ఆశా తోడుగా..
close

Updated : 07/04/2021 23:00 IST
ఆశా తోడుగా..

సైన్స్‌ సంగతులు

ఏడాది క్రితం.. ఇవే రోజులు..  మర్చిపోగలమా? బయట కాలు పెట్టాలంటే భయం, ఎవరిని కలవాలన్నా.. ఎవరితో మాట్లాడాలన్నా.. ఏది తినాలన్నా.. భయం భయం! అలా కరోనా కేసులు పెరుగుతున్న రోజులవి. ఇంటిపక్క వ్యక్తికో.. ఆఫీసులో మనతోపాటు పనిచేసే సహోద్యోగికో కొవిడ్‌ సోకిందంటే చాలు.. అంటరాని వ్యక్తిలా సమాజం నుంచి వేరుచేశారు. మనిషికి మనిషే సాయం చేయలేని అలాంటి దుస్థితిలో ఓ రోబో నర్సు ముందుకొచ్చింది. తనదైన శైలిలో సేవలు అందించింది. ఇప్పుడు మరిన్ని అదనపు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యింది. వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు అండగా ఉంటానంటూ ముందుకొచ్చింది.
కరోనాతోనే కాదు.. కాలంతో పరుగులు పెట్టే జీవితంలో నానాటికీ మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ఆప్యాయంగా పలకరించేవారే కరవవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరితనానికి చెక్‌ పెట్టేందుకు.. సామాజిక ఒత్తిళ్లను దూరం చేసేందుకు ఓ కంపెనీ పూనుకొంది. అందుకోసం ఓ రోబోని తయారుచేసింది. పేరు ‘ఆశా- ఏ రోబో నర్సు’. బెంగళూరుకు చెందిన ఏఐ, రోబోటిక్స్‌ టెక్నాలజీ పార్క్‌ దీన్ని రూపొందించాయి. గత ఏడాది బెంగళూరు టెక్‌ సమ్మిట్‌లో ఆవిష్కరించారు. అప్పట్లో కరోనా సోకిన వారికి సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకొచ్చినా.. ప్రస్తుతం ఆశాను మరోవిధంగా వాడుకునేందుకు ‘ఆర్ట్‌పార్క్‌’ ప్రయత్నాలు మొదలెట్టింది. వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు అండగా, ఇంటికే పరిమితమైన రోగులకు సంరక్షణగా నియమించడం కోసం ఆశా సామర్థ్యాలను పెంచే పనిలో ఉంది ఆర్ట్‌పార్క్‌. ప్రస్తుతం ఎంతోమంది ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం తల్లిదండ్రులను వదిలి దూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో మలివయసులో పెద్దలు ఒంటరి వాళ్లయిపోతున్నారు. అలాంటి వారికి ఆశా రోబో తోడుగా ఉంటుంది. ‘హాయ్‌, హలో..’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంది. తిన్నారోలేదో తెలుసుకుంటుంది. వారి అవసరాలను తీరుస్తుంది. అంతేకాదు హావభావాలనూ చక్కగా ప్రదర్శిస్తుంది. రిమోట్‌ ఆపరేషన్‌ల ద్వారా వస్తువులను నియంత్రించగలుగుతుంది. ప్రస్తుతం ఇంగ్లిషు, హిందీ, కన్నడ భాషల్లో మాట్లాడగలుగుతోంది. త్వరలో మరికొన్ని భాషల్లోనూ మాట్లాడేలా సిద్ధం చేస్తున్నారు. ఆశా రోబో చేతివేళ్లలో సెన్సర్‌లను అమర్చారు. దీంతో వస్తువులను వాటి పరిమాణం, బరువు ఆధారంగా పట్టుకుని తీసుకెళ్లగలుగుతుంది.

- నిఖిల్‌ గెంటిల, నిజామాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న