close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ పాటను ప్రత్యేకంగా చెప్పి రాయించుకున్నా

ఆ పాటను ప్రత్యేకంగా చెప్పి రాయించుకున్నా

కేబుల్‌ టీవీలూ, సెల్‌ఫోన్ల వూసు లేదు, ఇంటర్నెట్‌, సామాజిక వెబ్‌సైట్లు అసలు వూహక్కూడా రాని విషయం... అలాంటి రోజుల్లో తెలుగు చిత్రం ‘శంకరాభరణం’ జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. అంతర్జాతీయ వేదికలకెక్కింది. సాగర సంగమం రష్యాలోనూ కలెక్షన్లను రాబట్టింది. స్వాతిముత్యం తొలిసారి తెలుగు సినిమాను ఆస్కార్‌ వరకూ నడిపించింది. అలాంటి సినిమాల రూపకర్త కాశీనాథుని విశ్వనాథ్‌ని దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించిందంటే ఆశ్చర్యమేముందీ... ఆ కళా తపస్వి అరవై వసంతాల తన సినీ జీవితంలోని కొన్ని విశేషాలను పంచుకుంటున్నారిలా...

నా బాల్యం విజయవాడలోనే గడిచింది. గుంటూరులో హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాను. అప్పటికి నాన్నగారు బీఎన్‌ రెడ్డిగారి ‘వాహిని’ సంస్థలో మేనేజర్‌గా చేసేవారు. ఆ సంస్థలో కెమెరా డిపార్ట్‌మెంట్‌, సౌండ్‌ రికార్డింగ్‌... ఇలా అన్నిట్లోనూ డిగ్రీ పూర్తిచేసిన యువకుల్ని తీసుకోవాలనుకుంటున్నారని తెలిసి నాన్న ‘నువ్వు కూడా చేరతావా’ అని అడిగారు. డిగ్రీలో మంచి మార్కులు రాలేదు కాబట్టి, ఏదో ఒకటిలే అని సౌండ్‌ రికార్డిస్ట్‌గా చేరిపోయాను. అప్పట్లో ఆదుర్తి సుబ్బారావు, కె.వి.రెడ్డి... లాంటి ప్రముఖ దర్శకులందరూ వాహినీలో సినిమాలు తీస్తుండేవారు. ఆదుర్తిగారికి నా పనితీరు నచ్చడంతో ‘మూగ మనసులు’ సినిమా దర్శకత్వ శాఖలో పనిచెయ్యమన్నారు. తర్వాత పూర్తిగా కొత్తవారితో ‘తేనె మనసులు’ తియ్యాలనుకున్నప్పుడు నటీనటులకు శిక్షణ ఇచ్చే బాధ్యతనూ నాకే అప్పగించారు. ఆ సమయంలోనే నాగేశ్వరరావుగారు ‘అన్నపూర్ణ స్టూడియోస్‌కి వచ్చేయండి మాకో సినిమాను చేసి పెడుదురుగానీ’ అనడిగారు. అక్కడ కొంత కాలం పనిచేశాక ‘ఆత్మగౌరవం’ సినిమాతో దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. నా శ్రమకు గుర్తింపుగా మొదటి సినిమాకే నంది అవార్డు వచ్చింది. మొదట్లో ఇతర రచయితలు నా సినిమాల కథలకు సహకారం అందించారు. తర్వాత 99శాతం కథలు నావే.

అది వారి గొప్పతనమే
నాకు సంగీతం గురించి పెద్దగా పరిజ్ఞానం లేదు. మరి, ఇన్ని సంగీత ప్రాధాన్యమున్న సినిమాలు ఎలా తీశానూ... అంటే మన సంస్కృతీ సంప్రదాయాల మీదున్న అమితమైన గౌరవమే ఆ సినిమాలు తీసేలా చేసింది. కుటుంబ కథలూ ప్రేమకథలే సినిమాలుగా వస్తున్న తరుణంలో శంకరాభరణంలాంటి సినిమా తియ్యగలిగానంటే అది నిర్మాతల గొప్పతనమే. పెద్ద హీరోల్ని వదిలేసి విజయనగరంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న సోమయాజుల్ని తీసుకొచ్చి ప్రధాన పాత్రలో నటించమనడానికి కారణం, ఆ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోతాడనిపించింది నాకు. మంజుభార్గవిని కూడా అలాగే తీసుకున్నాం. ఓ ఫంక్షన్‌కి వెళ్లినపుడు ఎంట్రన్స్‌లో అతిథులను ఆహ్వానిస్తుంటే చూశా. తర్వాత శంకరాభరణం తియ్యాలనుకున్నప్పుడు ఈ పాత్రకు ఆ అమ్మాయైతే సరిపోతుంది అనిపించి ఆరా తీసి పిలిపించాం. కొత్త నటులతో తీసిన ఆ చిత్రం చరిత్ర సృష్టించింది. అలా ఒక్కోసారి పెద్ద నటులు లేకపోయినా భారీ సెట్టింగులూ పాటల్లో పాతిక డ్రెస్సుల్లాంటివి లేకపోయినా నా సినిమాలు విజయం సాధించాయంటే జనం హృదయాల్ని తాకగల కథలే కారణం.

