close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హరీశ్‌ ఎక్కడుంటే గెలుపు అక్కడే!

హరీశ్‌ ఎక్కడుంటే గెలుపు అక్కడే!

అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసును వాదించి, విజయం సాధించి దేశ ప్రజలందరి మెప్పు పొందిన న్యాయవాది... హరీశ్‌ సాల్వే. దేశంలో ఎంతోమంది లాయర్లు ఉండగా హరీశ్‌ దగ్గరకే ఈ కేసు రావడానికి కారణం హరీశ్‌ ఎటువైపు ఉంటే గెలుపు అటువైపేనన్న ధీమా ఉండబట్టి. మరి ఆ స్థాయికి చేరడం వరకూ ఆయన ప్రయాణం ఎలా సాగిందంటే...

రీశ్‌ పుట్టిందీ, చదువుకున్నదీ నాగ్‌పూర్‌లో. అతడి తండ్రి నరేంద్ర కుమార్‌ ప్రసాదరావ్‌ సాల్వే ఛార్టెడ్‌ అకౌంటెంట్‌, తాత పీకే సాల్వే క్రిమినల్‌ లాయర్‌. ముత్తాత మున్సిఫ్‌గా పనిచేశారు. ఆరేడు తరగతులు చదివేటపుడు ఇంజినీర్‌ అవ్వాలనుకున్నారు హరీశ్‌. కానీ లెక్కల లోతుల్లోకి వెళ్లేకొద్దీ బోర్‌ కొట్టిందని చెబుతారు. బీకామ్‌ చదువుతూనే తండ్రికి చెందిన ఛార్టెర్డ్‌ అకౌంటెన్సీ సంస్థలో పనిచేస్తూ సీఏ పరీక్షలు రాసేవారు. హరీశ్‌ తండ్రి సీఏ ప్రాక్టీసు సమయంలో అకౌంటెన్సీకంటే పన్నులకు సంబంధించిన అంశాల్లో ఎక్కువ ఆసక్తి చూపేవారు. తండ్రిలాగే హరీశ్‌కు కూడా పన్నుల లెక్కలంటేనే మక్కువ ఎక్కువ. ముంబయిలో ఉండే ప్రముఖ న్యాయవాది నానీ పాల్కీవాలాతో సాల్వే కుటుంబానికి బాగా పరిచయం. సాల్వేల ఖాతాదారులకు కార్పొరేట్‌ ఒప్పందాలూ, పన్నుల అంశాల్లో న్యాయపరమైన చిక్కులు వస్తే ఆయన్నే సంప్రదించేవారు. ఆయన వీరి ఇంటికీ వచ్చేవారు. అలా పదేళ్ల వయసునుంచీ పాల్కీవాలాను చూస్తూ పెరిగారు హరీశ్‌.

పాల్కీవాలా శిష్యరికం
హరీశ్‌ సీఏకి సిద్ధమవుతున్న రోజుల్లో ఆయన తండ్రి కార్యాలయానికి, పన్నులకు సంబంధించిన ఓ కేసు వచ్చింది. ఆ సమయంలో ఎన్‌కేపీ సాల్వే దిల్లీ వెళ్లారు. అప్పటికి కార్యాలయంలో ఉన్న ఎన్‌కేపీ స్నేహితుడొకరు హరీశ్‌ను ఆ కేసుకు సంబంధించిన నోట్‌ ప్రిపేర్‌ చెయ్యమన్నారు. ఎన్‌కేపీ దిల్లీ నుంచి వచ్చాక ఆ నోట్‌ చదివి, అది రాసింది హరీశ్‌ అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అది ఎంతో అనుభవజ్ఞులు రాసినట్లుంది. దానిపైన పాల్కీవాలా అభిప్రాయం కూడా తీసుకోవాలనుకున్నారు. ‘‘ముంబయి వెళ్లి పాల్కీవాలాకి ఆ నోట్‌ చూపించాం. అది నేను రాశానని నాన్న చెప్పారు. నోట్‌ చదివాక నావైపు చూసి చిన్నగా నవ్వి ‘నువ్వు ఈ వృత్తిలోకి ఎప్పుడు వస్తున్నావు’ అని అడిగారాయన’’ అంటూ ఆ సంఘటనను గుర్తుచేసుకుంటారు హరీశ్‌. ఆ సంవత్సరమే నాగ్‌పూర్‌లోనే ‘లా’ చదివిన హరీశ్‌, 1978లో దిల్లీ వెళ్లి ‘జె.బి.దాదాచంద్‌జీ అండ్‌ కో’ సంస్థలో ఇంటర్న్‌గా చేరారు. ఆపైన న్యాయవాదిగానూ పనిచేశారు. 1980లో సీఏ కూడా పూర్తిచేశారు. అలా తాత, తండ్రి- ఇద్దరి వారసత్వాన్నీ అందిపుచ్చుకున్నారు హరీశ్‌. దాదాచంద్‌జీకి పనిచేస్తున్నపుడు కొన్ని కేసులకు సంబంధించి పాల్కీవాలా దగ్గరకు ఆ సంస్థ హరీశ్‌ను పంపేది. ఆయన దగ్గర శిష్యరికం చేయడం తన జీవితాన్నే మార్చేసిందంటారు హరీశ్‌. న్యాయశాస్త్రంతోపాటు వ్యక్తిగతంగానూ ఆయనపైన పాల్కీవాలా ముద్ర ఉంది. ‘కేసుని గెలిచామా లేదా అన్నదానికంటే ఎంత బాగా మన వాదనను వినిపించామన్నదే ముఖ్యమ’న్న పాల్కీవాలా మాటలే తనను ముందుకు నడిపిస్తాయంటారు. ‘చర్చిల్స్‌ ఆర్ట్‌ ఆఫ్‌ పర్సు్యయేషన్‌’ గురించి ఆయన దగ్గరే నేర్చుకున్నానంటారు. ఏదైనా విషయంలో ఒకరిని ఒప్పించాలంటే ఆ విషయాన్ని చాలా తేలికైన మాటల్లో, సులభమైన పద్ధతిలో వివరించాలన్న పాల్కీవాలా సూచనను ఇప్పటికీ అవలంబిస్తారు హరీశ్‌. పాల్కీవాలా ఫొటోని తన టేబుల్‌ మీద పెట్టుకునే హరీశ్‌ కీలకమైన కేసుల సమయంలో ఆ ఫొటోని ఒకటికి పదిసార్లు చూస్తూ స్ఫూర్తి పొందుతానని చెబుతారు.

