ఎక్కడివీ రహస్య రేడియో సంకేతాలు
close

Updated : 20/10/2021 06:08 IST

ఎక్కడివీ రహస్య రేడియో సంకేతాలు

అంతరిక్షంలో ఎక్కడో సుదూరాల నుంచి బుద్ధిజీవులు మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారా? ఇటీవల భూమి వైపు దూసుకొచ్చిన రేడియో సంకేతాలు ఇలాంటి సందేహమే కలిగిస్తున్నాయి. పాలపుంత కేంద్రం నుంచి వెలువడుతున్న ఇవి శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏమిటివి? ఎక్కడివి? అనేవీ కొరుకుడు పడటం లేదు. ఏదో గొప్ప ఆవిష్కరణకో, అజ్ఞాత నక్షత్ర వస్తువు ఉనికికో ఇవి దారితీయగలవని భావిస్తున్నారు. మొదట్లో ఈ రేడియో సంకేతాలు ఏదో మృత నక్షత్రం నుంచి వస్తున్నాయని భావించారు. అయితే గతంలో వచ్చిన ఇలాంటి సంకేతాలేవీ వీటికి సరిపోలటం లేదు. అప్పుడప్పుడివి వస్తూ పోతున్నాయని, వీటికి మూలమని అనుకుంటున్న వస్తువు ప్రకాశం గణనీయంగా మారిపోతోందని యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ శాస్త్రవేత్త జిటెంగ్‌ వాంగ్‌ చెబుతున్నారు. ఈ రేడియో సంకేతాలు ఒకే దిశలో ప్రయాణిస్తుండటం విచిత్రం. అంటే కాంతి ఒకే వైపునకు అటూఇటూ ఊగిసలాడుతోందన్నమాట. కాకపోతే దీని దిశ సమయాన్ని బట్టి మారిపోతోంది. ప్రతీ కొన్ని వారాలకోసారి 15 నిమిషాల సేపు సంకేతాలు వస్తున్నాయి. గత సంవత్సరం తొమ్మిది నెలల్లో 6 రేడియో సంకేతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వస్తూ పోతున్నందున తిరిగి వీటిని గమనించగలమని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అదృష్టం కొద్దీ ఈ రేడియో సంకేతాలు వెనక్కి మళ్లిపోయాయి. కానీ వీటికి  మూలమైన వస్తువు ప్రవర్తన మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటున్నట్టు గుర్తించారు. ఈ సంకేతాలు వారాల కొద్దీ వెలువడినప్పటికీ మూల వస్తువు ఒక్క రోజులోనే కనుమరుగైపోవటం గమనార్హం. ఆస్ట్రేలియన్‌ స్క్వయర్‌ కిలోమీటర్‌ ఆరే పాత్‌ఫైండర్‌ రేడియో టెలిస్కోప్‌ (ఏఎస్‌కేఏపీ) ద్వారా అంతరిక్షాన్ని సర్వే చేస్తుండగా ఈ అనూహ్య వస్తువును గుర్తించారు. అనంతరం న్యూసౌత్‌ వేల్స్‌లోని పార్క్స్‌ రేడియో టెలిస్కోప్‌, సౌత్‌ ఆఫ్రికా రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీకి చెందిన మీర్‌క్యాట్‌ టెలిస్కోప్‌తో పరిశీలించి సంకేతాల తీరును పసిగట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న