5జీ వార్‌‌: వివో వి20 ప్రో vs వన్‌ప్లస్ నార్డ్
close

Published : 04/12/2020 14:15 IST

5జీ వార్‌‌: వివో వి20 ప్రో vs వన్‌ప్లస్ నార్డ్


 

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రాకముందే 5జీ ఫోన్ల తయారీపై మొబైల్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే ధర ఎక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలుచేసేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరచలేదు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే 5జీ ఫోన్ తయారీపై మొబైల్ కంపెనీలు దృష్టి సారించినప్పటికీ.. వాటి ధరలూ రూ.20 వేల మార్కు పైనే ఉన్నాయి. దీంతో 5జీ బడ్జెట్ ఫోన్ అంటే రూ. 30 వేల లోపు ధర పెట్టాల్సిన పరిస్థితి. తాజాగా వివో కూడా వి20 ప్రో పేరుతో కొత్త 5జీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ వన్‌ప్లస్‌ నార్డ్‌తో పోటీపడనుంది. ఈ నేపథ్యంలో వివో వి20 ప్రో, వన్‌ప్లస్‌ నార్డ్ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఏ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి? వాటి ధరలెంత వంటి విషయాలు ఒక్కసారి చూద్దాం.

డిజైన్‌

5జీ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో మిగతా వాటితో పోలిస్తే వి20 ప్రోనే సన్నగా ఉంటుందని వివో తెలిపింది. ప్లాస్టిక్‌ ఫ్రేమ్‌తో ఫోన్ పైన కింద గ్లాస్‌తో కప్పబడి ఉంటుంది. ఫోన్ వెనక కుడి వైపు ట్రిపుల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫోన్ ముందు భాగంలో రెండు సెల్ఫీ కెమెరాల కోసం నాచ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఇక వన్‌ప్లస్ నార్డ్ విషయానికొస్తే ప్లాస్టిక్‌, గ్లాస్‌తో కూడిన పంచ్‌ హోల్ డిస్‌ప్లే ఉంది. వెనక కుడి వైపు క్వాడ్ కెమెరా ఇస్తున్నారు. రెండు మోడల్స్‌లో ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ ఫీచర్ ఉంది. కానీ ఈ ఫోన్లకు వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఇవ్వలేదు.

ఫీచర్స్‌

ఈ రెండు ఫోన్లలోను క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 765జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నార్డ్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ఓఎస్‌ 11తో పనిచేస్తే వి20 ప్రో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్‌11తో పనిచేస్తుంది. వివో ఫోన్‌లో 6.44-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. వన్‌ప్లస్‌లో 6.44-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 5 ఇస్తున్నారు. వి20 ప్రో 8జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్  వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. కానీ నార్డ్‌ 6జీబీ ర్యామ్‌/64జీబీ, 8జీబీ ర్యామ్‌/128జీబీ, 12జీబీ ర్యామ్‌/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది.

కెమెరా

వి20 ప్రోలో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనక మూడు, ముందు రెండు కెమెరాలు ఇస్తున్నారు. వెనక 64 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సర్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 44 ఎంపీ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో పాటు 8 ఎంపీ వైడ్‌ యాంగిల్ కెమెరా అమర్చారు. నార్డ్‌లో ఆరు కెమెరాలు ఇస్తున్నారు. వెనక నాలుగు, ముందు రెండు ఉన్నాయి. వెనక వైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్‌ కెమెరా, 5 ఎంపీ డెప్త్ సెన్సర్ కెమెరా ఇస్తున్నారు. సెల్ఫీల కోసం ముందు 32 ఎంపీ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అమర్చారు.

బ్యాటరీ, ధర

వి20 ప్రోలో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 33 వాట్‌ ఫ్లాష్‌ఛార్జ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇక నార్డ్‌లో 4,115 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30టీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ధర విషయానికొస్తే వివో వి20 ప్రో ధర రూ. 29,990. మిడ్‌నైట్ జాజ్‌, సన్‌సెట్ మెలోడి రంగుల్లో లభిస్తుంది. వన్‌ప్లస్‌ నార్డ్ వేరియంట్స్‌ ధర రూ. 24,999, రూ.27,999, రూ. 29,999గా కంపెనీ నిర్ణయించింది. బ్లూ మార్బుల్, గ్రే యాష్, గ్రే ఆనిక్స్‌ రంగుల్లో నార్డ్ లభిస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న