చెక్కపై నడిస్తే విద్యుత్తు!
close

Published : 08/09/2021 01:09 IST
చెక్కపై నడిస్తే విద్యుత్తు!

దో చెక్క ఫ్లోర్‌. దాని మీద నడిస్తే చాలు. విద్యుత్తు పుట్టుకొస్తుంది. అదెలా అంటారా? అయితే స్విట్జర్లాండ్‌ పరిశోధకుల నానోజెనరేటర్‌ పరిజ్ఞానం గురించి తెలుసుకోవాల్సిందే. సాధారణంగా చెక్కతో విద్యుత్తును సృష్టించటం సాధ్యం కాదు. ఇది ట్రైబోన్యూట్రల్‌. అంటే ఎలక్ట్రాన్లను గ్రహించే, కోల్పోయే సామర్థ్యం లేనిదని. మరెలా? ఇక్కడే పరిశోధకులు కొత్తగా ఆలోచించారు. ఒక చెక్కకు పాలీడైమిథైల్‌సిలాక్జేన్‌ అనే సిలికాన్‌ పూత పూశారు. ఇది దేనికైనా తగిలితే ఎలక్ట్రాన్లను గ్రహిస్తుంది. మరో చెక్కకు జియోలైటిక్‌ ఇమిడజోలేట్‌ ఫ్రేమ్‌వర్క్‌-8 (జిఫ్‌-8) నానోక్రిస్టల్స్‌ను జోడించారు. లోహ అయాన్లు, సేంద్రియ అణువులతో కూడిన దీనికి ఎలక్ట్రాన్లను కోల్పోయే గుణముంది. వీటిని మధ్యలో పెట్టి పైనా, కిందా ఎలక్ట్రోడ్ల పొరలను అమర్చారు. దీంతో చెక్క ఫ్లోర్‌ మీద నడుస్తున్నప్పుడు సిలికాన్‌, నానోక్రిస్టల్స్‌ పొరలు ఒకదానికి మరోటి తగులుతూ, వేరవుతుంటాయి. ఇది నానోజెనరేటర్‌ మాదిరిగా పనిచేస్తుంది. ఎలక్ట్రాన్ల మార్పిడి జరగటం వల్ల చెక్క విద్యుత్తుతో ఛార్జ్‌ అవుతుంది (ట్రైబోఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్‌). దీని ద్వారా ఎల్‌ఈడీ బల్బ్‌, చిన్న పరికరాలు పనిచేయటానికి అవసరమైనంత విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. చాలాదేశాల ఇళ్లలో చెక్క ఫ్లోర్‌లే ఎక్కువ. అందువల్ల ఈ పరిజ్ఞానం సామర్థ్యాన్ని మరింతగా పెంచటంపై పరిశోధకులు దృష్టి సారించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న