close


వాట్సాప్ కథ

ట్రంకు పెట్టె

ఆ దంపతులకి పెళ్లయి అరవై ఏళ్లయింది. పెళ్లిరోజుని చక్కగా జరుపుకోవాలనుకున్నారు. ఇద్దరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. ముద్ద మందారాన్ని తలలో తురుముకుందామె. సువాసనలు వెదజల్లే అత్తరు రాసుకున్నాడాయన. ఇద్దరూ గుడికి వెళ్లి దేవుడికి నమస్కరించారు. మరో పద్దెనిమిది పెళ్లిరోజులు జరుపుకోవాలని కోరుకున్నాడు పెద్దాయన. అప్పటికి ఆయనకు నూరేళ్లు వస్తాయి. ఆమె మరో 22 పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంది. ఇద్దరూ గుడిబయటకొచ్చి అరుగుమీద కూర్చున్నారు. దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ప్రసాదాన్ని అతడి చేతిలో పెడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆమె. అయ్యయ్యో అనుకుంటూ భార్యను ఆసుపత్రిలో చేర్పించాడు భర్త. డాక్టర్లు పరీక్షించి ‘వయసు పైబడటం వల్ల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది, ఎంతోకాలం బతకదు, ఉన్నంతకాలం బాగా చూసుకోండి’ అన్నారు. చేసేదేంలేక ఇంటికి తీసుకొచ్చిన భర్త ఆమెకు జాగ్రత్తగా సపర్యలు చేయసాగాడు. ఆమె కళ్లలోకి చూస్తూ ‘దాపరికం లేని మనసు’ అనుకున్నాడు. నిజంగా ఆమె అతనితో అన్నీ  పంచుకునేది. ఒకే ఒక్కటి మాత్రం దాచిపెట్టింది. అదే ట్రంకు పెట్టె. అటక మీద ఉంది. ‘పెట్టె విషయం అడగకండి. అందులో ఏముందో చూడాలనుకోకండి’ అని గట్టిగా చెప్పడంతో దాన్లో ఏముందో తెలుసుకోవాలని మనసు ఎంత పీకుతున్నా ఇంతకాలం భర్త ఊరుకున్నాడు. ‘ఇక, ఇప్పుడు తప్పదు చూడాల్సిందే’ అనుకుని ఆ విషయమే ఆమెకు చెప్పాడు. ‘అలాగే చూడండి...’ అందామె. ఆ పెట్టెను తెరవగా రెండు స్వెటర్లూ మూడులక్షల రూపాయలూ కనిపించాయి భర్తకు. ఇవేంటని అడిగాడు. భార్య దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగింది... ‘పెళ్లయి మీతో పాటుగా నేనిక్కడికి వస్తున్నపుడు మా అమ్మ నన్ను చాటుగా పిలిచి ఓ మాట చెప్పింది. మీ ఆయనతో ఎప్పుడూ పోట్లాడకు. ఒకవేళ అతడి మీద పట్టరానంత కోపం వస్తే స్వెటరు అల్లుకుంటూ కూర్చో. అది పూర్తయ్యేటప్పటికి కోపం ఎలాగూ పోతుందని చెప్పింది. అమ్మ చెప్పినట్లుగానే ఇన్నాళ్లూ చేశాను’ అందామె. ఆ మాటలకి భర్త ఆనందానికి అవధుల్లేవు. రెండు స్వెటర్లనూ ప్రేమగా చేతిలోకి తీసుకుని, ‘అరవై సంవత్సరాల వైవాహిక జీవితంలో నా భార్య నాతో పోట్లాడాలనుకుంది రెండే సార్లన్నమాట. నేనెంత గ్రేట్‌’ అనుకుని, మూడులక్షల రూపాయల సంగతి ఆరా తీశాడు. అందుకామె... ‘ఈ అరవయ్యేళ్లలో నేను అల్లిన స్వెటర్లు అమ్మగా వచ్చినవి’ అంది. అతడు కళ్లు తేలేశాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.