ఆ చేపల చుక్కాని భూ అయస్కాంత క్షేత్రమే!
close

Updated : 19/05/2021 07:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ చేపల చుక్కాని భూ అయస్కాంత క్షేత్రమే!

తాబేళ్లు వందల మైళ్ల దూరంలో గుడ్లు పెట్టి వస్తాయి. తరువాత మళ్లీ అక్కడకు వెళ్లడానికి భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయన్నది తెలిసిన విషయమే. ఇప్పుడు వీటి సరసన సొరచేపలు (షార్కులు) కూడా చేరాయి. సుదూరాలకు వలస వెళ్లిన సొరచేపలు నిర్ణీత పూర్వపు ప్రదేశానికి ఎలా తిరిగి వస్తాయన్నది ఇప్పటివరకూ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలి పోయింది. ఇందులోని లోగుట్టును పరిశోధకులు ఇటీవల ఛేదించారు. తాబేళ్ల మాదిరిగానే ఇవీ భూ అయస్కాంత క్షేత్రం ఆధారంగా పాత ప్రదేశాలకు తిరిగి వస్తున్నట్టు గుర్తించారు. అంటే అయస్కాంత క్షేత్రం వీటికి ప్రకృతి ప్రసాదించిన జీపీఎస్‌ మాదిరిగా  పనిచేస్తోందన్న మాట! సేవ్‌ అవర్‌ సీ ఫౌండేషన్‌, ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ కోస్టల్‌ అండ్‌ మెరైన్‌ ల్యాబొరేటరీలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. బానెట్‌హెడ్‌ షార్క్‌ చేపలు ఏటా సముద్రంలో వేల మైళ్లు ప్రయాణించి మళ్లీ పాత ప్రదేశానికే కచ్చితంగా తిరిగొస్తుంటాయి. అందుకే వీటి మీద పరిశోధకులు దృష్టి సారించారు. వీటిని నిజంగా పట్టుకున్న చోట్ల ఉండే అయస్కాత పరిస్థితులకు గురిచేసి పరిశీలించారు. అప్పుడవి పరిశోధకులు ఊహించినట్టుగానే దక్షిణ అయస్కాంత క్షేత్రంలో ఉత్తర దిశగా, ఉత్తర అయస్కాంత క్షేత్రంలో దక్షిణ దిశగా ప్రయాణించటం గమనార్హం. తమ ప్రదేశం మారినట్టు ఊహించుకొని, దాన్ని దిద్దుకునే ప్రయత్నంలోనే భాగంగానే చేపలు ఇలా ప్రవర్తించాయని పరిశోధకులు భావిస్తున్నారు. మిగిలిన షార్క్‌ చేపల ప్రయాణాల గురించి తెలుసుకోవటానికీ ఈ అధ్యయనం ఉపయోగపడగలదని అనుకుంటున్నారు. ఒక తెల్ల సొరచేప ఏకంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య 20 వేల కిలోమీటర్లు వలస పోతూ, మళ్లీ కచ్చితంగా పాత ప్రదేశానికి తిరిగి వస్తుండటం విచిత్రం. ఇది చాలా గొప్ప విషయమని పరిశోధనకు నేతృత్వం వహించిన బ్రయాన్‌ కెల్లర్‌ చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు