Apple iOS 15: నేడే యాపిల్ ఐఓఎస్‌ 15 విడుదల.. 10 ఆసక్తికర ఫీచర్లివే
close

Updated : 20/09/2021 11:08 IST
Apple iOS 15: నేడే యాపిల్ ఐఓఎస్‌ 15 విడుదల.. 10 ఆసక్తికర ఫీచర్లివే

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్ది రోజుల క్రితం ఐఫోన్‌ 13, వాచ్‌ 7 సిరీస్‌, కొత్త ఐపాడ్‌లను యాపిల్ విడుదల చేసింది. తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్‌ను ప్రకటించింది. యాపిల్ కొత్త ఓఎస్‌ ఐఓఎస్‌ 15ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సోమవారం రాత్రి 10:30 నుంచి యూజర్స్ తమ డివైజ్‌లలో ఈ కొత్త ఓఎస్‌ అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఐఫోన్లలో ఉన్న ఐఓఎస్‌ 14.8 ఓఎస్‌ స్థానంలో కొత్త ఐఓఎస్‌ 15ని డౌన్‌లోడ్ చేసుకోవాలని ఐఫోన్, ఐపాడ్ యూజర్లకి యూపిల్ సూచించింది. గత ఓఎస్‌లతో పోలిస్తే ఐఓఎస్‌ 15 మరిన్ని యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో రానున్నట్లు  టెక్‌ వర్గాలు తెలిపాయి. మరి ఐఓఎస్‌ 15 గురించి పది ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం. 

1. ఐఓఎస్‌ 15 ఓఎస్‌ ఏయే డివైజ్‌లను సపోర్ట్ చేస్తుందనే దానికి సంబంధించి యాపిల్ జాబితా విడుదల చేసింది. ఐఫోన్ 13 సిరీస్‌, ఐఫోన్ 12 సిరీస్‌, ఐఫోన్ 11 సిరీస్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌, ఐఫోన్ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్ ఎక్స్‌, ఐఫోన్ 8 సిరీస్‌, ఐఫోన్ 7 సిరీస్‌, ఐఫోన్ 6ఎస్‌ సిరీస్‌, ఐఫోన్ ఎస్‌ఈ (1&2వ జనరేషన్), ఐపాడ్ టచ్‌ 7వ జనరేషన్‌ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుందని యాపిల్ తెలిపింది. 

2.  యాపిల్ కొత్తగా తీసుకొస్తున్న ఈ ఓఎస్‌లో ఫేస్‌టైమ్‌ ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్, పీసీ యూజర్స్‌ కూడా పాల్గొనవచ్చు. ఐమెసేజెస్‌లో కూడా కీలక మార్పులు చేసింది. ఇతరుల నుంచి వచ్చే ఐమెసేజెస్‌లోని లింక్‌లు, ఫొటోలను సులువుగా ట్రాక్ చేయొచ్చు. 

3. ఐఓఎస్‌ కొత్త అప్‌డేట్‌లో యూజర్స్‌ నోట్స్‌కి ట్యాగ్‌ని యాడ్‌ చేసుకోవచ్చు. దానివల్ల వాటిని కేటగిరీలుగా విభజించటం తేలికవుతుంది. అలానే యూజర్‌ అన్ని కేటగిరీలను ఒకే చోట చూడగలరు. ఇందులోని స్మార్ట్‌ఫోల్డర్స్ ఫీచర్ ట్యాగ్‌ల ఆధారంగా నోట్స్ అన్నింటినీ ఒక చోట చూపిస్తుంది. దాంతో యూజర్ సులువుగా తనకు కావాల్సిన నోట్స్‌ని యాక్సెస్‌ చేయొచ్చు.

