నవంబరులో వచ్చే స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే!
close

Published : 02/11/2020 09:40 IST
నవంబరులో వచ్చే స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే!

మీరు గ్యాడ్జెట్‌ ప్రియులా... అయితే ఈ నెల కూడా మీకు పండగే. గత నెలలో వచ్చినన్ని కాకపోయినా... ఈ నెలలోనూ కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్లు రాబోతున్నాయి. బేసిక్‌, బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌, ఫ్లాగ్‌షిప్‌ ఇలా వివిధ విభాగాల్లో కొత్త మొబైల్స్‌ మార్కెట్‌లోకి వస్తున్నాయి. అవేంటో చూసేయండి!


చాలా రోజుల తర్వాత...

నవంబరులో మార్కెట్‌లోకి వచ్చే మొబైల్స్‌లో తొలుతగా చెప్పుకోవాల్సింది మైక్రోమ్యాక్స్‌ గురించి. IN సిరీస్‌తో మొబైల్స్‌ తీసుకొస్తామంటూ మైక్రోమ్యాక్స్‌ గత కొద్ది రోజులుగా టీజ్‌ చేస్తోంది. ఈ నెల 3న మైక్రోమ్యాక్స్‌ 1, మైక్రోమ్యాక్స్‌ 1ఏ పేరుతో రెండు మొబైల్స్‌ లాంచ్‌ చేస్తారని సమాచారం. వన్‌ మొబైల్‌లో మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ ఉండనుండగా, వన్‌ ఏలో జీ85 ప్రాసెసర్‌ ఉండనుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 13 ఎంపీ బ్యాక్‌ కెమెరా ఉండనుంది. ఈ మొబైల్స్‌ ధర ₹10 వేలు నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. 


వివో నుంచి రెండు...

కెమెరా ప్రధానంగా మొబైల్స్‌ తీసుకొచ్చే వివో... ఈ నెలలో రెండు మొబైల్స్‌ లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. వాటిలో వివో వీ20 ఎస్‌ఈ ఒకటి కాగా, వివో వి20 ప్రో మరొకటి. థాయ్‌లాండ్‌లో రెండు నెలల క్రితం లాంచ్‌ చేసిన వివో వి20ని మన దేశంలో వి20ఈ గా తీసుకొస్తున్నారట. మొదటివారంలోనే ఈ మొబైల్‌ వచ్చే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ ఉండే ఈ మొబైల్‌లో 48 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఈ మొబైల్‌ సపోర్టు చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 12 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉండే ఈ మొబైల్‌ ధర ₹20,990 అని తెలుస్తోంది. ఇదే సిరీస్‌లో ప్రో వెర్షన్‌ కూడా ఈ నెలలోనే వస్తుందట. ఈ నెలాఖరున ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. వివో వి20 ప్రోలో 5జీ నెట్‌వర్క్‌ సపోర్టు ఉండనుంది. అలాగే ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 765జి ప్రాసెసర్‌ ఇస్తున్నారు. 6.44 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ ఆమెలెడ్‌ స్క్రీన్‌ ఉండే ఈ మొబైల్‌లో ముందువైపు రెండు 44 ఎంపీ కెమెరాలు ఉంటాయి. 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేసే 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.  వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతో మూడు కెమెరాల సెటప్‌ ఉంటుంది. 


రియల్‌మి నుంచి ఐదు...

రియల్‌మి మొబైల్‌ ఫోన్స్‌ వినియోగదారులకు ఈ నెల పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఈ నెలలో రియల్‌మి నాలుగు మొబైల్స్‌ను లాంచ్‌ చేయబోతోంది. రియల్‌మి ఎక్స్‌ సిరీస్‌లో రెండు మొబైల్స్‌ రానుండగా, రియల్‌మి సీ15ఎస్‌, సి17 మొబైల్స్‌ కూడా ఈ నెలలోనే వస్తాయట. రియల్‌మి ఎక్స్‌ సిరీస్‌లో ఎక్స్‌7, ఎక్స్‌ 7 ప్రో తీసుకొస్తున్నారు. వీటిలో మీడియాటెక్‌ డైమెన్‌సిటీ చిప్‌సెట్స్‌ ఉంటాయి. మన దేశంలో తొలిసారి ఈ ప్రాసెసర్లు తీసుకొస్తున్నారు. ఎక్స్‌ 7 ప్రోలో మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 1000ప్లస్‌ ప్రాసెసర్‌, ఎక్స్‌ 7లో డైమెన్‌సిటీ 800యు ప్రాసెసర్‌ ఉంటుంది. 

రియల్‌మీ 7 సిరీస్‌ మొబైల్స్‌ చైనాలో సెప్టెంబర్‌లోనే అందుబాటులోకి వచ్చాయి. ఎక్స్‌ 7లో వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతో నాలుగు కెమెరాల సెటప్‌ ఉంటుంది. 65 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 60 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో 4300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండనుంది. ఇక ప్రో వెర్షన్‌లో 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే ఉండనుంది. 65 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేసే 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తారు. 

