Duck Duck Go: మీ ఈ-మెయిల్ ఖాతాలను ప్రొటెక్ట్ చేశారా? 
close

Updated : 23/07/2021 22:29 IST
Duck Duck Go: మీ ఈ-మెయిల్ ఖాతాలను ప్రొటెక్ట్ చేశారా? 

ఇంటర్నెట్‌డెస్క్: డేటా ప్రైవసీ..ప్రస్తుతం సాంకేతిక ప్రపంచంలో కలవరపెడుతున్న అంశం. వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాకింగ్‌ వివరాల వరకు ప్రతిదీ డిజిటలైజ్ చేస్తుండటంతో యూజర్ డేటానే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దీంతో సైబర్ నేరాల కట్టడికి టెక్ కంపెనీలు ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తూ.. యూజర్‌కి అవగాహన కల్పిస్తున్నాయి. తాజాగా డక్‌ డక్‌ గో సెర్చ్ ఇంజిన్ కూడా డేటా ప్రైవసీకి సంబంధించి మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ-మెయిల్ ప్రొటెక్షన్‌ పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. మరి యూజర్ డేటాకు ఇది ఎలా రక్షణ కల్పిస్తుందో తెలుసుకుందామా..! 

ఎలా పనిచేస్తుంది?
ఈ-మెయిల్ ప్రొటెక్షన్ అనేది మెయిల్ ఫార్వార్డింగ్‌ ఫీచర్. ఇందుకోసం @duck.com పేరుతో కొత్త డొమైన్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో ఎప్పటిలాగే మీ ఇతర మెయిల్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు మీరు జీమెయిల్‌, మైక్రోసాఫ్ట్, అవుట్‌లుక్ సేవలను ఉపయోగిస్తుంటే.. వాటితోపాటు డక్‌ డక్‌ గో డొమైన్‌తో క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మీ ప్రైమరీ మెయిల్ ఖాతాలకు డక్‌ డక్‌ గో మెయిల్‌ను లింక్ చేయాలి. అలా మీకు వచ్చే ఈ-మెయిల్‌ని డక్‌ డక్‌ గో స్కాన్ చేస్తుంది. ఒకవేళ  ఈ-మెయిల్స్‌లో లొకేషన్, డివైజ్‌, లాగిన్ వివరాలను తెలుసుకునేందుకు ట్రాకర్స్, వైరస్, మాల్‌వేర్, స్పామ్ మెసేజ్‌లు ఉంటే వాటిని డక్‌ డక్‌ గో డిలిట్ చేస్తుంది. తర్వాత వాటిని మీరు ఎంచుకున్న మెయిల్ ఖాతాకి ఫార్వార్డ్ చేస్తుంది. దీనివల్ల మీ ప్రధాన మెయిల్ ఇన్‌బాక్స్‌పై భారం తగ్గడంతో పాటు హ్యాకర్స్ నుంచి రక్షణ ఉంటుందని డక్‌ డక్‌ గో తెలిపింది. 

ఈ ఫీచర్ కోసం యాప్‌స్టోర్ లేదా ప్లేస్టోర్ నుంచి డక్‌ డక్‌గో బ్రౌజర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే ఈ-మెయిల్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే జాయిన్ ది ప్రైవేట్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే XXX@Duck.com ఫీచర్ కనిపిస్తుంది. అందులో మీ వివరాలు నమోదు చేసి డక్ మెయిల్ ఐడీ పొందొచ్చు. అయితే ఇది పూర్తిగా ఇన్వైట్ బేస్డ్‌ ఫీచర్. అంటే మిమ్మల్ని మరొకరు ఆహ్వానించాలి. తర్వాత మీ ఖాతా యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతం బీటా యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని డక్‌ డక్‌ గో తెలిపింది.

 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న