గూగుల్ డాక్స్‌లో వీటిని ప్రయత్నించారా..
close

Updated : 31/08/2020 10:49 IST
గూగుల్ డాక్స్‌లో వీటిని ప్రయత్నించారా..

ఇంటర్నెట్‌డెస్క్: కంప్యూటర్‌లో ఓ చిన్న డాక్యుమెంట్ తయారు చేయాలన్న ఇప్పటికీ మనలో చాలా మంది మొగ్గు చూపేది మైక్రోసాఫ్ట్ వర్డ్‌పైనే. అయితే ప్రస్తుత ప్రపంచం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వైపు పరుగులు తీరుస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ వర్డ్‌కు ప్రత్యామ్నాయంగా ఉచితంగా లభిస్తోన్న మరో టూల్ గూగుల్  డాక్స్‌. వర్డ్‌లోలానే ఇందులో కూడా  వివిధ రకాల టెక్ట్స్‌ ఫార్మాట్లను ఉపయోగించి డాక్యుమెంట్లను తయారు చేసుకోవచ్చు. దాదాపు వర్డ్‌ తరహాలోనే ఉండే డాక్స్‌లో కూడా ఒకే తరహా ఫీచర్స్‌ ఉంటాయి. అయితే గూగుల్ డాక్స్‌లో మీరు తయారు చేసే డాక్యుమెంట్లను మరింత సులభంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఫీచర్స్ మరికొన్ని ఉన్నాయి. అవేంటో ఒక సారి చూసేయండి మరి...

ఫార్మాటింగ్

మనం డాక్యుమెంట్‌లో ఏదో ఒక విషయానికి సబంధించిన సమాచారం టైప్ చేస్తాం. అయితే దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని వేరే చోటు నుంచి తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ముందుగా టైప్‌ చేసిన టెక్ట్స్‌ ఫార్మాట్, వేరే చోటు నుంచి కాపీ చేసిన టెక్ట్స్‌ ఫార్మాట్ వేరుగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు కొత్త టెక్ట్స్‌ మొత్తం సెలెక్ట్ చేసి ఫాంట్ సైజు, ఫార్మాట్ మారుస్తారు. ఈ పనిని మరింత సులభంగా చేసేందుకు గూగుల్ డాక్స్‌లో ‘క్లియర్‌ ఫార్మాటింగ్’ అనే ఆప్షన్ అందుబాటులో ఉంది. మీరు వేరొక చోటు నుంచి టెక్ట్స్‌ యాడ్ చేసిన వెంటనే డాక్యుమెంట్‌లో పైనున్న టెక్ట్స్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే అందులో మీకు చివర క్లియర్‌ ఫార్మాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్‌ చేస్తే ముందుగా మీరు టైప్‌ చేసిన ఫార్మాట్ రూపంలోకి మీరు కొత్తగా యాడ్ చేసిన టెక్ట్స్‌ మొత్తం మారిపోతుంది.

వాయిస్‌ టైపింగ్

ఎంత జాగ్రత్తగా టైప్‌ చేసినా ఎక్కడో ఒక చోట తప్పులు పోతూనే ఉంటాయి. ఈ టైపింగ్ కష్టాలను తొలగించేందుకు గూగుల్ డాక్స్‌లో ‘వాయిస్‌ టైపింగ్’ అనే ఫీచర్ అందుబాటులో ఉంది. దీని సహాయంతో ఎలాంటి తప్పులు లేకుండా డాక్యుమెంట్ రూపొందించుకోవచ్చు. గూగుల్ డాక్స్ ఓపెన్ చేసి టూల్స్‌లోకి వెళ్తే  వాయిస్‌ టైపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే క్రోమ్‌ బ్రౌజర్‌ కుడి వైపున మైక్‌ సింబల్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేసి ఎనేబుల్ ఆప్షన్‌ సెలెక్ట్ చేసి వాయిస్‌ టైపింగ్‌ ద్వారా మీకు కావాల్సిన టెక్ట్స్‌ను డాక్యుమెంట్‌లో పొందుపరుచుకోవచ్చు.