ఇక, నా సినిమాల్లో ‘సాగర సంగమం’ సినిమాది ఓ ప్రత్యేక స్థానం. కమల్‌హాసన్‌తో సినిమా అనుకున్నప్పుడు... ఆ కథ అతనికి తగ్గట్లే ఉంటే ఉండాలనుకున్నా. హీరో కాకముందు కమల్‌హాసన్‌ డాన్స్‌ అసిస్టెంట్‌గా చేశాడు. ఆ కోణం నుంచి ఆలోచన మొదలుపెట్టి, భారతీయ నృత్య కళలన్నిటినీ కలిపి ‘ఇండియన్‌ డాన్స్‌’ అనే ఓ కళను సృష్టించాలని తపనపడే పాత్రను సృష్టించాను. దాన్ని కమల్‌ కూడా ఎంతో బాగా రక్తి కట్టించాడు.

నా పాటలు...
పాటల విషయానికొస్తే... మీ సినిమాల్లో చాలా పాటలకు పల్లవులు మీరు రాశారటగా... అని ఆశ్చర్యంగా అడుగుతుంటారు చాలామంది. నిజానికి దర్శకుడిగా అది కూడా కొంతవరకూ నా బాధ్యతే అనుకుంటా. ఎందుకంటే పాటల రచయితకు సినిమాలో ‘ఇక్కడ ఈ సీన్‌ వస్తుంది, దాని తర్వాత ఓ పాట రావాలి’ అని చెప్పేస్తే సరిపోదేమో అనిపిస్తుంది నాకు. స్క్రిప్ట్‌ రాసుకునేటపుడు మనం ఆ పాత్రల్లో పూర్తిగా లీనమై ఉంటాం కాబట్టి, అక్కడ పాట రావాలనుకున్నపుడు పల్లవి ఇలా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అది ఉపయోగపడితే రచయితలు ఉపయోగించుకుంటారు. లేదంటే మారుస్తారు. అందుకే, వాటిని నేను అబద్ధపు సాహిత్యం అనేవాడిని. అయితే, మొదటి సినిమా ఆత్మగౌరవం నుంచీ కూడా చాలా వరకూ ఆ పల్లవులు ఉపయోగపడ్డాయి. ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు... సద్దు చేశారంటే ఉలికి ఉలికి పడతాడూ...’ కూడా అలా వచ్చిందే. శంకరాభరణం సినిమానే తీసుకుంటే... ఓ వేశ్య కూతుర్ని చేరదీశాడని శంకరశాస్త్రి పాట మొదలుపెట్టగానే జనం లేచి వెళ్లిపోతారు. అప్పుడు శంకరశాస్త్రి వీళ్లందరూ కాదు నా పాటను నీకు వినిపిస్తాను అంటూ పాట మొదలుపెడతాడు అదే ‘శంకరా నాద శరీరాపరా... ’, అలాగే ‘స్వాతికిరణం’లోని ‘ప్రణతి... ప్రణతి... ప్రణతి...’ పాట కూడా. సాగర సంగమంలో తాగి తూలుతూ పాడిన ‘తకిట తదిమి తకిట తదిమి తందానా...’ పాటకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. మామూలుగా తాగినవాడి మాటలదేముందిలే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు అంటుంటారు. కానీ తాగినపుడే వేదం మాట్లాడతారు. అందుకే, ఆ పాటను ప్రత్యేకంగా చెప్పి రాయించుకున్నా. నిజానికి నా సినిమాల్లో అంత మంచి పాటలు వచ్చాయంటే ఆ గొప్పతనం రచయితలదే. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తిలాంటి గొప్ప పాటల రచయితల్ని నేనే పరిశ్రమకు పరిచయం చేశాను అంటుంటారు. అది కూడా నా గొప్పతనం కాదు. వాళ్లిద్దరిలోనూ ఎంతో పాండిత్యం ఉంది. ఇక్కడ ఓ సంఘటన చెప్పాలి... రాజమండ్రికి దగ్గర్లో ఏదో సినిమా షూటింగ్‌ జరుగుతుండగా ఓ మహిళ తన కొడుకులిద్దర్నీ వెంటబెట్టుకుని నా దగ్గరకొచ్చింది. ‘అయ్యా మాకు ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఏదైనా మార్గం చూపండి...’ అని బతిమాలింది. మీ పిల్లలు ఏం చెయ్యగలరు’ అనడిగితే ‘వీళ్లు స్కూల్లో గంగావతరణం అనే రూపకం ప్రదర్శించారు. చక్కగా పాడతారు’ అని చెప్పింది. నిజంగా ఆ పిల్లలు బ్రహ్మాండంగా పాడారు. వాళ్ల గానం అలా ఉంచితే ఆ రూపకం రాసిన తీరు ఇంకా బాగుంది. ఎవరు రాశారు... అనడిగితే ‘అనకాపల్లిలో టెలీఫోన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఆయన’ అని చెప్పారు. ఆ పిల్లలకు నాకు తోచిన సాయం చేసి పంపాను. ఆ తర్వాత కొన్ని నెలలకు ‘సిరి వెన్నెల’ తీద్దామనుకున్నప్పుడు గంగావతరణం రచయిత గురించి ఆరా తీశాను. అతడే సీతారామ శాస్త్రి. కబురుపెడితే తన పాటల క్యాసెట్లనూ పంపాడు. అవి కూడా చాలా బాగున్నాయి. వెంటనే పిలిపించి నా సినిమాకు పాటలు రాయమని అడిగాను. అలా ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి అయిపోయాడు.

