close

Updated : 25/02/2021 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హిమ జల ప్రళయానికి కారణాలెన్నో?

కొండ చరియలు విరిగి పడడం తెలుసు.. మంచు చరియలు విరిగి పడడమూ తెలుసు. కానీ మంచు చరియలు విరిగిపడటం వల్ల భారీ వరద ముంచెత్తటం ఆందోళనకరమైన విషయమే. ఉత్తరాఖండ్‌లో గత వారం పోటెత్తిన మంచు ప్రళయమే దీనికి నిదర్శనం. ఇది మనిషి విచ్చిలవిడి జీవనశైలికి ప్రతిఫలమా? ప్రకృతి ప్రతీకారమా? అసలు వేల కిలోమీటర్లు పరుచుకున్న మంచు కొండలు ఎందుకు బీటలు వారుతున్నాయి? భారీ పర్వత సమూహాలపై కొలువు తీరిన హిమానీ నదాలు ఎందుకు తగిరిపోతున్నాయి? విశ్లేషించుకోవడం ఎంతైనా అవసరం..

హిమాలయాలు.. ప్రతి ఒక్కరూ తలెత్తి చూసి తన్మయం పొందే మంచు శిఖరాలు. భూగోళం వేడెక్కుతుండడంతో అంతటి చల్లటి మంచుకీ ముచ్చెమటలు పడుతున్నాయి. ఏటా 0.25 మీటర్ల మేర మంచు మాయం అవుతోంది. దీనికి మానవ తప్పిదాలు, ప్రకృతి పరమైన అంశాలెన్నో దోహదం చేస్తున్నాయి. ముందుగా మాట్లాడుకోవాల్సింది మన తప్పిదాల గురించే. శిలాజ ఇంధనాలు, బొగ్గు వంటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇది భూతాపం పెరగటంలో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. దీనిపై 1912లోనే శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గుని మండించినప్పుడు వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌ గాలిలో కలిసి, ఉష్ణోగ్రత పెరగడానికి దోహదం చేస్తోందనేది అందరికీ తెలిసిందే. దీంతో పాటు వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువులు పెరగడంతో భూతాపం మరింత పెరిగిపోతోంది. ఇక మితిమీరుతున్న మీథేన్‌, భూమి మీద వేడి పెరగడానికి మరో కారణం. ఉష్ణమండలాల్లో అడవులు దహించుకుపోవడం, బొగ్గు, చమురు మొదలైన శిలాజ ఇంధనాలు వినియోగించడం వల్ల మీథేన్‌ వాతావరణంలోకి చేరుకుంటోంది. వాతావరణంలో అలముకున్న అనేక వాయువుల్లో మీథేన్‌ పరిమాణం ఎంత ఉంటుందో తెలియదు. కార్బన్‌ డయాక్సైడ్‌కు ఇది తోడైతే వెచ్చదనం మరింత పెరుగుతుంది. భూ ఉష్ణోగ్రతను ఓ జాతీయ సంస్థ గత 139 ఏళ్లుగా నమోదు చేస్తోంది. ఈ భూతాపం కారణంగా తరచు అడవులు దహనం కావడం, కరవులు తలెత్తడం, పర్వత ప్రాంతాల్లోని మంచు కరిగిపోడం వంటి వైపరీత్యాలు జరుగుతున్నాయి. కొన్ని వందల ఏళ్లుగా భూతాపంపై చేసిన ట్రాకింగ్‌లో.. 2014 నుంచి 2018 వరకూ ఉన్న సంవత్సరాల్ని అత్యంత వేడైన సంవత్సరాలుగా గుర్తించారు. ఇందులో 2016ని అత్యంత గరిష్ఠ వేడి ఏడాదిగా నమోదు చేశారు.
కోట్ల టన్నుల మంచు నీరుగా..
శీతాకాలం కారుపై పేరుకున్న మంచు ఎండ రాగానే నిమిషాల్లో కరిగిపోతుంది. మరి, ప్రకృతి సిద్ధంగా పర్వతాలపై పరుచుకున్న మంచు సంగతేంటి? భూతాపం కారణంగా ఎంత కగిరిపోతోంది. దీనిపై అమెరికా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో 1994 నుంచి 2017 సంవత్సరాల మధ్య భూతాపం కారణంగా 28 ట్రిలియన్‌ టన్నుల మంచు నీరుగా కరిగిపోయినట్లు ప్రకటించారు. ఈ నెల మొదటి వారంలోనే ఈ గణాంకాల్ని విడుదల చేశారు. అంతేకాదు.. ప్రతి సంవత్సరం ఈ నష్టం 57 శాతం పెరుగుతోందని చెబుతున్నారు. 1880 నుంచి పరిగణలోకి తీసుకుంటే ఈ మంచు చరియలు విరిగి నదుల గుండా నీరుగా ప్రవహించి సముద్రంలో కలవడం వల్ల సముద్రమట్టాలు 8 నుంచి 9 అంగుళాలు పెరిగాయి. అంతరిక్షంలో తిరుగాడుతున్న ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు ఈ మంచు ఏ రేటున కరిగి నీరుగా ప్రవహిస్తున్నది చెబుతున్నాయి.