డార్క్‌మోడ్

డాక్యుమెంట్ రూపొందించేప్పుడు కళ్లకు ఎక్కువ శ్రమ కలగకుండా ఉండేందుకు ఇందులో డార్క్‌మోడ్ ఫీచర్ అందుబాటులో ఉంది. కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపున పై భాగంలో ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళితే థీమ్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దానిని క్లిక్‌ చేస్తే డార్క్‌, లైట్, సిస్టం డీఫాల్ట్‌ అనే ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వాటిలో డార్క్‌ను సెలెక్ట్ చేస్తే మీరు టైప్‌ చేస్తున్న విండో మొత్తం డార్క్‌మోడ్‌లోకి మారిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

రెడీమేడ్ టెంప్లేట్లు

మీరు తయారు చేసే డాక్యుమెంట్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలంటే, గూగుల్‌ డాక్స్‌లో ఉన్న మరో ఫీచర్‌ రెడీమేడ్‌ టెంప్లేట్స్‌. రెజ్యూమ్‌, ప్రాజెక్టు ప్రపోజల్స్‌, లీగల్‌ డాక్యుమెంట్లు లాంటి అనేక రకాల రెడీమేడ్‌ టెంప్లేట్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో మనకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకుంటే, దాని లే అవుట్‌, ఫార్మేటింగ్‌ ఉన్నది ఉన్నట్లు మన ఫైల్‌కు అప్లై అవుతుంది. అలాగే డీఫాల్ట్‌గా ఉండే ఫాంట్లతో సరిపెట్టుకోవాల్సిన పని లేదు. మనకు నచ్చిన మరిన్ని వెబ్‌ ఫాంట్లను కూడా దీంట్లో వాడుకోవచ్చు.

సులువుగా సెర్చ్‌

మనకు ఏదో ఒక టాపిక్‌కు సంబంధించిన సమాచారాన్ని డాక్స్‌లో టైప్ చేస్తున్నాం. ఇంతలో మరికొంత సమాచారం కావాలి, ఇందుకోసం మనం వెంటనే గూగుల్ విండో ఓపెన్‌ చేసి అవసరమైన సమాచారం కోసం సెర్చ్‌ చేస్తాం. అయితే ఇలా ప్రతిసారి డాక్స్‌ నుంచి బయటికి వచ్చి గూగుల్‌లో సెర్చ్‌ చేయకుండా డాక్స్‌లోనే అందుకు సంబంధించిన సమాచారం గురించి వెతికేందుకు ‘ఎక్స్‌ప్లోర్‌’ అనే ఫీచర్‌ అందుబాటులో ఉంది. గూగుల్ డాక్స్‌లో కొత్త డాక్యుమెంట్ సెలెక్ట్‌ చేసిన తర్వాత పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్‌ చేస్తే మీకు ఒక లిస్ట్ కనిపిస్తుంది. అందులో ఎక్స్‌ప్లోర్‌పై క్లిక్‌ చేస్తే సెర్చ్‌ ఆప్షన్ ఉంటుంది. అందులో మీకు కావాల్సిన సమాచారాన్ని  సులభంగా వెతుకవచ్చు.

ట్రాన్స్‌లేషన్ ఈజీగా

ఒక భాషలో ఉన్న సమాచారాన్ని మరొక భాషలోకి తర్జుమా చేయడం కోసం గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ సర్వీస్‌ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా దాన్ని ఓపెన్‌ చేయాల్సిన పని లేకుండా, గూగుల్‌ డాక్స్‌లో ప్రస్తుతం మీరు టైప్‌ చేస్తున్న డాక్యుమెంట్‌ను మీకు కావలసిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. దీని కోసం టూల్స్‌ మెనూలో ఉండే ట్రాన్స్‌లేట్‌ డాక్యుమెంట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.

సలహాలకు ఉందో దారి..

ఒక వేళ ఎవరైనా షేర్‌ చేసిన డాక్యుమెంట్‌లో మీరు మార్పులు చేయాలనుకుంటున్నారు. అయితే మీరు ఎడిట్ చేసిన డాక్యుమెంట్‌ను మరోసారి వారికి పంపి దాన్ని వాళ్లు చూసి ఓకే చేసే వరకు వేచి చూడాలి. అలానే అందులో మీరు చేసిన మార్పులు వాళ్లకు తెలియాలంటే రెండింటిని పక్కన పెట్టి ప్రత్యేకంగా వెతుక్కోవాల్సి ఉంటుంది. అలాకాకుండా మీరు ఎడిట్  చేసిన మార్పులు వారికి సులభంగా తెలిస్తే మరింత సులభంగా పనైపోతుంది కదా. అందుకోసమే గూగుల్ డాక్స్‌లో సజెస్టింగ్ అనే ఫీచర్‌ ఉంది. డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎడిటింగ్‌ అనే ఐకాన్‌పై క్లిక్‌ చేసి సజెస్టింగ్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే డాక్యుమెంట్‌లో మీరు చేసిన మార్పులు ప్రత్యేకమైన రంగులో హైలైట్ అవుతాయి. దానిని వారు చూసి యాక్సెప్ట్‌ చేస్తే మీరు చేసిన మార్పులు అలానే ఉంటాయి. ఒక వేళ రిజక్ట్ కొట్టారనుకోండి ఎప్పటిలానే పాత టెక్ట్స్‌ ఉండిపోతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న