ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్-19 ప్రభావంతో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి విభిన్నమైన మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బినాటోన్ అనే కంపెనీ మాస్క్‌ఫోన్ పేరుతో కొత్త తరహా మాస్క్‌ని ‘కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో’ (సీఈఎస్) 2021లో ప్రదర్శించింది. ఈ మాస్క్‌లో ఎన్95 ఫిల్టర్‌తో పాటు వైర్లెస్ హెడ్సెట్, మైక్రోఫోన్ ఇస్తున్నారు. అంటే మాస్క్‌ని ధరించి ఫోన్ మాట్లాడుకోవడం, సంగీతం వినడం వంటివి చెయ్యొచ్చు. వస్త్రంతో తయారయిన మాస్క్ఫోన్ని కరోనాపై పోరులో భాగంగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న సిబ్బందికి ఎంతో ఉపయోగపడుతుందని బినాటోన్ తెలిపింది.
ఇందులో ఇయర్‌బడ్స్‌ని మాస్క్ లోపలి భాగంలో అమర్చిన వైర్‌తో అనుసంధానించారు. మాస్క్ లోపలి వైపు ఎన్95 ఫిల్టర్ ఉంటుంది. అలానే మాస్క్ బయట కుడి వైపు హెడ్సెట్ సౌండ్ కంట్రోల్స్, మైక్రోఫోన్‌ని అమర్చారు. దీనికి ఐపీఎక్స్5 సర్టిఫికేషన్ ఉంది. దీని వల్ల హెడ్సెట్ నీటిలో తడిచినా పాడవకుండా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎన్95 ఫిల్టర్, హెడ్‌సెట్‌ని తొలగించి అవసరమైనప్పుడు మాస్క్‌ని శుభ్రం చేసుకోవచ్చు. హెడ్సెట్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో పాటు అలెక్సా, సిరి, గూగుల్ అసిస్టెంట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎస్, ఎమ్, ఎల్ సైజుల్లో ఇది లభిస్తుంది. దీని ప్రారంభ ధర 50 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 3,600. త్వరలోనే అమ్మకాలు ప్రారంభమవుతాయని బినాటోన్ తెలిపింది.
ఇదీ చదవండి..
సీఈఎస్ 2021: తొలి రోజు హైలెట్స్..
వాట్సాప్ వద్దా..ఇవిగో వీటిని ప్రయత్నించండి..