సూర్య కాంతికే కీడుగా..
భూమ్మీద జీవి ఆవిర్భావానికి, మనుగడకు సూర్యుడే  మూలాధారం. సూర్యుడు విడుదల చేసే కాంతిలో అద్భుతమైన రోగనాశక శక్తి ఉంది. ఎంతంటే.. టీబీ రోగాన్ని కలిగించే సూక్ష్మజీవులు మరిగే నీటిలో కూడా సజీవంగా ఉండగలవు. కానీ, తీవ్రమైన సూర్యకాంతితో క్షణాల్లో మరణిస్తాయి. అదే సూర్యరశ్మి విశిష్టత. ఇది సాధారణ మోతాదులో భూమి మీద పడితే మేలు. మోతాదు మించిందంటే మనిషికి హానే. ఎలాగంటే.. సూర్యుడి నుంచి భూమిని చేరే సూర్యరశ్మిలో పరారుణ కిరణాలు ఉంటాయి. వీటి కారణంగానే ఎండవేడిగా ఉంటుంది. సాధారణంగా ఈ సూర్య కిరణాలు భూమిపై పడి పరావర్తనం చెంది తిరిగి అంతరిక్షంలోకి వెళ్లిపోతాయి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. కానీ, భూ వాతావరణంలో చేరిన కార్బన్‌ డయాక్సైడ్‌, మీథెన్‌, ఓజోన్‌, నీటి ఆవిరి వంటివి భూతలం నుంచి తిరిగి వెళ్తున్న పరారుణ కిరణాలను పట్టేస్తున్నాయి. అవి అంతరిక్షం వైపు వెళ్లకుండా అడ్డుపడుతున్నాయి. దీంతో భూమిపై  ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ గ్రీన్‌హౌస్‌ వాయువుల పెరుగుదలకు కారణం మానవ చేష్టలే. ఈ వాయువుల వల్ల భూమి మీద వాతావరణం 1.5 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 4.5 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరగొచ్చని ఒక అంచనా.

ప్రకృతి పరమైనవి ఏంటి?
సహజంగానే మంచుకొండలు కోతకు గురవుతుంటాయి. దీంతో మంచు కింద ఉన్న నీటిపై ఒత్తిడి పెరగడం.. నీటి కింద ఉన్న భూమి కంపించడం మూలంగానూ వరదలు పోటెత్తొచ్చు. హిమానీ నదాల్లో నీటి ప్రవాహం దారి తరచూ మళ్లడం కూడా ప్రకృతి విధ్వంసాలకు దారితీస్తుంది. సాధారణంగా ఇలాంటి వైపరీత్యాలకు ప్రకృతే సమాధానాలు సమకూరుస్తూ ఉంటుంది. రుతువులు మారటం అలాంటిదే. అయితే, వాతావరణ మార్పుల వల్ల మంచు, వర్షం ధోరణుల్లో మార్పులు సంభవిస్తూ ఉండడం వల్ల హిమానీ నదాల లోపాలు సరికావడం లేదు. నందాదేవి పర్వతంపై మంచు చెరియలు విరిగి పడడానికి అక్కడి మంచు కింద శతాబ్దాల తరబడి ఉన్న రాతి ఫలకాలు బలహీనపడటం కారణం కావొచ్చన్నది మరో పరిశీలన.

