గేమర్స్‌కి గుడ్‌ న్యూస్‌: కొత్త లుక్‌లో పబ్‌జీ
close

Updated : 12/11/2020 20:21 IST
గేమర్స్‌కి గుడ్‌ న్యూస్‌: కొత్త లుక్‌లో పబ్‌జీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: పబ్‌జీ అభిమానులకు శుభవార్త. త్వరలోనే ఈ గేమ్‌ని కొత్త లుక్‌తో పబ్‌జీ మొబైల్‌ పేరుతో భారత్‌లో విడుదల చేయనున్నట్లు పబ్‌జీ కార్పొరేషన్ తెలిపింది. అంటే గేమర్స్‌ పబ్‌జీలో ఇకపై కొత్త లుక్‌లో చికెన్‌ డిన్నర్‌ చేయొచ్చన్నమాట. కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియాకు చెందిన పబ్‌జీ మాతృ సంస్థ క్రాఫ్టన్‌ ఇన్‌కో కంపెనీ పబ్‌జీని తిరిగి తీసుకొస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో పబ్‌జీ గేమ్‌ కొత్తగా తీసుకురావడమే కాకుండా వంద మిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులు పెడుతున్నట్లు పబ్‌జీ కార్పొరేషన్ వెల్లడించింది. వీడియో గేమ్‌, ఈ-స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ కంపెనీల పరంగా పబ్‌జీ మొబైల్‌కు ఉన్న అతి పెద్ద మార్కెట్లలో భారత్‌ ఒకటని తెలిపింది.

‘‘పబ్‌జీ ఈస్పోర్ట్స్‌కి సంబంధించి భారత్‌లో వస్తున్న స్పందనకు ధన్యవాదాలు. మా కంపెనీ ద్వారా భారత్‌లో ఈ-స్పోర్ట్స్‌కి సంబంధించి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. ఇందులో భాగంగా కొత్తగా వంద మంది ఉద్యోగులను నియమించుకోనున్నాం’’ అని పబ్‌జీ కార్పొరేషన్‌ వెల్లడించింది. అయితే భారత మార్కెట్‌ కోసం కొత్తగా రూపొందించిన గేమ్‌ను ఎప్పుడు తీసుకొస్తున్నారనే దానిపై పబ్‌జీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. అలానే భారత్‌లో గేమర్స్‌ గోప్యత, భద్రత డేటాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని పబ్‌జీ కార్పొరేషన్ తెలిపింది.

గతంలో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్‌సెక్యూరిటీ ఆరోపణలతో కేంద్రం పబ్‌జీతో సహా చైనాకు చెందిన 117 యాప్‌లపై నిషేధం విధించింది. భారత ప్రభుత్వ చర్యలతో చాలా దేశాల్లో పబ్‌జీ పబ్లిషర్‌గా ఉన్న టెన్సెంట్‌తో క్రాఫ్టన్‌ సంస్థ ఒప్పందం రద్దు చేసుకుంది. తాజాగా మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకుని తిరిగి పబ్‌జీని భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు క్రాఫ్టన్‌ తెలిపింది. పబ్‌జీ గేమ్‌కు భారత్‌ సహా ప్రపంచ దేశాల్లో ఏ ఇతర గేమ్‌లకు లేనంతమంది అభిమానులున్నారు. నిషేధం విధించే సమయానికి భారత దేశంలోనే సుమారు 50 మిలియన్ల యాక్టివ్ యూజర్స్‌ ఉన్నారట.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న