రియల్‌మీ సి సిరీస్‌లో ఈ నెలలో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ రానున్నాయి. ఇటీవల వచ్చిన సి15కి సక్సెసర్‌గా సి15ఎస్‌ తీసుకొస్తున్నారు. ఇది కాకుండా సి17 కూడా ఈ నెలలోనే వస్తోంది.  ₹10 వేలు కంటే తక్కువ ధరలో 90 హెడ్జ్‌ డిస్‌ప్లే రేట్‌తో మొబైల్‌ తీసుకొస్తామని రియల్‌మి టీమ్‌ చెబుతోంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో ఈ మొబైల్‌ లాంచ్‌ చేశారు. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్‌ స్క్రీన్‌ ఉంటుంది. 6 జీబీ ర్యామ్‌, బ్యాక్‌సైడ్‌ నాలుగు కెమెరాల సెటప్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తారు. స్నాప్‌డ్రాగన్‌ 460 ప్రాసెసర్‌ ఉంటుంది. 

గతేడాది నవంబరులో రియల్‌మి నుంచి ఎక్స్‌ 2 ప్రో మొబైల్‌ వచ్చింది. సంవత్సరం అయిపోయిందిగా... మరి ఎక్స్‌3 ప్రో రావాల్సిన సమయం వచ్చేసింది. ఇటీవల రియల్‌మి తీసుకొచ్చిన 125 అల్ట్రా డార్ట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ ఈ మొబైల్స్‌లో ఉండొచ్చు. అలాగే 108 ఎంపీ కెమెరా కూడా ఉంటుందంటున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 865 లేదా 865 ప్లస్‌ ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ తీసుకొస్తారట. ₹30 వేల ధరలో ఈ ఫోన్‌ తీసుకొచ్చే అవకాశం ఉంది.


రెడ్‌మీ తీసుకొస్తుందా?

నోట్‌ 9 సిరీస్‌తో ఈ ఏడాది అదరగొట్టిన రెడ్‌మీ కొత్త సిరీస్‌ను తీసుకొస్తుందా? ఇప్పటివరకైతే అధికారికంగా ఎక్కడా ప్రకటన రాలేదు కానీ... రెడ్‌మీ కొత్త ఫోన్లు ఈ నెలలో రావడం పక్కా అని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌ ఈ నెలలోనే లాంచ్‌ చేయొచ్చట. 5జీ కనెక్టివిటీతో ఈ మొబైల్‌ వస్తాయనే ప్రచారమూ సాగుతోంది. ఇందులో 120 హెడ్జ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 750జి ప్రాసెసర్‌, 4820 బ్యాటరీ ఉండొచ్చు. ఈ బ్యాటరీ 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్‌ ఉంటుంది. అందులో ప్రధాన కెమెరా 64 ఎంపీ. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 


మహిళల కోసం...

మైక్రో మ్యాక్స్‌లాగే మరో సంస్థ కూడా చాలా రోజుల తర్వాత మార్కెట్‌లోకి వస్తోంది. BE పేరుతో మహిళలకు ప్రత్యేకంగా లావా ఓ మొబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. దీపావళి సందర్భంగా ఈ మొబైల్‌ లాంచ్‌ అవ్వొచ్చని సమాచారం. ప్రస్తుత ఫోన్లకు భిన్నంగా రిమూవబుల్‌ బ్యాక్‌ప్యానల్‌తో ఈ మొబైల్‌ వస్తోంది. మహిళలకు నచ్చేలా గులాబి రంగులో, గ్లాసీ ఫినిష్‌ ఉంటుంది. బడ్జెట్‌ ధరలో తీసుకొస్తారని తెలుస్తున్నా... ఎంత ధర పెడతారనేది తెలియడం లేదు. 


వన్‌ప్లస్‌ బడ్జెట్‌ ఫోన్స్‌

నార్డ్‌ సిరీస్‌తో వన్‌ప్లస్‌ మళ్లీ ₹30 వేల సెగ్మంట్‌లోకి వచ్చింది. ఆ మొబైల్‌కు మంచి స్పందన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలలోనే వన్‌ప్లస్‌ నార్డ్‌ సిరీస్‌లో మరో మొబైల్‌ తీసుకొస్తారని తెలుస్తోంది.  నార్డ్‌ ఎన్‌ 10 5జీ లేదా నార్డ్‌ లైట్‌ పేరుతో ₹20 వేలలోపు ధరతో ఈ మొబైల్‌ రావొచ్చట. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 690 చిప్‌సెట్‌ ఇస్తారు. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉండొచ్చు. 4300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ లెన్స్‌, రెండు 2ఎంపీ కెమెరాలు ఉంటాయట. 


పోకో ఏం చేస్తుందో?

చాలా రోజులుగా ఊరిస్తున్న పోకో ఎఫ్‌2 ఈ నెలలో వచ్చే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అంటున్నారు. అయితే దీనిపై ఎప్పటిలాగే పోకో నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆగస్టు 2018లో వచ్చిన పోకో ఎఫ్‌1 మంచి ఆదరణ దక్కించుకుంది. కానీ దాని సక్సెసర్‌ ఇంతవరకు రాలేదు. ఎప్పటికప్పుడు తీసుకొస్తామని పోకో చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు.  అయితే పోకో ఎక్స్‌4 మొబైల్‌ అయితే వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రపంచమార్కెట్‌లోకి రెడ్‌మీ కె40గా వచ్చే మొబైల్‌ను మన దేశంలో పోకో ఎక్స్‌4గా తెస్తారనే వాదనలూ వినిపిస్తున్నాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న