వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యాపిల్‌ వాచ్‌
close

Published : 20/10/2020 19:40 IST
వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యాపిల్‌ వాచ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనిషి రోజు వారీ జీవితంలో టెక్నాలజీ భాగమైపోయింది. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. అయితే, అది మనం ఉపయోగించుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. సక్రమంగా ఉపయోగిస్తే అది మనిషి ప్రాణాలను సైతం కాపాడుతుందనడానికి ఉదాహరణ తాజా ఘటన. యాపిల్ స్మార్ట్‌వాచ్‌ సాయంతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వృద్ధుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ విషయం తెలిసి ఆయన త్వరగా కోలుకోవాలని యాపిల్ సీఈవో టిమ్‌ కుక్‌ ఆకాక్షించారు. 

ఇండోర్‌కు చెందిన 61 ఏళ్ల రాజన్‌ అనే రిటైర్డ్ ఫార్మా ఉద్యోగి. ఆయన కొంతకాలంగా తన కొడుకు బహమతిగా ఇచ్చిన యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 5ను ఉపయోగిస్తున్నారు. ఒక రోజు రాజన్‌ అస్వస్థతకు గురికావడంతో యాపిల్‌ వాచ్‌లో ఉండే ఎలక్ట్రో కార్డియోగ్రాం (ఈసీజీ) ఫీచర్‌ను ఉపయోగించి హార్ట్‌బీట్ చెక్‌ చేసుకుని రిజల్ట్‌ను తన ఫ్యామిలీ డాక్టర్‌తో షేర్‌ చేసుకున్నారు. రిపోర్ట్‌ పరిశీలించిన డాక్టర్‌ రాజన్‌ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారని, గుండె పనితీరు సరిగానే ఉందని తెలిపారు. మళ్లీ కొద్ది రోజులకు హార్ట్‌బీట్‌లో తేడా గమనించిన రాజన్‌ మరోసారి యాపిల్‌ వాచ్‌తో ఈసీజీ చెక్‌ చేసి డాక్టర్‌కు పంపారు. ఈ సారి గుండె తక్కువ వేగంతో కొట్టుకుంటోందని, ఆయనకు హార్ట్‌ ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని వైద్యుడు సూచించాడు.

కొవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా ఆపరేషన్‌ వాయిదా పడటంతో రాజన్‌ రోజూ క్రమం తప్పకుండా యాపిల్‌ వాచ్‌తో ఈసీజీ చెక్‌ చేసి డాక్టర్‌కు పంపుతుండేవారట. కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రిలో రాజన్‌కు హార్ట్‌ ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు రాజన్ కొడుకు సిద్దార్థ్‌ తెలిపారు. ఆపరేషన్‌కు ముందు తన తండ్రి ఈసీజీ చెక్‌ చేసుకునేందుకు యాపిల్‌ వాచ్‌ ఎంతో ఉపయోగపడిందని వెల్లడించారు. అంతేకాదు ఈ విషయాన్ని ఆయన ఈ-మెయిల్ ద్వారా యాపిల్ సీఈవో టిమ్ కుక్‌కు తెలియజేశారు. విషయం తెలుసుకున్న టిమ్‌ కుక్‌ రాజన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. యాపిల్‌ వాచ్‌ లాంటి డివైజ్‌ సాయంతో టెక్నాలజీ ద్వారా వైద్యాన్ని వృద్ధులకు మరింత చేరువ చెయ్యొచ్చని సిద్దార్థ్‌ అభిప్రాయపడ్డాడు. తన తండ్రి లాంటి వారికి ఇది జీవితాన్ని మార్చే ఉత్పత్తని తెలిపాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న