WhatsApp: ఛాట్‌ డేటా క్లౌడ్‌ బ్యాకప్‌లో సురక్షితమేనా? 
close

Published : 05/08/2021 22:46 IST
WhatsApp: ఛాట్‌ డేటా క్లౌడ్‌ బ్యాకప్‌లో సురక్షితమేనా? 

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న చాట్ బ్యాక్‌అప్‌ ఫీచర్‌లో లోపాలు ఉన్నట్లు సైబర్ నిపుణులు పేర్కొన్నారు. సాధారణంగా వాట్సాప్‌లో జరిగే చాట్‌ సంభాషణలను చాట్‌ చేసే ఇద్దరు వ్యక్తులు మినహా వాట్సాప్‌తో సహా మూడో వ్యక్తి చూడలేరు. అలాగే గ్రూప్‌ చాట్‌లను అందులోని సభ్యులు మాత్రమే చూడగలరు. కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌లోని చాట్ డేటాను లోకల్ బ్యాకప్‌, గూగుల్ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ స్టోర్ చేసుకునేలా కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉందని, త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. దీనికి 64-డిజిట్ ఎన్‌క్రిప్షన్‌ కీతోపాటు ఎండ్‌-టు-ఎండ్ రక్షణ కల్పిస్తున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది. 

సైబర్‌ నిపుణులు మాత్రం క్లౌడ్‌లో స్టోర్‌ అయ్యే డేటాకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో భద్రత కల్పించడం సాధ్యపడదని అంటున్నారు. యూజర్‌ తన డేటాను క్లౌడ్‌లో స్టోర్‌ చేసిన తర్వాత దానికున్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ పోతుందని తెలిపారు. దీనివల్ల క్లౌడ్‌ స్టోరేజ్‌లో యూజర్‌ సేవ్‌ చేసిన డేటాను హ్యాకర్స్‌ యాక్సెస్ చేయగలరని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వాట్సాప్ పేజ్‌లో ఉన్నంత వరకే యూజర్ డేటాకు రక్షణ ఉంటుదని, క్లౌడ్‌ డ్రైవ్‌లో బ్యాకప్‌ చేసిన తర్వాత డేటాపై హ్యాకర్స్ దాడి చేసే అవకాశంలేకపోలేదని అంటున్నారు. ఇది పూర్తిగా యూజర్‌ డేటాను ప్రమాదంలోకి నెట్టే చర్యగా సైబర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై వాట్సాప్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతంలో కూడా క్లౌడ్ స్టోరేజ్ భద్రతకు సంబంధించి పలువురు సైబర్ నిపుణులు సందేహాలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో లోకల్ బ్యాకప్‌, క్లౌడ్ స్టోరేజ్‌ భద్రతపై వాట్సాప్ స్పందించాల్సి వుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న