ఇంటర్నెట్ డెస్క్: మీ స్నేహితుడు, మీరు ఒకేసారి ఒకే మోడల్ ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారు. ఇద్దరి ఫోన్లలోను దాదాపు ఒకే విధమైన యాప్స్ వాడుతున్నారు. కానీ మీ ఫోన్‌తో పోలిస్తే స్నేహితుడి ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఎంతో స్పీడ్‌గా ఉంటోంది. కారణమేంటని అడిగితే నవ్వుతూ నేను పవర్ యూజర్నంటూ కాలర్ ఎగరేశాడు. ఇంతకీ పవర్ యూజర్ అంటే ఎవరు.. దాని వల్ల ఉపయోగాలేంటి.. వాళ్లు ఏం చేస్తారు. ఆండ్రాయిడ్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ వేగంగా పనిచేయాలంటే ఏం చేయాలి. ఇలాంటి సందేహాలకు సమాధానాలు కావాలంటే కిందకో లుక్కేయండి మరి..
పవర్ యూజర్ (Power User)
సాధారణ కంప్యూటర్ యూజర్ కంటే భిన్నంగా ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం కలిగి అడ్వాన్స్డ్ పీచర్స్ ఉన్న కంప్యూటర్ హార్డ్‌వేర్/సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టం, ప్రోగ్రామ్స్, వెబ్‌సైట్స్, ఇతర ఎలాక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించే వారిని పవర్ యూజర్ అంటారు. మరి మీరు క్రోమ్‌ని పవర్ యూజర్లా ఉపయోగించాలంటే ఈ టిప్స్ గురించి తెలుసుకోవాలి.
ఎక్స్పరిమెంటల్ ఫీచర్స్ (Experimental Features)
ఈ ఎక్స్పరిమెంటల్ ఫీచర్స్‌నే ఫ్లాగ్స్ అని అంటారు. బ్రౌజర్ పనితీరును మెరుగుపరిచేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఫ్లాగ్స్ వినియోగాన్ని సెర్చ్ ఇంజిన్ కంపెనీలు అధికారికంగా ధ్రువీకరించకపోడం వల్ల వీటి గురించి సాధారణ యూజర్స్‌కి పెద్దగా అవగాహన ఉండదు. అంతేకాకుండా వీటిని క్రోమ్ బ్రౌజర్లో ఎనేబుల్ చేసిన తర్వాత గూగుల్ ఏ క్షణంలోనైనా వీటిని తొలగించే అవకాశం ఉంది. దాని వల్ల క్రోమ్‌తో పాటు ఇతర యాప్స్‌లో కూడా సమస్యలు రావొచ్చు. ఒకవేళ అదే జరిగితే తిరిగి ఫ్లాగ్స్‌ని డిసేబుల్ చేసి ఎప్పటిలానే బ్రౌజర్‌ని ఉపయోగించుకోవచ్చు.
అంతేకాదు ఈ ఫ్లాగ్స్‌ని ఎనేబుల్ చేస్తే మీ బ్రౌజర్ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. అలానే బ్రౌజర్లో సెక్యూరిటీ, ప్రైవసీ సెట్టింగ్స్ మారిపోతాయి. అయినప్పటికీ మీరు ఫ్లాగ్స్‌ని..అదేనండీ ఎక్స్పరిమెంటల్ ఫీచర్స్‌ని ఉపయోగించాలంటే మీ క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి యుఆర్‌ఎల్‌లో chrome://flags అని టైప్ చేయండి. కింద మీకు ఎక్స్పరిమెంట్స్ జాబితా కనిపిస్తుంది. వాటిలో దేన్ని ఎనేబుల్ చేయాలని గందరగోళంగా ఉందా. అందుకే మీకు ఉపయోగపడే బ్రౌజింగ్ టిప్స్‌తో పాటు కొన్ని ఫ్లాగ్స్ ఎంపిక చేశాం.
ట్యాబ్ స్విచర్ (Tab Switcher)
ఆండ్రాయిడ్ ట్యాబ్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే డెస్క్‌టాప్ తరహాలో ఓపెన్ చేసిన ట్యాబ్స్ ఒకదాని పక్కన ఒకటి కనిపిస్తాయి. అదే మొబైల్ ఫోన్లో అయితే బ్రౌజర్ పై భాగంలో నంబర్‌తో చిన్న బాక్స్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు ఓపెన్ చేసిన ట్యాబ్స్ కనిపిస్తాయి. అలా కాకుండా మొబైల్లో కూడా ట్యాబ్స్ జాబితాలా కనిపించాలంటే ట్యాబ్ స్విచర్ ఫ్లాగ్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇందుకోసం ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యుఆర్‌ఎల్‌లో Chrome://flags/#enable-accessbiity-tab-switcher అని టైప్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే ట్యాబ్ స్విచర్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసి బ్రౌజర్‌లోకి వెళ్తే ఓపెన్ చేసిన ట్యాబ్లన్ని జాబితాలా కనిపిస్తాయి.
