Clubhouse: క్లబ్‌హౌస్‌ వచ్చేసింది... కానీ!
close

Published : 22/05/2021 15:25 IST
Clubhouse: క్లబ్‌హౌస్‌ వచ్చేసింది... కానీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ ప్రపంచంలో తాజా సంచలనం క్లబ్‌హౌస్‌. ఆడియో బేస్డ్‌ సోషల్‌ మీడియా యాప్‌ ఇది. గతేడాది మార్చిలో ఈ యాప్‌ ఐవోఎస్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అలా వచ్చీరాగానే సంచలనంలా మారింది. ఎలాన్‌ మస్క్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌ లాంటివాళ్లు దీనిని వాడటానికి ఆసక్తి చూపించారు. అయితే ఆండ్రాయిడ్‌కి మాత్రం తీసుకురాలేదు. ఇన్నాళ్ల ఎదురుచూపులు తర్వాత ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అందుబాటులోకి తీసుకొచ్చారు. 

క్లబ్‌హౌస్‌ యాప్‌ అయితే లాంచ్‌ చేశారు కానీ, అందరూ డౌన్‌లోడ్‌ చేసినంత సులభంగా వాడలేరు. ఎందుకంటే ఇది ఇన్వైట్‌ బేస్డ్‌ యాప్‌. అంటే మీరు యాప్‌లో రిజిస్టర్‌ అయ్యాక... మీకు ఓ ఇన్వైట్‌ రిక్వెస్ట్‌ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు వెయిట్‌లిస్ట్‌లో చేరుతారు. మీ రిక్వైస్ట్‌ను క్లబ్‌ హౌస్‌లో ఇప్పటికే ఉన్న మీ స్నేహితులు, లేదా ఇతర వినియోగదారులు ఎవరైనా నామినేట్‌ చేస్తే... మీ ఖాతా యాక్టివ్‌ అవుతుంది. అప్పుడు యాప్‌ను వినియోగించొచ్చు. 

ప్రత్యేకత ఏంటంటే...

సోషల్‌ మీడియాలో ఇదో కొత్త రకం అని చెప్పొచ్చు. ఇప్పటికే ట్విటర్‌లో స్పేసెస్‌ ఫీచర్‌ వాడుతున్న వాళ్లకు క్లబ్‌ హౌస్‌ కొత్తగా ఉండదు. నిజానికి క్లబ్‌హౌస్‌ స్ఫూర్తిగానే ట్విటర్‌ స్పేసెస్‌ తీసుకొచ్చారు అనొచ్చు. ఇక క్లబ్‌హౌస్‌ సంగతికొస్తే... ఇందులో ఫొటోలు, వీడియోల షేర్‌ ఉండదు. జూమ్‌, గూగుల్‌ మీట్‌ తరహాలో ఒక రూమ్‌ను క్రియేట్‌ చేయాలి. అందులో ఎవరైనా వచ్చి జాయిన్‌ అవ్వొచ్చు. లేదంటే ఎవరు జాయిన్‌ అవ్వాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు. రూమ్‌ క్రియేట్‌ చేసేవాణ్ని ఇందులో మోడరేటర్‌ అంటారు. 

స్థూలంగా చెప్పాలంటే... టీవీల్లో కనిపించే డిస్కషన్స్‌ లాంటిది ఈ యాప్‌. అయితే ఇందులో కేవలం ఆడియో మాత్రమే ఉంటుంది. వేలాదిమంది ఒక్కో చర్చను వినొచ్చు. అయితే ఎవరు మాట్లాడాలి అనేది మోడరేటర్‌ నిర్ణయిస్తారు. వాళ్లు స్పీకర్లు అవుతారు. వారి మాటలు/పాటలను మిగిలినవాళ్లు  వినొచ్చు. మధ్యలో ఏమైనా మాట్లాడాలని అనిపిస్తే... దిగువ హ్యాండ్‌ ఐకాన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే... మోడరేటర్లకు కనిపిస్తుంది. వాళ్లు యాక్సెప్ట్‌ చేస్తే మీరు మాట్లాడొచ్చు. 

రూమ్‌ క్రియేషన్‌ ఇలా... 

మీరు ప్రొఫైల్‌  యాక్టివ్‌ అయ్యాక... దిగువన ‘స్టార్ట్‌ రూమ్‌’ అని ఉంటుంది. దానిని క్లిక్‌ చేస్తే  ఓపెన్‌, సోషల్‌, క్లోజ్డ్‌ అని మూడు ఆప్షన్లు వస్తాయి. ఓపెన్‌ ఎంచుకుంటే... మీ రూమ్‌ క్లబ్‌ హౌస్‌లో ఎవరికైనా కనిపిస్తుంది.. అదే సోషల్‌ క్లిక్‌ చేస్తే మీరు ఆ లింక్‌ షేర్‌ చేసినవాళ్లు మాత్రమే జాయిన్‌ అవ్వగలరు. క్లోజ్డ్‌ అంటే... మిమ్మల్ని క్లబ్‌ హౌస్‌లో ఫాలో అవుతున్నవాళ్లకు మాత్రమే ఆ రూమ్‌ కనిపిస్తుంది. ఒకసారి రూమ్‌ క్లోజ్‌ చేశాక  తిరిగి దానిని పొందలేం. 

ఇతరులు క్రియేట్‌ చేసిన రూమ్‌లను హోం పేజీలో చూడొచ్చు. లేదంటే సెర్చ్‌ ఐకాన్‌ ద్వారా వెతకొచ్చు. అలాగే క్లబ్‌హౌస్‌ మొంబర్స్‌ను కూడా సెర్చ్‌లోనే వెతికి ఫాలో అవ్వొచ్చు. అప్పుడ వాళ్లు భవిష్యత్తులో క్రియేట్‌ చేసే ఓపెన్‌ రూమ్‌ల నోటిఫికేషన్లు మీకు అందుతాయి. ఈ లింక్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ట్రై చేయొచ్చు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న