యాప్‌ సాయం లేకుండానే స్పామ్‌ కాల్స్‌కి చెక్  
close

Published : 24/11/2020 14:40 IST
యాప్‌ సాయం లేకుండానే స్పామ్‌ కాల్స్‌కి చెక్  


ఇంటర్నెట్‌ డెస్క్: ఫోన్‌కి తెలియని నంబర్‌ నుంచి కాల్‌ వస్తే మనకు తెలిసినవారెవరో అవసరం ఉండి చేస్తున్నారని ఆలోచించకుండా లిఫ్ట్‌ చేస్తుంటాం. అవతలి నుంచి కస్టమర్‌ కేర్‌ వాయిస్‌ వినబడితేనో..లేదంటే మీ కోసం ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయనే మాట వినిపిస్తే పట్టరాని కోపం వస్తుంది. వీటినే స్పామ్‌ కాల్స్‌ అంటారు. అలా రోజులో మనకు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఇలాంటి కాల్స్‌ నుంచి తప్పించుకునేందుకు ఎన్నో రకాల థర్డ్‌ పార్టీ యాప్స్‌ ఉపయోగిస్తుంటాం. అయితే కొన్ని సార్లు యాప్‌లతో ఈ కాల్స్‌ని అడ్డుకోవడం కూడా కష్టమే. అలానే మనకు వచ్చే ప్రతి స్పామ్ కాల్‌ని బ్లాక్‌ చేయడం సాధ్యం కాని పని. ఈ నేపథ్యంలో థర్డ్‌ పార్టీ యాప్స్‌పై ఆధారపడకుండా స్పామ్‌ కాల్స్‌ను కట్టడి చేసేందుకు మీ ఫోన్‌లోనే అదిరిపోయే ఫీచర్‌ అందుబాటులో ఉంది. వీటిని ఉపయోగించి తెలియని నంబర్ల నుంచి మీకు వచ్చే కాల్స్‌ని ఎలా అడ్డుకోవాలో తెలుసుకుందాం..

ఆండ్రాయిడ్‌ యూజర్స్‌

సాధారణంగా అన్ని ఫోన్లలో కాలర్‌ ఐడీ, స్పామ్‌ ప్రొటెక్షన్ ఫీచర్‌ డిసేబుల్ చేసి ఉంటాయి. అయితే యూజర్స్‌ వీటిని ఎనేబుల్ చేయాలి. ఇందుకోసం ఫోన్ యాప్‌ ఓపెన్ చేసి కుడి వైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళితే కాలర్‌ ఐడీ అండ్ స్పామ్‌ (Caller ID & Spam) అని కనిపిస్తుంది. దాన్ని ఆన్‌ చేస్తే స్పామ్‌ నంబర్లను సులభంగా గుర్తించి వాటిని అడ్డుకుంటుంది. అంతేకాకుండా ఇందులో ఫిల్టర్‌ సస్పెక్టెడ్‌ స్పామ్‌ కాల్స్‌ (Filter Suspected Spam Calls)ని ఎనేబుల్ చేస్తే స్పామ్‌ కాల్స్‌ని నోటిఫికేషన్లో కాకుండా కాల్‌ హిస్టరీలో చూపిస్తుంది. 

ఐఓఎస్‌ యూజర్స్‌

ఐఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్‌ యాప్‌పై క్లిక్ చేయాలి. యూప్‌లో కిందకి వస్తే సైలెన్స్‌ అన్‌నోన్ కాలర్స్‌ (Silence Unknown Callers) అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఆన్ చేస్తే మీకు తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే ఫోన్ రింగ్ అవ్వకుండా సైలెంట్ మోడ్‌లో ఉండిపోతుంది. ఒక వేళ వాళ్లు మెసేజ్‌ పంపినా సైలెంట్‌ మోడ్‌ ద్వారా మెసేజెస్‌లోకి కనిపిస్తుంది. కేవలం మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కి మాత్రమే ఫోన్ రింగ్ అవుతుంది.

ఒక వేళ మీరు ఈ ఫీచర్‌కి బదులు థర్డ్‌ పార్టీ యాప్స్‌ ఉపయోగించాలనుకుంటే ట్రూకాలర్‌ (TrueCaller), వైడ్‌ప్రొటెక్ట్ (Wideprotect), హియా (Hiya) వంటి యాప్స్‌ స్పామ్‌ కాల్స్‌ కట్టడికి అద్భుతమైన ఫీచర్స్‌ అందిస్తున్నాయి.  ట్రూకాలర్‌ యాప్‌ను భారత్‌లో ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే స్పామ్‌ కాల్స్‌ కట్టడికి ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్స్‌ కోసం ఈ యాప్‌లో కాల్‌ రీజన్ వంటి పలు రకాల కొత్త ఫీచర్స్‌ తీసుకొచ్చారు. ఇక వైడ్‌ప్రొటెక్ట్‌ యాప్‌ వివిధ ప్రాంతాల ఫోన్ కోడ్‌ ద్వారా స్పామ్‌ కాల్స్‌ని కట్టడి చేస్తుంది. ఉదాహరణకు మీరు అమెరికా నుంచి వచ్చే నంబర్లను బ్లాక్ చెయ్యాలనుకుంటున్నారు. యాప్ ఓపెన్ చేసి అందులో అమెరికా కోడ్ సెలెక్ట్‌ చేస్తే అక్కడి నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ బ్లాక్‌ అవుతాయి. హియా యాప్‌ కూడా ట్రూకాలర్‌ తరహాలోనే మీకు ఫోన్ చేస్తున్న వ్యక్తుల వివరాలను మీకు తెలియజేస్తుంది. అంతేకాదు తెలియని నంబర్‌ నుంచి వచ్చిన కాల్‌ని ఎవరైనా వ్యక్తులు చేశారా లేక ఆటోమేటిక్‌ (కంప్యూటర్‌ ఆపరేటెడ్ రోబో) కాల్‌ అనేది కూడా తెలుసుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న