వాట్సాప్‌ నిర్ణయంతో.. ఆ యాప్‌లకు భారీ డౌన్‌లోడ్స్‌!
close

Published : 12/01/2021 22:38 IST
వాట్సాప్‌ నిర్ణయంతో.. ఆ యాప్‌లకు భారీ డౌన్‌లోడ్స్‌!

దిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌ తీసుకురావడంతో భారత్‌లో సిగ్నల్‌, టెలిగ్రామ్‌ యాప్‌లకు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ రెండు యాప్‌లకు రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్స్‌ పెరగడం గమనార్హం. జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు సిగ్నల్‌, టెలిగ్రామ్‌ యాప్‌లకు ఏకంగా 4 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌ పెరిగినట్లు.. ‘సెన్సార్‌ టవర్’‌ అనే సంస్థ సమాచారాన్ని వెల్లడించింది. 4 మిలియన్ల డౌన్‌లోడ్లలో సిగ్నల్‌ యాప్‌ వాటా 2.3 మిలియన్లు ఉండగా.. టెలిగ్రామ్‌కు 1.5 మిలియన్లుగా నమోదైంది. కాగా ఇదే సమయంలో వాట్సాప్‌ డౌన్‌లోడ్స్‌ 35శాతం తగ్గిపోవడం గమనించదగ్గ విషయం. జనవరి 6 నుంచి 10తేదీ మధ్యకాలంలో వాట్సాప్‌కు కేవలం 1.3 మిలియన్‌ కొత్త డౌన్‌లోడ్స్‌ మాత్రమే వచ్చాయి.

ప్రపంచంలోని అత్యంత కుబేరుడిగా ఇటీవల రికార్డు సృష్టించిన టెస్లా సంస్థ సీఈవో ఎలన్‌ మస్క్‌ సైతం వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీని ఉద్దేశించి మాట్లాడుతూ.. సిగ్నల్‌ యాప్‌ ఉపయోగించడం మంచిదని వినియోగదారులకు సూచించారు. భారత్‌లో పేటీఎం సంస్థ వ్యవస్థాపకులు విజయ్‌ శంకర్‌ శర్మ సోమవారం వాట్సాప్‌ను విమర్శిస్తూ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. ‘భారత మార్కెట్లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు అతిపెద్ద శక్తిగా భావించి.. తమ గుత్తాధిపత్యంతో మిలియన్ల వినియోగదారుల గోప్యతను తమ చేతిలోకి తీసుకుంటున్నాయి. ఇప్పుడు మనం సిగ్నల్‌ యాప్‌ వైపునకు వెళ్లాల్సిన సమయం ఇది’ అని తెలిపారు. కాగా సిగ్నల్‌ యాప్‌ సైతం తాజాగా ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘మా యాప్‌ను అడ్డుకునేందుకు ఫేస్‌బుక్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. సిగ్నల్‌ యాప్‌లో ప్రకటనలు ఉండవు. అంతేకాకుండా వినియోగదారుల వ్యక్తిగత డేటా.. మా చేతిలో కాదు.. వారి చేతుల్లోనే ఉంటుంది’ అని తెలిపింది.  

వాట్సాప్‌ ఇటీవల కొత్త ప్రైవసీ పాలసీని వినియోగదారుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ద్వారా వాట్సాప్‌ వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌తో షేరింగ్‌ చేస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో వ్యక్తిగత సమాచార గోప్యతపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్‌ వివరణ ఇస్తూ.. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పింది. బిజినెస్‌ ఫీచర్స్‌ను మరింత మెరుగ్గా యూజర్లకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. తాజాగా తీసుకువచ్చిన మార్పులు వినియోగదారుల స్నేహితులు, బంధువుల సందేశాలపై ఏమాత్రం ప్రభావం చూపవని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి

మీ గోప్యతకు ఏ భంగం వాటిల్లదు: వాట్సాప్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న