close

Published : 22/11/2020 09:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాట్సాప్‌ కొత్త ఫీచర్లను గుర్తు చేసుకుందామా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ ఈ మధ్య కాలంలో కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. గ్రూపుల్లో వరుసగా మెసేజ్‌లు వస్తున్నట్లుగా ఫీచర్లు వరుస కడుతున్నాయి. అందుకే వాట్సాప్‌ ఇటీవల కాలంలో తీసుకొచ్చిన కొత్త కొత్త ఫీచర్ల గురించి మీకు గుర్తుచేద్దాం అనుకుంటున్నాం. ఈ క్రమంలో త్వరలో తీసుకురాబోతున్న ఫీచర్ల గురించి కూడా మాట్లాడేసుకుందాం. 

మల్టీపుల్ డివైజ్‌ సపోర్ట్

వాట్సాప్‌ను ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో ఉపయోగించుకునేలా మల్టీ డివైజ్‌ సపోర్ట్  ఫీచర్‌ తీసుకురావాలని యూజర్స్‌ ఎంతో కాలంగా కోరుతున్నారు. ఎట్టకేలకు వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. డెవలెప్‌మెంట్ దశలో ఉన్న మల్టీ డివైజ్‌ ఫీచర్‌తో ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ ఖాతాను లాగిన్‌ అవ్వొచ్చు. యూజ్‌ వాట్సాప్‌ ఆన్‌ అదర్‌ డివైజెస్‌ (Use WhatsApp on Other Ddevices) పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారట.

స్టోరేజ్‌ యూఐ కొత్తగా..

వాట్సాప్‌ స్టోరేజ్‌కి సంబంధించిన కొత్త యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)ను తీసుకొచ్చారు. ఇందులో ఏ ఫైల్స్‌ ఎంత మెమొరీ ఉన్నాయనేది విభాగాల వారీగా ఉంటుంది. ఉదాహరణకు 5ఎంబీ కన్నా ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్‌ మొదట కనిపిస్తాయి. వాటిలో అవసరం లేని వాటిని సులభంగా డిలీట్ చేయొచ్చు. ఒకవేళ వాట్సాప్ మెమరీ సరిపోకపోతే గూగుల్ ఫొటోస్‌, ఐక్లౌడ్, అమెజాన్ ఫొటోస్‌ వంటి థర్డ్‌ పార్టీ క్లౌడ్ సర్వీసుల్లో ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ని భద్రపరచుకోవచ్చు.

వెబ్‌ కాల్స్‌


(Photo Credit: WABetaInfo)

ఇప్పటివరకు మొబైల్‌ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన ఆడియో/వీడియో కాల్స్‌ ఫీచర్‌ను డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ తీసుకొస్తున్నారు. డెస్క్‌టాప్‌లో కాల్ వచ్చినప్పడు పాప్‌-అప్ విండోలో‌ కాల్ యాక్సెప్ట్‌/రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫీచర్‌ను డెస్క్‌టాప్‌లో ఉపయోగించాలంటే హెడ్‌సెట్, వెబ్‌కామ్‌ తప్పనిసరి.

వాట్సాప్‌ పేమెంట్స్‌

ఎన్నాళ్లనుంచో ఊరిస్తూ వచ్చిన వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్ ఇటీవల భారత్‌ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ పంపాడానికి ఉపయోగించే అటాచ్‌మెంట్ ఫీచర్‌ ద్వారా పేమెంట్స్‌ చెయ్యొచ్చు. అంతేకాదు నగదు బదిలీ, చెల్లింపులు యూపీఐ ద్వారా డైరెక్ట్‌గా బ్యాంక్‌ ఖాతా నుంచి జరుగుతాయి.

