష్టిపెడితే, దమానీ మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ సత్తా ఉన్న కొత్త సంస్థల షేర్లు కొనుగోలు చేసేవారు. అలా తొంభయ్యో దశకం చివర్లో కొన్ని సంస్థల్లో ఆయన కొన్న షేర్లు, తరవాతి కాలంలో ఆయనకు వందల కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టాయి. ఇరవై ఏళ్ల క్రితం దాదాపు అరవై మూడు కోట్ల రూపాయలుపెట్టి ‘వీఎస్‌టీ’ ఇండస్ట్రీస్‌ అనే చిన్న సంస్థలో దమానీ షేర్లు కొన్నారు. అప్పట్లో అందర్నీ విస్మయపరిచిన నిర్ణయం అది. కానీ ఆయన కొన్న షేర్ల విలువ ఇప్పుడు పన్నెండు వందల కోట్ల రూపాయలకు పైమాటే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో అందులో పెద్ద ఇన్వెస్టర్‌ దమానీనే. అప్పట్లో ఎనిమిది రూపాయలు చొప్పున ఆ సంస్థలో ఆయన కొన్ని లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఒక్కో షేర్‌ విలువ పద్నాలుగు వందల రూపాయలు పైనే ఉంటుంది. దమానీ స్టాక్‌మార్కెట్‌ ప్రయాణంలో ఇలాంటి విజయాలెన్నో ఉన్నాయి.

డిమార్ట్‌ మొదలు...
విజయవంతంగా స్టాక్‌మార్కెట్లో దూసుకెళ్తున్న సమయంలో పదిహేడేళ్ల క్రితం దమానీ స్టాక్‌మార్కెట్‌ నుంచి బయటికొచ్చి ముంబైలో కొంత స్థలం కొన్నారు. దామోదర్‌ మాల్‌ అనే స్నేహితుడితో కలిసి అప్పట్లో ప్రాచుర్యం పొందిన ‘అప్నా బజార్‌’ అనే సూపర్‌ మార్కెట్‌ ఫ్రాంచైజీని ఏర్పాటు చేశారు. తొలిరోజుల్లో స్టోర్‌ నిర్వహణ, బిల్లింగ్‌, ఉద్యోగుల నియంత్రణ, సరకుల కొనుగోలు లాంటి రకరకాల అంశాలపైన పూర్తిస్థాయిలో పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నించేవారు. హోల్‌సేల్‌ వ్యాపారులతో పాటు కస్టమర్లతోనూ తరచూ మాట్లాడుతూ వాళ్ల అవసరాలూ, మార్కెట్‌ పరిస్థితులూ తెలుసుకునేవారు. ‘వాల్‌మార్ట్‌’ సంస్థను మొదలుపెట్టి దాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ‘సామ్‌ వాల్టన్‌’ రాసిన పుస్తకాల్ని ఎక్కువగా చదివేవారు. ఆ స్ఫూర్తితోనే తరవాత ‘అప్నాబజార్‌’ ఫ్రాంఛైజీని వదిలిపెట్టి డి-మార్ట్‌ పేరుతో ఓ సరికొత్త సూపర్‌ మార్కెట్‌కి అక్కడే పునాది వేశారు దమానీ.

అప్పటిదాకా ఉన్న సూపర్‌మార్కెట్లకు భిన్నంగా తన స్టోర్లు ఉండాలని దమానీ పక్కాగా నిర్ణయించుకున్నారు. దాని కోసం కొన్ని కచ్చితమైన సూత్రాలను అనుసరించారు. అందులో మొదటిది ధరలపై నియంత్రణ. ఒకేలాంటి సరకులను ఇతరుల కంటే తక్కువ ధరకే అందివ్వాలన్నది ఆయన ఆలోచన. దానికోసం పెద్ద స్టోర్లకు సరఫరా చేసే సంస్థలతో కాకుండా చిన్న స్థాయి వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సాధారణంగా మార్కెట్లో మూడు వారాల తరవాత కొన్న సరకుకు స్టోర్‌ యజమానులు డబ్బులు చెల్లిస్తారు. కానీ దమానీ పదిరోజుల్లోనే డబ్బు చెల్లించేవారు. దాంతో ఇతరులకంటే కాస్త తక్కువ ధరకే వ్యాపారులు ఆయనకి సరకు అమ్మేవారు. ఆ మిగులుని తాను తీసుకోకుండా వినియోగదార్లకే బదిలీ చేసేవారు. అందుకే మిగతా స్టోర్లకంటే అక్కడ ధరలు తక్కువన్న భావన జనాల్లో నాటుకుంది.

సొంత స్థలాల్లోనే...
మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది దమానీ అనుసరించిన మరో సూత్రం. అందుకే ఆ రంగంలోని ఇతర వ్యాపారాల్లా... ఖరీదైన మాల్స్‌, షాపింగ్‌ సెంటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డిమార్ట్‌ స్టోర్లు కనిపించవు. దాంతో స్టోర్ల అలంకరణ కోసం పెట్టే ఖర్చునీ తగ్గించొచ్చనీ, ఆ డబ్బులో కొంత సంస్థకీ, ఇంకొంత వినియోగదారుడికీ మళ్లించాలన్నది ఆయన వ్యూహం. వీలైనంత వరకూ సొంత స్థలాల్లోనే స్టోర్లను ఏర్పాటు చేస్తుంటారు. గతంలో స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల ద్వారా సంపాదించిన డబ్బుతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆయన భూములు కొనుగోలు చేశారు. ఎక్కువ శాతం స్టోర్లను అలా కొన్న స్థలాల్లోనే నిర్మించారు. ఫలితంగా సంస్థ నిర్వహణ ఖర్చులు తక్కువగానే ఉంటాయని మార్కెట్‌ నిపుణుల మాట. అందుకే పోటీ సంస్థలతో పోలిస్తే డిమార్ట్‌ ఒక్కో స్టోర్‌కీ ఉండే ఆదాయం చాలా ఎక్కువ.

నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని దమానీ తూ.చ. తప్పకుండా పాటిస్తారు. డబ్బులొస్తున్నాయి కదాని పుట్టగొడుగుల్లా స్టోర్లు ఏర్పాటు చేయడానికి ఆయన మొగ్గు చూపరు. అందుకే ప్రారంభమై పదిహేనేళ్లవుతున్నా మొత్తమ్మీద డిమార్ట్‌ స్టోర్ల సంఖ్య 118 మాత్రమే. తొలి పదేళ్లలో అయితే ఆ సంఖ్య పాతిక కూడా దాటలేదు. దాని ప్రధాన పోటీ సంస్థలు రెండిటికీ దేశవ్యాప్తంగా వేలల్లో స్టోర్లున్నాయి. అయినా సరే ఆదాయంలో ఆవేవీ డిమార్ట్‌కి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఇప్పటికీ తరచూ స్టోర్లకు వెళ్లి ఉద్యోగుల భుజాల మీద చేయి వేసి మాట్లాడుతూ వృత్తిపర సమస్యలతో పాటు వ్యక్తిగత బాగోగుల గురించీ ప్రశ్నించడం దమానీకి అలవాటు. ఆ ప్రోత్సాహం ఉద్యోగుల పనితీరు మీదా పడుతుందనీ, అందుకే సంస్థ ఇప్పటిదాకా తన స్టోర్లలో ఒక్క దాన్ని కూడా మూసేయలేదనీ వ్యాపార వర్గాల అభిప్రాయం.

