హరిత అంగారకుడు!
close

Published : 14/07/2021 01:30 IST
హరిత అంగారకుడు!

ఖగోళం

అంగారకుడి మీద గడ్డి! చెట్లు, మొక్కలు!! అదేంటి? ఎటు చూసినా అక్కడ రాళ్లు రప్పలే కదా. చెట్లు ఎక్కడ్నుంచి మొలుచుకొచ్చాయోనని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు కాదు గానీ భవిష్యత్తులో సాధ్యమయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అంగారకుడిలాంటి వాతావరణంలోనూ సైయానోబ్యాక్టీరియా నివసించగలగదని శాస్త్రవేత్తలు గుర్తించారు మరి. అదే నిజమైతే రేపో మాపో అంగారకుడి మీద ఆవాసాలు ఏర్పరచుకునే మనుషులు అక్కడే పంటలు పండించుకోవటానికి వీలుంటుంది. సైయానోబ్యాక్టీరియా గొప్పతనం అలాంటిది. అవటానికిది నాచే అయినా మన భూమి ఇప్పుడు పచ్చగా కళకళలాడుతోందంటే అంతా దీని చలవే. సుమారు 240 కోట్ల సంవత్సరాల క్రితం మన భూ వాతావరణాన్ని మార్చేసింది ఇదే. బ్లూ-గ్రీన్‌ ఆల్గేగానూ పిలుచుకునే ఇది కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ మోతాదులు పెరిగేలా చేసింది. ఆక్సిజన్‌తో జీవించే ప్రాణుల పుట్టుకకు బీజం వేసింది. సైయానోబ్యాక్టీరియా మరో ప్రత్యేకత-  గాలి నుంచి నత్రజనిని గ్రహించి సేంద్రియ పదార్థాలుగా మార్చటం. ఇది ఏమీ లేని చోట కూడా జీవద్రవ్యాన్ని (బయోమాస్‌) ఉత్పత్తి చేయగలదు. భవిష్యత్‌ అంగారకుడి ఆవాసాలకు ఆక్సిజన్‌, బయోమాస్‌ చాలా కీలకం. అందుకే సైయానోబ్యాక్టీరియాపై జర్మనీ శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి సారించారు. భూమి మీది కన్నా పదో వంతు పీడనమే ఉన్నా, అంగారకుడి మీది కన్నా 10 రెట్లు ఎక్కువ పీడనం ఉన్నా ఇవి జీవిస్తుండటం విశేషం. అంగారకుడిపై సైయానోబ్యాక్టీరియాను పెంచటం సాధ్యమేనని ఇది తెలియజేస్తోంది. దీంతో ఇది భూమిని మార్చినట్టుగానే అంగారకుడినీ మార్చేయొచ్చని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న