సొలిసిటర్‌ జనరల్‌గా
పాల్కీవాలా సూచనతో తర్వాత కాలంలో సోలీ సొరాబ్జీ దగ్గర చేరారు హరీశ్‌. సీఏ కావడం, పన్నుల అంశాలపైన మొదట్నుంచీ అవగాహన ఉండటంతో అలాంటి కేసుల్లో అక్కడి మిగతా న్యాయవాదులకంటే ఒకడుగు ముందుండేవారు. ఆయన దగ్గర ఆరేళ్లు పనిచేశాక సుప్రీం కోర్టులో సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1992లోనే హరీశ్‌ను సీనియర్‌ న్యాయవాదిగా సుప్రీం కోర్టు గుర్తించింది. సోలీ అటార్నీ జనరల్‌గా ఉన్నపుడు 1999లో సొలిసిటర్‌ జనరల్‌గా హరీశ్‌ పనిచేశారు. ఆ పదవిలో మూడేళ్లు ఉన్నారు. ఆ సమయంలో పెట్టుబడుల ఉపసంహరణ కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించి గెలిచారు. ప్రపంచ వాణిజ్య సంస్థతో వివిధ ఒప్పందాలపైన చర్చలు జరిపారు. విద్యుత్‌ బిల్లు రూపకల్పనలో భాగమయ్యారు. ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ చట్టాల రూపకల్పనలో పాల్గొన్నారు. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసుల్లో కోర్టుకు సలహాదారుగానూ ఉన్నారు. సొలిసిటర్‌ జనరల్‌గా ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చినా హరీశ్‌ కొనసాగలేదు. లాయర్‌గా ప్రాక్టీసు కొనసాగించి అనతి కాలంలోనే సుప్రీం కోర్టులో తిరుగులేని న్యాయవాదిగా పేరు సంపాదించారు. తనకు ధన దాహం లేదనీ, తానెప్పుడూ ఆత్మ ప్రబోధం ప్రకారమే నడుచుకుంటాననీ చెప్పే హరీశ్‌ విలువలకు కట్టుబడి ఎన్నో కేసుల్ని- ముఖ్యంగా క్రిమినల్‌ కేసుల్ని తిరస్కరించారు. పర్యావరణానికి సంబంధించిన కేసుల్లో సలహాదారుగా ఉండమని 2011లో సుప్రీంకోర్టు హరీశ్‌ను నియమించింది. అయితే ఆ విభాగంలో ఉన్న కొన్ని సంస్థల తరఫున అదివరకు వాదనలు వినిపించిన కారణంగా తాను ఆ బాధ్యతలు తీసుకోలేనని కోర్టుకు వివరించి తప్పుకున్నారు.