నేరుగా టాప్‌-20లోకి...
ఒకప్పుడు స్టాక్‌మార్కెట్‌ని ఏలిన దమాని, తన కంపెనీ షేర్లను ఎప్పుడెప్పుడు అమ్మకానికి పెడతాడా అని స్టాక్‌ బ్రోకర్లంతా ఎదురుచూస్తూ వచ్చారు. గత నెలలో ఆ రోజు రానే వచ్చింది. డి-మార్ట్‌కి మాతృసంస్థ అయిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేర్లను దమాని అమ్మకానికి పెట్టారు. పదిహేనేళ్లుగా ప్రతి ఏడాదీ లాభాలతో నడుస్తున్న సంస్థ కాబట్టి షేర్‌ విలువ ఎక్కువగానే పలుకుతుందని మదుపర్లు అంచనా వేశారు. కానీ ఎవరి వూహలకూ అందనంత స్థాయిలో ఆ ధర ఎగబాకి, రాత్రికి రాత్రి దమానీ ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయల మేర పెరిగింది. ఐపీవోకి వెళ్లకముందే తన నమ్మకస్తులందరికీ దమానీ కొన్ని షేర్లు కేటాయించారు. దాంతో ట్రేడింగ్‌ మొదలయ్యాక సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవిల్‌ నోరొన్హా షేర్ల విలువే వెయ్యి కోట్ల రూపాయలు దాటింది. సంస్థలోని పదిహేను వందల పైచిలుకు ఉద్యోగుల కోసం దమానీ కేటాయించిన షేర్ల విలువ రెండొందల యాభై కోట్ల రూపాయలు పైమాటే. బంధువులూ, కుటుంబ సభ్యుల కోసం షేర్లలో కల్పించిన వాటా విలువ దాదాపు ఐదొందల కోట్ల రూపాయలు. దమానీ విషయానికొస్తే... ఐపీవోకి వెళ్లకముందు ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.15వేల కోట్లు. షేర్‌ మార్కెట్లోకి అడుగుపెట్టాక ఆ లెక్కలు అంతకంతకూ పెరిగిపోయాయి. డిమార్ట్‌లో ఆయన వాటా విలువే రూ.30వేల కోట్లు దాటింది. ఇతర పెట్టుబడులతో కలిపి మొత్తంగా ఆయన ఆస్తుల విలువ రూ.49వేల కోట్లకు చేరింది. అలా ఒక్క దెబ్బతో అనిల్‌ అంబానీ, అనిల్‌ అగర్వాల్‌, రాహుల్‌ బజాజ్‌ లాంటి దిగ్గజాలను వెనక్కునెట్టి దేశంలోని టాప్‌-20 కుబేరుల జాబితాలో దమానీ చేరిపోయారు.

మౌనమే మార్గం...
నిన్నమొన్నటి దాకా దమానీ ఎలా ఉంటారో చాలామందికి తెలీదు. కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా ‘ఆర్‌.దమానీ’ అంటే రమేష్‌ దమానీ అనే మరో పేరున్న ఇన్వెస్టర్‌ అనే అనుకుంటారు తప్ప, రాధాకిషన్‌ దమానీ పేరు ఎవరికీ స్ఫురించదు. తనకు కావల్సిందీ అలా తక్కువమంది గుర్తుపట్టడమే అంటారాయన. దానివల్ల తమ స్టోర్‌కి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది పనితీరునీ సులువుగా అంచనా వేయొచ్చని చెబుతారు. ఆఖరికి ఐపీవో ద్వారా వేల కోట్ల రూపాయలు ఒళ్లొ పడ్డాక కూడా ఆయన మీడియా ముందుకు రాలేదు. చాలా తక్కువ మాట్లాడుతూ, ఎవరేం చెప్పినా ఓర్పుగా ఎంతసేపైనా వినడం ఆయన స్వభావం. ఎలాంటి ఆడంబరాలూ లేకుండా ఒకే విషయంపైన దృష్టిపెడుతూ, మౌనంగా పని చేసుకుపోయే తత్వమే దమానీని ఇక్కడిదాకా తీసుకొచ్చిందన్నది ఆయన ప్రత్యర్థీ, ఫ్యూచర్‌ గ్రూప్‌అధినేత కిశోర్‌ బియానీ స్వయంగా చెప్పిన మాట.

విజయానికి దగ్గర దారులుండవు, ఓపిగ్గా కష్టపడితేనే అది ఏదో ఒక రోజు మన తలుపు తడుతుంది... దమానీ ఇరవైఏళ్ల స్టాక్‌ మార్కెట్‌ అనుభవం, పదిహేనేళ్ల డిమార్ట్‌ ప్రయాణం మరోసారి ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.