ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
close

Updated : 20/06/2021 18:00 IST
ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?

ఒకప్పుడు ప్రాజెక్టు వర్క్‌ ఉన్నప్పుడో, ఏదైనా అదనపు సమాచారం అవసరమైనప్పుడో... విద్యార్థులు కంప్యూటర్లు వాడేవారు. అయితే ఇప్పుడు మొత్తం చదువంతా కంప్యూటర్ల మీదే చేయాల్సిన పరిస్థితి. కరోనా కారణంగా విద్యార్థులు చదువు మొబైల్‌/ ల్యాపీ లేనిదే కుదరదు అనేలా తయారైంది. ఇప్పుడు మీ పిల్లల చదువు కోసం ల్యాప్‌టాప్‌ కొనాలి అనుకుంటే... ఈ దిగువ అంశాలను పరిగణలోకి తీసుకుంటే మంచిది!


💻 ఆన్‌లైన్‌ క్లాస్‌లు, సమాచార శోధన కోసంమైతే హై రిజల్యూషన్‌ స్క్రీన్స్‌ అవసరం లేదు. ఫుల్‌ హెచ్‌డీ  డిస్‌ప్లే (1920 x 1080 పిక్సల్స్‌) ఉంటే సరిపోతుంది. అంత రిజల్యూషన్‌ కూడా అవసరం లేదనుకుంటే 1366 x 768 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ పరిశీలించొచ్చు.


💻 విద్యార్థుల అవసరాలు బట్టి చూస్తే ఇంటెల్‌ కోర్‌ ఐ3 ప్రాసెసర్‌ ఉన్న ల్యాపీలు పరిశీలించొచ్చు. అయితే ఆ ప్రాసెసర్‌ పాతది, కొంచెం అప్‌డేటెడ్‌‌గా వెళ్దాం అనుకుంటే ఐ5  ప్రాసెసర్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ను తీసుకోవచ్చు. 


💻 ల్యాప్‌టాప్‌లో కనీసం 8 జీబీ ర్యామ్‌ ఉండేలా చూసుకోండి. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం అవసరమయ్యే యాప్స్‌, సర్వీసులు ఎలాంటి అవాంతరాలు లేకుండా రన్‌ అవ్వాలంటే ఆ మాత్రం ఉండాలి. 4 జీబీ ర్యామ్‌ సిస్టమ్‌  వేగం సరిపోకపోవచ్చు.


💻 ఆన్‌లైన్‌ క్లాస్‌లు, సమాచార సేకరణ ప్రధానం అయితే 512 జీబీ హెచ్‌డీడీ లేదా 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజీ సరిపోతుంది. వీడియో పాఠాలు లాంటివి డౌన్‌లోడ్‌ చేసి సేవ్‌ చేసుకోవాలి అంటే మాత్రం... స్టోరేజీ ఎక్కువ  ఉండేలా చూసుకోవాలి. 


💻 సైబర్‌ దాడులు, ఇతర రకాల ఇబ్బందుల నుంచి మీ ల్యాప్‌టాప్‌ ఎప్పుడూ సేఫ్‌గా ఉండాలంటే... అది జెన్యూన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)తో రన్‌ అవ్వాలి. కాబట్టి ల్యాపీలో మైక్రోసాఫ్ట్‌ ఒరిజినల్‌ ఓఎస్‌ ఉండేలా చూసుకోండి. అలాగే తీసుకున్నాక తరచుగా అప్‌డేట్‌ చేస్తూ ఉండండి.


💻 ల్యాప్‌ టాప్‌లో ఓఎస్‌ ఎంత ముఖ్యమో, యాంటీ వైరసూ అంతే ముఖ్యం. ల్యాప్‌టాప్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌ డిఫెండర్‌ డీఫాల్ట్‌గా ఉంటుంది. అయితే దాంతోపాటు యాంటీ వైరస్‌ ఇంకొకటి వేసుకున్నా మంచిదే. దాని వల్ల మాలిషియస్‌ ఫైల్స్‌ మీ సిస్టమ్‌ను ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.


💻 మైక్రోసాఫ్ట్‌ ఆఫీసుకు చెందిన ఉత్పత్తులు వాడనిదే విద్యార్థుల రోజు గడవదు. రాయడానికి, వివరాలు నమోదు చేయడానికి ఇలా చాలా వాటికి అవసరం. కాబట్టి అవసరం అనుకుంటే మైక్రోసాఫ్ట్‌ ఆఫీసు 365 సూట్‌ ఉండేలా చూసుకోండి.


💻 స్కూలు, కాలేజీకి వెళ్లే పిల్లల కోసమైతే బడ్జెట్‌ ₹30 వేలు నుంచి ₹50 వేలు లోపు ఉంటే సరిపోతుంది. అవసరం బట్టి బడ్జెట్‌ను ఫిక్స్‌ చేసుకోవాలి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆఫర్ల కాలం నడుస్తోంది. కాబట్టి క్యాష్‌బ్యాక్‌లు, ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌లపై ఓ లుక్కేయండి.


గమనిక: పైన తెలిపిన అంశాలన్నీ విద్యార్థి సాధారణ అవసరాలకు తగ్గట్టుగా సూచించినవి. అయితే వ్యక్తిగత అవసరాలను బట్టి అవసరమైన ల్యాపీని కొనుగోలు చేసుకోగలరు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న