వాట్సాప్‌లో కొత్త మోసం..పాటించాల్సిన జాగ్రత్తలివే  
close

Published : 23/11/2020 17:09 IST
వాట్సాప్‌లో కొత్త మోసం..పాటించాల్సిన జాగ్రత్తలివే  

ఇంటర్నెట్ డెస్క్‌: జైత్ర ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి. ఒక రోజు ఆఫీస్‌లో ఉండగా అతని మొబైల్‌కి తన స్నేహితుడి పేరుతో తెలియని నంబర్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. తన ఫోన్‌ నంబర్‌ పనిచేయడంలేదని.. వాట్సాప్‌ ఖాతా వేరే ఫోన్‌లో ఉపయోగించేందుకు ఓటీపీ కోసం నీ ఫోన్‌ నంబర్‌ ఇచ్చానని..ఆ ఓటీపీ తనకు మెసేజ్‌ చేయమని దాని సారాంశం. తర్వాత స్నేహితుడి చెప్పినట్లుగానే జైత్ర ఫోన్‌ నంబర్‌కి వాట్సాప్‌ నుంచి ఓటీపీ వచ్చింది. దాన్ని స్నేహితుడికి చెప్పటానికి ఫోన్‌ చేస్తే తన ఫోన్ బానే పనిచేస్తుందని..ఎలాంటి ఓటీపీ కోసం ఎవరి ఫోన్‌ నంబర్ ఇవ్వలేదని స్నేహితుడు చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే వాట్సాప్‌ కస్టమర్‌కేర్‌కి ఫోన్‌ చేస్తే అది ఓటీపీ స్కాం అని తెలిసింది. ఇంతకీ ఏంటీ ఓటీపీ స్కాం..దీన్ని నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.

ఏంటీ ఓటీపీ స్కాం

మీరు కొత్తగా ఫోన్‌ కొన్నారు. పాత ఫోన్‌ నుంచి వాట్సాప్‌ను కొత్త ఫోన్‌లోకి మార్చుకోవాలి. అప్పుడు ఫోన్ నంబర్‌ వెరిఫికేషన్‌ కోసం వాట్సాప్‌ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేస్తే మీ కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ వెరిఫికేషన్‌ ఓటీపీల ఆధారంగా హ్యాకర్స్‌ వాట్సాప్‌ యూజర్స్‌ లక్ష్యంగా సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు.

పైన చెప్పినట్లుగానే మీ స్నేహితులు లేదా బంధువులు లేదా తెలిసిన వ్యక్తుల పేరుతో హ్యాకర్స్‌ మీకు తెలియని నంబర్‌ నుంచి మెసేజ్‌ పంపుతుంటారు. అందులో ఫోన్ నంబర్‌ పనిచేయట్లేదనో లేదా పొరపాటునా మీ నంబర్ ఇచ్చానంటారు. అలా మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ తమకు మెసేజ్‌ చేయమని ఉంటుంది. ఒక వేళ మీరు ఆ ఓటీపీ వాళ్లకు పంపితే వెంటనే మీ ఫోన్‌లో వాట్సాప్‌ ఖాతా నుంచి మీరు లాగౌట్ చేసినట్లు మీకు మెసేజ్‌ వస్తుంది. అంటే మీ వాట్సాప్‌ ఖాతాను హ్యాకర్స్‌ మరో డివైజ్‌లో వేరే నంబర్‌తో లాగిన్ అయి ఉపయోగిస్తుంటారు. దాంతో మీ వాట్సాప్ ఖాతా వివరాలు పూర్తిగా వాళ్ల చేతికి చేరిపోయినట్లే. దాని వల్ల మీరు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఓటీపీ కోసం వచ్చే మెసేజ్‌లు మీకు తెలిసిన వ్యక్తుల వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ ఖాతాల నుంచి కూడా వస్తుంటాయి. అంటే అప్పటికే వారి వాట్సాప్‌ ఖాతా హ్యాక్‌ అయిందని గుర్తించాలి. అలా మీ ఖాతాలో ఉన్న కాంటాక్ట్స్‌ సహాయంతో మరొకరి ఖాతాను ఇదే తరహాలో హ్యాక్‌ చేస్తారు.

మరి ఈ సమస్యకు పరిష్కారం

ముందు మీరు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది వాట్సాప్‌ ఖాతా వెరిఫికేషన్‌ కోసం మీరు ఫోన్ నంబరు ఇస్తేనే మీకు ఓటీపీ వస్తుంది. రెండోది మీరు అడగకుండా వాట్సాప్‌ ఎలాంటి ఓటీపీ పంపదు. కాబట్టి మీరు ఫోన్ నంబరు ఇవ్వకుండా ఓటీపీ వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అలానే మీకు తెలిసిన వ్యక్తుల పేరు మీద ఓటీపీ కోసం మీ ఫోన్ నంబరుకి మెసేజ్‌ వస్తే అది నిజమో కాదో నిర్థారించుకోండి. అలానే మీ వాట్సాప్‌ ఖాతాకు టూ-స్టెప్‌ వెరిఫేకేషన్‌ను ఎనేబుల్ చేయండి. దాని వల్ల ఓటీపీతో పాటు ఖాతా వెరిఫికేషన్‌కి ప్రత్యేక పిన్‌ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల పొరపాటున మీరు ఓటీపీ పంపినా పిన్‌ నంబరు ఉండదు కాబట్టి మీ ఖాతాను హ్యాక్‌ చేయలేరు. ఒక వేళ ఓటీపీ పంపి మీ ఖాతా హ్యాక్ అయితే వెంటనే మీ వాట్సాప్‌ని రీసెట్ చేసి తిరిగి లాగిన్ అవ్వండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న