ఓటమి నుంచే పాఠాలు
సీనియర్‌ న్యాయవాది అయినందున జడ్జిలు కూడా హరీశ్‌ వాదన విలువైనదిగా ఉంటుందని భావిస్తారు, ఉండాలని ఆశిస్తారు. అందువల్ల ఏ కేసునూ తాను తేలిగ్గా తీసుకోనంటారు హరీశ్‌. అలాగని కేసులో ఓడిపోవడాన్ని పరాజయంగా భావించననీ వృత్తిలో అవన్నీ సహజమనీ చెబుతారు. గెలుపుకంటే ఓటమి తనకు ఎక్కువ పాఠాలు నేర్పిస్తుందంటారు. సీఏ పరీక్షల్లో మూడు సార్లు తప్పాననీ, కొన్ని కేసుల్లో ఓటమిని చూశాననీ, అవన్నీ తనను మరింత దృఢంగా తయారుచేశాయనీ చెబుతారు. విదేశీ న్యాయసేవల్ని అనుమతించాలంటూ దానివల్ల మన దగ్గరా న్యాయసేవల నాణ్యత పెరుగుతుందంటారు. న్యాయవాదులు నిత్య విద్యార్థులుగా ఉండాలని చెప్పే హరీశ్‌ తన కేసుకు మాత్రమే పరిమితం కాకుండా రోజూ కోర్టుకి వెళ్లి వివిధ కేసుల్లో వాదోపవాదాల్ని వింటారు. అలా విన్నపుడు ఎన్నో కొత్త కోణాలు తెలుస్తాయనీ, కొత్త ఆలోచనలు వస్తాయనీ చెబుతారు. అలా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చంటారీ నిత్య విద్యార్థి.

హరీశ్‌ వాదించిన కేసులు...
హరీశ్‌ ఖాతాదారుల్లో ముకేశ్‌ అంబానీ, టాటా గ్రూప్‌, ఐటీసీ, జయలలిత, ములాయం సింగ్‌ యాదవ్‌, సల్మాన్‌ ఖాన్‌, లలిత్‌ మోదీ తదితర ప్రముఖులెందరో ఉన్నారు. గుజరాత్‌ అల్లర్ల సమయంలో జాతీయ మానవ హక్కుల సంఘం తరఫున బిల్కిస్‌ బానోవైపు వాదనలు వినిపించారు. ఆ కేసులో కోర్టు 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కేసులో ముకేశ్‌ తరఫున హరీశ్‌, అనీల్‌ తరఫున దిగ్గజ లాయర్‌ రాం జఠ్మలానీ కేసు వాదించారు. అందులో ముకేశ్‌కు అనుకూలంగా తీర్పువచ్చింది. 2012లో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకూ వొడాఫోన్‌కూ మధ్య పన్ను చెల్లింపుల కేసులో వొడాఫోన్‌ తరఫున వాదించి ఆ సంస్థకు రూ.15 వేల కోట్ల పన్ను భారం పడకుండా కేసు గెలిచారు. వొడాఫోన్‌ కేసుని వాదించే క్రమంలో కొద్ది రోజులు ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న లండన్‌కి వెళ్లి అక్కడ పనిచేశారు. మొదట బొంబాయి హైకోర్టులో ఈ కేసు ఓడిపోయిన హరీశ్‌, తర్వాత సుప్రీం కోర్టులో వాదించి గెలిచారు. నీరా రాడియా టేపుల లీకేజీ వ్యవహారంలో రతన్‌టాటా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందంటూ వేసిన కేసులో రతన్‌టాటా తరఫున వాదించారు. రోడ్డు ప్రమాదం కేసులో సల్మాన్‌ఖాన్‌కు సెషన్స్‌ కోర్టు అయిదేళ్ల కారాగార శిక్ష విధించిన కొన్ని గంటల్లోనే బొంబాయి హైకోర్టులో తన వాదనను వినిపించి అతడికి బెయిల్‌ వచ్చేలా చేశారు. ఆరోషి హత్య కేసులో తల్వార్ల తరఫున వాదించారు. ప్రపంచంలోనే ఖరీదైన న్యాయవాదుల్లో ఒకరిగా హరీశ్‌కు పేరుంది. కేసునిబట్టి రోజుకు రూ.10-30 లక్షల వరకూ వసూలు చేస్తారు. కానీ, గోద్రా నిందితులపైన ‘పోటా’ను ఉపసంహరింపజేయడం, దిల్లీలో ‘సిరి ఫోర్ట్‌ కాంప్లెక్స్‌’ పరిసరాల్లో చెట్లు కొట్టకుండా దిల్లీ ప్రభుత్వాన్ని అడ్డుకోవడం తదితర కేసుల్లో స్వచ్ఛందంగా వాదించారు. ఆన్‌లైన్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పెట్టేవారికి కారాగార శిక్ష అమలుచేసేలా ఉన్న ‘సెక్షన్‌ 66ఎ’ను సుప్రీంకోర్టు కొట్టేయడంలో కీలకపాత్ర పోషించారు. శ్రేయా సింఘాల్‌ అనే న్యాయశాస్త్ర విద్యార్థిని కేసులో వాదనను వినిపించి ఈ విజయం సాధించారు. హరీశ్‌ వాదించిన, గెలిచిన ముఖ్యమైన కేసులు ఇంకెన్నో. ఎన్ని విజయాలు సాధించినా- పాల్కీవాలాతో పోల్చితే తాను ఆయనలో నాలుగోవంతు కూడా కాదంటారు వినమ్రంగా.

దేశం మెచ్చిన కేసు 

కులభూషణ్‌ జాదవ్‌ శిక్ష నిలిపివేత... టీవీల్లో, పత్రికల్లో ఈ పతాక వార్త చూసిన, చదివిన వారందరూ, ఎవరీ హరీశ్‌ సాల్వే అని తప్పక అనుకొని ఉంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌ వాదనను హరీశ్‌ ఎంత నిదానంగా, ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా వినిపించారో, అది వింటూ పాక్‌ తరఫు న్యాయవాది ఎంతలా గందరగోళపడ్డారో తెలియాలంటే ఆ వాదనల వీడియోల్ని చూసి తీరాల్సిందే. జాదవ్‌ కేసులో ఖరీదైన లాయర్‌ని ఎందుకు పెట్టారని సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చినపుడు ఈ కేసు వాదించడానికి హరీశ్‌ ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేసి ఆశ్చర్యపరిచారు.

సుప్రీం కోర్టుతోపాటు వివిధ రాష్ట్రాల హైకోర్టులూ, అంతర్జాతీయ పరిష్కారాల కోర్టుల్లోనూ వాదనలు వినిపించిన అనుభవం హరీశ్‌ సొంతం. అణ్వాయుధాలు కలిగి ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తోందంటూ గతేడాది ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ మార్షల్స్‌ ఐలాండ్స్‌’ భారత్‌ సహా మరికొన్ని దేశాల మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది. ఆ సమయంలో భారత వాదనలు వినిపించి కేసు గెలిచిన ముగ్గురు న్యాయవాదుల బృందంలో హరీశ్‌ ఒకరు.

ఇంకొంత

ద్మ భూషణ్‌(2015) గ్రహీత. హరీశ్‌ క్రిస్టియన్‌, ఆయన భార్య మీనాక్షి హిందూ. వీరికి ఇద్దరు అమ్మాయిలు. సాక్షి, సానియా. సానియా భర్త ముస్లిం. తమది అచ్చమైన భారతీయ కుటుంబం అని గర్వంగా చెబుతారు.
* హరీశ్‌ తండ్రి ఎన్‌పీకే సాల్వే కాంగ్రెస్‌ నాయకుడు. తల్లి అంబ్రితి వైద్యురాలు.
* అటార్నీ జనరల్‌గా ఉండమంటూ మోదీ ప్రభుత్వం అవకాశమిచ్చినా సున్నితంగా తిరస్కరించారు.
* ఆపిల్‌ నుంచి కొత్తగా ఐఫోన్‌, ఐపాడ్‌... ఏ టెక్‌ సాధనం మార్కెట్‌లోకి వచ్చినా 48 గంటల్లో అది హరీశ్‌ చేతికి వచ్చేస్తుంది.
* ప్రతి వేసవికీ విహార యాత్రకు లండన్‌ వెళ్తారు.
* ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జిలలో న్యాయశాస్త్ర విద్యార్థులకు పాఠాలు చెప్పాలనే హరీశ్‌ కోరిక ఇంకా తీరలేదు.
* పియానో వాయించడం ఇష్టం. రోజు కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లాక కాసేపు పియానో వాయిస్తూ సేదదీరుతారు.
* రోజూ వ్యాయామానికి గంట సమయం కేటాయిస్తారు. పనికన్నా వ్యాయామం ముఖ్యమని చెప్పే హరీశ్‌ మూడేళ్ల కిందట ఏడాది వ్యవధిలో 20 కిలోలు తగ్గారు.
* రిలయన్స్‌ సంస్థకు ఎలాంటి న్యాయ సమస్య ఎదురైనా, ఆ ఫైల్‌ హరీశ్‌ టేబుల్‌మీదకు వచ్చేస్తుంది. అందుకే రిలయన్స్‌కు వ్యతిరేకంగా వాదించడమంటే తనకు మనసు రాదని చెబుతారు.
* ఇంటినుంచి ఆఫీసుకు బెంట్లే కారులో, ఆఫీసు నుంచి కోర్టుకు రేంజ్‌ రోవర్‌లో వెళ్తారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.