గుర్తుకొస్తున్నాయి...
అరవై వసంతాల సినీ జీవితంలో ఎన్నో మర్చిపోలేని అనుభూతులు. కానీ వాటిలో గుర్తొచ్చిన ప్రతిసారీ ఆశ్చర్యంగా అనిపించేవాటి గురించి చెప్పాలంటే సిరివెన్నెల షూటింగ్‌ని జైపూర్‌లో తీసినప్పటిదే. మా యూనిట్‌ అంతా అక్కడికి వెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. తీరా చూస్తే జైపూర్‌ పర్యటక అధికారులు ఆఖరి నిమిషంలో ‘మీరు షూటింగ్‌ కోసం అనుమతి కేంద్రం నుంచి తెచ్చుకోండి’ అన్నారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో కలెక్టర్‌ పరిధిలో కొన్ని అధికారాలు ఉన్నాయని తెలిసి, అజ్మీర్‌ కలెక్టర్‌ను కలవడానికి వెళ్లాం. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఆ కలెక్టరు శంకరాభరణం సినిమాకు వీరాభిమాని అట. నేను వెళ్లేసరికి విషయం తెలుసుకున్న ఆయన వెంటనే బయటికొచ్చి ‘మీరా... సర్‌’ అంటూ చాలా సంతోషపడిపోయాడు. సమస్య చెప్పగానే ఆయన పుష్కర్‌లోనూ జైపూర్‌లో మరోచోటా అనుమతులు ఇప్పించారు. సినిమాల్లో అలాంటి కథలెన్నో రాస్తుంటాం కానీ నిజంగా మనకే అలాంటి సంఘటనలు ఎదురైతే ఆ అనుభూతి ఎంత బాగుంటుందో తెలియజేసిన సంఘటన అది. అలాగే... స్వర్ణకమలం పాటల షూటింగ్‌ కోసం మా యూనిట్‌ అంతా కలసి శ్రీనగర్‌ వెళ్లాం. అసలే అక్కడ చలి. నోటికి కాస్త కారంగా తినడానికి ఆవకాయ పచ్చడిలాంటివి ఉంటే బాగుండునని అందరికీ ఉంది. మా వంట మనిషేమో పచ్చళ్లు తీసుకురాలా. ఆ విషయమే నా దగ్గరకొచ్చింది. ఆ ఏముందీ పచ్చి ఆపిల్‌ పండ్లు కోసి పచ్చడి కలిపేయ్‌ అన్నా. అది అందరికీ నచ్చేసింది. అక్కడున్నన్ని రోజులూ తినాలనిపించినప్పుడల్లా యాపిల్‌ పచ్చడే.

ఇలా... చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు.