బ్రౌజర్ డేటా డిలీట్ (Clear Browsing Data)
బ్రౌజింగ్ చేసిన తర్వాత హిస్టరీ డిలీట్ చేయాలంటే 24 గంటలు, ఏడు రోజులు, నాలుగు వారాలు లేదా ఆల్ టైం అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటితో పాలు 30 రోజుల క్రితం హిస్టరీని డిలీట్ చేసే ఆప్షన్ ఉంటే. దీని కోసం మీరు బ్రౌజర్ అడ్రస్ బార్లో Chrome://flags/#clear-old-browsing-data అని టైప్ చేయాలి. తర్వాత ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసి బ్రౌజర్ క్లోజ్ చేసి, తిరిగి ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లో క్లియర్ బ్రౌజింగ్ డేటాపై క్లిక్ చేస్తే మీకు ఓల్డర్ దేన్ 30 డేస్ (Older Than 30 Days) ఆప్షన్ కనిపిస్తుంది.
క్రోమ్ హోం (Chrome Home)
మీ ఫోన్లో బ్రౌజర్ యూఆర్ఎల్ ఎప్పుడూ పైన ఉండటం చూసి మీకు బోర్ అనిపిస్తోందా.. సరదాగా యూఆర్ఎల్ విండోలో కింద ఉంటే బావుండనిపిస్తోందా. అయితే ఈ ఫ్లాగ్ మీ కోసమే. క్రోమ్ బ్రౌజర్లో Chrome://flags/#enable-chrome-home అని టైప్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే ఎనేబుల్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి బ్రౌజర్ రీఓపెన్ చేస్తే యూఆర్ఎల్ బ్రౌజర్ విండోలో కింద కనిపిస్తుంది. యుఆర్‌ఎల్‌ని పైకి జరిపితే డౌన్లోడ్, బుక్‌మార్క్ లాంటివి కనిపిస్తాయి.
వెబ్‌పేజ్ టు పీడీఎఫ్ పేజ్ (Save Webpage As PDF)
వెబ్‌పేజ్‌లను తర్వాత చదివేందుకు వీలుగా ఫోన్లో సేవ్ చేసుకుంటాం. అయితే ఈ వెబ్‌పేజ్‌లను పీడీఎఫ్లా కూడా సేవ్ చేసుకోవచ్చు. తర్వాత వాటిని వేరే డివైజ్‌లకు పంపొచ్చు. ఇందుకోసం క్రోమ్ బ్రౌజర్లో మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వెబ్ పేజ్ ఓపెన్ చేసి షేర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అందులో ప్రింట్‌పై క్లిక్ చేసి సేవ్ పీడీఎఫ్ సెలెక్ట్ చేయాలి. తర్వాత సేవ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఫైల్ని మీకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసి చదువుకోవచ్చు.
సెర్చ్ ఇంజిన్ (Search Engine)
ఆండ్రాయిడ్ ఫోన్లలోని పాత వెర్షన్ క్రోమ్‌లో గూగుల్, యాహూ, బింగ్, ఆస్క్, ఏవోఎల్లను మాత్రమే డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్లుగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఉండేది. కానీ ఇప్పటి క్రోమ్‌లో అలా కాదు. మీకు నచ్చిన సెర్చ్ ఇంజిన్‌ను డిఫాల్ట్‌గా బ్రౌజర్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి అందులో మీరు డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా కావాలనుకుంటున్న వెబ్పేజ్ని ఓపెన్ చేయాలి. తర్వాత క్రోమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెర్చ్ ఇంజిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఓపెన్ చేసిన సెర్చ్ ఇంజిన్ పేరు కింద రీసెంట్లీ విజిటెడ్లో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే అది మీ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా మారిపోతుంది.
డునాట్ ట్రాక్ (Do Not Track)
ఫోన్లో బ్రౌజింగ్ చేసేప్పుడు గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. దీని వల్ల మీరు ఆన్లైన్లో చేస్తున్న పనిని ట్రాక్ చేయలేరు. ఈ ఫీచర్ కోసం క్రోమ్ సెట్టింగ్స్‌లో అడ్వాన్స్‌డ్‌లో ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డు నాట్ ట్రాక్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేస్తే సరిపోతుంది. అలా మీరు ఎలాంటి ఆందోళన లేకుండా మొబైల్లో బ్రౌజింగ్ చేసుకోవచ్చు.