ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఎంపిక ఎలా
close

Updated : 26/10/2020 13:57 IST
ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఎంపిక ఎలా

ఇంటర్నెట్‌డెస్క్‌: మీరు కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఏది తీసుకోవాలి, ఎలాంటి ఫీచర్లు, కెమెరా, ప్రాసెసర్‌ ఇలా చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. అందుకే స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకునేముందు ఏయే అంశాలు పరిగణలోకి తీసుకోవాలి వంటి విషయాలు మీ కోసం!


బడ్జెట్ ఎంత?

ఫోన్‌ ఎంపికలో ఎంత ధరలో కొనుగోలు చేయాలనుకుంటున్నారనేది ముఖ్యం. ఎందుకంటే మార్కెట్‌లో రూ.5 వేలు నుంచి రూ. లక్షన్నర వరకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవసరానికి మించి ఖర్చు చేసి తర్వాత బాధపడే కంటే ముందే బడ్జెట్‌ ఎంతనేది నిర్ణయించుకోవాలి. కేవలం ఫోన్‌ మాట్లాడటం, ఫొటో/వీడియోల కోసం అయితే రూ.10 వేల ధరలో కూడా మంచి ఫీచర్లున్న ఫోన్లు ఉన్నాయి. అలా కాకుండా ప్రాసెసర్‌, మెమొరీ, ర్యామ్‌ వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చేట్లయితే రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పెట్టాల్సిందే. 


ఫొటోలు బాగుండాలంటే..

కెమెరా మీ ప్రయారిటీ అయితే.. అందులో సెల్ఫీ కెమెరా, ప్రైమరీ కెమెరాలు ఎంత మెగాపిక్సెల్‌తో ఇస్తున్నారు వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సెల్ఫీ ప్రియుల కోసం అత్యుత్తమ ఫీచర్లతో సెల్ఫీ కెమెరాలు ఇస్తున్నాయి. నైట్‌ మోడ్‌, ఏఐ బ్యూటీ లాంటి ఫీచర్లు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఎక్కువ మెగాపిక్సల్‌ ఉండి, నాసిరకం లెన్స్‌ ఉంటే ఉపయోగం ఉండదు. కాబట్టి కెమెరా లెన్స్‌ సంగతిపై కూడా దృష్టి పెట్టాలి.


బ్యాటరీ సామర్థ్యం ముఖ్యం

కొత్త ఫోన్‌ కొనేముందు పరిగణలోకి తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం బ్యాటరీ. రోజులో ఫోన్‌ను ఏ అవసరాల కోసం, ఎంతసేపు వాడతారనేది చెక్‌ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి రోజులో ఎంటర్‌టైన్‌మెంట్, ఛాటింగ్‌, వీడియో కాల్స్‌ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తాడనుకుంటే 4,500 ఎంఏహెచ్‌/ 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్న ఫోన్‌ కొనుక్కోవడం మంచిది. ప్రస్తుతం మార్కెట్లో 5K ఎంఏహెచ్‌ నుంచి 7K ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే 5K ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్లు రూ.10వేల నుంచి ఉంటే, 7K బ్యాటరీ ఫోన్లకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.


ప్రాసెసర్‌ సరైంది కాకపోతే...

ఎక్కువసేపు ఫోన్‌ మాట్లాడినా, వీడియోలు చూసినా గతంలో మొబైల్‌ వేడెక్కడం, హ్యాంగ్ అవ్వడం వంటివి జరిగేవి. దాంతో ప్రతి సారి ఫోన్‌ను రీస్టార్ట్‌ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్లతో అటువంటి సమస్య పెద్దగా ఉండటం లేదు. ఇందుకు కారణం అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్స్‌. స్మార్ట్‌ఫోన్‌ కొనేముందు ముఖ్యంగా పరిశీలించాల్సింది ప్రాసెసర్. భారత్‌లో విడుదలవుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లు ఎక్కువగా మీడియాటెక్‌ హీలియో లేదా క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌తో వస్తున్నాయి. గేమింగ్‌ కోసం కొన్ని మొబైల్స్‌ సంస్థలు ప్రత్యేకమైన ప్రాసెసర్లతో మొబైల్స్‌ తీసుకొస్తున్నాయి. మీ అవసరాన్ని చూసుకొని దానికి తగ్గట్టు ప్రాసెసర్ ఉన్న మొబైల్‌‌ తీసుకోవాలి.


డిస్‌ప్లే ముఖ్యమే

కొత్త ఫోన్‌ కొనేప్పుడు కొంతమంది ధర, ర్యామ్‌, మెమొరీ, కెమెరా, ప్రాసెసర్‌ మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంటారు. కానీ కీలకమైన డిస్‌ప్లేను పట్టించుకోరు. మంచి డిస్‌ప్లే లేని ఫోన్ కొనుగోలు చేసినా అందులో వీడియో, గేమింగ్ క్వాలిటీని ఆస్వాదించలేరు. అందుకే ఎన్ని అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారనే అంశంతోపాటు, స్క్రీన్‌ రెజెల్యూషన్‌ ఎంత అనేది కూడా చూసుకోవాలి. ఫుల్ హెచ్‌డీ+ ప్లస్‌ డిస్‌ప్లేతో పాటు అమోలెడ్, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. వీడియోలు ఎక్కువగా చూసే అలవాటు ఉంటే 2K, 4K రిజల్యూషన్ ఫోన్లను ఎంచుకుంటే మంచిది.


5జీ టెక్నాలజీ కావాలి

భారత్‌లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రాకముందే మార్కెట్లో 5జీ ఫోన్ల సందడి మొదలయింది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఈ నెట్‌వర్క్‌ విడుదల కావడంతో మొబైల్‌ తయారీ కంపెనీలు 5జీ టెక్నాలజీ ఫోన్ల తయారీకి మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న ఫోన్లు 4జీ నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. 5జీ నెట్‌వర్క్‌ను వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని మొబైల్ నెట్‌వర్క్‌ కంపెనీలు భావిస్తున్నాయి. స్నాప్‌డ్రాగన్‌ 865 5జీ, స్నాప్‌డ్రాగన్‌ 765 5జీ, మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 5జీ ప్రాసెసర్ల‌తో ఫోన్లను తయారు చేస్తున్నారు. అందుకే ఫోన్ కొనేముందు అది 5జీ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న