గొట్టం మాత్రే ఇంజెక్షన్‌!
close

Published : 08/09/2021 01:09 IST
గొట్టం మాత్రే ఇంజెక్షన్‌!

గొట్టం మాత్రే ఇంజెక్షన్‌గా పనిచేస్తే? అదీ జీర్ణాశయంలోకి వెళ్లాక సూది మందు ఇస్తే? చిత్రమే కదా. ఎంఐటీ పరిశోధకులు అలాంటి విచిత్రాన్నే ఆవిష్కరించారు. అదీ తాబేలు స్ఫూర్తితో! కొవిడ్‌-19 విజృంభణతో మోనోక్లోనల్‌ యాంటీబాడీల చికిత్స ప్రాచుర్యంలోకి రావటం తెలిసిందే. ఇవి క్యాన్సర్‌, కీళ్లవాతం వంటి రకరకాల జబ్బులకూ ఉపయోగ పడతాయి. మోనోక్లోనల్‌ యాంటీబాడీలనేవి ప్రొటీన్లు. మన రోగనిరోధకశక్తిని అనుకరించేలా వీటిని రూపొందిస్తుంటారు. వీటితో పెద్ద లోపమేంటంటే- ఇంజెక్షన్‌ ద్వారానే ఇవ్వాల్సి రావటం. ఇలాంటి పెద్ద ప్రొటీన్లను మాత్రలు, గొట్టాల రూపంలో ఇస్తే జీర్ణకోశ వ్యవస్థ మధ్యలోనే విరిచేస్తుంది. అంటే అవసరమైన చోటుకు మందు చేరుకోదన్నమాట. దీన్ని అధిగమించటానికే ఎంఐటీ పరిశోధకులు వినూత్నమైన మాత్ర ఇంజెక్షన్‌ను రూపొందించారు. ఒకరకంగా దీన్ని ‘రోబో పిల్‌’ అనుకోవచ్చు. జీర్ణాశయంలోకి వెళ్లి, కుదురుకున్నాక దీనిలోంచి సన్నటి సూది బయటకు రావటం గమనార్హం. జీర్ణాశయం గోడలోకి మందును ఇంజెక్ట్‌ చేశాక సూది తిరిగి గొట్టం మాత్రలోకి వెళ్లిపోతుంది. ఇలా పని ముగిశాక లోపల ఎలాంటి హాని చేయకుండానే జీర్ణకోశ వ్యవస్థ నుంచి బయటకు వచ్చేస్తుంది. పందుల్లో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్టు రుజువైంది. మనుషుల్లోనూ ఇలాంటి పనితీరే కనబరిస్తే ఇంజెక్షన్‌ రహిత మోనోక్లోనల్‌ యాంటీబాడీల చికిత్సకు మార్గం సుగమమైనట్టే. పెద్ద రేగు పండంత ఉండే ఈ రోబో పిల్‌తో ఇన్సులిన్‌నూ తీసుకునే వీలుండటం విశేషం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న