close


సమీక్ష

పండుగ పాటల్లో పరమార్థాలు

ప్రకృతితో మనిషికున్న సంబంధాన్ని ప్రదర్శించే బతుకమ్మ పండుగ శిల్పం, సంగీతం, సాహిత్యం, నర్తనం- అనే నాలుగు కళల సమాహారం. ఆ సందర్భంగా పాడుకునే పాటల పరిణామక్రమమూ వాటిల్లో స్త్రీల మనోభావాల గురించీ పరిశోధనచేసి వెలువరించిన పుస్తకమిది. బతుకమ్మ, బొడ్డెమ్మల పుట్టుపూర్వోత్తరాలతో మొదలుపెట్టి ఆటా పాటా ప్రసాదాల వివరాల్ని తెలిపారు. యాడాదికోసారి చందమామ/నువ్వొచ్చిపోవమ్మ చందమామ... అంటూ అటు బతుకమ్మనీ ఇటు ఇంటి ఆడపడచునీ ఉద్దేశించి పాడటం నుంచీ, పల్లెటూళ్లల్ల ఉయ్యాలో/బడిలేకపాయెనే ఉయ్యాలో... అంటూ సమస్యల్నీ చేర్చడందాకా పలు వివరాల్ని విశ్లేషించారు.
- పద్మ

బతుకమ్మ పాటలలో స్త్రీల మనోభావాలు;
రచన: తిరునగరి దేవకీదేవి
పేజీలు: 487; వెల: రూ.300/-;
ప్రతులకు: ఫోన్‌-99496 36515

ఆణిముత్యాలు

ఇతివృత్తమూ శైలీ శిల్పాల గురించి సృజనాత్మకంగా ఆలోచించి అక్షరయజ్ఞంతో పాఠకులను మెప్పించే రచయిత తాను సృష్టించిన పాత్రే ఎదురొస్తే ఏం చేస్తాడు? తాను చేసే తప్పుల్ని ఆ పాత్ర ఎత్తి చూపితే ఆ రచయిత పరిస్థితేమిటో చెబుతుంది ‘ద్వాదశి’. ‘ఏదైనా నేను మాత్రమే అధిరోహించాలి, అందరికన్నా ఎత్తుగా కనపడాల’నుకున్న మనిషి అపారమైన సంపద కూడబెట్టి చివరికి ఎక్కడ తేలాడో ‘పిరమిడ్‌’లో చూడవచ్చు. వీధికుక్కల్లో హింసాప్రవృత్తి ఎందుకు పెరిగిందో, తల్లిని చంపి దాని పిల్లల్ని సాకే బాధ్యత తలకెత్తుకున్న సెవ్వన్న సమాజానికిచ్చిన సందేశమేంటో ‘అతడి బాధ’ చెబుతుంది. కథాసాహితి వారి 28వ కథల సంకలనం ‘కథ 2017’లోని ఒక్కో కథా ఒక్కో ఆణిముత్యం. ఆపకుండా చదివించడమే కాదు, ఆలోచింపజేస్తాయి. 15 ఉత్తమ కథలతోపాటు బోనస్‌గా మాగోఖలే శతజయంతిని పురస్కరించుకుని ప్రచురించిన ‘బల్లకట్టు పాపయ్య’నీ ఈ పుస్తకంలో చదువుకోవచ్చు.
- శ్రీ

కథ-2017
సంపాదకులు: మధురాంతకం నరేంద్ర, అట్టాడ అప్పల్నాయుడు
పేజీలు: 232; వెల: రూ.80/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

నాగరత్నమ్మ జీవితం

కన్నడసీమలో పుట్టి తమిళనాడులోనూ పేరొందిన సంగీత, నృత్య కళాకారిణి- బెంగుళూరు నాగరత్నమ్మ. ఎనభై ఏళ్ల జీవితకాలంలో రచయిత్రిగానే కాక,  అలనాటి దేవదాసీల అంతరంగ ఆవిష్కర్తగానూ నిలిచారు. ఆ ‘విద్యాసుందరి’ జీవితాధార నవల ఇది. తిరువయ్యూరులో కావేరి ఒడ్డున త్యాగయ్య సమాధి వద్ద నాగరత్నమ్మాళ్‌ శిలావిగ్రహం నేటికీ కనిపిస్తుంది. ఈ అన్నింటి స్ఫూర్తితో తెలుగీకరించారు ఈ జీవిత చారిత్రక రచనని. అత్యంత పేదస్థితి నుంచి సంపన్నస్థితికి చేరిన ఆమె కడపటి రోజుల్లో సన్యాసినిగా మారడాన్నీ, కులవ్యవస్థా లింగవివక్షా సామాజిక దురన్యాయమూ తదితరాలతో ఆమె సాగించిన పోరాటాన్నీ అక్షరీకరించారు.
- శరత్‌

త్యాగరత్న (నవల)
రచన: ఆచార్య మలెయూరు గురుస్వామి
అనువాదం: రంగనాథ రామచంద్రరావు
పేజీలు: 297; వెల: రూ.250/-
ప్రతులకు: ఫోన్‌- 70938 00678

సందేశాత్మక కథలు

అపార్థాలూ అవమానాలూ ఆశలూ ప్రలోభాలూ ఉపాయాలూ ఊహలూ... ఇలా మధ్యతరగతి మనిషి జీవితానుభవాలనే కథలుగా మలిచారు రచయిత. ఒకరిని అకారణంగా చిన్నచూపు చూసి తర్వాత ఆ వ్యక్తి సాయంతోనే గండం గట్టెక్కితే మనలో కలిగే పశ్చాత్తాపానికి ప్రతిరూపమే ‘రెండు కళ్లు’. ఆర్థికస్తోమత గురించి ఆలోచించకుండా అన్నీ కావాలని కోరుకునేవారికి గుణపాఠం ‘ఇన్‌స్టాల్‌మెంటు’. ఆర్థికమాంద్యం సృష్టించిన సుడిగుండంలో అల్లాడిపోయిన దాంపత్యజీవితాన్ని కళ్లకు కడుతుంది ‘నిరీక్షణ’. ఇష్టంలేని పెళ్లిళ్లు చేస్తే కలిగే కష్టాలను కళ్లముందుంచుతుంది ‘మనసు-మనువు’. ఇలా ప్రతి కథా మనకో, మన చుట్టూ ఉన్నవారికో ఎదురైన అనుభవంలానే తోస్తుంది.
- వీరా

రెండు కళ్లు (కథలు)
రచన: దూరి వెంకటరావు
పేజీలు: 140; వెల: రూ.90/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.