సూర్యుడి ‘చీకటి ప్రాంతాల’ ప్రభావం..
నాణేనికి రెండో వైపు అన్నట్టుగా.. భూతాపం పెరగడంలో సూర్యుడి పాత్ర కొంత ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదెలాగంటే.. సూర్యుడి ఉపరితలం మీద దాదాపు వెయ్యి కిలోమీటర్ల వ్యాసం ఉండే చీకటి ప్రాంతాలు ఉన్నాయి. వీటినే సన్‌స్పాట్స్‌ అంటారు. చీకటి ప్రాంతాలంటే వీటి వద్ద ఉష్ణోగ్రత మిగిలిన ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత కంటే దాదాపు రెండు వేల డిగ్రీల సెల్సియస్‌ తక్కువ ఉంటుంది. భగ భగ మండే సూర్యుడి ఉపరితలంపై ఇలాంటి చీకటి ప్రదేశాలు ఉండడం ఒక ఆసక్తికరమైన విషయం. పైగా ఇవి ఒకే ప్రదేశంలో ఉండక, స్థిరమైన సంఖ్యలో లేకపోవడం మరొక ఆశ్చర్యకరమైన సంగతి. ఈ చీకటి ప్రాంతాల సంఖ్య పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. ఈ చట్రం పూర్తికావడానికి 11 సంవత్సరాలు పడుతుంది. చీకటి ప్రాంతాలు ఎక్కువ ఉన్నప్పుడు సూర్యరశ్మి తీవ్రత తక్కువగాను.. అవి తక్కువ ఉన్నప్పుడు సూర్యరశ్మి తీవ్రత ఎక్కువగానూ ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ తీవ్రత తేడా 0.1 శాతం అయినప్పటికీ భూ వాతావరణంపై దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. భూతాపం పెరగడంలో దీని పాత్ర కూడా ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల విశ్లేషణ.
మరో మానవ తప్పిదం
చైనా, భారత్‌ యుద్ధానంతరం చైనా మిలటరీ బలగాలపై నిఘా పెట్టేందుకు భారత్‌, అమెరికాతో చేతులు కలిపింది. 1965 అక్టోబరులో అమెరికా, భారత్‌ సంయుక్తంగా నందాదేవి పర్వతంపై ఒక అణుశక్తి పరికరాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నించాయి. ఇందులో భాగంగా యాంటెన్నా, రెండు ట్రాన్స్‌ రిసీవర్స్‌,  అణుశక్తి ఉత్పాదక జనరేటర్‌, అణు ఇంధనమైన ఫ్లుటోనియంని తీసుకెళ్లారు. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో వాటిని అక్కడే వదిలేసి తిరిగొచ్చారు. 1966, మేలో తిరిగి అక్కడికి వెళ్లేసరికి పరికరాలు కనిపించకుండా పోయాయి. వాటి మీద మంచు కప్పుకొని పోయి ఉండొచ్చని అనుకున్నారు. ఈ ఫ్లుటోనియం జాడలు కింద ప్రవహిస్తున్న నదుల్లో ఉన్నట్టు 2005 లోనే గుర్తించారు. ఫ్లుటోనియం రేడియోధార్మిక మూలకం కావడంతో అది విడుదల చేసే వికిరణాల వల్ల మంచు కరగడమే కాదు, ఇతర దుష్ఫలితాలు కూడా ఎదురవుతాయి. పైగా ఈ మూలకం జీవితకాలం వందేళ్లు కావటం గమనార్హం. ఇప్పటికి 55 ఏళ్లు గడిచాయి. వచ్చే 45 ఏళ్లలో ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయోనని అంతా ఆందోళన చెందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు