అగ్ని విద్యుత్తు
close

Updated : 06/10/2021 01:55 IST

అగ్ని విద్యుత్తు

చల్లబడ్డ నీరు వేడి రాళ్లలోకి పంప్‌ చేస్తారు. అది నీటి ఆవిరిగా మారి, తిరిగి టర్బయిన్‌కు చేరుకొని విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పడుతుంది.

గ్ని పర్వతాల సాయంతో విద్యుత్తు! బిట్‌కాయిన్లను సృష్టించటానికి (మైనింగ్‌) ఎల్‌ సాల్వడార్‌ చేస్తున్న తాజా ప్రయత్నం ఈ కొత్త చర్చకు దారితీసింది. కొత్త బిట్‌కాయిన్లను సృష్టించటానికి అధునాతన కంప్యూటర్లు అవసరం. వీటికి చాలా విద్యుత్తు కావాలి. శిలాజ ఇంధనాలు, బొగ్గుతో విద్యుత్తును తయారుచేస్తే పర్యావరణం మీద విపరీత ప్రభావం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే చైనా వంటి దేశాలు బిట్‌కాయిన్‌ మైనింగ్‌ను నిషేధించాయి. అందుకే ప్రకృతికి హాని చేయకుండా బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కేంద్రాన్ని అగ్ని పర్వతాల వద్ద ఏర్పాటు చేయాలని ఎల్‌ సాల్వడార్‌ సంకల్పించింది. ఇందుకు జియోథర్మల్‌ విద్యుత్తును ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. ఇంతకీ జియోథర్మల్‌ విద్యుత్తు అంటే ఏంటి?

భూమిలో నిక్షిప్తమైన శక్తికి (జియోథర్మల్‌ ఎనర్జీ) అగ్ని పర్వతాలు ప్రత్యక్ష నిదర్శనాలు. అందుకే వీటి దగ్గర జియోథర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు భూ ఉష్ణశక్తిని ఒడిసిపట్టి విద్యుత్తును తయారుచేస్తున్నాయి కూడా. భూమి ఉపరితలం నుంచి సుమారు 2,900 కిలోమీటర్ల దిగువన భూమి అంతర్భాగ కేంద్రం (కోర్‌) ఉంటుంది. రాళ్ల సందులు, చీలికల ద్వారా దీన్నుంచి ఎప్పుడూ కొంత వేడి బయటకు వస్తుంటుంది. ఉపరితలం నుంచి లోతుకు వెళ్తున్న కొద్దీ భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తుంది. ఒకో కిలోమీటరు లోతుకు సుమారు 25 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రత ఎక్కువవుతుంది. ఒకవేళ భూమిలోపలి రాళ్లు 700 నుంచి 1,300 డిగ్రీల సెల్షియస్‌ వేడికి గురైతే ద్రవరూపంలోకి (మాగ్మా) మారతాయి. అగ్ని పర్వతాలు పేలినప్పుడు లావాగా వెలువడేది ఇదే. భూ ఉష్ణశక్తి చాలావరకు లోపలే ఉండిపోతుంది. నెమ్మదిగా బయటకు వెలువడుతుంటుంది. ఇలా ఇది కొన్నిచోట్ల అత్యధిక వేడి ప్రాంతాలనూ సృష్టిస్తుంది. గొట్టపు బావుల ద్వారా అక్కడికి చేరుకొని నేరుగా నీటి ఆవిరి ద్వారా గానీ నీళ్లను లోనికి పంపించి గానీ ఆవిరిని సృష్టించి.. విద్యుత్తును తయారు చేయొచ్చు. జియోథర్మల్‌ విద్యుత్తు అంటే ఇదే. గొట్టాల ద్వారా బయటకు వచ్చే ఆవిరి టర్బయిన్లను తిప్పుతుంది. దీంతో జనరేటర్‌లో విద్యుత్తు తయారవుతుంది. ఇది ట్రాన్స్‌ఫార్మర్‌కు చేరుకొని తీగల ద్వారా సరఫరా అవుతుంది. అనంతరం మిగిలిన నీటి ఆవిరి పైపు ద్వారా కండెన్సర్‌లోకి.. అక్కడ్నుంచి కూలింగ్‌ టవర్‌లోకి చేరుకుంటుంది. ఇందులో చల్లబడ్డ నీటిని తిరిగి వేడి రాళ్లలోకి పంపిస్తారు. ఇది మళ్లీ ఆవిరిగా మారుతుంది. ఇలా నిరంతరం విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న