- బి.మధులత

నిర్మాతల మనిషి...
- ఏడిద రాజా, పూర్ణోదయా మూవీ క్రియేషన్స్‌

శంకరాభరణం, స్వయం కృషి, సాగర సంగమం, స్వాతి ముత్యం... ఇలా పూర్ణోదయా పిక్చర్స్‌ బ్యానర్‌లో విశ్వనాథ్‌గారితో చాలా సినిమాలు తీశాం. ఆయన అందరికోసం ఆలోచించే మనిషి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రొడ్యూసర్లకు నష్టం రాకుండా, ఆర్టిస్ట్‌లకు డేట్లు వృథా కాకుండా చూసేవారు. స్వయంకృషి సినిమా సమయంలో మైసూర్‌ దగ్గర కావేరీనది ఒడ్డున చిరంజీవి ఉండే వూరూ, విజయశాంతి ఉండే వూరినీ పెద్ద సెట్‌ వేశాం. షూటింగ్‌ ముందురోజు స్థానిక గొడవలతో 144 సెక్షన్‌ విధించారు. వూళ్లొకి ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. మరోపక్క తెల్లారితే నటీనటులందరూ వచ్చేస్తారు. నేను విశ్వనాథ్‌గారికి ఫోన్‌ చేసి విషయం చెప్పాను. ఆయన నువ్వు ఆ ఎస్టీడీ బూత్‌లోనే ఉండు, మళ్లీ ఫోన్‌ చేస్తాను అన్నారు. తర్వాత ఫోన్‌ చేసి అక్కణ్నుంచి తెల్లారేలోపు మీరు వూటీ వచ్చేసెయ్యండి. గొడవ సద్దుమణిగేలోపు మనం రెండు పాటలు షూట్‌ చేసేసుకుందాం అన్నారు. అలా నటీనటుల డేట్సు వృథా కాకుండా చూశారు.

చాలామందికి తెలియని విషయం ఏంటంటే విశ్వనాథ్‌గారి చాలా సినిమాలు రష్యాలో విడుదలై విజయవంతంగా ఆడాయి. అదెలా అంటే, ఇక్కడున్న రష్యన్‌ కాన్సులేట్‌ వాళ్లు శంకరాభరణం చూశాక ఆయనకు వీరాభిమానులైపోయారు. వాళ్లు మమ్మల్ని డిన్నర్‌కి పిలిచి ఆయన తీసిన సినిమాలను రష్యాలో విడుదలచెయ్యమని అడిగారు. అలా మొదట ‘సాగర సంగమం’ సినిమాను రష్యన్‌ భాషలోకి డబ్‌ చేసి అక్కడి థియేటర్లన్నిటిలో విడుదల చేశాం. అలా విశ్వనాథ్‌గారి స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు... ఇలా చాలా సినిమాలు రష్యాలోని థియేటర్లలో విడుదలై హిట్‌ అయ్యాయి. రష్యాలో విడుదలైన తొలి తెలుగు సినిమా సాగరసంగమం కావడం విశేషం.


సప్తపది నాయిక సబిత...

నాట్యకారిణిగా నేను ప్రోగ్రామ్‌లు ఇస్తున్న తొలిరోజులవి. అలా ఓసారి నా ప్రోగామ్‌ను చూసిన విశ్వనాథ్‌గారు ‘సప్తపది’ సినిమాకోసం అడిగారు. మేకప్‌ టెస్ట్‌ చెయ్యడానికి పిలిచినపుడు కూడా నన్ను తీసుకుంటారని అనుకోలేదు. కానీ అట్నుంచి అటే షూటింగ్‌కి వచ్చేయమన్నారు. తర్వాత ఆ సినిమా విడుదలవడం, మంచి పేరు రావడం అన్నీ తెలిసినవే. విశ్వనాథ్‌గారితో అనుబంధం అప్పట్నుంచీ కొనసాగుతూనే ఉంది. అది చివరికి చుట్టరికంగా కూడా మారింది. విశ్వనాథ్‌గారి మనవరాల్ని మా కోడలిగా చేసుకున్నాం.


త్రివిక్రమ్‌...

సాయం సమయంలోని నీరెండ, సంక్రాంతి వేళ గొబ్బెమ్మ, ఆడపిల్ల జడలోని మొగలి పువ్వు, గోధూళి వేళ లేగదూడ మెడలోని గంట శబ్దం, వర్షం వచ్చేముందు మట్టిలోనుంచి వచ్చే వాసన, వేసవిలో రాత్రిపూట గోంగూర పచ్చడి కలిపి అమ్మ తినిపించే గోరు ముద్ద... ఇలా మనకు బాగా నచ్చే కొద్ది విషయాల్లో విశ్వనాథ్‌గారి సినిమాలు కూడా ఉంటాయి.


చిరంజీవి...

స్వయంకృషి సినిమా సమయంలో సంఘటన అది. పాటల షూటింగ్‌ ఉన్నప్పుడు నేను మధ్యాహ్నం భోజనం చేసేవాడిని కాదు. అలా ఓరోజు విరామం సమయంలో ఏమీ తినకుండా పడుకున్నా. విశ్వనాథ్‌గారు చిరంజీవి భోజనం చేశాడా... అని అడిగారట. అక్కడున్నవాళ్లు తినలేదు అని చెప్పారట. వెంటనే తనే స్వయంగా పెరుగన్నం కలిపి నేను తినమన్నానని చెప్పు అని పంపించారు. ఆ ప్రేమను ఇప్పటికీ మర్చిపోలేను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.