4. మ్యూట్ బటన్‌ టచ్‌ చేసిన ప్రతిసారీ మీకు అలర్ట్స్ సౌండ్ వినిపిస్తుంది. దీనివల్ల యూజర్స్ ట్రాకింగ్ పిక్సెల్స్‌ని బ్లాక్ చేయగలరు. యూజర్‌ మార్కెటింగ్‌కి సంబంధించిన ఈ-మెయిల్స్‌ ఓపెన్ చేసినప్పుడు వాటిని ఎప్పుడు ఓపెన్ చేశారు.. ఎంతసేపు ఓపెన్ చేసి ఉంచారనేది మార్కెటింగ్‌ కంపెనీలు పిక్సెల్‌ సాయంతో ట్రాక్ చేస్తాయి. దానివల్ల కొన్నిసార్లు యూజర్‌ డేటా కూడా సదరు కంపెనీలకు చేరిపోయే అవకాశం ఉంది.

5. కొత్త ఓఎస్‌లో వస్తోన్న మరో ఫీచర్ ఫోకస్‌. దీని సాయంతో యూజర్స్ తమ నోటిఫికేషన్‌ ప్రాధాన్యతలను కనిపించేలా మార్పులు చేయొచ్చు. అలానే మీ ప్రస్తుత పరిస్థితి ఆధారంగా ఫోన్‌ వైబ్రేట్ కావాలా, సౌండ్ చేయాలా.. వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. ఐమెసేజ్‌లోని కాంటాక్ట్స్‌కి మీ స్టేటస్‌ ఏంటనేది తెలియజేయడంతోపాటు మీ మెసేజ్‌లకు వారు ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నారనేది కూడా ఫోకస్‌ ఫీచర్‌ తెలియజేస్తుంది.

6. ఐఓఎస్‌ 15లో యాపిల్‌ మ్యాప్స్‌తో యూజర్స్ దారి తెలుసుకోవడంతోపాటు ఒక ప్రదేశానికి బయల్దేరిన, చేరిన సమయాన్ని కూడా తెలుసుకోవచ్చు.

7. సుమారు 100కు పైగా కొత్త ఎమోజీలను ఐఓఎస్‌ 15లో పరిచయం చేయనున్నారు. దీని సాయంతో యూజర్స్ మరింత మెరుగ్గా తమ భావాలను ఎమోజీల ద్వారా వ్యక్తపర్చవచ్చు. 

8. కొత్త అప్‌డేట్ చేసేప్పుడు అపరిమిత క్లౌడ్ స్టోరేజ్‌ని యూజర్స్ యాక్సెస్‌ చేయొచ్చు. మీరు కొత్త డివైజ్‌ కొనుగోలు చేసినా లేదా మీ డేటా బదిలీ చేయాలనుకున్నప్పుడు అపరిమిత క్లౌడ్ స్టోరేజ్‌ని పొందొచ్చు. అయితే దీనిపై ఎలాంటి పరిమితులు ఉంటాయనేది తెలియాల్సివుంది.

9. యూజర్స్ ఫొటోలపైన ఉండే టెక్ట్స్‌ని డైరెక్టుగా కాపీ, పేస్ట్, షేర్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఐఓఎస్‌ 15లో ఓసీఆర్ అనే ఫీచర్ ఇస్తున్నారు. 

10. కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌లో థెఫ్ట్‌ ప్రొటెక్షన్ ఫీచర్‌ ఉంది. ఫోన్‌ పోయినా, దొంగిలించినా, అందులోని సమాచారం తొలగించినా యూజర్‌ ఫోన్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు. అలానే దొంగిలించిన మీ యాపిల్‌ డివైజ్‌ని ఇతరులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే అందులో ‘ది హలో స్క్రీన్‌’ అనే ఫీచర్‌ సదరు డివైజ్‌ లాక్‌ అయిందని.. అది మరోకరిదనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇవేకాకుండా మరెన్నో ఆసక్తికర అప్‌డేట్‌లు ఐఓఎస్‌ 15లో రానున్నట్లు యాపిల్ తెలిపింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న