ఛాట్‌ చేస్తూ షాపింగ్

యాప్‌లో కొత్తగా షాపింగ్‌ బటన్‌ చేర్చారు. దానిపై క్లిక్ చేస్తే ఆ సంస్థలు అందించే వస్తువులు, సేవలకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా కొనుగోలుదారుడు నేరుగా వ్యాపారులతో ఛాట్ చేస్తూ షాపింగ్ చెయ్యొచ్చు. అలా మనకు నచ్చిన వస్తువుని సెలెక్ట్ చేసి పేమెంట్ ప్రాసెస్ కూడా వాట్సాప్‌ ద్వారా చేసుకునే సౌకర్యం ఉంది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌ను వ్యాపారానికి అనువైన వేదికగా మార్చాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం షాపింగ్ కొంత మంది యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది.

డిస్‌అపియరింగ్ మెసేజెస్‌

వాట్సాప్‌ కొత్తగా డిస్‌అపియరింగ్ మెసేజెస్‌ ఫీచర్‌ను ఇటీవల తీసుకొచ్చింది. మీరు పంపిన మెసేజ్‌లు ఏడు రోజుల లోపల వాటంతటవే డిలీట్ అయిపోతాయి. వ్యక్తిగత ఛాట్‌లతో పాటు, గ్రూప్‌ ఛాట్‌లను కూడా కనిపించకుండా చేయొచ్చు. దీని కోసం వాట్సాప్‌ కాంటాక్ట్‌పై క్లిక్‌ చేస్తే డిస్‌అపియరింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఆన్‌/ఆఫ్ ఉపయోగించి ఫీచర్ ఉపయోగించుకోవచ్చు.

మ్యూట్ వీడియో

ఇతరులకు పంపే వీడియోలతోపాటు, స్టేటస్‌లో పోస్ట్ చేసే వీడియోలను త్వరలో మ్యూట్‌ చేసే చేసేయ్యొచ్చు. వాట్సాప్‌లో వీడియో అటాచ్‌ చేశాక కింద ట్రిమ్మింగ్ బార్‌ కింద సౌండ్ సింబల్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే మీరు పంపుతున్న వీడియో మ్యూట్ అవుతుందట. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. త్వరలోనే యూజర్స్‌కి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం.

ఆరోపణలకు ఆధారాలు చూపాలి


(Photo Credit: WABetaInfo)

ఏదైనా వాట్సాప్ ఖాతా గురించి కానీ, స్పామ్ బిజినెస్‌ అకౌంట్ లేదా గ్రూప్‌పై మీకు అనుమానం ఉంటే వాట్సాప్‌కు రిపోర్ట్ చెయ్యొచ్చు. అయితే మీ రిపోర్ట్‌తో పాటు వారికి మీరు కొన్ని ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అంటే ఏ వాట్సాప్ అకౌంట్‌పై మీరు ఫిర్యాదు చేశారో ఆ యూజర్‌కి మీకు జరిగిన ఛాటింగ్‌ను సాక్ష్యంగా చూపించాలి. వాటిని పరిశీలించి మీ ఆరోపణలు నిజమైతే యూజర్‌ అకౌంట్‌పై వాట్సాప్‌ చర్యలు తీసుకుంటుంది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌లో వేధింపులకు చెక్‌ పెట్టోచ్చు. త్వరలోనే దీన్ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. 

ఇవే కాకుండా అల్వేజ్‌‌ మ్యాట్ బటన్, కస్టమ్‌ రింగ్‌టోన్‌ ఫీచర్స్‌ని కూడా వాట్సాప్‌ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆల్వేజ్‌‌ మ్యూట్ ఫీచర్‌తో ఏదైనా గ్రూప్‌ను పూర్తిగా మ్యూట్‌ మోడ్‌లో ఉంచొచ్చు. ఇక కస్టమ్‌ రింగ్‌టోన్ సహాయంతో వాట్సాప్‌ కాంటాక్ట్స్‌లో ఒక్కోదానికి నచ్చిన రింగ్‌టోన్ సెట్ చేసుకోవచ్చు. 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు